ఏదైనా గౌతమ్ రెడ్డి సార్ టోన్, టెనార్ చాలా డిఫరెంట్ సిద్దప్పా...
posted on Apr 8, 2020 @ 7:11PM
* జగదేకవీరుడు చిత్రం లో ఎన్ టీ ఆర్ ఎలాగో, పరిశ్రమల శాఖ లో జితేందర్ శర్మ అలాగన్న మాట
* జితేందర్ శర్మ అవినీతిపై విచారణ ఇహ అటకెక్కినట్టేనా ?
* చంద్రబాబు నాయుడు 'బ్లూ ఐడ్ బాయ్' శర్మ అంటే -గౌతమ్ రెడ్డి కి మక్కువ ఎక్కువ
* రెండు ప్రభుత్వాల్లోనూ చక్రం తిప్పుతూ, ఎందరినో అబ్బురపరిచిన శర్మ
ఏది ఏమైనా గౌతమ్ రెడ్డి సార్ టోన్, టెనార్ చాలా డిఫెరెంట్ అని వెలగపూడి సచివాలయం ఐ ఏ ఎస్ లు చెవులు కొరుక్కుంటున్నారు. 'ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ', 'సాహసమే నా ఊపిరి ' లాంటి స్లోగన్లు మనం చిన్నప్పుడు లారీల వెనుక, బస్సుల వెనుక చూస్తూ చదువుతూ ఉండే వాళ్ళం కదా .. అందులో ఫస్ట్ స్లోగన్ అంటే మంత్రి గౌతమ్ రెడ్డి గారికి మహా ప్రీతి అనీ, అందుకనే రెండు ప్రభుత్వాలలో ( తెలుగు దేశం, వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వాలు ) ఒక వెలుగు వెలిగి, ఇంకా వెలుగుతూనే ఉన్న పూనమ్ మాలకొండయ్య, జితేందర్ శర్మ లాంటి వారిని ఆ స్లోగన్ కిందకు తీసుకువచ్చి వారికి పెద్ద పీట వేశారని కొందరు కిట్టని ఐ ఏ ఎస్ లు, మంత్రులు అనుకుంటున్నప్పటికీ, ధీశాలి గౌతమ్ రెడ్డి మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోకుండానే, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి-ఆంధ్ర ప్రదేశ్ మెడ్ టెక్ జోన్ ( ఏ ఎం టీ జెడ్) అద్భుతాలను ప్రెజెంట్ చేసిన తీరు, ఆ నిమిత్తం జగదేకవీరుడు సినిమా లో ఎన్ టీ ఆర్ మాదిరి జితేందర్ శర్మ ఏ రకంగా అసాధ్యాలను సుసాధ్యం చేశారో వివరించుకుంటూ వచ్చిన తీరు చూపరులను, మీడియా ప్రతినిధులను ఆద్యంతం అబ్బురపరిచింది. ఆ విశేషాలేమిటో, మంత్రి గౌతమ్ రెడ్డి మాటల్లోనే వినండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. జితేందర్ శర్మ అనే అద్భుత వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కూడా. నాదస్వరానికి నాగుపాము ఎలా తల ఊపుతూ నాట్యం చేస్తుందో, సరిగ్గా అదే తీరున జితేందర్ శర్మ ప్రతిపాదనలను ఆద్యంతం ప్రోత్సహిస్తూ వచ్చి, ఏ ఎం టీ జెడ్ అవినీతి వివాదాల్లో చిక్కుకోవటానికి చంద్రబాబు నాయుడు కూడా శాయశక్తులా సాయపడ్డారు. అపుడు ఏ ఎం టీ జెడ్ ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటె, ఈ ప్రభుత్వం లో మాత్రం గౌతమ్ రెడ్డి గారి పరిశ్రమల శాఖ పరిధిలోకి వచ్చింది. ఏ జితేందర్ శర్మ మీద అయితే, వై ఎస్ ఆర్ సి పి అలుపెరుగని పోరాటం చేసిందో, తాము అధికారం లోకి రాగానే, మళ్ళీ అదే శర్మ గారిని ఏ ఎం టీ జెడ్ కి సి ఈ ఓ గా నియమించింది. ఇక్కడ కూడా గిట్టనివారు, చంద్రబాబు నాయుడును, కీలక బీ జె పీ నేతలను, పూనమ్ మాలకొండయ్య నూ ఆడిపోసుకున్నా కూడా- గౌతమ్ రెడ్డి మాత్రం తన హృదయ వైశాల్యాన్ని చాటుకుని మరీ జితేందర్ శర్మ చేత కరోనా కిట్లు తయారు చేయిస్తున్నారు. అదీ పరిశ్రమల మంత్రి గొప్పతనం.
