తెలంగాణ సిటీ బస్సుల్లో ఇక నో స్టాండింగ్.. ఓన్లీ సిట్టింగ్!

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేసింది. పరిస్థితులు కొలిక్కి వచ్చి రవాణాను తిరిగి ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.  ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే, ఇకపై స్టాండింగ్ జర్నీకి చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. అలాగే, సిటీ బస్సులకు రెండువైపులా డోర్లు ఏర్పాటు చేయాలని, శానిటైజ్ చేసిన తర్వాత బస్సులను రోడ్లపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం కోసం ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరిని, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. మెట్రో రైలులో మూడు బోగీల్లో కలిపి 900 మంది ప్రయాణించే వీలుండగా, ఇకపై అతి కొద్ది మందితోనే అంటే దాదాపు సగం మందితోనే రైళ్లను నడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ప్రయాణికులు నిల్చునేందుకు తెలుపు రంగుతో సర్కిళ్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయడంతోపాటు మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు.

లాక్ డౌన్ తో  భారీగా ప‌డిపోయిన ఉప్పు ఉత్పత్తి! ఉప్పుధ‌ర పెర‌గ‌నుందా?

లాక్ డౌన్ నేపధ్యంలో ఉప్పు ఉత్పత్తి దారుణంగా ప‌డిపోయింది.  భారతీయులు ప్రతి సంవత్సరం 95 లక్షల టన్నుల ఉప్పు తింటారు. పరిశ్రమల కోసం ఉప‌యోగించే ఉప్పు డిమాండ్ 110 - 130 లక్షల టన్నుల మధ్య ఉంటుంది. అయితే ఈ ఉప్పు ఉత్పత్తి చక్రం 60 నుండి 80 రోజులు వుంటుంది.  ఒక నిర్దిష్ట ప్రదేశంలో అవపాతం స్థాయిలను బట్టి అది ఉత్పత్తి అవుతుంది.  మార్చి నెలలో సగం రోజులు మరియు ఏప్రిల్ నెల రోజుల కాలం మొత్తాన్నిఉప్పు ఉత్ప‌త్తి జ‌ర‌గ‌లేదు. ‌ఉప్పు ఉత్పత్తికి అది సరైన సీజన్. అయితే సీజన్ గరిష్టంగా ఇంకా 40 రోజులు మాత్ర‌మే ఉంది. ఉప్పు ఉత్పత్తిలో నాలుగు నెలల ఉత్పత్తిని కోల్పోయినట్టే అని ఇండియన్ సాల్ట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఇస్మా) అధ్యక్షుడు భరత్ రావల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అక్టోబర్ మరియు జూన్ మధ్య కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు ఉత్పత్తి ఉంటుంది .మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ఎండాకాలం కాబట్టి ఉప్పు మడులు కట్టి మరీ గరిష్ట ఉత్పత్తి చేస్తారు. గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ఉత్పత్తిలో దాదాపు 95 శాతం ఉండగా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ చిన్న పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్నాయి . ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో 200 - 250 లక్షల టన్నుల ఉప్పు తయారీ జరుగుతుంది . పారిశ్రామిక ఉప్పును విద్యుత్ ప్లాంట్లు, చమురు శుద్ధి కర్మాగారాలు, సౌర విద్యుత్ సంస్థలు, రసాయన తయారీదారులు, వస్త్ర తయారీదారులు, లోహపు కర్మాగారాలు, ఔషధాలు, రబ్బరు మరియు తోలు తయారీదారులు ఉపయోగిస్తున్నారు. ఇండియన్ సాల్ట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకటన మేరకు ఉప్పు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి.

