గుంటూరు వెళ్ళి కరోనా అంటించుకున్నాడు!
posted on Apr 16, 2020 @ 12:32PM
తక్షణమే అవసరంలేని శస్త్ర చికిత్స కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడి పిల్లోడు. ఇంట్లోని పెద్ద వాళ్ళు కనీసం సమయం, సందర్భం లేకుండా ఉచితంగా గుంటూరులో చెవి ఆపరేషన్లు చేస్తున్నారని తెలిసి చికిత్స చేయించడానికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించారు. ఆ తరువాత ఇంటికి వెళ్ళారు. అయితే దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఈ పిల్లోడిని పరీక్షిస్తే పాజిటివ్ తేలింది. ఉచిత చికిత్స సరే మరి కరోనా అంటిందిగా!
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్టు ఆర్డీవో నరేందర్, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్న గుంటూరు నుంచి బాలుడు వచ్చాడన్న స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. చిన్నారికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో స్పష్టమైంది.
బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అతడి కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్ తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలుడు, అతడి కుటుంబాన్ని ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. వైద్యాధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.