ట్రంప్ తీరు బాగోలేదు! ఒబామా

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ట్రంప్ తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఆయన ఒకరితో చేసిన సంభాషణ బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలలే గడువు ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది.  కరోనాను ట్రంప్‌ ఎదుర్కొంటున్న తీరు గందరగోళంగా ఉందని ఒబామా చెప్పారు. స్వార్థం, విభజన, ఇతరుల పట్ల ద్వేషం వంటి పోకడలు ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయయని ఆయన అన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదేతీరు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ పరిణామాల వల్లే తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చాలా అసమర్థంగా స్పందిస్తున్నాయని చెప్పారు.  కరోనా వంటి విపత్కర పరిస్థితులని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు. ఇటువంటి విపత్కర సమయంలో నాకేంటన్న ధోరణితో, అందరితోనూ గొడవ పెట్టుకుంటున్న పాలకులు ఉండడం ఈ విపత్తును మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా అభిప్రాయపడ్డారు.

కరోనాతో న్యూమోనియే కాదు, హార్ట్ అటాక్ వ‌స్తోంది!

కరోనాతో శ్వాస సంబంధ సమస్యలతో పాటు హృదయ సంబంధ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. గుండె కండరాలకు ఇన్ఫెక్షన్ వస్తోంద‌ని తాజా అధ్యయనాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ సోకితే న్యూమోనియా ఏర్పడుతుందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే, ఇటీవల కరోనా కారణంగా హార్ట్ అటాక్ కు గురవుతున్న కేసులు పెరిగిపోతుండడంతో ఈ మహమ్మారి వైరస్ గుండెను కూడా దెబ్బతీస్తోందని గుర్తించారు.  కేరళలో కరోనా కారణంగా సంభవించిన మొదటి మరణంలోనూ హార్ట్ ఫెయిల్యూర్ జరిగినట్టు వైద్యులు తెలుసుకున్నారు. కరోనా సోకితే శ్వాససంబంధ సమస్యలు ఏర్పడడం అనేది ప్రాథమిక లక్షణం. కానీ, కరోనా మరణాలు పెరిగే కొద్దీ ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. గతంలో హృదయ సంబంధ సమస్యలు ఉన్నా, లేకపోయినా... కరోనా సోకిన తర్వాత వారిలో గుండె పనితీరు కూడా ప్రభావితమవుతోందని వైద్యులు గుర్తించారు.  ముఖ్యంగా గుండె కండరాలను కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. చైనా, అమెరికా, యూరప్ దేశాల్లోనూ కరోనా ఇదే తరహాలో దెబ్బతీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనాతో చనిపోయిన వారిలో 45 నుంచి 55 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్, ఆపై మయో కార్డైటైటిస్ సమస్యలు ఏర్పడినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ తరహా గుండె సమస్యలు వచ్చిన కరోనా రోగుల్లో 3 శాతం మందే బతికి బట్టకడుతున్నారట.

పరిశ్రమ గేటు వద్ద మృతదేహాలతో ఆందోళన 

12 మంది మృతి, వందలాది మంది ఆసుపత్రి పాలవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్యాస్‌ లీకేజి ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గ్యాస్‌ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు వలయంగా ఏర్పడి డీజీపీకి రక్షణ కల్పించారు. ఆందోళనకారులు పరిశ్రమలోకి చొచ్చుకురావడంతో డీజీపీ వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్యాస్‌లీకైన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు అతికష్టం మీద డీజీపీని అక్కడినుంచి పంపించారు. మరో వైపు డీజీపీని అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఎల్జీ పాలిమర్స్‌ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌చేస్తూ ఈరోజు ఉదయం నుంచి పరిశ్రమ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా పర్యవేక్షిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తాం.. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలతో పరిశ్రమ వద్దే ఆందోళన కొనసాగిస్తామని ఐదు గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. నాయకులు ఎవరు వచ్చినా పరిశ్రమలోకి వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప గ్రామాల్లోకి వచ్చి చూడటం లేదని వెంకటాపురం వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తాగునీరు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం ప్రజలకు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏపీలో మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం

