చంద్రబాబు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం...
posted on Apr 20, 2020 @ 12:18PM
పట్టుదల, క్రమశిక్షణ, సేవాతత్వం, విలక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎదిగారు.1978లో రాజకీయాల్లో ప్రవేశించి 2020 ఫిబ్రవరి 27 నాటికి 42ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా సేవలందిస్తున్నారు.
చిన్నప్పటి నుంచే చంద్రబాబునాయుడికి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువ. చదువుకునే రోజుల్లోనే చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. చిత్తూరు జిల్లాలో యువనాయకుడిగా గుర్తింపు పొంది 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేశారు. 20 వేల మెజార్టీతో గెలిచి విశ్వవిద్యాలయం నుంచి శాసనసభలోకి అడుగు పెట్టారు. ఏపీ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 28 ఏళ్ల వయసులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత సాంకేతిక విద్యాశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారధ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చారిత్ర సృష్టించింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కర్షక పరిషత్ అధ్యకక్షుడిగా సేవలందించారు. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, అసెంబ్లీని ఎన్టీఆర్ బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి అప్పట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు.
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది.
అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 17వ వ్యక్తిగా చంద్రబాబునాయుడు చరిత్రలో నిలిచారు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు.
1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు.
1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్ మేకర్’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు చక్రం తిప్పారు.
రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు.
బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ నిర్మాణం ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహారాష్ట్రలో అరెస్ట్ అయి 3 రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో 16-12-2010 నుండి 22-12-2010 వరకు 8 రోజుల పాటు అన్న పానీయాలు మరచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రాణాలకు తెగించి చంద్రబాబు నిరవధిక నిరహారదీక్ష చేశారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపి భవన్‌లో 6 రోజులు నిరవధిక దీక్ష చేసి తెలుగువారి సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కాళ్లు బొబ్బలెక్కినా ప్టించుకోకుండా 208 రోజులు 7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు.
2014 ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. 102 స్థానాలను కైవసం చేసుకుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.