కొనుగోలు కేంద్రాలలో సామాజిక దూరం పాటించాల్సిందే!
posted on Apr 10, 2020 @ 10:14AM
హాకాభవన్ లో ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బి.సి. సంక్షేమం, పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష చేశారు. పరిశుభ్రత విషయంలో, వసతుల కల్పనలో రాజీపడొద్దని మంత్రులు ఈ సందర్భంగా ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 713 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వారం రోజులలో వరికోతలు ఊపందుకుంటాయి ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, కొనుగోలు కేంద్రాల సక్రమ పనితీరుకు చర్యలు తీసుకుంటున్నారు. రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం మరియు నిల్వ సామర్థ్యం పెరగడం మరియు బియ్యం మిల్లింగ్ పరిశ్రమకు ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు విషయంలో నిపుణుల సేవలను వినియోగించుకుని బియ్యం మిల్లింగ్ పరిశ్రమ మరియు రాష్ట్రంలో ఆహార ప్రక్రియ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు.