ముప్పతిప్పలు పెడుతున్న ఆ రెండు డొమెస్టిక్ ఎయిర్ లైన్స్

* 15 నుంచి డొమెస్టిక్ సర్వీసుల పునః ప్రారంభం అనుమానమే * ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30 తర్వాతే అంటోంది ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , ఈ నెల 15 నుంచి తలపెట్టిన డొమెస్టిక్ ఎయిర్లైన్స్  సర్వీసుల విషయం లో -పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఇద్దరు ఆపరేటర్లు రకరకాల తలనొప్పులు తెస్తున్నట్టు, ఫలితంగా ఈ నెల 15 న తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్న డొమెస్టిక్ సర్వీసుల విషయం లో ఇంకా ఒక క్లారిటీ రాలేదని అధికారులు అంటున్నారు. ఈ రెండు ఎయిర్ లైన్స్ ఇప్పటికే, తాము చెల్లించాల్సిన రిఫండ్ విషయం లో ఎయిర్ పాసెంజర్స్ ను ఇబ్బంది పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో 15 నుంచి ఎయిర్ ఇండియా మినహా మిగతా అన్ని పౌరవిమానయాన సంస్థలూ విమాన సర్వీసులను నడిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుందని, సమయ పాలన పాటించే అవకాశాలు అంతంతమాత్రమేనని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  21 రోజుల లాక్ డౌన్ అనంతరం 15 నుంచి సర్వీసులను నడిపించేందుకు ఇప్పటికే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ బుకింగ్ లను తీసుకుంటున్నాయి. "ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అందువల్ల 14 తరువాత పరిమిత సంఖ్యలోనే దేశవాళీ, అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తాం. ఏప్రిల్ 14 తరువాత బుకింగ్స్ స్వీకరించే వెసులుబాటును, స్వేచ్ఛను ఎయిర్ లైన్స్ కు కల్పించాం" అని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇదే సమయంలో 14 తరువాత లాక్ డౌన్ కొనసాగితే, విమానాలు కూడా రద్దువుతాయని, బుక్ చేసుకున్న టికెట్లు వాటంతట అవే క్యాన్సిల్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30 వరకూ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి ఎయిర్ ఇండియా బుకింగ్స్ స్వీకరిస్తోంది. ఇక ఇప్పటికే మాంద్యంలో కూరుకుపోయిన విమానయాన సంస్థలు ఉద్యోగులకు వేతనాల్లో కోతను విధిస్తున్నాయి. ఇండిగో, తన సీనియర్ ఉద్యోగులకు 25 శాతం కోతను ఇప్పటికే ప్రకటించగా, ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మినహా ప్రతి ఉద్యోగికీ, మూడు రోజుల వేతన రహిత సెలవు తప్పనిసరి చేసింది. గో ఎయిర్ సైతం వేతనాల్లో కోతను విధించింది. ఉద్యోగులు రేషనల్ బేసిస్ లో వేతనం లేకుండా సెలవు తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన విధించింది. మార్చి 25న మొదలైన 21 రోజుల లాక్ డౌన్ మరో 8 రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు వారాలూ అన్ని దేశవాళీ, విదేశీ కమర్షియల్ విమానాలు రద్దయ్యాయి.

అజిత్ దోవల్ దెబ్బకు దిగొచ్చిన తబ్లిగీ జమాత్‌

*  కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ * ప్రతి అంగుళం గాలిస్తున్న ఎఫ్ఎస్ఎల్ పత్రినిధులు * మౌలానాల సమక్షంలోనే తనిఖీలు , వీడియో చిత్రీకరణ జాతీయ భద్రతా సలహాదారు ( ఎన్ ఎస్ ఏ) అజిత్ దోవల్ దెబ్బకు దెయ్యం వదిలింది. ఆయన జోక్యం తర్వాత, పోలీస్ యంత్రాంగం లో కదలిక మొదలైంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్‌ కార్యాలయాన్ని నిన్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎస్ఎన్ఎల్) ప్రతినిధుల సంయుక్త బృందం పరిశీలించింది. మార్చిలో ఈ కేంద్రంలో జరిగిన సమావేశానికి దేశం నలుమూలల నుంచి పలువురు హాజరుకావడం, ఆ తర్వాత వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తెలిసిందే. దీంతో సమావేశానికి హాజరైన వారిని ఎక్కడికక్కడ గుర్తించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కేంద్రంలోని వారందరినీ ఖాళీ చేయించిన అనంతరం రెండు రోజులపాటు వైరస్ నివారణ చర్యలు చేపట్టారు. అనంతరం ఈ భవనంలోకి ప్రవేశించడం సురక్షితమన్న సర్టిఫికెట్ వైద్యశాఖ ఇవ్వడంతో నిన్న రెండు విభాగాలకు చెందిన సైబర్ ఫోరెన్సిక్ యూనిట్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తోఫాటు ఫొటో డివిజన్ ప్రతినిధులు కేంద్రంలోని రెండు విభాగాల్లోని ఐదంతస్తులను పరిశీలించారు. దాదాపు ఆరు గంటలపాటు భవనంలోని ఆమూలాగ్రం పరిశీలించిన బృందం ప్రతినిధులు భవనం మొత్తాన్ని మ్యాప్ చేశారు. వీడియో షూట్ చేశారు. భవనంలో చాలా రహస్య అరలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ 'మాతోపాటు మేనేజ్మెంట్ కమిటీకి చెందిన మౌలానాలను కూడా తీసుకువెళ్లాం. వారి సమక్షంలోనే భవనంలోని కార్యాలయం నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. మార్చినెలలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని భవనం మేనేజరుని అడిగాం. అవసరమనుకుంటే మరోసారి భవనాన్ని సందర్శిస్తాం' అని తెలిపారు. 'ఇది చాలా సీరియస్ కేసు అయినప్పటికీ సున్నితమైన అంశాలతో ముడిపడివుంది. అందువల్ల ఆచితూచి అడుగు వేస్తున్నాం. అయినప్పటికీ అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు పూర్తయ్యాక న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్న తర్వాత ఏ విధంగా అడుగు ముందుకు వేయాలన్నదానిపై ఓ నిర్ణయానికి వస్తాం' అని ఆ పోలీసు అధికారి వివరించారు. కాగా, బృందం సభ్యులు భవనం లోపలి భాగాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లే ముందు, తిరిగి వచ్చేటప్పుడు ప్రవేశ ద్వారం వద్దే వారికి పూర్తిగా వైద్యపరమైన తనిఖీలు నిర్వహించారు. పరిస్థితిని  నియంత్రించటానికి, చివరకు నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైసర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సీనియర్ అధికారులే చెపుతున్నారు.

లాక్ డౌన్ ముగిసే వరకూ తెలంగాణ లో బీ జె పీ ఫీడ్ ద నీడ్

లాక్ డౌన్ ముగిసే వరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయాలతో పాటు ప్రతి కార్యకర్త ఇంటి పై పార్టీ జెండా ఎగరేయ్యాలని, బీజేపీ కార్యకర్తలు -డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దిన్ దయల్ ఉపాధ్యాయ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావంగా బీజేపీ కార్యకర్తలు ఒక్క పూట భోజనం మానేయాలని, ఫీడ్ ది నీడ్ లో ప్రతి  కార్యకర్త 5 + 1 పేదలకు అన్నదానం చెయ్యాలని ఆయన కోరారు. లాక్ డౌన్ లో అత్యవసర సేవలు అందిస్తున్న వారికి కార్యకర్తలు మీ ఏరియాలో ఉన్న 40 మందితో సంతకాలు సేకరించి థాంక్యూ లెటర్స్ ని ఉద్యోగులకు ( కరోనా వారియర్స్ ) పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పరిశ్యుద్ధ కార్మికులకు అందించాలని సూచించారు. ప్రతి కార్యకర్త మాస్కులను ఇంట్లో తయారు చేపించి మరో ఇద్దరికి అందించేలా వ్యవస్థ ను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలు సామాజిక దూరం పాటిస్తూ ,ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.  

