టెస్ట్, ట్రేస్, ఐసొలేట్ , ఎండ్ ట్రీట్ : కరోనా నివారణకు వెంకయ్య కొత్త మంత్రం

నిత్యావసర వస్తు సరఫరానే కీలకం - ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరించందన్ కరోనా నేపధ్యంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్ కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ అన్నారు, ఇటీవల విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇంటింటికీ సర్వే నిర్వహించి, వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి హస్తిన నుండి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిస్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి,  గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సమావేశంలో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేసిన రాష్ట్రాల గవర్నర్ల తో మాట్లాడుతూ సామాజిక దూరం మాత్రమే వ్యాధి వ్యాప్తిని నిరోధించే అవకాశం కలిగి ఉన్నందున తదనుగుణంగా వ్యవహరించాలనిసలహా ఇచ్చారు, కరోనావ్యాప్తికి వ్యతిరేకంగా దేశం మొత్తం తగిన సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని, మరోవైపు ఒంటరిగా, సామాజిక దూరాన్ని కొనసాగించ వలసిన అవశ్యకత కీలకమైనదని స్పష్టం చేసారు.  గవర్నర్లు,  లెఫ్టినెంట్ గవర్నర్లు తమ కున్న అనుభవ సారంతో అక్కడి ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు. సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రార్థనల పేరిట సమావేశాలు వద్దని  మత పెద్దలు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ' టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ అండ్ ట్రీట్’ అనే మంత్రాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకునే క్రమంలో  ప్రజా జీవితంలో విస్తారమైన అనుభవంతో పరిపాలనకు మార్గనిర్దేశం చేయగలవారి సేవలను ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సలహా ఇచ్చారు.ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, నిత్యావసర వస్తువుల సరఫరా, విద్యార్థులకు ఆహార లభ్యత, ఆశ్రయం, వలస కూలీలకు ఆహారం ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు, జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. వైరస్ గురించి అవగాహన కల్పించి, ఇతర రాష్ట్రాల విద్యార్థులను జాగ్రత్తగా చూసుకునేలా చిత్ర పరిశ్రమ, సాహిత్య సంస్థలు, ప్రైవేటు రంగ సేవలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించారు.

భారతీయులూ అప్రమత్తంగా ఉండండి.

భారత దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకూ దేశం మొత్తం లాక్ డౌన్. ప్రజలకు భయపడకండి మేమున్నాం అని ప్రభుత్వాలు ధైర్యం చెప్తున్నాయి. ప్యాకేజీలు కూడా ప్రకటించాయి. ఇదిలా ఉండగానే..కరోనా విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నివేదిక ఒకటి స్పష్టం చేసింది. ఇండియాలో వచ్చే మే నెల నాటికి 10 నుంచి 13 లక్షల మందికి కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ వ్యాధి వ్యాపిస్తున్న విధానాన్ని పరిశీలించి, దాని ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. కోవిండ్-19(COV-IND-19) అనే అధ్యయన బృందం ఈ నివేదికను రూపొందించింది. వైరస్ తొలిదశ వ్యాప్తిలో అమెరికా, ఇటలీ వంటి దేశాలతో పోలిస్తే, భారతదేశం మెరుగ్గానే కరోనా కేసులని నియంత్రించగలిగిన మాట వాస్తవమేనని, కానీ విస్తృతంగా నిర్థారణ పరీక్షలు చేయలేకపోవడం ఇండియా ప్రధాన లోపంగా కనిపిస్తోందని ఈ పరిశోధకులు అంటున్నారు.  పరీక్షా కేంద్రాలు చాలా తక్కువగా ఉండటం, ఫలితాల ఖచ్చితత్వం, ఎంతమంది వైరస్ బారిన పడిన వారు పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు వంటి అంశాలు కరోనా విస్తృతిని అర్థం చేసుకోడానికి ముఖ్య అంశాలని, ఇండియాలో ఈ సమాచారం సమగ్రంగా లేదని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటి శాస్త్రవేత్త దేబశ్రీ రాయ్ అన్నారు. ఇప్పటిదాకా, ఇండియాలో టెస్టులు చేసిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అందువల్ల, ఎంతమందికి వాస్తవంగా ఈ వైరస్ సోకిందో చెప్పలేని పరిస్థితి ఇండియాలో నెలకొని ఉందని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా రిపోర్టు అవుతున్నాయని, అందుచేత ప్రస్తుత లెక్కలని నమ్మలేమని అంటున్నారు. మార్చి 16 వరకూ రిపోర్టయిన కేసుల ఆధారంగా వేసిన లెక్కల ప్రకారంగా మే నెల నాటికి కరోనా కేసుల సంఖ్య దేశంలో పది లక్షలు దాటొచ్చనేది అంచనా. అయితే, ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలను బట్టి ఈ సంఖ్య తగ్గొచ్చు అని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో ఢిల్లీ స్కూలు ఆఫ్ ఎకనామిక్స్, అలాగే అమెరికాలోని జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటికి చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. సాధారణ పరిస్థితుల్లోనే పేషెంట్ల తాకిడిని తట్టుకోలేని వైద్యఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో ఉన్నదని, అలాంటిది ఒక్కసారిగా ఒత్తిడి ఎక్కువైతే వైద్యరంగం కుప్పకూలే అవకాశం ఉందని రిపోర్టులో అన్నారు. ఇండియాలో పదివేల మందికి 7 బెడ్లు ఉన్నాయి. అదే ఫ్రాన్సులో 65, దక్షిణ కొరియాలో 115, చైనాలో 42, ఇటలీలో 34, అమెరికాలో 28 బెడ్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే, ముందుముందు పెరిగే కరోనా కేసులను ట్రీట్ చేయగల సామర్థ్యం మన ఆస్పత్రులకు లేదని అర్థం అవుతుంది. ఇండియాలో మరో సమస్య ఏంటంటే, దేశంలో 110 కోట్ల మందికి, అంటే మెజారిటి ప్రజలకి ఎటువంటి ఇన్సూరెన్సు పాలసీ లేదు. దీనికి తోడు, దాదాపు 30 కోట్ల మందికి బీపీ ఉంది. కరోనా వైరస్ సోకిన వాళ్లు చనిపోవడానికి దోహదం చేసే అంశాల్లో బీపీ ప్రధానమైనది. కఠిన మైన చర్యలు తీసుకోకపోతే, ఇండియాలోని వైద్యఆరోగ్య వ్యవస్థ, ఇక్కడున్న ఆస్పత్రులు పెరగనున్న కరోనా పేషెంట్ల సంఖ్యతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి. మనందరం స్వయం నిర్భందంలో ఉండడమే మనకు శ్రీ రామ రక్ష.

