ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ ఇక క‌రోనా పరీక్షలు!

దేశంలోని 52 ల్యాబ్‌ల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇక నుంచి అధీకృత ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ కరోనా వైరస్ పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వుంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ కేవలం గాంధీ హాస్పిటల్‌లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలో తిరుపతి స్విమ్స్‌లో, విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో, అనంతపురంలోని జీఎంసీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఉన్న సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలోని వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్‌ లేబొరేటరీలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించారు. రూ. 23 లక్షలతో రియల్‌ టైమ్‌ పోలిమెరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ పరికరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. త్వరలోనే కాకినాడ ఆర్ఎంసీ ల్యాబ్‌లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. కరోనా అనుమానితులకు ప్రభుత్వం ఉచితంగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. కానీ ఒక్కోసారి టెస్ట్ చేసినందుకు గానూ రూ.6 వేలకుపైగా ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది. ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు అందుబాటులోకి వస్తే.. వాటిల్లో నిర్ధారణ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు కొర‌త‌!

తెలంగాణలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పడిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తలసేమియా బాధితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొద్ది రోజులుగా రక్తదానం చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. కరోనా భయంతో హాస్పిటల్స్, ఆరోగ్య శిబిరాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. గతంలో ఐటీ కంపెనీలు, కాలేజీల్లో రక్తదాన క్యాంపులు నిర్వహించి, రక్తం సేకరించేవారిమని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వీటిని మూసివేయడంతో పూర్తిగా రక్త నిల్వలు తగ్గిపోయాయి.. దీని వల్ల ముఖ్యంగా చిన్నారులు, తలసేమియా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర డాక్టర్ కేపీ రెడ్డి అన్నారు. తెలంగాణా ప్ర‌భుత్వం క‌రోనాపై సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగా ష‌ట్ డౌన్ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో జ‌నం బ‌య‌ట‌కు రావ‌డం పూర్తిగా త‌గ్గిపోతోంది. ముఖ్యంగా హార్ట్ పేషంట్ల‌కు స‌ర్జ‌రీలు చేయ‌డానికి కూడా ర‌క్తం అవ‌స‌రం అయిన‌ప్పుడు దాత‌లు క‌రువైపోతున్నార‌ని ఆసుప‌త్రుల నిర్వాహ‌కులు చెబుతున్నారు. హైద‌రాబాద్‌తో పాటు మొత్తం తెలంగాణాలోని ఇతర బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విశాఖ శారదాపీఠంలో యోగవాసిష్టం యాగాలు 

కరోనా వైరస్ నిర్మూలన కోసం 11 రోజులపాటు సాగనున్న యజ్ఞయాగాదులు యాగం నేపథ్యంలో విశాఖ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర వాయిదా రాజమండ్రిలో యాత్ర ముగించుకుని విశాఖ బయలుదేరిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సామాజిక స్పృహతో ఈ యోగ వాసిష్ఠం సూచించిన యాగం చే పట్టినట్టు స్వామి స్వాత్మానందేంద్ర 'తెలుగు వన్ '  కు చెప్పారు. శాస్త్ర గ్రంధాల్లో సూచించిన మేరకు యాగం నిర్వహిస్తామన్నారు.  ఆరోగ్యకరమైన సమాజమే విశాఖ శారదాపీఠం ఆకాంక్ష  అని స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు. నిజానికి  యోగవాసిష్ఠం లో కర్కటి ఉపాఖ్యానం అని ఒక అధ్యాయం ఉంది.  కర్కటి అనేది  ఓ మహారాక్షసి . దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు. ఇలా కాదు;  భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకే సారి మింగ గలిగితే ఎంత బాగుండు ! అప్పుడు కానీ నాకు కడుపు నిండదు – అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది. ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది. హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు. “ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయం లోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోం చేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువుద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే  దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నాడు.  అవేమిటంటే ,  తినకూడని వాటిని తినేవారిని, చెయ్యకూడని పనులు చేసేవారిని , చెడు ప్రదేశాల్లో ఉండేవారిని , శాస్త్రవ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను  సుబ్బరంగా  హింసించి ఆరగించవచ్చు.మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో   పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ ఎస్కేప్ రూట్ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికావ్యాధి కోరలనుంచి తప్పించుకోగలరట!   వేల సంవత్సరాల కిందటి  యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో, పక్క వాటాలోనో  కాపురంపెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కప్పలు, పాములు తినే చైనా వాళ్ళూ , ఎద్దు మాంసం లేనిదే  ముద్దదిగని తూర్పు, పడమర  దేశాల వాళ్ళూ , మతం పేర రక్తపుటేర్లు పారించిన వాళ్ళూ కరోనా కోరల్లో నజ్జు అవుతున్నారు. వాటికన్ , మక్కా లాంటి క్షేత్రాలే మనిషి జాడలేకుండా మూతపడి , ఇటలీలాంటి దేశాలు మొత్తానికి మొత్తం దిగ్బంధమై , చైనావాళ్ళు పైకి చెప్పుకోలేని ఘోరకలితో గొల్లుమంటూ ప్రపంచమంతటా హాహాకారాలు దద్దరిల్లుతున్నా , ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం చేతులెత్తేసిన స్థితిలో పాత పురాణం లో బ్రహ్మ చెప్పిన ఈ విషూచికా మంత్రమే  రేపు బాధిత జనాలకు తారకమంత్రం అవుతుందేమో?! ఎవరు చెప్పగలరు ? ఈ సంగతి తెలిస్తే ఏ అమెరికా వాడో  ఈ విషూచికా మంత్రానికి అర్జెంటుగా పేటెంటు కొట్టెయ్యడా ?! అయితే, ఈ మంత్రం ద్వారా, 11 రోజుల పాటు జరిగే యాగం -కరోనా వైరస్ బారి నుంచి క్షేమంగా ప్రజలను బయటపడేయటం కోసం ఉద్దేశించిందేనని శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు.

11 రూపాయ‌ల‌కే కరోనా తాయెత్తు!