మద్యం దుకాణాలు విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను మరో 13 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరుకు 2,934 దుకాణాలు మాత్రమే పనిచేస్తాయని.. మిగతా వాటిని మూసివేస్తున్నట్టు పేర్కొంది. మద్యపానాన్ని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను నెలకొల్పటమే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపింది. అదనపు ఎక్సైజ్‌ రీటైల్ టాక్స్‌ పేరిట ధరలు పెంచినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వం ఇప్పటికే 43 వేల బెల్టు దుకాణాలను తొలగించిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులకు అనుగుణంగా ఒక వ్యక్తికి బీర్లు, మద్యం విక్రయాలను 3 సీసాలకు మాత్రమే పరిమితం చేసినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూంలను కూడా తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బార్ల సంఖ్యను 40 శాతం మేర కుదించి 530కి తగ్గించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

వ్యాక్సీన్ లేకుండానే కరోనా ఖతం! ట్రంప్ కొత్త భాష్యం!

'ఈ కరోనా త్వరలోనే నశిస్తుంది.. కొంతకాలం తరువాత మనం మళ్ళీ దీన్ని చూడబోం.. కొన్ని వైరస్ లు వస్తుంటాయి.. వాటికి టీకా వంటి వ్యాక్సీన్ లేకుండానే అవి అంతమవుతాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మళ్ళీ వాటి జాడ కనబడదని ..ప్రతిదీ మరణించినట్టే అది కూడా మరణిస్తుందని ట్రంప్‌ చెప్పారు. కరోనా వ్యాధి వ్యాక్సీన్ లేకుండానే ఖతమవుతుందని కొత్త పల్లవి అందుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ వైరస్ నశించాలంటే మనకు వ్యాక్సీన్ అవసరం లేదని.. ఇది అవసరమంటూ డాక్టర్లు చెబుతున్న దాన్ని తను నమ్మలేనని వ్యాక్సీన్ లేకుండానే కరోనా వ్యాధి నయమవుతుందని ట్రంప్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఏదో ఒక కాలంలో ఈ వైరస్ లన్నీ నశించడం గ్యారంటీ అని ట్రంప్ 'జోస్యం' చెప్పారు. గ‌తంలో ట్రంప్ కరోనా వ్యాధి చికిత్సకు వ్యాక్సీన్ ఎంతయినా అవసరమని, బహుశా ఏడాదిలోగా ఇది మనకు అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాట మార్చి అసలు ఇది అవసరమే లేదని ఢంకా బజాయిస్తున్నారు.

అవమాన భారంతో ఏమి చేసుకోకు సాయిరెడ్డి! అయ్యన్నట్వీట్స్

టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడిని ఉద్ద్యేశించి వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘అడిగిన వాడికి, అడగని వాడికి విశాఖ అంతా నాదే అని బిల్డప్ ఇచ్చాడు. కారులోంచి గెంటేయడం హఠాత్ పరిణామమే. ఆయన లేకుండానే విశాఖలో అన్నీ జరిగిపోవడం తట్టుకోలేక తీవ్ర ఫ్రాస్ట్రేషన్‌కి గురయ్యాడు. ఎవరిపై ఏడవాలో తెలియక చంద్రబాబు గారి నామ జపం చేస్తున్నాడు. ముందు తాడేపల్లి కలుగులో పబ్జీ ఆడుతున్న ఏ1ని నిద్రలేపు.. ప్రజలంతా బీచ్ రోడ్డులో పడుకుంటున్నారు సాయిరెడ్డి. నీ ట్వీట్లు చూస్తుంటే జగన్‌కి చేతకాదు రావాలి బాబు గారు, కావాలి బాబు గారు అన్నట్టు ఉంటున్నాయి. ఇంతకీ నువ్వేక్కడ ఉన్నావు. కారు దించేసారు అన్న అవమాన భారంతో ఏమి చేసుకోకు సాయిరెడ్డి’’ అంటూ అయ్యన్నపాత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ!

మహా విషాదానికి కారణమైన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు అన్నివిధాల సహకరిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని పేర్కొంది. వెంటనే అమలు చేయగల సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి కచ్చితమైన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు ఎల్‌జీ పాలిమర్స్‌ వెల్లడించింది. స్థానికులకు దోహదపడేలా మధ్య, దీర్ఘకాలిక మద్దతు కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున విషవాయువు లీకావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన 300 మందిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, గ్యాస్‌ లీకేజీ వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ. 50 కోట్లను విశాఖ కలెక్టర్‌ వద్ద డిపాజిట్‌ చేయాలని ఎల్‌జీ పాలీమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నిన్న ఆదేశించింది. ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను ఈరోజు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, ధర్మాన ప్రసాదరావు, జయరాం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పరిశీలించారు.