పెరుగుతున్న ఉష్ణోగ్రత! మ‌రోప‌క్క హైద‌రాబాద్‌కు వ‌ర్ష సూచ‌న‌!

దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ గుజరాత్ వరకు, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు మధ్య మహారాష్ట్ర మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రము సంచాలకులు తెలిపారు. దీని ప్ర‌భావంతో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఎండలు బగబగలాడుతున్నాయి. దీనితో గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవికాలంలో తొలిసారిగా 37.0 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. వారం క్రితం 36.2 డిగ్రీలు ఉండగా.. నిన్న శుక్రవారం 37.0 డిగ్రీలు నమోదు కావడంతో పగలు భానుడు బగబగకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయిని ధాటి 22.9 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపధ్యంలో రాగల రెండు రోజుల్లో రాజధానిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వున్న‌ట్లు అధికారులు స్పష్టం చేశారు.

ప్రపంచం మొత్తం క్యా కరోనా.. ఏపీలో పదవులు బరోనా...

ఒక వైపు కరోనా ప్రపంచాన్ని మింగేయాలని చూస్తోంది..ప్రపంచ దేశాలన్నీ క్యా కరోనా అనే ఆలోచనలు చేస్తున్నాయి. ఏపీలో మాత్రం కరోనా అయితే మాకేంటి? మేం మా వాళ్ళతో పదవులు బరోనాకే మొగ్గు చూపుతాం అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అదేదో వచ్చిందని ప్రభుత్వ కార్యక్రమాలను ఆపుకోవాలా? అన్నట్లుగానే ఉంది ఏపీలో ప్రభుత్వ వ్యవహారం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత మంది ఉన్నారో అంత మందికి పైగానే నామినేటెడ్ పదవులు.. అందులో క్యాబినెట్ హోదా కూడా కలిగిన వారు ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమే.  సీఎంఓ నుండి ఢిల్లీ వరకు ఇంకా ముందుకెళ్తే ఇతర దేశాలలో కూడా ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. ఆయా దేశాల నుండి పెట్టుబడుల ఆకర్షణగా వీరిని ప్రభుత్వం నియమించిందని చెప్పుకుంటోంది. కానీ పది నెలలలో వీరు తెచ్చిన పెట్టుబడులు ఎన్నో.. ఏర్పాటు చేసిన మీటింగులు ఎన్నో ఆ ప్రభుత్వానికి కానీ సలహాదారులకు కానీ తెలుసో లేదో భగవంతుడికే తెలియాలి. రాష్ట్రంలో ఇలాంటి సలహాదారు పదవుల జాతర చిట్టా చాలా పెద్దదే.  ప్రభుత్వ సలహాదారులుగా ఎడాపెడా పోస్టింగులు ఇచ్చేశారు.. ఇస్తున్నారు.. ఇంకా ఇస్తారేమో కూడా. అది కూడా సీఎం జగన్ సొంత మీడియాలో పనిచేసిన వారిని లేదా తన సొంత సామజిక వర్గానికి చెందిన వారినే ఎక్కువగా ఈ నామినేటెడ్ పదవులలో కూర్చోబెడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు పదవులు పొందిన వారిలో ఆ రెండు క్వాలిఫికేషన్స్ ఉండడం అందుకు కారణం.  అదలా ఉంచండి.. ప్రస్తుతం ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో అసలైన సమస్య కరోనా కట్టడి. ప్రపంచం మొత్తం దీనిపై పోరాటం చేస్తుంది. ఇందుకోసం రోజుకి లక్షల కోట్ల నష్టాలను భరిస్తున్న ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను రక్షిస్తే చాలని తాపత్రయపడుతున్నాయి. ఏపీలో కూడా రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇక్కడ ప్రజలు  తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు కరోనా భయాందోళన నుండి ఎంతవరకు భరోసా కల్పిస్తున్నారో కానీ ఈ సమయంలో కూడా జగన్ పదవుల పందేరం మాత్రం ఆపలేదు. తాజాగా మరో ఇద్దరికి పదవులను పంచారు. సాక్షి ఏపీ ఎడిషన్‌కు రెడిసెంట్ ఎడిటర్‌గా పనిచేసిన ధనుంజయరెడ్డి అనే జర్నలిస్టును సీఎం సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో రమణారెడ్డి అనే విద్యాసంస్థల అధినేతను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారు. ధనుంజయరెడ్డిని ఈమధ్యనే సాక్షి పత్రిక నుండి తొలగించి మరో సీనియర్ జర్నలిస్టును నియమించారు. అయన కంటే ధనుంజయ్ జూనియర్ అయినా అప్పుడు సాక్షిలో పదవికి వైఎస్ కుటుంబంతో సన్నిహిత్యమే పనిచేసింది. అదే ఇప్పుడు ఏకంగా సీఎం సలహాదారునిగా కూడా అదే పనిచేసినట్లుగా ఉందని ప్రభుత్వ వర్గాల భోగట్టా. అయితే.. ధనుంజయ్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయనే వారు కూడా ఉన్నారు. చిత్తూరు, విశాఖ జిల్లాలలో కొన్ని భూ దందాలకు పాల్పడ్డారని మీడియాలో కొందరు ఆరోపిస్తుంటారు. అయితే, అందుకు ఆధారాలు మాత్రం బయటకి రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో అయన కూడా భాగమే.  అయితే.. రాష్ట్రంలో ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుంది. ప్రభుత్వంలో కూడా అత్యవసర సేవలు మినహా అంతా లోక్ డౌన్ లోనే ఉన్నారు. ఇప్పుడే ఈ పదవుల నియామకానికి సమయం కుదిరిందా అని ప్రశ్నలు వస్తున్నాయి. అది కూడా ధనుంజయ్ రెడ్డి ముఖ్యంగా పంచాయతీ వార్డు మెంబర్లు, సచివాలయాలు విషయంలో సలహాలిస్తారట. ఏదేమైనా ఇలాంటి విపత్కర పరిస్తితుల్లో పేదలకు వెయ్యి ఇస్తూ లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము మరో మాజీ సాక్షి ఉద్యోగి ఖాతాలో పడుతోంది.