మాస్కు కంటే త‌న తాయెత్తే ప‌వ‌ర్‌ఫుల్ అంటున్న దొంగ‌బాబా కరోనా వైరస్ మన దేశంలో దొంగ బాబాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాయత్తు కట్టుకుంటే కరోనా దరిచేరదంటూ ప్రచారం మొదలెట్టాడు యూపీలో దొంగ బాబా అహ్మద్ సిద్ధిఖ్‌. అంతా అమాయక ప్రజలు ఆ బాబాల దర్శనం కోసం క్యూ క‌ట్టారు. తాయత్తు కట్టుకుంటే కరోనా వచ్చినా ఎగిరిపోతుందంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న దొంగబాబాకు యూపీ పోలీసులు క‌ట‌క‌టాల వెనుక‌కు నెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. చేతికి తానుకట్టే మంత్రించిన తాయెత్తుతో కరోనా పారిపోతుందంటూ అహ్మద్ సిద్ధిఖీ అనే ఓ దొంగబాబా ఏకంగా బోర్డు పెట్టే తామెత్తులు అమ్మాడు. మందులు ఎలాగు లేవు క‌నుక తానే కరోనా వ్యాపారానికి తెరలేపాడు. ఒక్కో తాయెత్తు ధర కేవ‌లం 11 రూపాయ‌లు మాత్ర‌మేనంటూ స్థానికంగా విస్తృతంగా ప్ర‌చారం చేసుకున్నాడు. ఇంకేముంది. అమాయక ప్రజలు క్యూలైన్లు కట్టి మరీ తాయెత్తు కట్టించుకుంటున్నారు. మాస్కులకంటే ఇదే బెటర్ అనుకుంటున్న ప్రజలు.. తాయెత్తు కట్టుకుంటూ మోసపోతున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో.. ప్రజలను మోసం చేస్తున్నా బాబా అవతారమెత్తిన సిద్ధిఖీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఎస్ సెప్పినారూ.. సీఎం సెప్పినారూ.. వైద్యులందరూ సెప్పినారూ.. ఒక్క సారి వచ్చిపోన్నా.. నానన్నా

గౌరవ వైద్య ఆరోగ్య మంత్రి గారూ అధైర్య పడకండి.. ఏపీకి కరోనా రాదు..వచ్చినా మన దగ్గర మంచి మందులున్నాయని ముఖ్యమంత్రిగారే చెప్పారు..మీరెక్కడున్నా ధైర్యంగా ప్రజల్లోకి రండి ప్రజలకు కూడా కాస్త ధైర్యం చెప్పండి. రాష్ట్ర మంత్రి గారిని ప్రజలు వేడుకుంటున్నారు.    కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు చాలా రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాళ్‌, జమ్మూకశ్మీర్‌  సహా దాదాపుగా రాష్ట్రాలన్నీ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. ఐపీఎల్ మ్యాచులు కూడా వాయిదా పడ్డాయి. ప్రధాని సార్క్ దేశాల సమావేశం కూడా ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపట్టారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా స్కూల్స్ మూసి వేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రూ.500 కోట్లను కరోనా వ్యాప్తి నివారణకు కేటాయించారు.  ఇంతవరకూ అంతా బాగానే ఉంది..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతుబట్టని విషయం ఏంటంటే దేశ ప్రధాని సహా రాష్ట్రాల ఇన్ని ముఖ్యమంత్రులు కరోనాపై స్పందించినా మన ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు స్పందించడంలేదని నిన్నటి వరకూ అనుకున్నారు. కానీ మన సీఎం గారు మీడియా ముందుకొచ్చి ఆందోళన అవసరంలేదు బ్లీచింగ్ పౌడర్, పారసిటమాల్ ఉంటే చాలు అదే పోతుంది అని ప్రజలకు యెనలేని ధైర్యం అందించారు. ఇదంతా అలా ఉంచుదాం.. అసలింతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఏంచేస్తున్నారు? ఇలాంటి వెలకట్టలేని ప్రశ్నలు ప్రజల మెదళ్ళని తొలుస్తూనే ఉన్నాయి..కొంతమందికి మాత్రం మంత్రిగారు మొన్నామద్యన ఒక మున్సిపల్ కార్పోరేషన్ కు 5గురు డిప్యుటీ మేయర్ అభ్యర్దులను నియమించామని ఇది దేశంలోనే ప్రధమం అని చెప్పినట్టు గుర్తు..తర్వాత మళ్ళీ ఇంతవరకూ అమాత్యులవారి అయిపు, జాడ లేదు. ఇంతకీ మంత్రిగారికి ఏమైంది..ముఖ్యమంత్రి గారే మెడిసిన్ చెప్పారు కదా ఇంకా నాకేం పని అనుకున్నారా? లేదా కరోనా భయంతో స్వయం నిర్భందంలోకి వెళ్ళిపోయారా? అని ప్రజలు గుబులు పడుతున్నారు.

నాగబాబు ట్వీట్లకు పెరుగుతున్న ఫాలోయింగ్!

ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటుంటే, నక్క మాత్రం తోక ఎండబెట్టుకుందని సామెత. నాగబాబు శూన్య మాసం లో మాంఛి ముహూర్తం చూసి మరీ స్టార్ట్ చేసిన పొలిటికల్ ట్వీట్లు అన్నీ, జెట్ స్పీడ్ లో బూమరాంగ్ అవుతున్నాయి. ఆయన ఇలా ట్వీట్లు పెట్టడం ఆలస్యం, అలా వేడి వేడిగా నెటిజన్లు మాంఛి టైమింగ్ తో మరీ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన ప్రజల ఆలోచనలను ప్రతిబింబించేలా పెట్టిన ట్వీట్ కూ నెటిజెన్లూ అంటే ఫాస్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చేసారు.  "Antything,any belief which is devoid of logic,reason,rational,evidence,witness,,. That is faith.so all the  faiths and religions are same." అంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ లో కంటెంట్ చూడటం మానేసి మరీ నెటిజనం, ఆయన ఆంగ్ల భాషా పరిజ్ఞానం మీద సెటైర్లు వేయడం మొదలెట్టారు.  "బుస్సన్న, ఈ ఇంగ్లీష్ అంత నువ్వే ట్వీట్ చేశావా.మీవి అంత ఎండాకాలం లో వానాకాలం చదువులు అని ఫ్యూజ్  లేని  పవర్ స్టార్ అన్నట్టు గుర్తు ," అంటూ ఒక నెటిజనుడు విసిరిన సెటైర్ బాగా ట్రోల్ అవుతోంది. నిజానికి, జబర్దస్త్ షో చేసినంత కాలం, నాగబాబు కు  టైమింగ్ బాగా కలిసొచ్చింది. ఇప్పుడా షో నుంచి బయటకు వచ్చిన తర్వాత , కాస్తంత తీరిక చేసుకుని మరీ తమ్ముడు పవన్ కళ్యాణ్ జన సేన కోసం , ట్విట్టర్ వేదికగా నాగబాబు విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఒక అంచనా ప్రకారం, ఆర్ జీ వీ ట్వీట్ల తర్వాత, ఇప్పుడు నాగబాబు ట్విట్టర్ పేజీ కె ఎక్కువ ఫాలోయింగ్ ఉందట. కానీ, ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందని మాత్రం నాగబాబు ఊహించలేదు.

ఏపీ స్థానిక పోరు వాయిదాతో అసెంబ్లీ సమావేశాలు, రాజధాని తరలింపుపై ప్రభావం 

స్థానిక సంస్థల  ఎన్నికల వాయిదా అంశం  కీలక అంశాలపై ప్రభావం చూపిస్తోంది...ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు  ఎప్పుడు నిర్వహించాలి అనేది సందేహాత్మకంగా  మారింది.దీంతో పాటు వైజాగ్ రాజధాని అంశం కూడా చర్చనీయంశం అవుతోంది... రాష్ట్రంలో కరోనా ప్రభావం తో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడ్డాయి...ప్రస్తుతం  ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది...సుప్రీం కోర్టు ఏం  చెబుతుంది అనేది చూడాల్సి ఉంది..అయితే  . దీని ప్రభావం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై పడుతోంద.....మామూలుగా అయితే  ఈ నెల చివరి వారంలో  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది..పూర్తి  స్థాయి బడ్జెట్ కాకుండా  ఓట్ ఆన్ అకౌంట్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.. కానీ ప్రస్తుతం  స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు  వాయిదా పడ్డాయి...దీంతో   ఓట్ ఆన్ అకౌంట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా అనే చర్చ కూడా జరుగుతోంది...అయితే  ప్రస్తుతం ఎన్నికలు  ఆరు వారాలు వాయిదా పడినా కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంది..ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ సాధ్యం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.....ఆర్ధిక శాఖ అధికారులతో  నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.... మరో వైపు  వైజాగ్ కు రాజధాని తరలింపు పై కూడా  స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం పడుతోంద......అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ చివరికంతా   షిస్టింగ్  ఉంటుంది అనుకున్నారు..కానీ ప్రస్తుతం  పరిస్థితి ఇందుకు అనుకూలంగా లేదు.....ఒక వైపు ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడ్డాయి...ఈ లోపు తరలింపు కష్టమే అనే అభిప్రాయాలు ఉద్యోగుల్లో ఉన్నాయి..అయితే  సచివాలయం తరలిచండానికి ఎన్నికలు ఎంత వరకు అవరోధంగా ఉండచ్చు అనే చర్చ కూడా ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది.

హనీమూన్ వెళ్లిన జంట‌కు కరోనా, విష‌యాన్ని దాచిపెట్టి అధికారుల‌కు త‌ప్పుడు స‌మాచారం

కరోనా బారినపడ్డ తన కుమార్తెను ఇంట్లో దాచిపెట్టి అధికారులను తప్పుదోవ పట్టించాడు. ఇట‌లీకి హ‌నీమూన్ కు వెళ్లిన త‌న కుమార్తె వివరాలను దాచిపెట్టి వైద్య అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. చివ‌ర‌కు అల్లుడితో పాటు కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ తన భర్తతో కలిసి ఇటీవల హనీమూన్‌ కోసం ఇటలీకి వెళ్లొచ్చింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతడి ట్రావెల్ హిస్టరీని ట్రాక్ చేసిన కర్ణాటక వైద్యాధికారులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆగ్రాలో తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆ వ్యక్తి భార్యను పరీక్షించేందుకు వైద్యుల బృందం వారి ఇంటికి వెళ్లగా.. ఆమె తండ్రి అధికారులను తప్పుదోవ పట్టించాడు. తన కుమార్తె ఇంట్లో లేదని, ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్తోందని చెప్పాడు. కానీ, ఆమె ఆ ఇంట్లోనే ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, అధికారులను తప్పుదోవ పట్టించింనందుకు పోలీసులు.. యువతి తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్‌ సింగ్ ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరోనా బారినపడ్డ సదరు యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని అదనపు ప్రధాన వైద్య అధికారి డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ తెలిపారు.

టీడీపీ కార్యాలయంలో కరోనా భద్రత...