రైతురాజ్యం ముసుగులో కేసీఆర్ రాచరిక పాలన: కోదండరాం

ప్రతిపక్షాలు ఏం చేయాలన్నా ప్రభుత్వానికి లాక్ డౌన్ నిబంధనలు గుర్తుకొస్తాయని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. అధికార పార్టీ చేస్తే మాత్రం గుర్తుకు రావన్నారు. టీజేఎస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం రైతురాజ్యం ముసుగులో సీఎం కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పని చేస్తామన్నారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయాలని కోరామన్నారు.  మద్యం అమ్మకాల తో కరోనా వ్యాప్తి పెరిగితే కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆరు వారాల లాక్ డౌన్ లో సమాచారం సేకరించి సీఎస్ కి పంపిస్తే సీఎం అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు ఎవరివో ప్రజా క్షేత్రంలో బయటపడతాయని హెచ్చరించారు.  కోదండరాం నేతృత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామన్నారు విపక్షాల నేతలు. అసంఘటిత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ పొడగించిౌలిక్కర్ అమ్మకాలు చేయడంతో జనం పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారన్నారు. రెడ్ జోన్ లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపేయాలన్నారు. పేదల కరెంటు బిల్లులను మాఫీ చేయడంతో పాటు ఇసుక అక్రమ రవాణాను ఆపాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ లో ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలమైందన్నారు.  మీ ఆదాయాలు పెంచుకుంటున్నారు తప్పితే పేదల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రకటించడంలో ప్రభుత్వానికి పారదర్శకత లేదన్నారు. అఖిల‌ప‌క్షం పలు పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మే చివ‌రి నాటికి ఇండియాలో 3 లక్షలు కరోనా కేసులు?

కోవిడ్ 19 భారతదేశంలో ఇలా విస్తరిస్తోంది! మార్చి 05.                30 కేసులు మార్చి15.                 114 కేసులు మార్చి 25.               657 కేసులు మార్చి 31.              1397 కేసులు ఏప్రిల్ 05.               4289 కేసులు ఏప్రిల్ 10.               7600 కేసులు ఏప్రిల్ 20.               18539 కేసులు ఏప్రిల్ 30.               34863 కేసులు మే 05.                  49400 కేసులు క‌రోనా విస్త‌ర‌ణ వేగం ఇలా వుండ‌బోతోంది.... 70000.                            మే 10 వరకు 140000.                          మే 20 వరకు మే నెల చివరి వరకు    3 లక్షలు మొన్నటి వరకు భారత్ లో కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉందని అంతా అనుకున్నప్పటికీ. క్రమంగా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే 53వేలు దాటిక కరోనా కేసులు. జూన్-జులై నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ అధికారికంగా ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం 53వేల పైచిలుకు కేసులున్నాయి. 1783మంది మరణించగా, 15,267మంది కోలుకున్నారు. అయితే. కేసుల సంఖ్యను నిశితంగా పరిశీలిస్తే గడిచిన వారం-పది రోజుల నుండి కేసుల సంఖ్య ప్రతి రోజు పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 3వేలకు పైగా కేసులు వచ్చాయి. మొన్నటి వరకు వెయ్యిలోపు, ఆ తర్వాత రెండు వేల మధ్య వచ్చిన కేసులు ఇప్పుడు మూడు వేలు కూడా దాటాయి. ఇండియాలో మే నెలలో కరోనా పీక్స్ లో ఉంటుందని డేటా విశ్లేషించినప్పటికీ, లాక్ డౌన్ కారణంగా కేసుల వేగం తగ్గింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ బట్టి జూన్-జులై నాటికి కేసుల సంఖ్య అత్యధిక స్థాయిలో ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గలేరియా ప్రకటించారు. అయితే. అంచనాలకు మించి కేసులు నమోదు కావచ్చని స్పష్టం చేశారు. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా ఉండగా. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కనపడుతోంది. బెంగాల్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటం కూడా గమనిస్తే. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.   కాబ‌ట్టి ఎవరినీ కలవవద్దు, క్లోజ్ ఫ్యామిలీని సందర్శించవద్దు. ఇంటి వద్ద ఉండండి.  సురక్షితంగా ఉండండి.

మాస్క్ లేకుంటే రూ. వెయ్యి జరిమానాః  లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ!

తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నిన్నటితో లాక్‌డౌన్ గడవు ముగియడంతో దానిని ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా నిత్యావసర, ఇతర దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా తప్పదని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. సడలింపుల్లో భాగంగా నిత్యావసర వస్తువులు, ఉత్పత్తి, విత్తనాలు, ఎరువులు సహా వ్యవసాయ సంబంధ దుకాణాలు వంటి వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి హామీ పనులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, క్లినిక్‌లు, టెలికం, ఇంటర్నెట్, పెట్రోలు పంపులు, పోస్టల్, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, బ్యాంకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సేవలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.  దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు (శ్రామిక్ రైళ్ల మినహాయింపు), అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు(అనుమతి పొందినవారికి మినహాయింపు), మెట్రో రైళ్లు, పాఠశాలలు, శిక్షణ సంస్థలు, హోటళ్లు, లాడ్జీలు, బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, సామూహికంగా మతపరమైన కార్యక్రమాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు వంటి వాటికి జోన్లతో సంబంధం లేకుండా అన్నింటిని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మహారాష్ట్రలో ఘూర రైలు ప్రమాదం:15 మంది వలస కార్మికులు మృతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో ఈ తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం.  మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే లాక్‌డౌన్‌ వల్ల పలువురు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో.. రైల్వే ట్రాక్‌లపై నడుచుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాధిత కూలీలు రైల్వే ట్రాక్‌పై నిద్రించినట్టుగా తెలుస్తోంది. ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలు కొంతమందిపై నుంచి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది" అని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఒక్కో క‌రోనా బాధితుడికి అయ్యే ఖ‌ర్చు ఎంతంటే!

