ప్రజా ఖజానాకు మేము కాపలాదారులం: ఆళ్ళ నాని
posted on Apr 19, 2020 @ 9:33PM
ర్యాపిడ్ కిట్ల కొనుగోలు పారదర్శకం గానే జరిగిందనీ, ఎక్కడ తక్కువ రేటుకు ఇచ్చినా ఆ రేటు మాత్రమే చెల్లించేలా షరతు, ఆ మేరకే చెల్లింపులు కూడా జరుగుతాయనే డెప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ళ నాని స్పష్టం చేశారు. అన్ని పత్రాలనూ బయటపెట్టాం, తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అసత్య ప్రచారాలతోనే టీడీపీ రాజకీయం చేస్తోందని అయన విరుచుకు పడ్డారు. ప్రజల ఖజానాకు మేం కాపలాదారులమనీ, దోపిడీదారు కాబట్టే చంద్రబాబుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయనీ, ప్రజలు చీత్కరించుకుంటున్నా చంద్రబాబు కుటిలరాజకీయలు మానడంలేదని ఆళ్ల నాని విమర్శించారు.
అతితక్కువ కాలంలోనే రాష్ట్రంలో 9 ల్యాబులను ఏర్పాటు చేసుకోగలిగామని, మరో వారంరోజుల్లో మొత్తంగా 12 ల్యాబులు పనిచేస్తాయని ఆయన చెప్పారు. ట్రూనాట్‌కిట్ల ద్వారా, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా కోవిడ్ –19 పరీక్షలు రోజుకు 17,500 వరకూ చేసే సామర్థ్యానికి మనం అతితక్కువ కాలంలో చేరుకుంటున్నాం. కోవిడ్ –19 నివారణా చర్యల్లో ఇది అత్యంత కీలకమైన అంశం. మన రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బంది అకుంఠిత శ్రమ కారణంగా ప్రతి 10 లక్షల జనాభాకు టెస్టుల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ పక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, జన సమూహంలో వైరస్ వ్యాప్తిని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కోసం గత కొన్ని రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. 210 దేశాల్లో, సుమారు 24 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. ఈ పరిస్థితుల్లో ర్యాపిడ్ టెస్టు కిట్స్‌కు అమాంతమైన డిమాండ్ నెలకొంది. వీటిని తయారుచేస్తున్న దేశాల్లో కూడా వైరస్ వ్యాప్తి ఉండడం వల్ల వీటిని తెప్పించడం అత్యంత ప్రయాసతో కూడిన వ్యవహారంగా మారింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా వైద్య ఆరోగ్యశాఖ కొరియా కంపెనీ నుంచి లక్ష కిట్స్‌ను త్వరగా తెప్పించుకోగలిగింది. అన్ని రాష్ట్రాలకంటే ముందుగా ఇవి మనకు చేరాయి. అంతేకాక జిల్లాలకు ఈ కిట్స్ పంపిణీకూడా ప్రారంభం అయ్యింది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ... ప్రభుత్వం, అధికారులు చేసిన విశేష ప్రయత్నాలు వల్ల మన రాష్ట్రానికి ఈ కిట్స్ చేరాయన్నారు.
ర్యాపిడ్ టెస్టు కిట్స్ ఎవరి నుంచి కొనుగోలు చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వివిధ కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ఐసీఎంఆర్ అనుమతి పొందిన కంపెనీలు తమతమ కొటేషన్లను సంబంధిత డీలర్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు సమర్పించినట్టే మన రాష్ట్రానికి కూడా సమర్పించాయి. ఐసీఎంఆర్ కూడా అవే కంపెనీలనుంచి కొనుగోలు ప్రారంభించిందని చెప్పారు. కొటేషన్లు సమర్పించిన తర్వాత ఎంత త్వరగా ఇవ్వగలరు? ధర ఎంత అని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సార్లు పరిశీలించుకుని కొరియన్ కంపెనీ ఎస్.డి.బయో సెన్సర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనగోలును ఖరారు చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 7 వ తారీఖున (జీఎస్టీకాకుండా) ఒక్కో కిట్‌కు రూ. 730ల చొప్పున 2 లక్షల కిట్లకు పర్చేజ్ ఆర్డర్ జారీచేయడం అయ్యింది. ప్రస్తుతం కోవిడ్–19 నివారణా చర్యలకోసం ఉపయోగిస్తున్న వైద్య పరికరాలు, అలాగే వ్యాధి నిర్ధారణ, వ్యాప్తిని తెలుసుకునేందుకు వినియోగిస్తున్న టెస్టు కిట్స్‌కు సంబంధించి మార్కెట్ ధరల్లో నిరంతరం హెచ్చు తగ్గులున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పర్చేజ్ ఆర్డర్‌లో ఒక షరతును క్లాజు రూపంలో పెట్టిన విషయాన్నీ కూడా డెప్యూటీ సి ఎం గుర్తు చేశారు. ఈ క్లాజు ప్రకారం... సదరు కంపెనీ ఎక్కడైనా తక్కువ ధరకు అమ్మినా, లేదా తన అనుబంధ సంస్థలద్వారా ఇంతకంటే తక్కువ ధరకు విక్రయించినా, ఆ డిఫరెన్స్ మొత్తాన్ని తుది బిల్లునుంచి మినహాయించుకుంటామని స్పష్టంగా పేర్కొన్నామని వివరించారు.