బాబు విశాఖ పర్యటన రద్దు.. అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి దెబ్బకొట్టిన సర్కార్!!

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఆయన పర్యటనకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను సోమవారం పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. విశాఖకు విమానంలో రావడానికి రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు అనుమతి కోసం లేఖలు రాశారు. తెలంగాణ నుండి ఆయన పర్యటనకు వెంటనే అనుమతి రాగా, ఏపీ నుండి మాత్రం ఆదివారం సాయంత్రం అనుమతి వచ్చింది. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని విధంగా, ఏపీకి విమానాల సర్వీసుల ప్రారంభాన్ని సోమవారం నుంచి మంగళవారానికి వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు విశాఖ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి సోమవారం నుంచి విమాన సర్వీసులు నడపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఇంతలోనే ఏం జరిగిందో.. సోమవారం విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ ఆదివారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకే విమానాల సర్వీసులను సోమవారం నుంచి మంగళవారానికి వాయిదావేశామని పౌరవిమానయాన మంత్రి హర్దీ‌ప్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ఓ వైపు పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, మరోవైపు విమాన సర్వీసులు మొదలుకాకుండా చేసి, ఆయన పర్యటనను దొంగచాటుగా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  చంద్రబాబు పర్యటనకు డీజీపీ సోమవారం వరకే పాస్‌ ఇచ్చారు. మంగళవారం రావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసినా ఎప్పటికి అనుమతిస్తారో తెలియదు. మరోవైపు బుధ, గురువారాల్లో టీడీపీ మహానాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది. ఒకవేళ, మంగళవారం విమాన సర్వీసు లు ప్రారంభమైనా.. చంద్రబాబు ఆ ఒక్కరోజులోనే మళ్లీ అనుమతి తీసుకొని వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని  టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.  మరోవైపు, చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ పర్యటనకు వెళ్లాలని చంద్రబాబు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనుమతి సోమవారం వరకే ఉండటం, మళ్ళీ మంగళవారం అనుమతి వస్తుందన్న నమ్మకం లేకపోవడం, బుధ గురు వారాల్లో మహానాడు ఉండటం.. ఇవన్నీ ఆలోచించిన చంద్రబాబు.. హైదరాబాద్‌ నుంచి సోమవారమే అమరావతికి రోడ్డుమార్గంలో వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి విశాఖ పర్యటనతో చంద్రబాబు ఎలాంటి సంచలనాలు రేపుతారో చూడాలి.

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

ప్ర‌ముఖ‌ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్ (95) క‌న్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మొహాలీలోని ఫార్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.  ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు బంగారు పతకాలు అందించడంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. హాకీ ఒలింపిక్స్ లండన్ (1948), హెల్సింకి (1952), మెల్‌బోర్న్‌ (1956) లలో భారత్ బంగారు పతకాల‌ను సాధించింది. ఈ మూడు బంగారు పతకాల విజయంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు.  బల్బీర్ సింగ్ గోల్ మెషీన్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపుపొందారు. 1952లో జరిగిన ఒలింపిక్స్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన ఘనతను బల్బీర్ సింగ్ సొంతం చేసుకున్నారు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజ హాకీ ఆటగాళ్లలో బల్బీర్ సింగ్ కూడా ఉన్నారు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క భారత ఆటగాడిగా బల్బీర్ సింగ్ రికార్డులకెక్కారు. 1957లో భారత ప్రభుత్వం బల్బీర్ సింగ్ ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షను జులై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో, ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. జూలై 1న పాలీ సెట్, జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్, జూలై 4న ఈసెట్, జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జులై 10న లాసెట్ & లాపీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.

హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర.. వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేయాలి

తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న శ్రీవారికి సంబంధించిన విలువైన ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకెక్కడిది అంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సర్కారుపై మండిపడ్డారు. శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే మీకు హక్కు ఉంది. అలాంటిది మీరెలా వేలం వేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై రాజీలేని పోరాటం చేస్తామని కన్నా స్పష్టం చేశారు. ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.. జగన్ సర్కార్ విమర్శలు గుప్పించారు. హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టటం హిందువులను అవమానించటమే అని అన్నారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం, మీ బినామీలకు కట్టబెట్టటం కోసం ఇదో కొత్త  ఎత్తుగడ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టటం చేతకాని తనమని, అంత చేతగాని వారు చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , పాలక మండలి సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షకులు అని ప్రచారం చేసుకునే స్వరూపానంద స్వామి, చిన్నజీయర్ స్వామీ ఇతర పీఠాధిపతులు ఏమయ్యారు? మీరు కూడా ప్రశ్నించటానికి భయపడుతున్నారా? అని నిలదీశారు. హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే అని ప్రగాల్భాలు పలికే బీజేపీ, విశ్వ హిందూపరిషత్ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొవాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు‌ హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1963 మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు మిమిక్రీ అంటే ఆసక్తి​. స్కూల్ టైం నుంచే గొంతులను అనుకరిస్తూ ఉండేవారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో మిమిక్రీ రంగంలోకి వచ్చిన హరికిషన్..1971లో విజయవాడలో తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. ఆ తరువాత దేశ విదేశాల్లో 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించి నటుడిగానూ అలరించారు. 12 ఏళ్ల  పాటు టీచర్‌గా పనిచేసిన హరికిషన్.. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గానూ పనిచేశారు.

నాగబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందన.. ప్రజాసేవ తప్ప వేరే అంశాల జోలికి వెళ్లొద్దు

నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ నటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గాంధీని చంపిన గాడ్సేని పొగడటం ఏంటంటూ నాగబాబుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో నాగబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వివాదంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.  ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసిన పవన్.. కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని వెల్లడించారు. నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను.. జనసేన అధికారిక పత్రం ద్వారా, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని అన్నారు. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నట్టు తెలపారు. కరోనా కష్టకాలంలో.. ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని జనసైనికులందరికీ పవన్ విజ్ఞప్తి చేశారు.

టీటీడీ సంచలన నిర్ణయం.. శ్రీవారి ఆస్తుల వేలం...

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇప్ప‌టికే టీటీడీ పాల‌క‌మండ‌లిలో ఈ మేర‌కు తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. బ‌హిరంగ వేలం ద్వారా అమ్మిన ఆస్తుల‌ను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. ఈ ఆస్తుల నిర్వహణ భారంగా మారిందనే పేరుతో ఆస్తులు విక్రయించాలని నిర్ణయించారు. ఇవన్నీ వివిధ సందర్భాలలో స్వామి వారి భక్తులు విరాళంగా ఇచ్చినవి. ఇందులో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. కాగా, ఈ అమ్మకాలకు సంబంధించిన తతంగమంతా టీటీడీ ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు అధికారికంగా ఉత్తరువులు కూడా వచ్చాయి. ఓ వైపు ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకాలే వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు శ్రీవారి ఆస్తులు అమ్మకానికి పెట్టడం సంచలనంగా మారింది. టీటీడీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

సినీ నటి వాణిశ్రీ కుమారుడి మృతి పై అనుమానాలు

సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ (36) మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత అభినయ్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నారని నిర్థారణ అయింది. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని ఫాంహౌస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.  చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న అభినయ్‌.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఏవో సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ఆయన ముభావంగా ఉంటున్నారట. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు అభినయ్‌ మృతిపై తిరుక్కళుకుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఏడాది క్రితం ఇదే రోజు.. ఫ్యాన్ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొని వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఘన విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి కావడంతో 'అపూర్వ ఘట్టానికి సంవత్సరం' అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇక వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అయితే వరుస ట్వీట్లతో వైసీపీ ఘన విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. "ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు చిరస్మరణీయం." అంటూ ఏడాది క్రితం వైఎస్ జగన్ తో విజయానందాన్ని పంచుకుంటున్న ఫోటోని షేర్ చేశారు. "తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత." అంటూ జగన్ ని ప్రశంసించారు. "ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు." అంటూ ఓ వైపు జగన్ ని ప్రశంసిస్తూ, మరోవైపు ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ విజయ సాయి ట్వీట్ చేశారు.