ఎంపీల సాయం నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్ 

అజీం ప్రేమ్ జీ అన్ని కోట్లు, అంబానీ ఇన్ని కోట్లు..వీరితో పాటు సినీ ప్రముఖులు, కాంట్రాక్టర్లు ఇతరత్రా ప్రముఖులు కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారని రోజూ చూస్తున్నాం. అంతవరకూ బాగానే ఉంది.. దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆ పార్లమెంటు సభ్యుడు ఇంత ఇచ్చాడు, ఈ పార్లమెంటు సభ్యుడు అంత ఇచ్చాడు అనే వార్తలూ చూస్తున్నాం. అత్త సొమ్ము అల్లుడి దానంలా  చాలా మంది పార్లమెంటు సభ్యులు ఇస్తున్నది తమ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి మాత్రమే అన్నది పచ్చి నిజం.  వీళ్ళలో ఎవరూ సొంత డబ్బులు రూపాయి కూడా సాయం చేయడం లేదు. కరోనా కట్టడి కోసం తమ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తం స్థానిక సంస్థలు ఉపయోగించుకోవాలని చెబుతూ ఆ ఎంపీలు సంబంధిత జిల్లా కలెక్టర్లకు, మునిసిపల్ కమిషనర్ లకు లేఖలు ఇస్తున్నారు. పైపెచ్చు తామేదో తమ సొంత డబ్బులు ఇస్తున్నట్లు ఫొటోలు తీయించుకుని పత్రికలలో వేయించుకుంటున్నారు. ఎంపీ లాడ్స్ నిధులు ప్రజల సొమ్మే. వారు సొంతగా ఇస్తున్నది కాదు. తెలుగు రాష్ట్రాలలోని ఎంపీలు సొంత డబ్బులు ఇచ్చిన వారు తక్కువే. ఇలా మంది సొమ్ము పందారం చేసిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. దేశంలో ప్రస్తుత పార్లమెంటులో దాదాపు 70 శాతం మంది కోటీశ్వరులున్నారు. వంద కోట్లకు పైబడి ఆస్తులు ఉన్న వారు లెక్కకు మించి ఉన్నారు. వెయ్యి కోట్ల ఆస్తులు దాటిన ఎంపీలూ ఉన్నారు. ఆర్ధిక నేరాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా మన దేశంలో కొదవేం లేదు. ఎంపీలు అందరూ తమ సొంత సొమ్ము ఇవ్వకపోవడం ఇక్కడ గమనార్హం. ఎంపీ లాడ్స్ ఇవ్వాళ కాకపోతే రేపు ప్రజలకు ఖర్చు చేయాల్సిందే. అది మీరు ఇప్పుడు ఇవ్వడం ఏమాత్రం గొప్ప కాదు. అయ్యా గౌరవ ఎంపిలూ.. సొంత డబ్బులు ఇవ్వండి. అప్పుడు మీ డబ్బాలు కొట్టుకోండి..మాకేం పర్వాలేదు.. మేము కూడా మెచ్చుకుంటాం అంటున్నారు ప్రజలు.

హైదరాబాద్‌లో కరోనా రెడ్ జోన్!