ఢిల్లీ బహుత్ దూర్ హై, లేకిన్ కరోనా తో నజ్దీక్ మే.....

* సఫ్దర్ జంగ్ ఆస్పత్రి, ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైపు వెళ్లాలంటే ఒణుకుతున్న జనం * ఎయిమ్స్, సర్ గంగారాం ఆస్పత్రుల వద్ద కూడా అదే పరిస్థితి కరోనా పాజిటివ్ కేసుల్లో డాక్టర్లు, నర్సులు ఉండటం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ ని కలవరపెడుతోంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ సర్కారు సిద్ధమైనప్పటికీ, కరోనా తీవ్రత మాత్రం ఢిల్లీని హడలెత్తిస్తోంది. న్యూఢిల్లీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన తరువాత ఇప్పటివరకూ 24 మంది డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ స్టాఫ్ తదితర హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వైరస్ సోకడంతో తీవ్ర కలకలం రేగుతోంది. వీరిలో ఇద్దరు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు ఉండగా, వీరిద్దరూ రెండు మొహల్లా క్లినిక్స్ లో పని చేశారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో పని చేస్తున్న మరో డాక్టర్ కు తాను చికిత్స చేసిన రోగి నుంచి కరోనా సోకింది. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో పని చేస్తున్న ఆరుగురు నర్సులు, ఇద్దరు డాక్టర్లకు, ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రాగా, వీరికి వ్యాధి ఎలా సోకిందన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. రెండు కొవిడ్-19 కేసులను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా అటెండ్ చేసినందుకు సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని 108 మందిని క్వారంటైన్ చేశారు. మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో 20 రోజుల క్రితం చేరిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో, ఆసుపత్రిలో పని చేస్తున్న 81 మందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. వీరిలో ఓ డాక్టర్ కు, ముగ్గురు నర్సులకు, హౌస్ కీపింగ్ స్టాఫ్ లో ఒకరికి ఇప్పటికే వైరస్ పాజిటివ్ రావడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలోని అన్ని ఆసుపత్రుల్లోనూ కరోనా లక్షణాలు లేకుంటేనే లోనికి పంపుతున్నారు. వారి ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు లేకుంటేనే ఓపీ సేవలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే, తొలుత క్వారంటైన్ సెంటర్లకు, పరీక్షల తరువాత పాజిటివ్ వస్తే, ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు బయట తిరగడం కూడా వారికి కరోనా సోకడానికి కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. "ఇప్పటివరకూ ఇళ్లల్లో ఉన్న వారు ఎవరికీ కరోనా సోకలేదు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లూ బయట తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. అందుకే వారికి ఇన్ఫెక్షన్ అధికంగా సోకుతోంది. వీరు పరిశీలించిన వారిలో 20 నుంచి 30 శాతం మందికి జ్వరం, దగ్గు లేకపోయినా, వారి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తోంది" అని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ జుగల్ కిశోర్ వ్యాఖ్యానించారు. వైద్యులంతా రక్షణ సూట్ లను ధరించి మాత్రమే ఏ రోగి వద్దకైనా వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆసుపత్రులకు వచ్చేవారు మాస్క్ లను ధరించాలని కోరారు.