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్టడి చేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. రోగుల‌ను ఆరోగ్యంగా తిరిగి ఇళ్ల‌కు పంప‌డానికి ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు. ఒక్కో క‌రోనా బాధితుడు ఆస్ప‌త్రిలో చేరిన మొద‌లుకుని కోలుకుని ఇంటికి చేరే వ‌ర‌కు ఎంత ఖర్చు అవుతుంది? వైరస్‌ నిర్ధారణ పరీక్ష మొదలు కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు ఒక్కో వ్యక్తికి రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఏ ప‌రీక్ష‌కు ఎంతెంత ఖ‌ర్చు అవుతుందో కూడా వైద్య నిపుణులు వివ‌రిస్తున్నారు.  ఒక కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4,500 అవుతుంద‌ని తేల్చారు. పాజిటివ్‌ కేసులకు చికిత్స అనంతరం మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. ఇలా ఒక్కొక్కరికీ రూ.13,500 చొప్పున కేవ‌లం నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కే అవుతుంద‌ని వెల్ల‌డించారు.  అనుమానితులను అంబులెన్స్‌లోనే ఆస్ప‌త్రికి తీసుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అనంత‌రం డిశ్చార్జి చేసిన వ్య‌క్తిని ప్రభుత్వమే వాహనం ఏర్పాటు చేసి ఇంటికి పంపుతుంది. అంటే ఒక్కో రోగి రవాణా ఖర్చు రూ.4 వేలకు పైమాటే.  పాజిటివ్‌ వ్యక్తులకు కోలుకొనే వరకు కనీసం 80 వరకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు ఉపయోగిస్తారు. ఈ కిట్లను ఒక్కసారి వాడితే తిరిగి వినియోగించే అవకాశం లేదు. ఒక్కో కిట్‌ ధర రూ.2,500 వరకు ఉంటుంది. ఒక్కో వ్యక్తికి పీపీఈ కిట్ల కోసం రూ.2 లక్షలు ఖర్చు వ‌స్తుంది. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న వారి విష‌యంలో ఈ ఖ‌ర్చు మ‌రింత పెరుగుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ల‌కు ఎక్కువ మొత్తంలో పీపీఈ కిట్లు మార్చాల్సి ఉంటుంది.  అలాగే కొవిడ్‌ సోకినవారిలో రోగనిరోధకశక్తి పెంచేందుకు, వారికి యాంటీ బయాటిక్‌, యాంటీ వైరల్‌ మందులు, ఫ్లూయిడ్స్‌, ఇతర మందులు అందించేందుకు రూ.50 వేలు అవుతున్నదని అంచనా. ఉదాహ‌ర‌ణ‌కు గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నవారి విష‌యానికి వ‌స్తే... ప్రత్యేక మెనూతో  పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. బాధితుల్లో రోగనిరోధకశక్తిని పెంచేలా ప్రతిరోజు ఉదయం అల్పాహారం, రెండుసార్లు భోజనం, డ్రైఫ్రూట్స్‌, పాలు, బ్రెడ్‌, నాలుగు వాటర్‌ బాటిళ్లు అందజేస్తున్నారు. ఇందుక‌య్యే ఖ‌ర్చు రూ.55 వేలు. ఇంత‌టితో అయిపోలేదు.  రోగుల‌కు అవ‌స‌ర‌మైన స‌బ్బులు, శానిటైజ‌ర్‌,  ప్రత్యేక డ్రెస్‌ వంటివి ఇస్తారు. వీటి కోసం రూ.27 వేలు ఖర్చొస్తోంది. సాధారణంగా 14 రోజుల్లో క‌రోనా రోగి కోలుకొని డిశ్చార్జి అవుతారు. ఒక‌వేళ‌ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం 21 రోజుల వరకు చికిత్స పొందుతున్నారు.  క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని తిరిగి మామూలు మ‌నిషి కావాలంటే ఇంత పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. అందుకే క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌టం కంటే... ఇంట్లోనే ఉంటూ సుర‌క్షితంగా ఉండ‌టం ఎంతో మంచిది. దేనికంటే దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గడం లేదు. కేంద్రం తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో మొత్తం 52,952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1783 మంది చనిపోయారు. అటు.. 15267 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 35,902 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏపీ‌ ప్ర‌భుత్వానికి మానవహక్కుల కమిషన్ నోటీస్ జారీ!