కరోనా బాధితులున్న ప్రాంతాలను 'కొవిడ్ - 19 క్వారంటైన్డ్ జోన్స‌గా తెలంగాణా ప్ర‌భుత్వం ప్రకటించింది. చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజాల్, కొత్త పేట ప్రాంతాలను రెడ్ జోన్ గా డిక్లేర్ చేసి ఈ ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు విధించారు. ఇక్కడున్న వారు 14 రోజుల పాటు ఇళ్లల్లోని బయటకు రావొద్దని అధికారులు సూచించారు. రెడ్ జోన్‌లో వున్న‌వారంతా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందే.హెల్త్ కేర్ సిబ్బంది వీరి ఇళ్లకే వెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. తద్వారా ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే ముందుగానే వారిని ఐసోలేషన్‌కు తరలించే అవకాశం ఉంటుంది. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు ఇంటి వద్దకే అధికారులు పంపించ‌నున్నారు. వీరికి మందులు, ఇతరత్రా అవసరాల కోసం ప్ర‌త్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. కిలో మీటర్ పరిధిలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేసి..అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని అధికారులు భావిస్తున్నారు. వైరస్ సోక‌కుండా అడ్డుకట్ట వేయాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు. సామాజిక దూరం ఒక్కటే మనల్ని ఈ వైరస్ నుంచి కాపాడుతుంది.

దేశంలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 886

కొత్త కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత తొలిసారి శుక్రవారం అత్యధికంగా 150కిపైగా కేసులు నమోదుకావడం ఆందోళన గురిచేస్తోంది. శుక్రవారం కేరళలో అత్యధికంగా 39 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 176కి చేరింది. దీని తర్వాతి స్థానంలో 156 కేసులతో మహారాష్ట్ర నిలిచింది. కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 76 మంది కోలుకోగా, 20 మంది మృతిచెందారు. ప్రస్తుతం 791 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఒక్క రోజు 10 కేసులు నమోదుకావడంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 59కి చేరింది. మార్చి 2న రాష్ట్రంలో తొలికేసు నమోదైన తర్వాత.. ఒక రోజులో 10కిపైగా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. వీరిలో ఓ వ్యక్తి కోలుకొని ఇంటికెళ్లగా, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించిన వారిలో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యుడి తల్లి కూడా ఉన్నారు. దీంతో వైద్యులైన భార్యాభర్తలతో పాటు వారి కుటుంబంలో ఇప్పుడు తల్లికి కూడా సోకినట్లయింది. ఆ వైద్యుడి తండ్రికి, ఇద్దరు చిన్నారులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇంకా వెల్లడి కావలసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరింది. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా కుటుంబ సభ్యులు ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. విశాఖలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.

అమెరికా...  కరోనా మృతులలో చైనాను మించి పోతుందా..?

ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేసి అమెరికా భారీ మూల్యం చెల్లిస్తోంది! అమెరికాలో ప్ర‌స్తుతం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, చివరికి తగినన్ని మాస్క్‌లకు సైతం కొరత ఏర్పడుతుంద‌ట‌. తూర్పు ఐరోపా, యురేసియా ప్రాంతంలో అమెరికా సాయం పొందిన దేశాల నుంచి అమెరికాకు అవసరమైన వైద్య పరికరాలు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తుల కోసం రంగంలోకి దిగాలని విదేశాంగ శాఖ అగ్రశ్రేణి దౌత్యవేత్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు 'ఫారిన్‌ పాలసీ' పత్రిక తెలిపింది.  మార్చి 22న ఐరోపా, యురేసియా దేశాలకు విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి డేవిడ్‌ హాలే పంపిన ఇమెయిల్‌ అంశాలు తమకు లభ్యమైనట్లు 'ఫారిన్‌ పాలసీ' పత్రిక పేర్కొన్నది.   వేలాది వెంటిలేటర్లు, ఇతర ఆధునిక పరికరాలు అవసరమని హాలే పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి అనేక దేశాలకు సాయం అందించే చర్యలను సమన్వయం చేసే కార్యాలయం ద్వారానే ఇప్పుడు తమకే సాయం అవసరమని ఆయా దేశాలను అభ్యర్ధించింది అమోరికా. అయితే కరోనాతో వణికిపోతున్న తరుణంలో అవి ఏమాత్రం సాయం చేయగలవో తెలియదు.   ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేసిన అమెరికా, దేశ‌ప్ర‌జ‌ల‌ ప్రాణాలకు పెను ముప్పు తెచ్చిందనే విమ‌ర్శ‌లు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు హ‌డావిడిగా దేశాధ్య‌క్షుడు  ఆయుధ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు వాటి బదులు అత్యవసరమైన వైద్య పరికరాల తయారీ చేపట్టేందుకు వీలుగా 'డిఫెన్స్‌ ప్రొడక్షన్‌' చట్టాన్ని వినియోగించేందుకు వీలు కల్పిస్తూ ట్రంప్‌ ఒక ఉత్తరువు మీద సంతకం చేశారు.  అమెరికా లోని పలు ఆసుపత్రులలో వైద్య సిబ్బంది, వాడిన మాస్కులనే మరోసారి వాడటమే కాకుండా, గత్యంతరం లేక నిర్మాణ రంగ కార్మికులు వినియోగించే మాస్కులను కూడా వినియోగించాల్సి వస్తోంది.  దేశంలో లక్ష వెంటిలేటర్లు ఉన్నాయని గత వారంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెనెస్‌ చెప్పగా, లక్షా 60 వేలు ఉన్నాయని 'న్యూయార్క్‌ టైమ్స్‌' పత్రిక వార్త పేర్కొన్నది. కరోనా వైరస్‌ బాధితులకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి గనుక అమెరికాలో వేగంగా పెరుగుతున్న రోగులకు అవసరమైన వెంటిలేటర్లు లభ్యం కావేమో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా సోకింది. స్వీయ నియంత్రణ లో గడిచిన వారం రోజులుగా ఉన్న ఆయన, తనకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు వెల్లడించారు. వైరస్ తాలూకు తక్కువ స్థాయి లక్షణాలను గడిచిన 24 గంటల్లో గుర్తించినట్టు ఆయనపేర్కొన్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ లో గురువారం జరిగిన ప్రధాని వారాంతపు ప్రశోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని బోరిస్ జాన్సన్, ఈ రోజు తనకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తానూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నానని ప్రధాని చెప్పారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు, ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారని, డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