సేఫ్ జోన్ లో పార్టీ కార్యాలయం.... ఏపీ లోని టిడిపి ప్రధాన  కార్యాలయంలో కరోనా  భద్రతా ఏర్పాట్లు  చేసారు... గుంటూరు జిల్లా మంగళగిరి  ప్రధాన కార్యాలయంలో  కరోనా  వైరస్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు... క్రమశిక్షణ గల పార్టీగా   టిడిపికి మంచి పేరుంది... ప్రక్రుతి విపత్తులు, జాతీయ విపత్తులు సంభవించినపుడు  ప్రజా సేవలోనే కాక  పార్టీ  సేవలో కూడా  టిడిపి నాయకత్వం ద్రుష్టి పెడుతుంది. అందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పార్టీ కార్యాలయంలో  ఏర్పాట్లు చేసారు... అత్యవసరం అయితే తప్ప నాయకులు జిల్లాల నుంచి రావద్దని ఆదేశాలు అందాయి... అంతే కాక  కార్యకర్తలు కూడా వివిధ జిల్లాల నుంచి రావొద్దని పిలుపిచ్చారు... పార్టీ కార్యాలయంలో అందరికీ ధర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసారు... పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో సహా పార్టీ కార్యాలయంలోకి వచ్చే అంధరికీ  స్కానింగ్ చేస్తున్నారు. 100 డిగ్రీల శరీర ఉష్టోగ్రత దాటిన వారికి పార్టీ కార్యాలయంలోకి ఎంట్రీ లేదు... వీరు ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి... స్కానింగ్ తర్వాతే  పార్టీ కార్యాలయంలోకి నేతలు అడుగు పెట్టాలి.. స్కానింగ్ లో  ఎవరి కైనా టెంపరేచర్ ఎక్కువ ఉంటే తక్షణం వారికి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. సాక్షాత్తూ చంద్రబాబే  అందరకి   ఆరోగ్య జాగ్రత్తలు చెబుతున్నారు.... కరోనా దేశ వ్యాప్తంగా అలజడి కలిగిస్తోంది..జనాన్ని బాగా భయపెడుతోంది..దీంతో  టిడిపి కార్యాయలంలో ముందు జాగ్రత్తలపై  ద్రుష్టి  పెట్టారు... ఇలాంటి సమయంలో టిడిపి  ముందుకు వచ్చి  సహాయ సహకారాలు అందించడమే కాక పార్టీ కార్యకర్తలు, నాయకులకు మంచి  క్రమశిక్షణ అందించడంలో ముందుంటుంది అనే చర్చ పార్టీ కార్యాలయంలో జరుగుతోంది.

నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి శిరిడీ సాయిబాబా ఆలయం మూసివేత

మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు  భక్తుల తాకిడి అధికంగా ఉండే శిరిడీ ఆలయ మూసివేతకు నిర్ణయం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవద్దని ప్రకటన కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. భక్తుల తాకిడి అధికంగా ఉండే శిరిడీ ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవబోరని ప్రకటించారు. బాబా భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని చెప్పారు. జనాల తాకిడి అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విపక్షంలో ఏ పార్టీ ఉన్నా వారి టార్గెట్‌ పోలీసులే!

తమ రాజకీయాలకు పోలీసులను బలిపీఠమెక్కిస్తున్న విషాదకర పరిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెలకొంది. ప్ర‌స్తుతం చంద్రబాబు నాయుడు కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విపక్షాలకు చెందిన అభ్యర్ధులపై పోలీసుల ప్రోత్సాహంతోనే, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, కేంద్రబలగాలను పంపి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో పోలీసులు అన్‌ఫిట్. వారు భయపడుతున్నారు. అందుకే కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించాలని’ బాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బాబును పోలీసులు ఆయన నివాసం వద్దనే నిలిపివేసిన వైనంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత తగ్గించిన వైనంపైనా ఆయన జగన్ ప్ర‌భుత్వం పై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గతంలో ప్ర‌తిపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదు మేరకు, ఐపిఎస్‌లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయగా.. ఇప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఫిర్యాదు మేరకు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఐపిఎస్, డీస్పీ, సీఐలపై కొరడా ఝళిపించింది. అంటే విపక్షంలో ఏ పార్టీ ఉన్నా, వారికి పోలీసులే టార్గెట్. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులపై నమ్మకం లేదని విమర్శించిన వారే, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసులకు కితాబు ఇవ్వడం ఏపీ రాజ‌కీయా నాయ‌కుల్లోనే క‌నిపిస్తుంది.     జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు ఇద్దరు నేతలు.. తమకు అధికారం లేనప్పుడల్లా, పోలీసు వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేయడం పోలీసులకు మనస్తాపానికి గురిచేస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తు, కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేసి, పిల్లలను కూడా పట్టించుకోకుండా రోడ్డుపైనే జీవితం గడుపుతున్న తమను.. రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిలో, ముద్దాయిలుగా మార్చడాన్ని పోలీసులు భరించలే కపోతున్నారు. రాజకీయ పార్టీలు, తమ స్వార్ధం కోసం పోలీసు వ్యవస్థపై బురద చల్లడం వల్ల.. పోలీసులు నైతిక సైర్థ్యం కోల్పోతే నష్టపోయేది, పౌర సమాజమేనని వారంటున్నారు. తాము లేకుండా, అడుగు కూడా ముందుకు వేయలేని రాజకీయ నాయకులు, వారి స్వార్థం కోసం తమనే అవమానించడం అనైతికమంటున్నారు. గతంలో చంద్రబాబు, జగన్ విపక్ష నేతలుగా ఉన్నప్పుడు నిర్వహించిన పాదయాత్రలకు.. ఎండనక, వాననక వారికి భద్రత కల్పించింది తామేనన్న విషయాన్ని మర్చిపోయి పోలీసుల్ని విమ‌ర్శించ‌డం దారుణ‌మంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా వైఎస్. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నా, చంద్రబాబు ఉన్నా పోలీసు వ్యవస్థపై మ‌చ్చ ప‌డ‌లేదు. తమ వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దళిత, బీసీ సంఘాల నేతలు మాత్రమే అప్పట్లో విమర్శలు కురిపించేవి. జిల్లాల్లో ఉన్న కులసమీకరణ ఆధారంగా పోస్టింగులు ఇచ్చే సంప్రదాయం అప్ప‌ట్లో ఉండేది.   ఉదాహరణకు కమ్మ ఆధిపత్యం, రెడ్ల హవా ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలో ఆ రెండు వర్గాలకు చెందిన వారు కాకుండా, ఇతర కులాలకు చెందిన అధికారులను ఎస్పీ, కలెక్టర్లుగా నియమించేవారు. డీఎస్పీ, సీఐల నియామకాలు కూడా అలాగే ఉండేవి. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతి పాటించేవి. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కులాలకే ప్రాధాన్యం మొదలయింది. సమర్ధత, నిజాయితీ ప్రాతిపదిక కాకుండా.. కులం-విధేయతకే పట్టం కట్టే సంప్రదాయం ప్రారంభమయింది. దానితో అసలు ఎలాంటి పలుకుబడి, ప్రభావం లేని కింది స్థాయి కులాలకు చెందిన పోలీసులకు, అప్రాధాన్య పోస్టులు దక్కేవి. టీడీపీ హయాంలో రెడ్డి, ఎస్సీ, కులాలకు చెందిన వారికి, చాలాకాలం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం విమర్శలకు దారితీసింది. వారంతా వైసీపీకి మానసిక మద్దతుదారులయినందున, వారికి కీలకమైన పోస్టింగులు ఇస్తే ఆ పార్టీకి సహకరిస్తారన్న అనుమానమే, దానికి కారణమన్న విశ్లేషణ అప్పట్లో వినిపించింది. డీఎస్పీ పోస్టింగులు, ఎస్పీలలో ఎంతమంది కమ్మవర్గానికి చెందిన వారికి ఇచ్చారో ఒక జాబితాను విడుదల చేశారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పోలీసులపై న ఆరోప‌ణ‌లు పెరిగాయి. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు కొంత మంది పోలీసులు కులం, పక్షపాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఫలానా పోస్టులో ఫలానా కులం వారిని నియమించారన్న నాటి వైసీపీ ఆరోపణలు, పోలీసులను నైతికంగా దెబ్బతీశాయి.     ప్ర‌స్తుతం జగన్ సర్కారు, కమ్మ వర్గానికి చెందిన పోలీసు అధికారులను వెయిటింగ్‌లో ఉంచి, ప్రతీకారం తీర్చుకుంది. మరికొందరికి లూప్‌లైన్ పోస్టింగులు ఇచ్చింది. ఐపిఎస్, ఐఏఎస్‌లకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకపోగా, కొందరిని సస్పెండ్ చేసింది. కాపు వర్గానికి చెందిన పోలీసుల విషయంలోనూ ఇదే విధానం అవలంబిస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ, ముస్లిం వర్గానికి చెందిన వారికి మంచి పోస్టింగులు ఇవ్వడం ద్వారా, వారిని మెప్పించింది. బాబు జమానాలో లూప్‌లైన్‌లో ఉన్న వారికి, ఎక్కడా లంచాలు తీసుకోకుండానే జగన్ సర్కారు ప్రాధాన్యం ఇచ్చింది. అసలు తమకు అలాంటి పోస్టింగులు వస్తాయని, సదరు అధికారులు కూడా ఊహించనంతగా, జగన్ సర్కారు వారిని అందలమెక్కించింది. ప్ర‌తిప‌క్ష నేత నుంచి ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన తర్వాత జగన్ మోహ‌న్‌రెడ్డి అనేక సందర్భాల్లో పోలీసుల పనితీరును ప్రశంసించడం విశేషం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, పోలీసుల పనితీరును ఆయన ఆకాశానికెత్తారు. పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. ఎస్పీ, డీఎస్పీ, సీఐలను బదిలీ చేయడంపై జగన్ స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ తప్పిదాలే విపక్షానికి ఆయుధాలు...