కళ్ల ద్వారానే వేగంగా వ్యాపిస్తున్న కరోనా!

క‌రోనాకు సంబంధించి హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు. కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్ వైరస్ కంటే 100 రెట్లు వేగంగా కరనా వైరస్ దాడి చేస్తున్నట్టు గుర్తించారు. ఒక అంచనా ప్రకారం మనిషి ప్రతి గంటకు 16 సార్లు కంటిని టచ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో, కంటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో సురక్షిత చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. తద్వారా ఇతరుల నుంచి ముక్కు, నోటి ద్వారా తమకు వైరస్ సోకకుండా జగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఇలా కంటి ద్వారా మ‌నిషిలోకి చొచ్చుకువెళ్ళ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

అరెస్ట్ లేదు, ఒక్క ఆస్తిని జప్తు చేయలేదు సీఎం ఎక్కడ ఉన్నారు?: చంద్రబాబు ట్వీట్‌

సీఎం జగన్ ఎక్కడ ఉన్నారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఎల్జీ గ్యాస్‌ ప్రమాద బాధితుల కష్టాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. విశాఖ వాసులు రోడ్లపై నిద్రిస్తున్నారని, మృతుల బంధువులు శవాల పక్కన రోధిస్తున్నారని చెప్పారు. ఎల్జీ కంపెనీ పరిసర గ్రామస్తులు న్యాయం కోసం పోరాడుతున్నారని, ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ చేయలేదని, ఆస్తులు స్వాధీనం చేసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనతో భయకంపితులైన విశాఖ ప్రజలు రోడ్లపైనే పడుకుంటున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారని, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు తమవారి మృతదేహాల పక్కన దీనంగా రోదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదని, ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడున్నాడు? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

జూలైలో కరోనా ఉధృతంగా ఉంటుంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా కట్టడి విషయంలో భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకుందని ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో ప్రశంసించారు. సకాలంలో స్పందించడం వల్ల కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేశారని అన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య కొంత కాలం పెరుగుతుందని చెప్పారు. జూలై నెలలో కేసులు గరిష్ఠ స్థాయికి పెరుగుతాయని అన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా క్రమంగా వైరస్ విస్తరణ కట్టడి అవుతుందని చెప్పారు. భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని నబారో తెలిపారు. దేశంలోని భారీ జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పారు. భారత్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. డబ్ల్యూహెచ్ఓపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఓ దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఆరోపణలు గుప్పించినంత మాత్రాన కరోనా వైరస్ పై చేస్తున్న పోరు ఆగిపోదని చెప్పారు. కరోనా కట్టడి చేసే లక్ష్యం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.జూలైలో కరోనా ఉధృతంగా ఉంటుంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా కట్టడి విషయంలో భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకుందని ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో ప్రశంసించారు. సకాలంలో స్పందించడం వల్ల కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేశారని అన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య కొంత కాలం పెరుగుతుందని చెప్పారు. జూలై నెలలో కేసులు గరిష్ఠ స్థాయికి పెరుగుతాయని అన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా క్రమంగా వైరస్ విస్తరణ కట్టడి అవుతుందని చెప్పారు. భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని నబారో తెలిపారు. దేశంలోని భారీ జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పారు. భారత్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. డబ్ల్యూహెచ్ఓపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఓ దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఆరోపణలు గుప్పించినంత మాత్రాన కరోనా వైరస్ పై చేస్తున్న పోరు ఆగిపోదని చెప్పారు. కరోనా కట్టడి చేసే లక్ష్యం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.