మెఘా కృష్ణారెడ్డికి జగన్ ప్రత్యేక మినహాయింపు, రాష్ట్ర ప్రజలకు వర్తించే రూల్..ఆయనకు వర్తించదా?

సీఎం జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించిన కృష్ణారెడ్డి. దేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ మెఘా ఇంజనీరింగ్ కరోనా సాయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఐదు కోట్ల రూపాయల విరాళం అందించిన మెఘా ఇంజనీరింగ్ ఎండీ కృష్ణారెడ్డి..శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలసి సీఎం సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఇతర పారిశ్రామిక సంస్థలతో పోలిస్తే కరోనా పోరుకు విరాళం అందించిన వాటిలో మెఘా సాయం ప్రశంసనీయం. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ ఎక్కడ వారు అక్కడే లాక్ డౌన్ ఉంది కాబట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి..ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో నానా కష్టాలు పడుతున్న ఏపీ యువత సరిహద్దులకు చేరుకుని ఇబ్బందులు పడుతోంది.  ఇఫ్పటికీ కొన్ని చోట్ల యువత సరిహద్దుల వద్ద నానా ఇబ్బందులు  పడుతున్నారు. కొంత మంది మంత్రులు మాత్రం ఎవరైనా ఏపీకి చెందిన వారైనా  రాష్ట్రంలోకి రావాలంటే మాత్రం 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని..అందుకు సిద్ధం అయితే మాత్రం రావాలని సూచించారు. అంతే కాదు..పదుల సంఖ్యలో విద్యార్ధులను క్వారంటైన్ లో పెట్టారు కూడా.  ఏపీ సరిహద్దులకు చేరిన విద్యార్ధులు, ఉద్యోగులు మా రాష్ట్రంలోకి మమ్మల్ని రానివ్వరా? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ తరుణంలో అన్ని మార్గాలు బంద్ ఉన్న తరుణంలో మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి విజయవాడ వెళ్ళటం, ముఖ్యమంత్రి జగన్ కు ఐదు కోట్ల రూపాయల చెక్కు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. అసలు మెగా కృష్ణారెడ్డి ఆకాశమార్గంలో విజయవాడ వెళ్ళారా?. రోడ్డు మార్గంలో వెళ్లారా?. ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారా?. ఓ వైపు విద్యార్ధులను సరిహద్దుల్లో ఆపేసి విరాళం ఇస్తున్నారు కారణంతో బడా పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలోకి అనుమతించటం సరైన విధానం కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిజంగా విరాళం ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో  కూడా ట్రాన్స్ ఫర్ చేయవచ్చని..ప్రజలకు ఓ రూల్..పారిశ్రామికవేత్తలకు ఓ రూల్ అనేది సరైన సందేశం పంపదని వ్యాఖ్యానించారు.కరోనా ప్రొటోకాల్ ప్రకారం మెఘా కృష్ణారెడ్డిని ఏపీలోకి అనుమతించటం నిబంధనల ఉల్లంఘనే అని చెబుతున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు!

మీ ధాన్యం ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తోంది. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చెల్లిస్తాం. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. మీ గ్రామానికే వ‌చ్చి పంట కొంటారు. మీరు మార్కెట్‌కు రావ‌ద్దు. వ్య‌వ‌శాయ‌శాఖ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశాం. ల‌క్ష‌ల మంది రైతులకు అండ‌గా వుంటాం. నిదానంగా లైన్‌లో నిల‌బ‌డి పంట అమ్ముకోండి మీ ఊరిలోనే. గ్రామాల్లో కంచె వేసుకోవ‌డం మంచిదే కానీ మీ ఊరి అవ‌స‌రాల‌కోసం అడ్డు తొల‌గించండి. మీ గ్రామ వ‌స‌తుల కోసం తెలివిగా వ్య‌వ‌హ‌రించండి. రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా వుంది. మ‌న చేతిలో వున్న ఏకైక ఆయుధం వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకోవ‌డ‌మే. బ‌య‌టికి క‌ద‌ల‌కుండా ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వాలి. మ‌న ఐక్య‌మ‌త్యంతో వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి. రైతులు కూడా సంయ‌మ‌నం పాటించాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్జాతీయంగా కొత్త కేసులు రావు. కాబ‌ట్టి పెద్ద ప్ర‌మాదం లేదు. రాష్ట్రంలో వున్న కేసుల్ని నియంత్రించుకోవాలి. కొంత మంది మూర్ఖంగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్లే క‌రోనా విస్త‌రిస్తోంద‌ని సి.ఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ ఆధీనంలో ఐదు ల్యాబ్‌లు వ‌ర్కింగ్‌లో వున్నాయి. మ‌రొక‌టి అందుబాటులో రానుంది. అవ‌స‌ర‌మైతే సిసిఎంబి సిద్ధంగా వుంది. ప్ర‌భుత్వ కెపాసిటీ అయిన త‌రువాతే ప్రైవేట్ ల్యాబ్ ల‌ సంగ‌తి ఆలోచిస్తాం.