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న టిడిపి  సీఎం ఏదో రూపంలో రాజకీయ  ఆయుధాలు అందిస్తున్నారు...మొన్నటి వరకు మూడు రాజధానుల అంశంలో  నానా యాగి చేసిన టిడిపికి ఇప్పుడు కరోనా ,  క్యాస్ట్ ఆయుధాులుగా  దొరికాయ...లోకల్ బాడీ ఎన్నికల పుణ్యమా అని అమరావతి ఆందోళనలకు కాసేపు విరామం ప్రకటించిన టిడిపికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల  వాయిదా మరో ఆయుధంగా దొరికింది..దీంతో పాటు సీఎం జగన్  కరోనా తో పాటు కమ్యూనిటీ  ఏంగిల్ లో చేసిన కామెంట్లు  తో టిడిపి నాయకులు రెచ్చిపోతున్నారు... కరోనా విషయంలో   దేశ వ్యాప్తంగానే కాక  ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్ ఉంది...చాలా దేశాలు గజ గజ వణికిపోతున్నాయి....ఏపీలో   పెద్ద ప్రభావం లేదు..దీంతో  పాటు ఒక్క పాజిటివ్ కేస్ కూడా లేదు..దీంతో  కరోనా పై సీఎం జగన్  లైటర్ వేలో మాట్లాడారు..జస్ట్ పారా సెట్మాల్ బ్లీచింగ్ చాలు అని  సీఎం చేసి న  వ్యాఖ్యలు టిడపికి వరంగా మారాయి....చంద్రబాబు  ఇదే అదనుగా చేసుకుని రెచ్చిపోతున్నారు..రాష్ట్రంలో  కరోనా కేస్ ఒక్కటి కూడా లేదే అనే బాధ చంద్రబాబు  మాటల్లో వ్యక్తం అవుతోంది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం అవుుతున్నాయి..దీంతో చంద్రబాబుతో సహా  టీడిపి  నేతలు మరింత రెచ్చిపోతున్నారు... ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను  సామాజిక వర్గ కోణంలో  సీఎం జగన్ చేసి న కామెంట్ కూడా టిడిపి వర్గాలకు అనుకూలంగా మారింది..ఇప్పటికే ఒక సామాజిక వర్గాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి జనంలోకి తీసు కెళ్లింది. దీనికి కొనసాగింపుగా  సాక్షాత్తూ సీఎం జగన్ ఈ రకమైన కామెంట్ చేయడంతో  చంద్రబాబు దగ్గర్నుంచి  మిగిలిని నాయకులంతా రెచ్చిపోయి  మాట్లాడుతున్నారు....సామాజిక వర్గం కోణం కావడంతో జనంలో కూడా చర్చ జరుగుతోంది... ఏదో రకంగా రాజకీయంగా నష్టపోయిన టిడిపికి సీఎం జగన్ ఆయుధాలు బాగా అందిస్తున్నారనే చర్చ జరుగుతోంది..కనీసం ఏడాది పాటు మాటా మంతి లేకుండా ఉండాల్సిన  పార్టీ విపరీతంగా రెచ్చిపోవడం  టిడిపి వర్గాలకు మరింత ఆనందం కలిగిస్తోంది.