కాబా శానిటైజ్‌ ప్రక్రియలో 3,500 మంది కార్మికులు

3,500 మంది కార్మికులతో గ్రాండ్‌ మాస్క్‌ మక్కాలో క్లీనింగ్‌ ఆపరేషన్‌ జరుగుతోంది. జనరల్‌ ప్రెసిడెన్సీ ఫర్‌ ఎఫైర్స్‌ ఆఫ్‌ టూ హోలీ మాస్క్స్‌, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ బృహత్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. 2,160 లీటర్ల ఎకో ఫ్రెండ్లీ శానిటైజేషన్‌ సొల్యూషన్‌ని 89 పీస్‌ల ఎక్విప్‌మెంట్‌ని రోజువారీ ఆరు క్లీనింగ్‌ ఆపరేషన్స్‌ని ఈ హోలీ సైట్‌లో చేపడుతున్నారు. ప్రతి ఐదు రోజులకోసారి కార్పెట్స్‌ని క్లీన్‌ చేస్తున్నారు. విజిటర్స్‌ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 13,500 పెద్ద ప్రేయర్‌ రగ్గుల్ని ఎప్పటికప్పుడు వాష్‌ చేసి, స్టెరిలైజ్‌ చేస్తున్నామని హోలీ మాస్క్‌ క్లీనింగ్‌ అండ్‌ కార్పెట్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జబెర్‌ విదాని చెప్పారు. జూలై చివరలో జ‌రిగే హజ్‌ యాత్రకు సంబంధించి సౌదీ ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

గర్భిణీకి వైద్యం నిరాకరణ, అంబులెన్స్‌లోనే  డెలివరీ బిడ్డ మృతి!

రాజస్తాన్‌లో కొంత మంది వైద్యులు చూపిన మత వివక్షకు ప‌సిపాప బ‌లైంది.  మతం పేరుతో వైద్యం నిరాకరించిన సంఘటన రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రాగా, సిక్రీలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు క్లిష్టంగా ఉందంటూ అక్కడి వైద్యులు ఆర్‌బిఎం జనన ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. అయితే అక్కడికి వెళ్లగా, డ్యూటీలో వున్న వైద్యురాలు  మహిళ భర్తను వివరాలు అడిగారు. అంతే మేం ఇక్కడ ముస్లింలకు చికిత్స అందించబోమని, జైపూర్‌కు తరలించాలని ఇర్ఫాన్‌తోనూ, అక్కడ ఉన్న మరో డాక్టర్‌తోనూ చెప్పారు.  వేరే దారిలేక జైపూర్ బ‌య‌లుదేరారు. దారిలోనే  అంబులెన్స్‌లో ఆమెకు డెలివరీ అయిందని ఆమె భ‌ర్త ఇర్ఫాన్‌ తెలిపారు. తమ బిడ్డ చనిపోయా డని భోరున విలపించాడు. ఈ ఘటనపై రాజస్తాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి, భరత్‌ పూర్‌ ఎమ్మెల్యే సుభాష్‌ గార్గ్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన బాధాకరమైన దని, జిల్లా యంత్రాంగానికి చెందిన బృందం విచారణ చేపడుతుందని సుభాష్‌ గార్గ్‌ తెలిపారు.

ఆదివారంనాడు 65వేలకుపైగా పాజిటివ్  కేసులు!

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది.  ఆదివారంనాడు ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 69వేల మందికిపైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికిపైగా చ‌నిపోయారు.   ఇప్ప‌ట్టి వ‌ర‌కు అమెరికాలో 3 లక్షల 34వేలకుపైగా కేసులు న‌మోదైయ్యాయి. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది.  ఇటలీలో 15వేల 887 మంది చ‌నిపోయారు.  స్పెయిన్‌లో  12వేల 518మంది పౌరులు కరోనాతో చనిపోయారు. బ్రిటన్‌లో  కరోనా మరణాలు 5వేలకు చేరువలో ఉన్నాయి.  ఫ్రాన్స్ లో   8వేలకు పైగా పౌరులు మృతి చెందారు.  జర్మనీలో   కరోనాతో 1576మంది చనిపోయారు.

పులి రాజాకు క‌రోనా వ‌స్తుందా?