అనంతపురం వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ లేబరేటరీ కి అందిన 24శాంపిల్స్

అనంతపురం మెడికల్ కళాశాలలో కరోనా వైరస్ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి వైరల్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ కి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు 24 శాంపిల్స్ అందాయని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజా మైరెడ్డి తెలిపారు. అందులో కర్నూలు జిల్లా నుండి ఉదయం 10 గంటల లోపు ఒక శాంపిల్, అనంతపురం జిల్లా నుండి సాయంత్రం ఐదు గంటల లోపు  23 శాంపిల్స్ అందాయన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి  హిందూపురం నుండి20 శాంపిల్స్ , అనంతపురం ప్రధాన కేంద్రము నుండి 3 శాంపిల్స్ వచ్చాయని ఆమె తెలిపారు. ఈనెల 24వ తేదీ నుండి ఈనాటి వరకు(27వ తేదీ) మొత్తం 45 శాంపిల్స్ అందాయన్నారు. ఇందులో కర్నూలు జిల్లా నుండి 24వ తేదీన 11 శాంపిల్స్, 25వ తేదీన 2, 26వ తేదీన ఒక శాంపిల్ ,27 వ తేదీన ఒక శాంపిల్ అందగా, అనంతపురం జిల్లా నుండి 24వ తేదీన రెండు శాంపిల్స్, 25వ తేదీన 2 శాంపిల్స్, 26వ తేదీన మూడు శాంపిల్స్,27 వ తేదీన 23 శాంపిల్స్ పరీక్షల నిమిత్తం అనంతపురం మెడికల్ కళాశాలలో ని వైరల్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ కి వచ్చిందన్నారు.

కిషన్ రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు...

తెలంగాణ 33 జిల్లాల పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీలో 13 జిల్లాలను పర్యవేక్షణ బాధ్యతను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వీరు ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు ఇవ్వడంతోపాటు, కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ నేపధ్యం లో వైరస్‌ను ఎదుర్కొనేందుకు  తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించి, కేంద్రానికి నివేదిక ఇస్తారు. కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వీరిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు.వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటిదాకా 45 కేసులు నమోదవగా, ఏపీలో 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.

ఇత‌ర రాష్ట్రాల వారిని స్వంత‌బిడ్డ‌ల్లా క‌డుపులో పెట్టుకుంటాం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పిల్ల‌లు ఎవ‌రూ బ‌య‌టికి వెళ్ల‌వ‌ద్దు. మీ హాస్ట‌ల్స్‌ను మూసివేయ‌రు. మీరంతా ఎక్క‌డికి ప్ర‌యాణాలు పెట్టుకోవ‌ద్దు. ఇక్క‌డే వుండండి. ఎలాంటి స‌మ‌స్య రాకుండా చూసుకుంటామ‌ని సి.ఎం. హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 15వ‌ర‌కు తెలంగాణాలో పెంచుతున్నాం, రాత్రి క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని సి.ఎం. చెప్పారు. కూర‌గాయ‌లు బ్లాక్ మార్కెట్ కాకుండా స్థానిక నేత‌లు చూడండి. అయితే గుంపులు గుంపులుగా తిర‌గ‌కండ‌ని నేత‌ల‌కు కేసీఆర్ స‌ల‌హా ఇచ్చారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు ఆక‌లికి గురికారాదు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కుండా చూసుకుంటాం. కాబ‌ట్టి మీరు ఎక్క‌డి వారు అక్క‌డే వుండండి. త‌ర‌లి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌కండి. మీకు జీతాలు ఇవ్వ‌డ‌మే కాదు అన్నం పెట్టి ఆదుకుంటామ‌ని సి.ఎం. హామీ ఇచ్చారు. ఈ విష‌య‌మై అన్ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు సి.ఎం. తెలిపారు. హైద‌రాబాద్ జిహెచ్ఎంసితో పాటు చుట్టుప‌క్క‌ల వున్న 9 కార్పొరేష‌న్‌లో వున్న కార్మికుల్ని ఆదుకుంటాం. అధికారుల స‌మ‌న్వ‌యంతో స‌మ‌స్య‌ను అధిక‌మిస్తాం. ప‌శుగ్రాశంకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాం. పాలు, కూర‌గాయ‌లు, పండ్ల వాహ‌నాల‌కు ఇబ్బందిలేకుండా తిరిగేలా చ‌ర్య‌లు తీసుకున్నాం. డైరీ ఫాంల‌కు అవ‌స‌ర‌మైన గ‌డ్డి తెప్పించుకోవ‌చ్చు. ఎలాంటి ఆటంకం లేకుండా ఆదేశాలు జారీ చేశాం. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోమ‌ని ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. కోడిగుడ్లు బాగా తినండి. అలాగే సి.విట‌మిన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌త్తాయిపండ్ల‌ను, మామిడిపండ్ల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు పంప‌కుండా మొత్తం తెలంగాణాలోనే స‌ర‌ఫ‌రా చేయించండ‌ని సి.ఎం. ఆదేశించారు.