ఏపీలో స్ధానిక పోరు వాయిదా వెనుక ఎవరి హస్తం?.. రాష్ట్రంలో ఆసక్తికర చర్చ

స్థానిక సంస్థల ఎన్నికలు  వాయిదా వేయించడంలో ఎవరి హస్తం ఉంది  అనే చర్చ ప్రస్తుతం  జరుగుతోంది.. అధికారంలో లేకపోయినా  చంద్రబాబు ఇంత  లాబీ చేయించే పరిస్థితిలో ఉన్నారా  అనే చర్చ కూడా జరుగుతోంది. రాత్రికి రాత్రే ఎన్నికల కమిషన్ ఇంత తీవ్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం కూడా మరింత చర్చనీయాంశం అవుతోంది.....ఇలాంటి పరిస్థితుల్లో  స్థానిక సంస్థలు వాయిదా అంశం  అన్ని రాజకీయ పార్టీలతో పాటు అధికార వర్గాలలో కూడా చర్చగా మారింది... ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో  ఎన్నికల కమిషనర్  ని మ్మగడ్డను  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనేజ్ చేసారనే అభిప్రాయాలు బాగా వ్యక్తం అవుతున్నాయి...సీఎం జగన్ నుంచి   మంత్రులు  వైసీపీ నేతల వరకు ఇదే విమర్శ.......చంద్రబాబు ఎన్నికలను ఆపించే పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా ఆయనకు ఇంకా బోల్డంత క్రేజ్ ఉన్నట్టే అనుకోవాలి.....సామిజిక కోణం పక్కన  పెడితే ఒక కీలక మైన ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేసి ఎన్నికలు వాయిదా వేయించే పరిస్థితి ఉన్నట్టయితే   భవిష్య్ త్  లో జరిగే పరిణామాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు   ఉన్నాయి...... స్థానిక సంస్థల  వాయిదా  వెనుక  కేంద్ర ప్రభుత్వం ఉందనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి...బిజెపి  శ్రేణుల పై దాడులు జరగడం  దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది....ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలిసినా  పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు...దీంతో ఈ రెండు పార్టీలు సరైన  విజయం పక్కన పెడితే  కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపించకపోతే  నష్టపోయే ప్రమాదం  ఉంది....దీంతో రాష్ట్రంలో జరిగిని హింసాత్మక సంఘటనలు కూడా  బిజెపి సీరియస్ గా తీసుకుంది..సొంత పార్టీ నాయకులపైనే దాడులు జరగడం  ఎన్నికల్లో   సరైన ఫలితాలు రాకపోతే  నష్టం జరగడం వీటిని ద్రుష్టిలో పెట్టుకుని కేంద్రంతో మాట్లాడి  బిజెపి నేతలు ఎన్నికలు వాయిదా వేయించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.... దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కూడా తీవ్రంగా ఉండడం  కూడా ఒక కారణం అయింది..వై సీపీ నేతల విమర్శల ప్రకారం చంద్రబాబు  వాయిదా వెనుక ఉండే పరిస్థితి   పెద్దగా కనిపించడం  లేదు....ఒక వేళ నిజంగా ఆయన హస్తం ఉంటే  బాబు పవర  లో లేకపోయినా  పవర్  ఫుల్ గా ఉన్నట్టే  లెక్క....వైసీపీ అండ్  ప్రభుత్వం బాబుపై విమర్శలు చేసి  ఆయన్ని అనవసరంగా  ఇంకా  పెద్ద  హీరోను చేస్తోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ లో చుక్కెదురు

వెంకటేశ్వర రావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను క్యాట్ సమర్థించి వెంకటేశ్వర రావు పిటిషన్ ను ట్రిబ్యునల్ కొట్టి వేసింది. ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. గత నెలలో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తన కుమారుని సంస్థకు ప్రయోజనం కలిగించేలా కొన్ని కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నారంటూ ఏబీ వెంకటేశ్వరరావును రెండు నెలల క్రితం ఏపీలోని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఏబీ.. ఒకవైపు కేంద్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తూ.. మరోవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదనను హోంశాఖకు నివేదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సబబైనదేనని కితాబునిచ్చింది. ఏబీవీని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ కూడా సమర్థించింది. సస్పెన్షన్‌నను సమర్థించడమే కాకుండా.. ఏబీవీపై వచ్చిన ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపాలని ఏపీ డీజీపీని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఏబీవీపై వచ్చిన ఆరోపణలపై వెంటనే ఛార్జీ షీట్ ఓపెన్ చేయాలని నిర్దేశించింది. ఏరియల్ వాహన కొనుగోలులో అవకతవకలు జరగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్రం అభిప్రాయపడిందది. ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం వెచ్చించిన 25.5 కోట్ల రూపాయల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రాధామిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఏఫ్రిల్‌ 7 లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏబీ అక్రమాలకు ప్రాథమిక ఆధారాలున్నాయ‌ని, వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హోంశాఖను కేంద్రం కోరింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయంచారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని రాజకీయ దురుద్దేశం తీసుకున్న నిర్ణయమని ఏబీ పిటిషన్లో పేర్కొన్నారు. తన 30 ఏళ్ల సర్వీసులో చిన్న ఆరోపణ లేదని.. అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మే 30న తనను బదిలీ చేసి.. 8 నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వలేదని.. జీతం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తన సస్పెన్షన్‌పై స్టే ఇవ్వాలని క్యాట్‌ను కోరారు. ఏబీ వెంకటేశ్వర్రావు.. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

నేనూ ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పనిచేశా.. నాక్కూడా వివరం తెలుసు: నిమ్మగడ్డ 

సీఎస్ రాసిన లేఖకు ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రత్యుత్తరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొత్తానికి స్పందించారు. మూడు పేజీలతో కూడిన లేఖ రాసిన రమేష్ కుమార్, తనకు చాలా విషయాలపై అవగాహనా ఉందనీ, తానూ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదనీ స్పష్టం చేశారు. చీఫ్ సెక్రెటరీ నీలం సహానీ కి రాసిన లేఖలో -కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరపలేమని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రం లో  స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ  తీసుకున్న నిర్ణయంపై  సీఎస్ కు 3 పేజీల లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతం లో రాజ్ భవన్ లో కంటే ముందు ఆర్దిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశాననీ, ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉందనీ అయన గుర్తు చేశారు. కోరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారు.ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించిన రమేష్ కుమార్. " గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన  సందర్భాలు ఉన్నాయి. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరికలను,ఆరోగ్య&కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.  మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు ఇంకో మలుపు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి కూడా ఎస్‌ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే . ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిచి గవర్నర్ వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ , చీఫ్ సెక్రెటరీ కి ఘాటైన జవాబు ఇస్తూ, వ్యక్తిగతం గా తనపై వ్యాఖ్యలు చేయడం బాధించినట్టు పేర్కొన్నారు.

