ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు...
posted on Oct 18, 2019 @ 5:26PM
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కడం లేదు. గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సాధారణ రోజుల్లో గ్రేటర్ ఆర్టీసీ బస్సుల్లో రోజుకు ముప్పై మూడు లక్షల మంది ప్రయాణించే వారు. సమ్మె కారణంగా అరకొర బస్సులు మాత్రమే నడుస్తూండడంతో మెజారిటీ నగర వాసులు సొంత వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఒకేసారి పెద్ద ఎత్తున కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా నగర నలుమూలల నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే రహదారులు ఎక్కువ భాగం కార్లే కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా మాదాపూర్ వెళ్తున్న మార్గంలో కార్ల రద్దీ విపరీతంగా ఉంటోంది. సుమారు డెబ్బై శాతం కార్లు కనిపిస్తే ముప్పై శాతం మిగిలిన వాహనాలు ఉంటున్నాయి.
ఇక అమీర్ పేట్ నుంచి యూసుఫ్ గూడ, కృష్ణా నగర్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, కెపిహెచ్బి, హైటెక్ సిటీ, మియాపూర్, కొండాపూర్, ఓఆరార్, గచ్చిబౌలి, బేగంపేట్ ఇలా ఏ మార్గంలో చూసినా కార్లే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా గ్రేటర్ పరిధిలో సుమారు నలభై లక్షల మంది ప్రజా రవాణా వ్యవస్థల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీలో ముప్పై మూడు లక్షలు, మెట్రోలో మూడు లక్షలు, ఎంఎంటీఎస్ లో లక్షా అరవై వేల మంది వరకు ప్రయాణం చేస్తుండగా మిగతా వారు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణిం చేస్తున్నారు. సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మెట్రో సేవలు యాభై ఆరు కిలోమీటర్ల మేర ఉండటంతో కిక్కిరిసిన జనాభాకి ఆ రైళ్లు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత వాహనాల్నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్నాయి.ఇక ఈ సమ్మె ముగిసి మళ్ళీ బస్సులు యధావిధిగా ఎప్పుడు తిరుగుతాయా అని ప్రజలు వేచి చూస్తున్నారు.