కొత్త‌గా మ‌రో 10 పాజిటివ్ కేసులు! తెలంగాణాలో 59కి పెరిగిన పాజిటివ్ కేసులు!

తెలంగాణాలో 59 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. 20 వేల మంది క్వారెంటైన్‌లో వున్నారు. ఈ ఒక్క రోజే శుక్ర‌వారంనాడు 10 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. ఇండియాలో 20 కోట్ల మంది క‌రోనాబారిన ప‌డే ప్ర‌మాదం వుంద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స్వీయ‌నియంత్ర‌ణే శ్రీరామ‌ర‌క్ష‌. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇళ్ల నుంచి బ‌య‌టికి రావ‌ద్దు. ఏమైత‌దిలా అనే నిర్ల‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని చేతులెత్తి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధానితో మాట్లాడాను. అండ‌గా వుంటామ‌ని పి.ఎం. భ‌రోసా ఇచ్చారు. ప్ర‌పంచ‌మంతా ఇదే ప‌ద్ద‌తి పాటిస్తోంది. ఏం చేస్తున్నారంటే 80 శాతం ఇళ్ల వ‌ద్దే పెట్టి చికిత్స చేస్తున్నారు. 13శాతం, 4 శాతం బాధితుల్ని ఆసుప‌త్రిలో పెట్టి చికిత్స చేస్తున్నారు. పూర్తిగా స్ట‌డీ చేస్తున్నాం. ఎంత వ‌ర‌కు దీన్ని ఎదుర్కోగ‌లం? 100 మంది అవ‌స‌రం అయితే 130 మందిని సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామ‌ని సి.ఎం. చెప్పారు. ఒక్కో ద‌శ‌లో 4 వేల మంది ఐసొలేష‌న్ వార్డులో వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. 1400 ఐసిఎం బెడ్స్ సిద్ధం చేస్తున్నాం. గ‌చ్చిబౌలీలో స్టేడియం పూర్తిగా అందుబాటులో రానుంది. కింగ్‌కోఠి ఆసుప్త‌రిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. 500 వెంటిలేట‌ర్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చిం. 12 వేల మంది బెడ్స్ సిద్ధం చేసుకొని వున్నాం. 60 వేల మంది బాధితులున్నా స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా వున్నాం. 8 వేల మంది వైద్యులు స‌ర్కార్ ఆసుప‌త్రుల్లో ప‌నిచేస్తున్నారు. వారే కాకా ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారి స‌మాచారం తీసుకొని 14 వేల మందిని సిద్ధం చేసుకుంటున్నాం. ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో నిర్ల‌క్ష్యం, అల‌స‌త్వం వ‌హించ‌కుండా భ‌యంక‌ర విప‌త్తులో భ‌యంక‌ర రాక్ష‌సితో యుద్ధం చేస్తున్నాం. ఈ ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు స‌హ‌కారం చేయాలి. తెలంగాణాలో వున్న ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల క‌డుపు నింపుతాం. ఆందోళ‌న చెంద‌కండి. హాస్ట‌ల్ బంద్ అయిందంటూ రోడ్ల మీద ప‌డ‌వ‌ద్దు అని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ కరోనా కంటిన్యూ అవుతోంది గదా, నా లోన్ కిస్తీ ఆపేస్తారా? , నా క్రెడిట్ కార్డు బిల్ క్యాన్సిల్ చేస