టీటీడీలో ఇక నుంచి టైమ్ స్లాట్ దర్శనం!

మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారు ఆలయానికి రావొద్దని కోరిన టీటీడీ, మంగ‌ళ‌వారం నుంచీ టైం స్లాట్ దర్శనాల్ని ప్రారంభించింది. కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. కంపార్ట్‌మెంట్లలో భక్తుల్ని ఉంచితే, సమూహంగా ఉండటం వల్ల కరోనా వ్యాధి ప్రభలే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టైమ్ స్లాట్ దర్శనంలో కొండపైకి వచ్చే భక్తులకు ముందుగానే టైమ్ ఫిక్స్ చేస్తారు. వారికి ఇచ్చే దర్శనం టికెట్‌పై టైమ్ స్లాట్ ప్రింట్ చేస్తారు. సరిగ్గా దర్శనం టైముకి భక్తులు క్యూ లైన్ల దగ్గరకు రావాల్సి ఉంటుంది. దర్శనం టికెట్‌పై ఉండే టైమ్ చూసి... క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. తద్వారా క్యూలైన్‌లోకి వెళ్లిన భక్తులను మధ్యలో కంపార్ట్‌మెంట్లలో ఉంచకుండా డైరెక్టుగా దర్శనానికి పంపిస్తారు. ఇలా వెళ్లినా ప్రస్తుతం దర్శనం అవ్వడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. ఈ సమయంలో కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ భక్తులు ఈ సమయంలో కొండకు రాకపోవడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది. టీటీడీ మాత్రం అలా భక్తులు రావొద్దని చెప్పట్లేదు. అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే రావొద్దని చెబుతోంది.ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. భారతీయులతోపాటూ విదేశీ యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు వ‌స్తారు. ఇప్పటికే తిరుపతిలో కరోనా కలకలం ఉంది. చాలా మందిని అనుమానితులుగా రుయా ఆస్పత్రిలో చెక్ చేస్తున్నారు.

భారీ న‌ష్టంలో మామిడి రైతులు

ప్రపంవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా భయాలు పండ్లరాజును సైతం విడిచిపెట్టలేదు. కరోనా వైరస్‌ ప్రభావం మామిడి ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. 40శాతం మామిడి పంటను ఎగుమతి కోసం ఉత్పత్తి చేయడంతో తాజా పండ్లను రవాణా చేసేందుకు అవకాశం లేకపోవడం రైతులను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని మామిడి రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. మామిడి సీజన్‌ ఇప్పుడే ప్రారంభం అవుతోంది. గల్ఫ్‌, యూరోపియన్‌ దేశాలు, అమెరికాలో ఈ పండ్లకు చాలా డిమాండ్‌ ఉంది. విదేశాలలో ఉంటున్న భారతీయులు మామిడి సీజన్‌ కోసం వేచి ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తితో వ్యాపారులు మామిడి పండ్లను ఎగుమతి చేయలేకపోతున్నారు. మన దేశంలో మామిడి ఉత్పత్తిలో 40శాతం విదేశాలకు పంపబడుతుంది. దీనికోసమే రైతులు మామిడి పండ్లపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఈ పండ్లకు విదేశాలలో విపరీతమైన డిరాకీ ఉంది. ఒక వేళ ఎగుమతులు లేకపోతే మాత్రం రైతు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. విమానంలో పంపేబదులుగా సముద్ర మార్గంద్వారా పంపేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ పంపినా గమ్యస్థానానికి చేరుకుంటుందనే గ్యారంటీ లేదు. సీజన్‌ ఒక నెల ఆలస్యంగా ప్రారంభమైంది. మామిడి ఎగుమతులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రైతుల యూనియన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఎగుమతులు లేకపోతే సగానికి సగంపంట వృధా అయినట్లే. రైతులపై ఊహించలేనంత భారం పడుతుంది. ఈ సీజన్‌లో రైతులకు ప్రధాన ఆదాయం మామిడి ఎగుమతులే.

క‌రోనా చేసిన పెళ్లి!

