ప్రత్యేక హోదాపై జగన్ కొత్త మాట.. ఇప్పట్లో కష్టమేనట!!

రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నది ఒక్కటే.. ప్రత్యేక హోదా. కానీ, రాను రాను ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం దూరమవుతుంది. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని మాట ఇచ్చారు. కానీ, తరువాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట మార్చారు. ఇక హోదా రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి హోదా తీసుకురావడం చేతకావడంలేదని, వైసీపీకి అత్యధిక ఎంపీ సీట్లు కట్టబెడితే, కేంద్రం మెడలు వంచైనా తాను హోదా తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కానీ, ఏపీ ప్రజల కోరికైన ప్రత్యేక హోదాని మాత్రం తీసుకురాలేకపోతోంది. ఈ సంవత్సరం సంవత్సరన్నర కాలంలో జగన్ స్వరం కూడా కాస్త మారింది. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పిన ఆయన.. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఢిల్లీ సాక్షిగా హోదా రావడం కష్టమే అన్నట్టు మాట్లాడారు. హోదా ఇచ్చేవరకు కేంద్రాన్ని బ్రతిమాలాడమే అన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో హోదాపై చాలామంది ఆశలు వదులుకున్నారు. ఇక తాజాగా, జగన్ వ్యాఖ్యలు చూస్తే.. అసలు ఈ నాలుగేళ్లు హోదా మాటని మర్చిపోతే మంచిది అన్నట్టుంది. వైసీపీ మేధోమదనం సదస్సులో భాగంగా ‘మన పాలన-మీ సూచన’ పేరుతో సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం ఇవ్వలేదని.. హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందని విమర్శించారు. పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమని చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొందన్నారు. అయితే, భవిష్యత్‌లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని.. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని జగన్ తెలిపారు. జగన్ మాటలను బట్టి చూస్తుంటే ఈ నాలుగేళ్లు హోదా మాటని మర్చిపోండి అన్నట్టే ఉంది. ఒకవేళ, వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో మళ్లీ బీజేపీనే పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి?. మళ్లీ ఆ ఐదేళ్లు కూడా హోదాని మర్చిపోవాలా?. అంటే ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేయాలంటే కేంద్రంలో ఖచ్చితంగా హంగ్ రావాలి. ఆ హంగ్ ఎప్పుడొస్తుంది?.. ఒకవేళ హంగ్ వచ్చినా.. హోదా డిమాండ్ చేసే అన్ని ఎక్కువ ఎంపీ సీట్లు, వైసీపీ అప్పుడు కూడా గెలుచుకుంటుందా?. ఏంటో.. ఇప్పటికే చాలామంది హోదాపై ఆశలు వదులుకున్నారు. ఇక కొన్నేళ్లు పొతే అసలు హోదానే మర్చిపోతారేమో. అసలు హోదా వస్తుందో రాదో?.. ఒకవేళ వచ్చినా ఎప్పుడొస్తుందో? అంతా ఆ వెంకన్నకే తెలియాలి.