అవును. వ‌స్తుంది. న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలకు చెందిన నాడియా అనే నాలుగేళ్ల పులికి కరోనా వైరస్ సోకిందని అమెరికా అధికారులు ప్రకటించారు. జూపార్కు ఉద్యోగి నుంచి పులికి కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.  దీంతో ఈ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు. పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డైరెక్టరు జిమ్ బ్రెహేనీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  కరోనా వైరస్ తో బాధపడుతున్న పులిని ఐసోలేషన్ లో ఉంచారు. ఇతర జంతువులకు క‌రోనా వైర‌స్ విస్త‌రించ‌కుండా  అమెరికన్ వెటర్నరీ మెడికల్  అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

తెలంగాణలో పాజిటివ్ సంఖ్య 332కు పెరిగింది! ఆదివారం 62 కేసుల న‌మోదు!

తెలంగాణలో ఆదివారం రోజు 62 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయి. దీంతో  రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య 332కు చేరింది. ఇందులో 32 మందికి నెగిటివ్ రావ‌డం వ‌ల్ల ఇళ్ల‌కు వెళ్ళారు. 11 మంది చ‌నిపోయారు. మిగ‌తా 283 వివిధ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో వైరస్ విజృభిస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లా లో23 కరోనా కేసులను గుర్తించారు. నిజామాబాద్ (19), నల్గొండ (13), మేడ్చల్ (12), ఆదిలాబాద్ (10), కామారెడ్డి (8), కరీంనగర్ (6) ఉన్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.  ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ రాత్రి పది గంటల త‌రువాత  హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

ఐక్యత చాటిన స్పూర్తి దీపం! 130 కోట్ల ప్ర‌జ‌ల మ‌నోధైర్యాన్ని పెంచింది!

ఒకేసారి లైట్లు ఆఫ్. అంతా చీక‌టి. సెకెండ్ల వ్య‌వ‌ధిలో 130 కోట్ల మంది ప్రజల చేతిలో దీపాలు, కొవ్వ‌త్తులు, సెల్‌ఫోన్ లైట్లు. అద్భుత‌మైన వెలుగు. అదో అనుభూతి. జ్ఞానానికి కాంతి సంకేతం. ప్రజలంతా ఒకేసారి దీపాలను వెలిగించటం ద్వారా కరోనాతో ఏర్పడిన నిరాశ నుంచి ఆశ వైపుకు తీసుకెళ్లాలని ప్ర‌ధాన మంత్రి మోదీ భావించారు. దేశ ప్ర‌జ‌లు అనుస‌రించారు. ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఆ దీపపు వెలుగులతో అంధకారాన్ని పారద్రోలటంతో పాటు... ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించారు. కరోనాను తరిమి కొట్టాలన్న సంకల్పంతో కరోనాను జయించడం అసాధ్యమేమీ కాదు. ఆరోగ్య భారతదేశం నిర్మాణానికి మన వంతుగా మనం కృషి చేస్తామ‌ని దీపం వెలుగు సాక్షిగా చాటి చెప్పారు.  కరోనా పై పోరాటం నిమిత్తం యావత్తు జాతి ఒకే తాటిపై నిల‌బ‌డింది. 130 కోట్ల మంది ప్ర‌తి ఒక్క‌రూ దీపం వెలిగించారు. కరోనావైరస్ చీకటి" తో పోరాడటానికి సంఘీభావం చూపిస్తూ  రాత్రి 9 గంటలకు దేశ‌మంతా కరెంట్ ఆఫ్ చేసి, త‌మ త‌మ ఇంటి గుమ్మం ముందు నిల‌బ‌డి 9 నిమిషాల పాటు దీపాలను, కొవ్వొత్తులను, సెల్‌ఫోన్ టార్చ్ ను ఆన్ చేశారు. ప్ర‌ధాన‌ మంత్రి మోడీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పంద‌న ల‌భించింది.  130 కోట్ల దీపాల వెలుగులో భారత్ వెలిగిపోయింది. ఆ దృశ్యం మ‌రిచిపోలేని అద్భుత‌మైన అనుభూతిని ప్ర‌జ‌ల‌కు మిగిల్చింది. ఓ వైపు క‌రోనా భ‌యం. మ‌రో వైపు వెలుగుతున్న దీపాల వెలుగుతో ప్ర‌జ‌ల్లో ధైర్యం పెరిగింది. మనం మనకోసం కాదు.. వేల మందికోసం ఇప్పుడు పోరాడుతున్నాం. మ‌న‌మంతా ఒక్క‌టే న‌ని దీపం వెలిగించి మొత్తం భార‌త‌జాతి చాటిచెప్పిన ఈ తొమ్మిది నిమిషాలు ఓ చ‌రిత్ర‌. దీపం వెలుగు సాక్షిగా తామెవ‌రూ ఒంటరిగా లేమని ధైర్యం చెప్పుకున్నారు 130 కోట్ల ప్ర‌జ‌లు. కంటికి క‌నిపించ‌ని క‌రోనా ర‌క్ష‌సి పీడ నుంచి ప్ర‌పంచ మాన‌వాళి బ‌య‌ట‌ప‌డాల‌ని ప్ర‌జ‌లు ఈ సంద‌ర్భంగా కోరుకున్నారు. ముందు వ‌రుస‌లో వుండి కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బందికి సంఘీభావంగా జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5గంటల సమయంలో తమ తమ ఇళ్ల బాల్కనీలోకి లేదా గుమ్మం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపుకు  విశేష స్పందన లభించిన‌ట్లే దేశ ప్ర‌జ‌లంతా ఒక‌టై  తొమ్మిది నిమిషాల పాటు దీపం వెలిగించి త‌మ ఐక్య‌త‌ను చాటారు.  దీపాలు వెలిగ‌డం ఎంతో మంగళకరం. దేశమంతా ఒక్కటేనన్న భావన అందరిలో కలిగించ‌డానికి ప్ర‌ధాని మోది చేసిన ప్రయత్నం విజ‌య‌వంతం అయింది.