సింగినాదం సింగినాదం ఎం చేస్తున్నా వోయీ  అంటే, విరిగిపోయిన వెదురుబొంగులు అతికిస్తున్నా, మనింటిపైన చూరు కారకుండా ఉండటానికి అన్నాట్ట ! ...అచ్చం అలానే ఉన్నాయి.. మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి తెలివితేటలు . కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో, అన్ని తరహా లోన్ల మీద మారటోరియం విధించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తూ, ఆర్ బీ ఐ ఈ రోజు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం అన్ని బ్యాంకులు కూడా అన్ని తరహా టర్మ్ లోన్ల మీద మూడు నెలల మారటోరియం విధించుకునే వెసులుబాటుని ఆర్ బీ ఐ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల, బ్యాంకు కస్టమర్లు మూడు నెలల పాటు తమ కిస్తీలను కట్టకుండా ఉండే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చునన్న మాట. ఇక్కడే ఆర్ బీ ఐ ఒక పీట ముడి వేసింది. బ్యాంకులకు తాము మారటోరియం  సదుపాయం మాత్రమే కల్పించామని, దీనిపైన తదుపరి నిబంధనలు రూపొందించాలని, ఈ విషయం లో ఒక వేళ వ్యక్తిగత స్థాయిలో ఈ ఎం ఐ లను మూడు నెలలపాటు సస్పెండ్ చేయాలా, లేక బ్యాంక్ లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలా అనేది ఇంకా ఒక నిర్ణయం అయితే జరగలేదనేది ఆర్ బీ ఐ సూత్రీకరణ. ఎస్ బీ ఐ చీఫ్ రజనీష్ కుమార్ అయితే, అన్ని టర్మ్ లోన్లు క్యాన్సిల్ అయినట్లే అని ధృవీకరించారు. లోన్లు తీసుకున్న బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి లోన్లు ఆటొమ్యాటిక్ గా డిడక్ట్ అవుతాయా, లేక, కస్టమర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ ఆప్షన్ ను ఎంచుకొవాలా అనే అంశం మీద ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఒక వేళ లోన్ కిస్తీలు చెల్లించకపోతే, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ మీద దాని ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు, ఏ ప్రభావమూ ఉండదు అనే బదులిస్తోంది ఆర్ బీ ఐ. అలాగే, ఆర్ బీ ఐ తీసుకున్న కిస్తీ ల మూడు నెలల వాయిదా నిర్ణయాన్ని, అన్ని కమర్షియల్ బ్యాంకులు, అంటే రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అఖిల భారత స్థాయిలో ఉన్న ఆర్ధిక సంస్థలు, NBFC, అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఈ మారటోరియం సదుపాయాన్ని కల్పించవచ్చును. అయితే, ఆర్ బీ ఐ దీని మీద మరో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది రుణాల రద్దు కిందకి రాదు, కేవలం కిస్తీల చెల్లింపు లో కల్పిస్తున్న వాయిదా సదుపాయమే కానీ, మూడు నెలల పాటు రీ పేమెంట్ షెడ్యూల్ తో పాటు, తదుపరి కిస్తీ చెల్లింపు తేదీలన్నీ కూడా మూడు నెలల తర్వాత ఉండేలా చూడాలనేది బ్యాంకులకు ఆర్ బీ ఐ సూచన. అంటే దానర్ధం, మూడు నెలల రుణ వాయిదాలన్నీ, ఒకే సారి జూన్ నెలలో చెల్లించాలనే అనుమానాల మీద మాత్రం ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ బీ ఐ పూర్తి గైడ్ లైన్స్ వెలువరిస్తే కానీ, దీని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ మూడు నెలల మారటోరియం -ఖాతాదారుల రుణాల మీద అసలు, ఇంకా వడ్డీ కి కూడా వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చ్ 1 నాటికి ఉన్న అన్ని రకాల రుణాల మీద, మూడు నెలల పాటు రుణ కిస్తీల అసలు, ఇంకా వడ్డీ మీద మినహాయింపు ఉంటుందని ఆర్ బీ ఐ వివరించింది. హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, నిశ్చిత కాలపరిమితి ఉన్న ఆటో లోన్లు వంటివి అన్నీ, అంటే- మొబైల్, ఫ్రిజ్, టీ వీ లాంటి -కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఆర్ బీ ఐ ప్రకటించిన మారటోరియం పరిధిలోకి వస్తాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది. అయితే క్రెడిట్ కార్డు పేమెంట్స్ మాత్రం దీని పరిధిలోకి రావాలి. అవి రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి కాబట్టి, ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆర్ బీ ఐ సూత్రీకరణ. అలాగే, క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న రుణాల విషయం లో మారటోరియం వర్తిస్తుందా, లేదా అనే దాని మీద ఆర్ బీ ఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే నిమిత్తం తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఇక వ్యాపారాల గురించి, వాటి మీద తీసుకున్న రుణాల గురించి మాట్లాడుతూ, ఆర్ బీ ఐ చెప్పేదేమిటంటే -వ్యాపారాల నిమిత్తం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీద వడ్డీ చెల్లింపుల కు మినహాయింపు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని స్పష్టం చేసింది. మార్చ్ 1 నాటికి ఉన్న లోన్స్ మీద ఈ మూడు నెలల కాలానికి గానూ పేరుకుపోయిన వడ్డీని, ఈ మారటోరియం ముగిసిన తర్వాతనే వాసులు చేస్తారనేది కూడా ఆర్ బీ ఐ మాట. అయితే, రుణ ఒప్పందాలను కానీ, ఆస్తుల విభజన అంశాలను కానీ ఈ మారటోరియం ఏ రకంగానూ ప్రభావితం చేయదనేది ఆర్ బీ ఐ మాట.  

బిగ్ బ్రేకింగ్.. ఆర్మీని దింపిన కేసీఆర్.. రేపటి నుండి డబుల్ కోటింగ్!

తెలంగాణలో లాక్ డౌన్ అయినా సరే ప్రజలు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. పోలీసులు లాఠీలతో విరుచుకు పడుతున్నా.. చాలామంది రోడ్లపై చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రోడ్ల మీదకు వస్తున్న ప్రజలను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, పోలీసుల సూచనలను పాటించాలని చెప్పిన సీఎం కేసీఆర్.. ఒకవేళ ప్రజలు మాట వినకపోతే అర్మీని దింపుతామని ముందే చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో అన్నట్టుగానే కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడంతో.. కేంద్రం స్పందించి వెంటనే కేంద్ర బలగాలను పంపింది. కేంద్ర బ‌ల‌గాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. శ‌నివారం నుండి గ‌ల్లీల్లో కేంద్ర బ‌ల‌గాలు గ‌స్తీ కాయ‌బోతున్నాయి.