ఇకనుంచైనా బాధ్యతగా ఉందాం.. చిన్నారుల ప్రాణాలను కాపాడుకుందాం

బోరుబావిలో పడి చిన్నారి మృతి. ఈ వార్త ఒకటి రెండు సార్లు కాదు.. కొన్ని వందల సార్లు వింటున్నాం. విన్న ప్రతిసారి అయ్యో పాపం అంటూ బాధపడుతున్నాం. కాసేపటికి అంతా మర్చిపోయి మళ్లీ మన పనిలో మనం పడిపోతున్నాం. 'నేటి బాలలే రేపటి పౌరులు', 'పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు'.. వంటి వాటిని మాటలకే పరిమితం చేస్తున్నాయి బోరు బావులు. బుజ్జి బుజ్జి మాటలు, బుడి బుడి అడుగులతో అప్పుడే ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటున్న చిన్నారులను బోరుబావులు మింగేస్తున్నాయి. జీవితంలో ఇంకా ఏమి చూడని ఎందరో చిన్నారుల జీవితాలకు అప్పుడే ముగింపు పడటానికి కారణం ఎవరు?. చిన్నారి బోరు బావిలో పడితే నిముషాలు, గంటల్లో ప్రాణాలతో బయటకు తీసే టెక్నాలజీని అందుబాటులో ఉంచని ప్రభుత్వమా?.. నీరుపడని బోరుబావులను నిర్లక్ష్యంగా వదిలేస్తున్న ప్రజలా?.. ఎవరు? ఆ చిన్నారుల చావుకి కారణం ఎవరు?.. ఇద్దరిది తప్పుంది. కానీ, అసలు ప్రమాదానికి కారణమవుతున్న ప్రజలది.. అంటే మనదే ఎక్కువ తప్పుంది. కష్టం మన వరకు వస్తేనే కానీ బాధ విలువ తెలియదు అంటారు. కానీ, ఎందరో తల్లిదండ్రుల కన్నీళ్లు చూసైనా.. ఆ కష్టం మనదే అనుకొని బాధ విలువ తెలుసుకోవాలి. ఎందరో తల్లిదండ్రుల శోకానికి కారణమవుతున్న బోరు బావుల పని పట్టాలి. నీరుపడని ఖాళీ బోరుబావులను అలా నిర్లక్ష్యంగా వదిలేయకండి. మూతలు పెట్టండి లేదా పూడ్చేయండి. ఆ బోరుబావి మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకోకండి. మీ కాలనీలోనో, మీ ఊరిలోనో లేదా మరెక్కడైనా సరే.. ఖాళీగా వదిలేసిన బోరుబావులు కనిపిస్తే.. కనీస బాధ్యతగా దగ్గరలోని అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇప్పటివరకు మనం నిర్లక్ష్యంగా ఉన్నది చాలు.. చిన్నారుల ప్రాణాలు పోగొట్టింది చాలు. ఇకనుంచైనా బాధ్యతగా ఉందాం. ఖాళీ బోరు బావులను పూడ్చేసి.. చిన్నారుల ప్రాణాలను కాపాడుకుందాం.

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ముందు హాజరైన ఏపీ సీఎస్

ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగులు వేసిన విషయంలో ఈ రోజు హైకోర్టు ముందు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ హాజరయ్యారు. ఆమెతో పాటు ఏపీ పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజ శంకర్ హాజరయ్యారు. ప్రభత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పివ్వగా, దానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా, అక్కడ కూడా చుక్కెదురయ్యింది. దానితో ఏపీ హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాల రంగులు తొలగించేందుకు గడువు విధించింది. ఐతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా మరో జీవో తెచ్చి ఉన్న రంగులకు అదనంగా టెర్రకోట రంగు (మట్టి రంగు) వేయాలని 623 నంబరు జీవో ఇచ్చింది. ఐతే దీని పై స్పందించిన హైకోర్టు ఆ జీవో ను రద్దు చేసి ఎటువంటి పరిస్థితులలోను ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని, అలాగే ఏపీ సీఎస్, పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజ శంకర్ ల పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అలాగే ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి ఆ అధికారులు స్వయం గా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిఎస్ నీలం సహానీ తో కలిసి మిగిలిన ఇద్దరు అధికారులు హాజరయ్యారు. మరో నెలలో రిటైర్ కాబోతున్న సీఎస్ నీలం సహానీ ఇలా కోర్టు ముందుకు రావలసి రావడం కొంత ఇబ్బందికరమే.

కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఏపీలో 54.. భారత్ లో 6,566

ఏపీ‌లో కరోనా ఉధృతి తగ్గట్లేదు. ప్రతిరోజూ 50 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,858 శాంపిల్స్ ను పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కు చేరుకుంది. కాగా, గత 24 గంటల్లో కర్నూల్ లో ఒకరు కరొనతో చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,958 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 824 మంది చికిత్స  పొందుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా రోజుకి ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది.  గత 24 గంటల్లో 194 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకోగా, ప్రస్తుతం 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారు.. ఇది ఫిక్స్!!