క‌రోనా దెబ్బ‌కు ఆన్‌లైన్‌లో నిఖా జ‌రిగింది. పెళ్లి కొడుకు సౌదీలో వున్నాడు. పెళ్లి కుమార్తె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో వుంటుంది. అయితే అనుకున్న స‌మ‌యం ప్ర‌కారం పెళ్లి కొడుకు ఇండియా చేరుకోలేక‌పోయాడు. విమాన ప్రయాణాల్లో ఆంక్షలు ఉండటంతో సౌదీ నుంచి వరుడు రాలేకపోయాడు. దీంతో ఇరువైపుల పెద్ద‌వారు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో అనుకున్న స‌మ‌యానికే నిఖా కానిచ్చారు. టెక్నాల‌జీ ని ఉప‌యోగించి ఆన్ లైన్‌లోనే నిఖా వేడుక జరిగింది. బంధువులంతా ఆన్‌లైన్ షాదీలో పాల్గొని షాదీముబార‌క్ చెప్పారు. ముస్లిం సాంప్ర‌దాయం ష‌రియ‌త్ ప్ర‌కారం పెళ్ళి జ‌ర‌గాలంటే ఇద్ద‌రు సాక్షుల స‌మ‌క్షంలో పెళ్ళి కొడుకు, పెళ్ళికూత‌రు సంత‌కం పెట్టాలి. ఇద్ద‌రి సంత‌కాలు అయితే పెళ్ళి జ‌రిగిన‌ట్లే. ఆ త‌రువాత పెళ్ళి కూతురు విదాయి అంటే వీడ్కోలు సంద‌ర్భంగా దావ‌త్ చేసుకుంటారు. స్థానికంగా వుండే ఖాజీ తో ఆపాటు ఇద్ద‌రు సాక్షుల స‌మ‌క్షంలో పెళ్ళి కూతురు నిఖా నామాలో సంత‌కం పెట్టింది. ఆ కాపీని స్కాన్ చేసి పెళ్ళి కొడుకుకు మెయిల్ చేశారు. మెయిల్ కాపీ ప్రింట్ తీసుకొని వ‌రుడు సంత‌కం చేశారు. సౌదీలో అత‌ని ఇద్ద‌రు స్నేహితులు ఈ పెళ్లికి సాక్షిగా సంత‌కాలు చేశారు. మొత్తం వ్య‌వ‌హారం ఆన్‌లైన్‌లో రికార్డు చేసుకున్న త‌రువాత బంధువులు పెళ్ళికొడుకుకు ఆన్‌లైన్‌లో షాదీముబార‌క్ చెప్పి బంధువులంతా మ‌ట‌న్ బిర్యానీ తిని హ్యాపీగా వారి ఇళ్ళ‌కు వెళ్లిపోయార‌ట‌. పెళ్ళి ఎక్క‌డ ఆగిపోతుందోన‌ని తెగ మ‌ద‌న ప‌డిపోయిన పెళ్ళికూతురు తండ్రి నిఖా జ‌ర‌గ‌డంతో తృప్తిగా బిర్యానితో పాటు డ‌బుల్ కా మీఠాకూడా లాగించాడ‌ట‌.

ఐఏఎస్‌లకు వాత పెడితే... సిబ్బంది లైన్‌లోకి వచ్చారు !

  పొద్దు పొద్దునే హైదరాబాద్ లక్ డీ కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర ప్రతి సోమవారం కనిపించేహడావుడి ఈ సారెందుకో కనిపించలేదు. ఐదు రోజుల పని దినాల పుణ్యమా అని, చాలా మంది ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సిబ్బంది, అధికారులు ....హైదరాబాద్ లోని తమ ఇళ్లలో రెండు రోజులు సేద దీరి, సోమవారం పొద్దుట అమరావతి బస్సెక్కి విజయవాడ కు చేరుకోవటం రివాజు గామారింది. గడిచిన ఐదేళ్ళలో ఇది వారికొక రెగ్యులర్ ప్రాక్టీస్ గా నిలిచింది. అయితే, ఐదు రోజుల పనిదినాలను దుర్వినియోగం చేస్తూ జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారుల తీరుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కిందటి వారం సీరియస్ అవటం తో, ఇప్పుడు హైదరాబాద్ లో కాపురాణాలంటూ..అమరావతి లో ఉద్యోగాలు చేసుకుంటున్న సిబ్బంది, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.     పని  దినాల్లో కూడా సచివాలయంలో కనిపించకపోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐ ఏ ఎస్ లకు వేసిన  అక్షింతల ప్రభావం, ఇప్పుడు సిబ్బంది, అధికారుల మీద కూడా పడింది.. ఇకపై అలా కుదరదని, వారాంతాలతో పాటు పని దినాల్లోనూ అమరావతి విడిచి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని ఐ ఏ ఎస్ లు, తమ్ దగ్గర పనిచేసే అధికారులను, సిబ్బందికి  తేల్చిచెప్పేశారు.   ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్, ఢిల్లీ పర్యటనలకు వెళితే చర్యలు తప్పవని సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి ఐ ఏ ఎస్ లకు చెప్పడంతో, ఆ ఆదేశాలను వారు తమ కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి కూడా పాస్ ఆన్ చేశారు. తమ అనుమతి లేకుండా , శుక్రవారం మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయి, సోమవారం మధ్యాహ్నానికి అమరావతి కి చేరుకునే స్కీములకు ఇక స్వస్తి పలకండని సిబ్బందికి ఐ ఏ ఎస్ లు ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పనిదినాలను సైతం సీరియస్ గా తీసుకోకుండా అమరావతి విడిచి వెళ్లిపోతున్న ఐఏఎస్ అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం  ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో, వారు కూడా అందుకు తగ్గట్టుగా తమ పద్ధతులను మార్చుకున్నారు. . అయితే ఇందుకు ఓ కారణం జగన్ రోజూ సచివాలయనికి రాకపోవడమనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రోజూ సచివాలయానికి వచ్చేవారు. దీంతో అధికారులు, సిబ్బందిలోనూ ఆ భయం ఉండేది. కానీ జగన్ మాత్రం అమరావతిపై అయిష్టతో, లేక సొంతిట్లో నుంచి రివ్యూలు చేసుకోవచ్చన్న ఆలోచనతో తెలియదు కానీ సచివాలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కీలక సమావేశాలన్నీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే కానిచ్చేస్తున్నారు. దీంతో ఐఏఎస్ అధికారులతో పాటు సచివాలయంలోని ఉద్యోగులకూ ఇదే అలుసుగా మారిపోయింది.     అదే సమయంలో సీఎం జగన్ రాకపోవడంతో ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా సచివాలయానికి రావడం మానేశారు. దీంతో ఏ ఒక్క ఉద్యోగికీ ప్రభుత్వంపై ఎలాంటి భయాలు ఉండటం లేదని సచివాలయంలో పరిస్దితి చూస్తే అర్దమవుతుంది. అయితే తాజాగా పలుమార్లు మంత్రులను ప్రతీ బుధవారం కచ్చితంగా సచివాలయానికి రావాలని చెప్పిన జగన్... తాజాగా ఐఏఎస్ అధికారులకూ క్లాస్ పీకడాన్ని బట్టి చూస్తే వీరి గైర్హాజరీతో ప్రభుత్వ పాలనపై పడుతున్న ప్రభావం ఏమిటో అర్దమవుతోంది.