తిరుమల ఆలయాన్ని మూసివేశారన్న దుష్ఫ్రచారాన్ని నమ్మొద్దు: టీటీడీ ఈవో సింఘాల్

* సామాజిక మాధ్యమాలు వేదికగా వదంతులు సృష్టిస్తున్నారు: టీ టీ డీ ఈ.ఓ. అనిల్ సింఘాల్ * ఇలా దుష్ప్రచారం చేసే వారు చట్ట రీత్యా శిక్షార్హులు: అనిల్ సింఘాల్ పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామికి  అన్ని సేవలు జరుగుతున్నాయని, కొన్ని వేల సంవత్సరాల అనంతరం తిరుమల ఆలయాన్ని మూసివేశారంటూ వస్తున్న వదంతులను, జరుగుతున్న దుష్ప్రచారాన్నినమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2500 సంవత్సరాల తర్వాత  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరారు. పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నిత్యం స్వామి వారి కల్యాణాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.  వసంతోత్సవాల సందర్భంగా ఇవాళ ఉదయం మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం వెంటవెంటనే పెట్టారని, ‘ఇది అపచారం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారని, ఇలాంటివి నమ్మొద్దని సూచించారు. ఇలా దుష్ప్రచారం చేసే వారు చట్ట రీత్యా శిక్షార్హులు అని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ లో 252 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