ఏపీ రాజధాని తరలింపుకు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి దివ్యమైన ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు ఈ లాక్ డౌన్ సమయంలోనే రాజధాని తరలింపు ఉంటుందని వార్తలొచ్చాయి. వాస్తవానికి నేడు(మే 28) కొద్దిమంది స్టాఫ్ తో అమరావతి నుంచి విశాఖకు తరలిపోవాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కాగా, ఇప్పుడు అక్టోబర్ 25 న రాజధాని తరలింపుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరువరకు దివ్యమైన ముహుర్తాలు లేవని, అక్టోబర్ 25 విజయదశమి రోజున రాజధాని తరలింపుకు శ్రీకారం చుడితే.. అంతా విజయం చేకూరుతుందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పడంతో.. అదేరోజున రాజధాని తరలించాలని జగన్ సర్కార్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు స్వరూపానందేంద్ర స్వామిపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సీఎం అవ్వకముందు, సీఎం అయిన తరువాత అనేకసార్లు స్వరూపానందేంద్రను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి కూడా ఆయననే ముహూర్తం పెట్టారు. పలు విషయాల్లో జగన్ కి సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. రాజధాని తరలింపుకు కూడా ఆయన చేతనే ముహూర్తం పెట్టించిన జగన్.. విజయదశమి రోజు నుంచి విశాఖ వేదికగా పాలన సాగించనున్నారని సమాచారం. 

తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జయంతి సందర్భంగా పలువురు సినీరాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ ట్వీట్స్ చేశారు. "ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది సామాన్యులకు అండగా, నిలిచిన మేరునగ ధీరుడు నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ  మార్గదర్శకం. ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం... తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని చాటుదాం." అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. "తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం  తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం  నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.  వారితో కలిసి నటించడం నా అదృష్టం.  పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..." అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది,  మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది,  పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..  సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.  "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అన్నది ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ కోసం అందించిన నినాదం కావచ్చు. కానీ అంతకుముందే తన జీవితమంతా ఈ మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్ గారు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా తన వంతు సేవను, సహకారాన్ని అందించిన ప్రజాబంధువు ఎన్టీఆర్. బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమసమాజవాది... పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది. మహిళలకు సమాన హక్కులను కల్పించిన అభ్యుదయవాది.... నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం" అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలి

ఎన్‌. టి. ఆర్.. ఈ మూడు అక్షరాల పేరుని కోట్లమంది ఆరాధిస్తారు. ఆ కోట్ల మందిలో సినీరాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖ దర్శకులు వై.వి.ఎస్ చౌదరి ఒకరు. ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకునే వైవిఎస్.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా.. అక్షర రూపంలో తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లోని ప్రతి లైన్ ఎన్టీఆర్ పై ఆయనకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆ అభిమానాన్ని ఆయన మాటల్లోనే చదవండి. "విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్‌, స్వర్గీయ 'నందమూరి తారక రామారావు (ఎన్‌. టి. ఆర్‌.)' గారు ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘీక చిత్రాలలో నటించటమే కాక, ఆయా పాత్రలలో జీవించి, తన దివ్య మోహన రూపంతో ఎందరికో స్పూర్తి నిచ్చారు. 1983 వరకూ CM, PM, MLA, MP, గవర్నర్‌ మరియూ రాష్ట్రపతి లాంటి రాజకీయ పదవుల్లోని తేడాపై ధ్యాసే పెట్టని 'తెలుగు' ప్రజానీకానికి, తనకున్న తిరుగులేని జనాకర్షణ శక్తితో ఆత్మీయ 'అన్న'గా దగ్గరై, వాళ్ళల్లో 'రాజకీయ చైతన్యం' తీసుకురావటమే కాక, 'ఆత్మగౌరవం' నినాదంతో, అప్పటివరకూ 'మదరాసీ'లుగా పిలువబడుతున్న 'తెలుగు జాతి'కీ, 'తెలుగు భాష'కీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపునీ తెచ్చారు. ఆయన తన పరిపాలనలో తీసుకున్న సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు మరియూ సంక్షేమ పధకాలు ఇప్పటికీ ఎందరో రాజకీయవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.  అంతే కాకుండా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన 'మహాభారతం', 'భాగవతం', 'రామాయణం'లోని పాత్రలకు తన సినిమాల ద్వారా సజీవ రూపకల్పన చేసి, మన కళ్ళముందు కదలాడారు. తన 60 ఏళ్ళ వయస్సులో, ఆ రోజుల్లో మన 'తెలుగు'నాట ఉన్న గతుకుల రోడ్లల్లో, 'చైతన్యరధం' పైభాగాన కూర్చొని తిరుగుతూ, ప్రతీ కిలోమీటరుకూ వేలాదిగా, లక్షలాదిగా ప్రజల్ని ఆకర్షిస్తూ, 'చైతన్యరధం' పైనే నిలబడి తన ప్రసంగాల ద్వారా వాళ్ళల్లో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపారు. భావితరాల వాళ్ళు 'మానవమాత్రులకు ఇంతటి జనాకర్షణశక్తి సాధ్యమా' అని కలలో కూడా ఊహించుకోలేనటువంటి అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక 'కా'రణ'జన్ముడి'లా, 'యుగపురుషుడి'లా, ఓ 'దైవం'లా అవతరించారు.  ‘తెలుగు జాతి’కి గర్వకారణం మరియూ ‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన ఆ 'మహాపురుషుని’ జ్ఞాపకార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ‘ఎన్‌. టి. ఆర్‌. జిల్లా’ పేరుతో నామకరణం జరపాలనీ.. ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ.. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరి తరపున.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, భారతదేశ ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతున్నాను.  'కా'రణ'జన్ములు', 'యుగపురుషులు' ఎప్పుడూ సందేశాలు ఇవ్వరు. కానీ, తమ తమ జీవనవిధానాల ద్వారా మనకి స్పూర్తినిచ్చే ఆశయాలని, మన మధ్య వదిలి 'భువి' నుండీ 'దివి'కి పయనమవుతారు. అలా ఆయన వదిలిన వెళ్ళిన ఎన్నో ఆశయాలలో ముచ్చటకి మూడు.. 1. ఏ పనినైనా 'అంకితభావం'తో చేయడం.. 2. ఆ పని ఎంత 'కష్టమైనా ఇష్టపడి' చేయటం.. 3. ఆ పనిని సాధించటంలో 'మడమ తిప్పకుండా పోరాటం' చెయ్యటం.. ‘ఆయన’ నాకు ‘దేవుడు’. నాలాగా ఎంతోమందికి ‘దైవసమానం’. ‘ఆయన’ దివ్యమోహనరూపమే నన్ను సినిమాలవైపు తద్వారా సినీపరిశ్రమకు తీసుకువచ్చింది. ఆయన ఆశయాల స్పూర్తితోనే నేను ఇక్కడ నిలబడ్డాను. అంతేకాదు, నేనిక్కడ పొందిన కీర్తీ, సంపాదిస్తున్న ప్రతీ పైసా ఆయన Account లో నుండీ Draw చేసుకుంటున్నట్లే Feel అవుతాను. అందుకే నా సొంత చలనచిత్ర నిర్మాణ సంస్థ అయిన  ‘బొమ్మరిల్లు వారి’ బేనర్‌పై నేను నిర్మించే ప్రతీ సినిమా ప్రారంభం ‘ఆయన’ ఫొటోపై.. “నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో, నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ, ప్రభూ.. ఈ జన్మకూ..” అంటూ సంగీత సవ్యసాచి ‘యం యం కీరవాణి’గారు స్వయంగా రచించి, స్వరపరచి, ఆలపించిన ‘ప్రార్ధనాగీతం’తో మొదలై, మళ్ళీ సినిమా చివరిలో ‘ఆయన’ అదే ఫొటోపై ‘కృతజ్ఞతాభావం’తో పూర్తి అవుతుంది.  అలా నాకే కాదు, ఇక్కడ 'అమలాపురం'లోని 'రిక్షాపుల్లర్' నుండి, ఎక్కడో 'అమెరికా'లో ఉంటున్న 'సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్' వరకూ, ప్రపంచవ్యాప్తంగా.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న, నాలా ఎంతో మంది 'తెలుగు' వాళ్ళకు, ఆయన తన ఆశయాల ద్వారా స్పూర్తినిచ్చారు. ‘మరణంలేని జననం ఆయనిది, అలుపెరగని గమనం ఆయనిది, అంతేలేని పయనం ఆయనిది..’ ‘ఆయన’ ఎక్కడున్నా నన్నూ, నాలాంటి అభిమానుల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారనే నా నమ్మకం. అటువంటి ‘అవిశ్రాంత యోధుని’ 9️⃣8️⃣వ 'జయంతి' సందర్భంగా..  జై ‘నటరత్నం’.. జై జై ‘తెలుగుతేజం’.. జై జై జై ‘విశ్వవిఖ్యాతం’.. జోహార్ 'ఎన్. టి. ఆర్‌.’.. అంటూ ఆ ‘మహనీయుని’ తలచుకుని, స్మరించుకోవటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ 'తెలుగు'వాడు తనని తాను గౌరవించుకోవటంతో సమానంగా భావిస్తూ.. ‘ఆయన’ వీరాభిమాని, వై వి ఎస్ చౌదరి."