చారిత్రక కట్టడాల కూల్చివేత బాధాకరం.. అశోక్ గజపతి రాజు ఆవేదన

చరిత్ర ప్రసిద్ధి చెందిన మూడు లాంతర్ల కూడలి చిహ్నాన్ని విజయనగరం నగరపాలక సంస్ధ కూల్చివేసింది. రాజుల కాలం నాటి చారిత్రక కట్టడమైన మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ యంత్రాంగం కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు ప్రధాన రహదారుల కలిసే చోట నిర్మించిన ఈ లాంతర్ల స్తంభంపై జాతీయ చిహ్నం మూడు సింహాలు ఉంటాయి. రాజుల కాలంలో నిర్మించిన దాని పేరుమీదే ఆ ఏరియా మూడు లాంతర్ల జంక్షన్ గా ప్రసిద్ధి చెందింది. అలాంటి చరిత్ర ఉన్న దానిని కూల్చివేసిన మున్సిపల్ యంత్రాంగం.. ఆ స్థానంలో కొత్త ఆకృతితో మరో కట్టడం పెడతామని చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు స్పందించారు. చారిత్రక కట్టడాల కూల్చివేత బాధాకరమని అన్నారు. వందల ఏళ్ల క్రితం విజయనగరంలో నిర్మించిన మూడు లాంతర్లు కట్టడం విజయనగరానికి చారిత్రక చిహ్నంగా ఉందని పేర్కొన్నారు. ఆనాటి విజయనగరం వైభవానికి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. అందులో గంటస్తంభం, ముడులాంతర్లు, మ్యూజిక్ కళాశాల వంటివి కొన్ని మచ్చు తునకలు అన్నారు. ముడులాంతర్ల వద్ద స్వతంత్ర సమరయోధులు నిర్మించిన మూడు సింహాలు చిహ్నం కి కూడా ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్న  నాయకులే చారిత్రక చిహ్నాలు ధ్వంసం కి పాల్పడటం దారుణం అన్నారు. ముడులాంతర్ల జంక్షన్ వద్ద హరికథ పితామహుడు అధిబట్ల నారాయణ దాసు హరికదలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని, ఎంతో మంది మహానుభావులు ఈ ముడులాంతర్ల కింద కూర్చుని చదువుకున్నారని గుర్తుచేశారు. మన పూర్వికుల గత చరిత్ర ఈ తరానికి ఎన్నో అనుభవాలను, గుర్తింపులను ఇచ్చింది. వాటిని కాపాడుకోలేక పోతున్నందుకు బాధగా ఉందన్నారు. ప్రజలు స్పందించాలి చరిత్రకు, చరిత్ర అనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు. మేము ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతాం. ఇది మనందరి భవిష్యత్తు.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.. ప్రజలు శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియచేయాలని అశోక్ గజపతి రాజు కోరారు.

సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు మృతి

టాలీవుడ్ సీనియర్‌ నటి వాణిశ్రీ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ (36) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఊటీలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ్..‌ ఇంటి పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. ఆ రాత్రి కూడా తన కుమారుడితో సరదగా గడిపిన ఆయన.. తరువాత నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఆయనకు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నారు. ఆయన భార్య కూడా డాక్టరే. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అభినయ్ అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో నిర్వహించనున్నారు. వాణిశ్రీకి కుమారుడు హఠాన్మరణంతో చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గాంధీ గారు బ్రతికున్నా ఇదే చెప్పేవారు.. నాగబాబు సెన్సేషనల్ ట్వీట్

జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల, మ‌హాత్మాగాంధీని కాల్చి చంపిన నాధూరాం గాడ్సేని నిజమైన దేశభక్తుడని ప్రశంసిస్తూ ట్వీట్ చేసి నాగబాబు విమ‌ర్శ‌లపాలైన సంగతి తెలిసిందే. అయినా నాగబాబు ఏమాత్రం తగ్గట్లేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా చెప్తూనే ఉన్నారు. తాజాగా, మ‌రోసారి నాగబాబాబు మ‌హాత్మాగాంధీపై ట్వీట్ చేశారు.  ఇండియన్ కరెన్సీ నోట్లు అనగానే మనకి గాంధీనే గుర్తొకొస్తారు. నోట్లపై ఆయన బొమ్మే ఉంటుంది. అయితే నాగబాబు మాత్రం.. మిగతా మహానుభావుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై చూడాలని ఉంది అంటున్నారు. అంతేకాదు, ఒకవేళ గాంధీ బ్రతికున్న ఇలాగే చెప్పేవారు అంటున్నారు. "ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది." అని నాగబాబు ట్వీట్ చేశారు.