మాంసం కోసం పోయి కరోనా తెచ్చుకోవద్దు: హరీశ్ రావు

కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కరోనాతో సహజీవనం తప్పేటట్టు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో ఈరోజు గ్యాదరి బాల్ రాజ్ జ్ఞాపకార్థం కరుణ క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1400 మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావుతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కరోనా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రెండవ దశలో మరో రూ. 1500 కూడా ఇస్తున్నామని తెలిపారు. సిద్దిపేటలో ఇప్పటికే 12 వేల మందికి సాయం అందిందని చెప్పారు. సిద్ధిపేట గ్రీన్ జోన్ లో ఉందని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హరీశ్ అన్నారు. సామాజిక దూరం పాటించకుండా గుమికూడవద్దని... మాంసం కోసం వెళ్లి రోగం తెచ్చుకోవద్దని హితవు పలికారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ. 1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. అందరం కలసికట్టుగా మహమ్మారిని ఎదుర్కొందామని అన్నారు.

అత్యవసర సరుకుల్లో మద్యం! మోదీస‌ర్కార్ నిబంధ‌న‌ల స‌డ‌లింపు!

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూనే మరో వైపు మద్యం అమ్మకాలకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనువెంటనే మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపేశాయి. ఏమైతేనేం! అత్యవసర సరుకుల్లో మద్యాన్ని చేర్చి మరీ అందుబాటులోకి తీసుకురావడం అత్యంత బాధాకరం. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అందక మానేసిన వారు దాదాపు సాధారణ సమాజ సభ్యులుగా మారిపోయారు. వారిలో 75 శాతం మద్యపాన ప్రియులు ఇప్పుడు తిరిగి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. పైగా మద్యపానం సేవించే వారిలో సాధారణంగానే వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. ఇది కరోనా వ్యాప్తి చెందేందుకే దారి తీస్తుంది తప్ప నిరోధించేందుకు ఏ మాత్రమూ ఉపయోగపడదు. ఉపాధి కోల్పోయి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న ఈ లాక్‌డౌన్‌ సమయంలో మద్యానికి సరిపడా నగదు అందుబాటులో లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పోలీసు స్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన రోడ్డు ప్రమాదాల కేసుల్లో 75 శాతం మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల జరిగినవే. సాధార‌ణంగా 20 నుంచి 25 శాతం మద్యపాన సంబంధిత మరణాలే వుంటాయి. సమాజంలో సగం కుటుంబాలు మద్యపానంతో చితికి పోతున్నవే. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ.2.5 లక్షల కోట్లు. అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,340 కోట్లు. అయితే మద్యపానం ద్వారా సంభవించిన లివర్‌ క్యాన్సర్‌, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఒబెసిటీ, చిన్న పేగు, పెద్ద పేగు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు లాంటి మరెన్నో ప్రమాదకరమైన జబ్బులకు ప్రయివేటు కార్పొరేట్‌ వైద్యశాలలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారాను, ప్రజలు నేరుగాను ఏడాదికి చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.40,000 కోట్లు.

టీవీ5 కార్యాలయంపై దాడి ఓ దుష్టచర్య: ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌

హైదరాబాదులోని టీవీ5 చానల్ ప్రధాన కార్యాలయంపై గత అర్ధరాత్రి కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై దాడి అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమేనని ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని దర్యాప్తు అధికారులను కోరారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తాను ఎంతో బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి దుష్ట చర్యలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పవన్ ట్వీట్ చేశారు. టీవీ5 చానల్ యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే కుట్రలో భాగమేనని, మీడియా సంస్థలను, జర్నలిస్టులను టార్గెట్ చేసి జరుపుతున్న ఇలాంటి దాడులను ప్రజలు ప్రజాతంత్రవాదులు ఖండించాల‌ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తండ్రీ కొడుకుల్ని వ్యాన్‌లో పంపండి! విజయసాయిరెడ్డి ట్వీట్‌!

హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు , ఆయన కుమారుడు లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. విమానంలోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్‌. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?' అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

లిక్కర్ కోసం వేల‌మంది? శ‌వ‌యాత్ర‌కైతే 20 మందే! మోదీ నిబంధ‌న‌పై శివ‌సేన ట్వీట్‌!