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘ‌ట‌న‌ నేపధ్యంలో రాష్ట్రానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. గ్యాస్ లీకేజీ ఘటన విషయమై సమాధానాలనివ్వాలని కమిషన్ తన నోటీసుల్లో ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. గ్యాస్ లీకేజీ సంఘటనను, తర్వాతి పరిణామాలను మీడియా ద్వారా తెలుసుకుంటున్న జాతీయ మానవహక్కుల కమిషన్... ఆయా అంశాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది.  గ్యాస్ లీకేజీ అనంతరం... తీసుకున్న సహాయక చర్యలను కూడా వివరించాలని ఆదేశించింది.

ఎల్జీ పాలిమర్స్ మృతులకు కోటి రూపాయ‌ల‌ ఎక్స్‌గ్రేషియా: సి.ఎం. జ‌గ‌న్‌

విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పరామర్శించారు. బాధితులకు అందుతున్న సాయంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చనిపోయిన వారిని నేను తిరిగి తీసుకుని రాలేను కానీ మనసున్న వాడిగా మాత్రం వారికి అండగా ఉంటా. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.  మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం ప్రకటించారు. వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25లక్షలు ఇస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో రెండు మూడు రోజులుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.లక్ష ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. అందరూ కోలుకునే వరకు ఉచిత వైద్యం అందించ‌నున్నారు. విశాఖ ఘటన బాధాకరమని ముఖ్య‌మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రముఖ కంపెనీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమని, ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీ వేస్తున్న‌ట్లు సి.ఎం.  ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అధ్యయనం చేస్తారని తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ప్రమాదం జరిగినప్పుడు అలారమ్‌ మోగాలని, కానీ అలా జరగలేదని సి.ఎం. జగన్‌ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారని, అపస్మారక స్థితిలో ఉన్న వారు కోలుకుంటున్నారని ముఖ్య‌మంత్రి జగన్‌ తెలిపారు.

నిర్లక్ష్యమే గ్యాస్ లీక్ కు కారణమా?

విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్‌ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ఉన్నకారణంగా మెయింటెనెన్స్‌ కోసం ప్రభుత్వం పాస్‌లు కూడా ఇచ్చింది. 45 మందికి మెయింటెనెన్స్‌ పాస్‌లు ఇచ్చినప్పటికీ.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. స్టైరెన్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్‌ గ్యాస్‌ వేగంగా వ్యాప్తి చెందింది. కాగా, గురువారం తెల్లవారుజామన చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా, దాదాపు 200 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.  మ‌రో 2 వేల మంది అనారోగ్యానికి గురి అయ్యారు.

తాడేపల్లి నుంచి విశాఖకు బయలుదేరిన జగన్

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై పరిస్థితులను దగ్గరుండి తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి విశాఖ బయలుదేరారు.  ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. అలాగే, ఆసుపత్రుల్లో చేరి, చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శిస్తారు.  వైజాగ్ లో గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారు అని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఎల్జీపాలిమర్స్ కంపెనీలో పని చేసే వర్కర్స్ అంతా ఆ పరిసరాల్లోనే ఉంటారని, వారిలో చాలా మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారని అన్నారు. లీకైన గ్యాస్ ను ఎక్కువ మొత్తంలో పీల్చిన వారికే ప్రమాదం ఉండే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ గ్యాస్ అంత ప్రాణాంతకం కాదని, దీని కారణంగా అనారోగ్యానికి గురైన వారంతా వెంటనే డిశ్చార్జి అవుతారని భావిస్తున్నట్టు చెప్పారు.