* కరోనా పాజిటివ్ తో 1 మరణం నమోదు * ఆదివారం ఒక్కరోజే 60 కొత్త కేసులు నమోదు * ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం లో ఇప్పటి వరకు నమోదు కాని కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన పరీక్షల్లో ఒక్క కర్నూలులో 26 పాజిటివ్ కేసులు. జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల వివరాలిలా ఉన్నాయి. అనంతపురం - 3, చిత్తూరు - 17, తూర్పుగోదావరి - 11, గుంటూరు - 30, కడప - 23, కృష్ణ - 28, కర్నూలు - 53, నెల్లూరు - 34, ప్రకాశం - 23, శ్రీకాకుళం - 0, విశాఖపట్నం - 15 , విజయనగరం - 0, పశ్చిమగోదావరి - 15. ఈ రోజు వరకు నమోదైన కేసులలో విదేశాల నుంచి వొచ్చిన వాళ్ళు 11. వారి కాంటాక్ట్స్ 6 మరియు వైరస్ లక్షణాలతో చేరిన వాళ్ళు మరో ఆరుగురు ఉన్నట్టు సమాచారం.

ఎపి సిఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ కాల్

ముఖ్యమంత్రి   వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి  ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఫోన్ చేసి, కోవిడ్ _19 నివారణా, నియంత్రణ చర్యల గురించి మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లో , ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యల గురించి ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.  కరోనా వ్యాధిని ఎదుర్కోవటంలో ఎపి ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు సాగటం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో  స్థానిక ఎన్నికల ఊపులో ఉండి కరోనా ను అశ్రద్ధ చేశారు. తీరా పరిస్థితిని గుర్తించిన తర్వాత కూడా తగిన రీతిలో స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో , ప్రధాని-ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.

వైఎస్ఆర్సీపీ పై గవర్నర్ కు టీ డీ పీ ఫిర్యాదు 

తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రామానాయుడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు లేఖ రాశారు. వైకాపా నాయకులు కరోనా వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం అన్నట్లుగా నగదు పంపిణీ చేస్తున్నారని గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థికసాయాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. లాక్​డౌన్‌లో ఇస్తున్న రూ.1000 నగదు, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అన్నట్లు వైకాపా నేతలు నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం అన్నట్లుగా నగదు పంపిణీ చేస్తున్నారని గవర్నర్​కు వివరించారు.సామాజిక దూరం పాటించకుండా సమూహంగా వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

కొండపోచమ్మ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఇళ్ళు నేల మట్టం! 

సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా, మరోవైపు హైకోర్టులో స్టే ఉండగానే పోలీసుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా చేస్తున్న అధికారులు. అడ్డుకున్న రైతుల్ని బెదిరిస్తూ పోలీసులతో పక్కకు నెట్టేస్తూ లాక్‌డౌన్‌లోనూ పనులు కొనసాగిస్తున్నారు.  బహిలింపూర్, మామూదాల గ్రామాల్లో కి ప్రజలు వెళ్లకుండా అడ్డంగా కాల్వను తొవ్వుతూ అడ్డుకున్న రైతులను పోలీసులు కెమెరాలతో వీడియో తీస్తూ బెదిరించే ప్రయత్నం చేశార‌ని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.   రెండు గ్రామాల పరిధిలోని రైతులకు సంబంధించి న పరిహారం చెల్లించకుండా రైతుల పైనే కేసులు పెడతామని బెదిరింపులు చేస్తున్నారు. ఒకవైపు కారోనాతో రైతులు బెంబేలెత్తిపోతుంటే ఇదే సమయంలో బలవంతంగా పనులు చేస్తే ప్రతిపక్షాలు గానీ ప్రజాసంఘాలు గానీ, రైతులుగానీ అడ్డుకోరని పనులను వేగవంతం చేశారు.  గత వారం రోజులుగా ఈ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోని ఇళ్ళని నేల మట్టం చేశారు. అడ్డుకున్న గ్రామస్థులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌ని స‌త్య‌నారాయ‌ణ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కడప జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎం సెంటర్ మూసివేత!