లాక్‌డౌన్ నిబంధనల సడలింపులపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్ర‌ ప్ర‌భుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శవయాత్రలో పాల్గొన‌డానికి అయితే కేవలం 20 మందికి అనుమతి ఇచ్చి, మద్యం షాపుల ఎదుట మాత్రం వేల మందికి అనుమతి ఇవ్వడంపై తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. శవ యాత్రలో 20 మందిని మాత్రమే అనుమతించారు, ఎందుకంటే ఆత్మ(స్పిరిట్‌) అప్పటికే శరీరాన్ని వదిలి వెళ్లి ఉంటుంది. అదే మద్యం షాపుల ముందు మాత్రం వేలాది మందికి అనుమతిచ్చారు. ఎందుకంటే మద్యం షాపుల్లోనే స్పిరిట్‌ ఉంటుంది కాబట్టి అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్! ఎస్సై, 4 మావోయిస్టులు మృతి!

చత్తీస్‌గఢ్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎస్సై సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మాన్పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంట‌ర్ జరిగింది. తమకు తారసపడిన పోలీసులపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఎస్సైతోపాటు నలుగురు మావోయిస్టులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్టు రాజ్‌నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్!

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న 22 ఏళ్ల గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. ప్రత్యేక జాగ్రత్తల మధ్య గైనిక్ వైద్య బృందం మహిళకు డెలివరీ చేశారు. తొలి సారిగా కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణికి శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేసి గాంధీ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. సదరు మహిళ కరోనాతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోంది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని... చిన్నారిని వేరుగా ఉంచినట్టు డాక్ట‌ర్లు వివరించారు. చిన్నారి స్వాబ్ సేకరించి.. పరీక్షల కోసం పంపినట్టు తెలిపారు. అరుదైన ఈ ఘనతను సాధించిన వైద్యులను మంత్రి ఈటల అభినందించారు. అయితే ఈ మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరూ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి! 40 లక్షల కేసులు! 2 ల‌క్ష‌ల 70 వేల మంది బ‌లి!

ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని కబళిస్తూ కరోనా క‌రాళ నృత్యం చేస్తోంది. వైరస్ ఉద్ధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువైంది. 2.70 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పుడీ మహమ్మారి బ్రెజిల్‌ను పట్టి పీడిస్తోంది. గత 24 గంటల్లో ఇక్కడ ఏకంగా 20 వేల కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.36 లక్షలకు పెరిగింది. నిన్న ఒక్క రోజే కొత్తగా 35 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 610 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 9,146కు చేరుకుంది. బ్రెజిల్ దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కి అల్లాడుతున్నా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మాత్రం ఏమీ పట్టనట్టగా వ్యవహరిస్తున్నారు. ఆయన అధికార ప్రతినిధి ఒటావియో బారోస్ కూడా కరోనా బారినపడినా అధ్యక్షుడు మాత్రం కరోనా విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన తొలి ఐదు దేశాల్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలు ఉన్నాయి. బ్రిటన్‌లో తాజాగా మరో 626 మంది మరణించగా, వీరిలో ఆరు వారాల చిన్నారి కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన దేశాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జర్మనీలో నిన్న 1,209 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1.67 లక్షలకు చేరింది. స్విట్జర్లాండ్‌లో నిన్న 81 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 30,207కు పెరగ్గా, ఇప్పటి వరకు 1,526 మంది మృత్యువాత పడ్డారు.

కొన్నేళ్లపాటు కరోనాతో క‌లిసి జీవించాల్సిందే! డబ్ల్యూహెచ్‌ఓ!

కరోనాతో ఆఫ్రికాకు పెనుముప్పు పొంచివుంది. లక్షల మంది మృతి చెందే ప్రమాదమంటూ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చ‌రించింది. కరోనా క‌ట్ట‌డికి తగిన చర్యలు చేపట్టకపోతే ఆఫ్రికా ఖండానికి పెనుముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇదే పరిస్థితులు ఉంటే ఈ ఏడాది కాలంలో 2.9 కోట్ల నుంచి 4.4 కోట్ల మందికి వ్యాధి సోకే అవకాశం ఉందని, 1.9 లక్షల మంది మరణించే ప్రమాదం ఉందని హెచ్చ‌రించింది. ఆఫ్రికా ఖండంలోని 47 దేశాల్లోని పరిస్థితులను పరిశీలించిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించకపోతే కొన్నేళ్లపాటు ఈ వ్యాధి ప్రజల జీవితంలో ఓ భాగంగా మారిపోతుందని హెచ్చరించింది.