ఇహ, మిగిలిన కథా క్రమమెట్టిదో మీరే చదవండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 వైరస్ టెస్ట్ కిట్లు తయారు చేయడం గర్వించదగ్గ పరిణామమనీ, అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విప్లవాత్మక మార్పులకు విశాఖ మెడ్ టెక్ జోన్ శ్రీకారం చుట్టిందని ప్రెస్ మీట్ లో చెప్పిన గౌతమ్ రెడ్డి, ఏపీతో పాటు, దేశానికే మెడ్ టెక్ జోన్ కిట్ల తయారీలో కీలకంగా మారుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ మెడిటెక్ జోన్ లో కోవిడ్-19 టెస్టింగ్ కిట్ల తయారీకి ఐసీఎంఆర్ అనుమతి లభించిందని, వెంటిలేటర్ల తయారీకి అవసరమైన అన్ని అనుమతులకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మినహాయింపు ఇచ్చారని, కరోనా వైరస్ ను ధృవీకరించడంలో ఈ కిట్లు చాలా అద్భుతంగా పని చేస్తాయని చెప్పుకొచ్చారు. రోజుకు 2000 కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీ, రానున్న రోజుల్లో 25 వేల కిట్ల తయారే లక్ష్యం, ర్యాపిడ్ టెస్టింగ్ ద్వారా గంటలోనే ఫలితం, పాలిమరస్ చైన్ రియాక్షన్ (PCR)టెస్ట్ నిర్ధారణ ప్రక్రియకు 2-3 రోజుల సమయం అవసరమని చెప్పిన మంత్రి, కిట్లు తయారీతో పాటు, 6వేల మెషిన్లు నిల్వ సిద్ధంగా ఉందన్నారు. స్క్రీనింగ్ పరీక్షలకు కావలసిన సామాగ్రిని త్వరలోనే 60 శాతం సిద్ధంగా ఉంచుతామన్నారు. దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల కొరత ఉన్న నేపథ్యంలో త్వరలోనే కావల్సినన్ని సమకూరుస్తామన్నారు. N95 కన్నా సురక్షితమైన P 95 మాస్కుల తయారీ పనులను కూడా 4 పరిశ్రమలకు అప్పగించామన్నారు. వ్యక్తిగత రక్షణ సామాగ్రీ (PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కూడా రాష్ట్రంలో అవసరాలకు లోటు లేకుండా తయారు చేస్తామని, డీఎన్ఏ , ఆర్ఎన్ఏ మోడల్ కాబట్టి కచ్చితమైన నిర్ధారణ జరుగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 20వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అందుబాటులో ఉన్న వనరులతో రోగుల ప్రాణ నష్టం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాట. వైద్య పరికరాల కొరత, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికగా ముందుకు వెళుతున్నామని కూడా మంత్రి చెప్పారు. అత్యవసర వైద్య పరికరాలు, మాస్కులు, టెస్టింగ్ కిట్లు తయారు చేసే పరిశ్రమలకు కావలసిన కార్మికులు, సిబ్బందికి లోటు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అత్యవసర సేవలు, సామాగ్రి అందించే పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులకు పౌష్ఠికాహారం, వసతులు లోటు రానివ్వడం లేదని, కరోనా ఇబ్బందులలోనూ 25-30 శాతం పారిశ్రామిక ఉత్పత్తి చేస్తూ దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ ముందుంది. మిగతా రాష్ట్రాలలో 20 శాతం కన్నా తక్కువేనని చెప్పారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 1000 టెస్టింగ్ కిట్లు, 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ అందజేస్తామన్నారు.
కోవిడ్-19 బాధితులకు వెంటిలేటర్ల సాయం అత్యవసరమని, అటువంటి వెంటిలేటర్ల తయారీకి కూడా రాష్ట్రంలో ప్రాధాన్యతనిస్తూ వాటిని కూడా విశాఖ మెడ్ టెక్ లో తయారీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ క్రమంలో హిందుస్థాన్ లైఫ్ కేర్(హెచ్ఎల్ఎల్) సంస్థతో కలిసి ఏప్రిల్ 15 నుండి నెలకు 3000 వెంటిలేటర్లు మరియు మే చివరి నాటి 6 వేల వెంటిలేటర్లు ఉత్పత్తి చేయనున్నామని మంత్రి తెలిపారు. కేంద్రం ఇప్పటికే 3500 వెంటిలేటర్లు కావాలని ప్రతిపాదించిన నేపథ్యంలో వాటి తయారీకి తొలిదశలో 6 కంపెనీలను ఎంపిక చేయడం జరిగిందని, అవి ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ వాడటం ద్వారా ఒక్క వెంటిలేటర్ సహాయంతో ఐదు నుండి ఆరుగురుకి వినియోగించే టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైన నేపథ్యంలో పరిశ్రమల శాఖ తమ వంతు సహకారంగా 1000 టెస్టింగ్ కిట్లను ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదే విధంగా రూ. 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ ను కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీఐఐసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం(5 లక్షల 4వేల 570 రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారని వెల్లడించారు. అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విశాఖ మెడ్ టెక్ జోన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు విశాఖ మెడ్ టెక్ జోన్ సంస్థ ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు.
పరిశ్రమలు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ మాట్లాడుతూ, ప్రస్తుతం క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే మిషన్ లలో ఈ టెస్టింగ్ కిట్లను వినియోగించనున్నామన్నారు. రాష్ట్రంలో 230 ఈ తరహా మిషన్లు ఉన్నాయని, వాటన్నింటిని వినియోగిస్తూ ఈ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించి 55 నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.