★ఏటీఎం సెంటర్ పై ఉమ్మేసిన యువకుడు ఏ టీ ఎం సెంటర్లకు వెళ్లే వారూ ఓ సారి ఈ వార్త చదివి, ఆనక ఆలోచించి, నిర్ణయం తీసుకోండి. అసలే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. కరోనా భయాందోళన ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, ఉంటే ఇంట్లో ఉండాలని, ఏవైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తుంటే, ఒకతను మాత్రం, ఎవరూ ఊహించని పని చేశాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పట్టణంలోని రాయల్ సర్కిల్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ కు వచ్చాడు. లోపలికి వెళ్లి, ఏటీఎం డిస్ ప్లే, నంబర్ బోర్డు తదితరాలపై లాలా జలాన్ని ఊశాడు. దీన్ని గమనించిన కొందరు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తీసుకుని వెళ్లి, వైద్యులతో పరీక్షలు జరిపించారు. అతనికి జలుబు, దగ్గు ఉన్నాయని, 101 డిగ్రీల జ్వరం కూడా ఉందని వైద్యులు తేల్చారు. దీంతో వెంటనే ఏటీఎంను మూసివేసిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని, వైద్య చికిత్స తరువాత విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా చర్యలు!

ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని అధికారులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ నివారణా చర్యలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సంబంధిత లక్షణాలతో ఎవరు వచ్చినా... కోవిడ్‌ పేషెంట్‌గానే భావించి ఆమేరకు వైద్య  సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని, దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కూడా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని, ప్రతి జిల్లాలో కూడా ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్నికూడా పెంచాలని, ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతుండాలని ముఖ్యమంత్రి మరో సరి మరోసారి స్పష్టం చేశారు.

ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్లు మొదలైనట్లా, కానట్లా?

ఈ నెల 14తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ గడువు ముగియనుండగా, ఇప్పటికే ఎయిర్ ఇండియా మినహా మిగతా పౌర విమానయాన సంస్థలు 15వ తేదీ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభించాయి. అయితే, ఆర్టీసీ మాత్రం ఇంకాకొక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. 15 వ తేదీనుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడుస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.   లాక్ డౌన్ ను తొలగిస్తూ, కేంద్రం నిర్ణయిస్తే, 15వ తేదీ నుంచి రైళ్లను నడిపించేందుకు సిద్ధమని చెప్పిన ఇండియన్ రైల్వేస్, ఇప్పటికే బుకింగ్స్ ను స్వీకరించడం ప్రారంభించాయి. ఇక, ఏపీఎస్ ఆర్టీసీ సైతం 15 నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. ఓపీఆర్ఎస్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఏసీ బస్సులకు మాత్రం ఇంకా రిజర్వేషన్ మొదలు కాలేదు. ఏసీ బస్ లను ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపించక పోవచ్చన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. కాగా, విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 127 రైళ్లకు 15 నుంచి బుకింగ్స్ ఇప్పటికే మొదలైనట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, కాల్ సెంటర్ మాత్రం ఇంకా ఈ విషయమై ఏ రకంగానూ స్పందించటం లేదు.

జ్యోతి ప్రజ్వలనకు పీఠాధిపతుల పిలుపు

ఈ రాత్రి 9 గంటలకు జ్యోతిని వెలిగించి, దేశ ఖ్యాతిని పెంచాలని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి, అలాగే, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. జ్యోతిని ప్రజ్వలించాలన్న ప్రధాని మోడీ పిలుపు దేవీ సంపదతో కూడినదని స్వామి స్వాత్మానందేంద్ర చెపితే, జాతి లో సమైక్య స్ఫూర్తికి ప్రధాని పిలుపు ఒక సూచిక అని చినజీయర్ వివరించారు. కరోనా మహమ్మారిని అంతమొందించడానికి అంతా సైనికుల్లా కదిలి జ్యోతిని వెలిగించాలని స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. భారతావనికి నష్టం వాటిల్లకుండా ఐక్యమత్యంతో, విశాల హృదయంతో, బుద్ధి వికాసంతో కలిసి కదలాలనీ, ఈ సామూహిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అందుకు పీఠిక కావాలనీ ఇద్దరు పీఠాధిపతులు అభిలాష, ఆకాంక్ష వ్యక్తం చేశారు.