15 ఏళ్ల భారతీయ బాలికపై ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలానికి వెళ్లే క్రమంలో గాయపడిన తన తండ్రిని ఓ బాలిక సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఎందరో హృదయాలను కలచివేసింది. ఆ బాలిక సాహసానికి ప్రశంసల జల్లు కురిసేలా చేసింది. తాజాగా ఆ బాలికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ఇవాంక‌ ట్విట్టర్ లో స్పందిస్తూ.. 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని 7 రోజుల పాటు 1200 కి.మీ ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమని చెప్పాలంటూ కొనియాడారు. భారతీయ ప్రజల్లో​ ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈ బాలిక ద్వారా తనకు తెలిసిందని ప్రశంసించారు. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను కూడా ఆకర్షించిందంటూ ఇవాంక ట్వీట్‌ చేశారు. బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీలో తన కూతురితో కలిసి నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు రావడంతో సొంతూరికి వెళ్లే క్రమంలో గాయపడ్డాడు. దీంతో తండ్రిని సైకిల్‌ ఎక్కించుకుని అతని కూతురు జ్యోతి సొంతూరికి వచ్చింది. హర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించింది. మే 10న గురుగ్రామ్‌ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం.. మే 16న తన సొంతూరైన దర్భంగాకు చేరుకోవడంతో ముగిసింది.  15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమంటూ ఎందరో ఆమెని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త  సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా జ్యోతి కుమారిని ఆహ్వానించింది. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

సినీ ఇండస్ట్రీకి సీఎం కేసీఆర్ భరోసా.. దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి

సినీ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ టాలీవుడ్ పెద్దలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ని కలిసిన వారిలో.. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కల్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, ఎన్.శంకర్ తదితరులు ఉన్నారు. సుమారు అరగంటకు పైగా భేటీ జరిగింది. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని, అదే విధంగా థియేటర్స్ కూడా ఓపెన్ చేయాలని సినీ ప్రముఖులు సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఆగిపోయిన షూటింగులను దశల వారీగా పునరుద్ధరిస్తామని ప్రకటించారు. కోవిడ్ నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ.. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున.. ప్రిప్రొడక్షన్, షూటింగులు, థియేటర్లను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న ప్రిప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, తర్వాత దశలో జూన్ లో సినిమా షూటింగులు ప్రారంభించాలని సీఎం సూచించారు. చివరగా పరిస్థితిని బట్టి, థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై మంత్రి తలసాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లతో చర్చించాలని సినీ ప్రముఖులను సీఎం కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు.

పాక్ దుశ్చర్య.. హిందువుల బస్తీ నేలమట్టం

మైనార్టీల హక్కులను కాపాడటంలో పాకిస్థాన్ ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవల ఆ దేశ మానవ హక్కుల సంఘం తీవ్రంగా తప్పబట్టింది. అయినా పాకిస్థాన్ తీరు మారలేదు. మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులపై  అరాచకాలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, హిందువులు నివాసం ఉంటున్న ఓ బస్తీ మొత్తాన్ని నేలమట్టం చేయించి, వారందర్నీ నిరాశ్రయులను చేసింది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో హిందువులు నివసించే ఓ బస్తీని పాక్ ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. పాక్ గృహనిర్మాణ మంత్రి తారిఖ్ బషీర్, ఆ దేశ ప్రధాన సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్వవేక్షణలో అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రజల లబోదిబోమంటున్నా పట్టించుకోకుండా కర్కషంగా వ్యవహించారు. సొంత గూడు కోల్పోయిన హిందూ మైనారిటీ ప్రజలు.. మంటుటెండల్లో కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.