విశాఖ విషవాయువు న‌న్నెంత‌గానో క‌లిచివేసింది! ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్టణం శివార్లలోని ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్నెంతగానో కలిచివేసింది. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డితో మాట్లాడాను.  ఈ విషయంలో అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టామని హోంశాఖ కార్యదర్శి చెప్పారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

పశువులు, పక్షులు బలి! విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్‌ లీకేజిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఊపిరాడ‌క పాకల్లో కట్టేసి ఉన్న పశువులు.. పొలాల్లో ఉన్న పశువులు అక్కడే కుప్పకూలి పోయాయి. పక్షులు గాల్లోనే నుంచి కింద పడిపోయి విలవిల్లాడుతూ కొట్టుకుని చనిపోయాయి...LG పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి చుస్తే హృదయ విదారకంగా ఉంది. ప్రజలు ఎక్కడికక్కడ పడిపోయారు. మరోవైపు.. పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లోని చెట్లు మాడిపోయాయి.  ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సైరన్‌లు మోగించి పోలీసుల హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంటినీ పోలీసులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. మొత్తం 5 గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలేసి బయటికొచ్చేశారు.

విశాఖ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంతో పాటు అధిక సంఖ్యలో ఆస్పత్రిపాలు కావడంపై చంద్రబాబు ఆవేదన చెందారు. ఈ ఘటనలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా మృతిచెందాయని ఆయన తెలిపారు.  కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను ప్రభుత్వం వెంటనే కాపాడాలని ఆయన సూచించారు. ఈ విష వాయువు సుమారు 3కిలోమీటర్లు వ్యాప్తి చెందడంతో చెట్లన్నీ రంగుమారడం జరిగిందని, అది విషవాయు తీవ్రతకు నిదర్శనమని ఆయన అన్నారు. యుద్దప్రాతిపదికన వెంటనే ప్రజలందరినీ ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమని, బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సూచించారు. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్య సాయం అందించాలని చంద్రబాబు కోరారు.

పాలిమర్స్‌ బాధితులతో నిండిపోయిన కేజీహెచ్!

పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.  విషవాయువు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు వెంకటాపురంలో పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టూ ఉన్న చెట్లు మాడిపోయాయి. మరోవైపు సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థత గురవ్వగా.. వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.  ఘటనను పరిశీలించడానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం ఆవేదన!

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.  రసాయన వాయువు లీకైన ఘటనలో ఇప్పటి వరకు 8మంది మృతిచెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.  సీఎం ఇవాళ మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. బాధితులను కాపాడేందుకు అంబులెన్స్‌లు, మెడికల్‌ కిట్‌లతో భారత నావికాదళం రంగంలోకి దిగింది. రసాయన వాయువు ప్రభావానికి వెంకటాపురం గ్రామంలోని మూగజీవాలు మృత్యువాత పడగా, చెట్లన్నీ రంగు మారాయి. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండడంతో.. పరిసర గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.  సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

చిన్నారిని కాపాడిన గ్రామ‌స్థులు! పాప క్షేమం!

విశాఖ గ్యాస్ లీక్ కావ‌డంతో  వెయ్యి మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల 3కి.మీ వరకు ఈ గ్యాస్ వ్యాపించడంతో.. 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. గ్యాస్ లీక్ సమాచారంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. గ్యాస్ ప్రభావానికి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. వారిిన అంబులెన్సుల్లో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాప పేరు: సుచరిత. తండ్రి పేరు : రాజు. ఊరు : వెంకట పురం, గోపాలపట్నం, విశాఖపట్నం.  ఈరోజు జరిగిన  L.G పొలిమెర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం వాళ్ళ అక్కడున్న చిన్నారిని చింతలగ్రహారం రైతులు కాపాడి జాగ్రత్తగా చూస్కుంటున్నారు. చిన్నారి క్షేమంగా ఉంది, ఎటువంటి కంగారు పడనక్కర్లేదు. ఈ పాప‌ తల్లితండ్రులు 9440921522 ఫోన్ నెంబర్ కి కాల్ చేయమ‌ని వారు చెబుతున్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి.. 200 మందికి అస్వస్థత

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో భారీగా కెమికల్ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఈ కెమికల్ గ్యాస్ 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఎల్జీ పాలిమర్స్‌, ఆర్‌.ఆర్‌ వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలు.. కెమికల్ గ్యాస్ వాసనకు కళ్లు మండి కడుపులో వికారంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ.. మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలువరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనలో దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  గ్యాస్ లీకేజీ ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో ఎల్జీ పాలిమర్స్‌, వెంకటాపురం పరిసరాల్లో ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌లు మోగిస్తూ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరు అత్యుత్సాహంతో ఈ ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.