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ షాక్‌!

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ షాక్‌ ఇచ్చింది. వరుసగా మూడో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగుల జీతాలు కోతపెట్టారు. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులతో మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో.. మే నెలలోనైనా పూర్తి జీతం వస్తుందని ఉద్యోగులు భావించారు. కానీ, ఈ నెల కూడా ఉద్యోగులకు సగం జీతం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే నెల కూడా ఉద్యోగులకు సగం జీతం ఇవ్వాలని.. ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. నడిరోడ్డుపై కొట్లాట.. 8 మందికి గాయాలు

అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నిన్నటికి నిన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నగరి ఎమ్మెల్యే రోజా మాటల యుద్ధం మరువక ముందే.. నేడు ద్వితీయ శ్రేణి నాయకులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చూస్తుండగానే ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. కడప జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసేందుకు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఓ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ గొడవ చెలరేగింది. ఆ వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామకృష్ణారెడ్డి, యోగానంద్‌రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. మాటవినని వారిపై లాఠీ ఝుళిపించారు. గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బ్లీచింగ్‌, పారాసిటమాల్ అంటూ నిర్లక్ష్యం.. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం

టీడీపీ మహానాడు కార్యక్రమంలో మాట్లాడిన పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బ్లీచింగ్‌ చల్లి, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందంటూ నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. చివరికి బ్లీచింగ్‌ పౌడర్‌లోనూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో భూమాఫియా రెచ్చిపోతోందన్నారు. తిరుమల, సింహాచలం, విజయవాడ ఆలయాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయల ఆస్తులు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, భవిష్యత్‌లో తగ్గిస్తామని చెప్పామని గుర్తుచేశారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం వంతపాడుతోందని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ తరుపున ప్రభుత్వం పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధికార అహంకారంతో ఎన్నికల అధికారిని తొలగించారన్నారు. రాజధాని తరలింపు విషయంలో సెలక్ట్‌ కమిటీపై మండలి చైర్మన్‌ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శి ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ప్రశ్నించినవారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పీపీఈ కిట్లు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను హింసిస్తున్నారన్నారు. మీడియాపై చీకటి జీవో ఇచ్చారని, సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కార్యకర్తలే టీడీపీకి బలం.. వారికి పాదాభివందనం

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం  కొనసాగనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు అధినేత చంద్రబాబు, నేతలు నివాళులర్పించారు.  టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో, 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందన్నారు. 'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు' అనే బాటలో నడిచాం. టీడీపీ పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయి అన్నారు. టీడీపీ హయాంలో పేద, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేశామని చెప్పారు. కరోనా కాలంలోనూ ఐటీరంగం వృద్ధి రేటు సాధిస్తోందంటే.. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. టీడీపీ హయాంలోనే సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి శ్రీకారం జరిగిందని చంద్రబాబు తెలిపారు.  కరోనా ఉధృతి కాలంలో ప్రజలు, టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో సహాయం అందించిన టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే బలం.. కార్యకర్తలకు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యకర్తలు భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశారు.. కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి అని కొనియాడారు. ఈ ఏడాది టీడీపీకి గడ్డుకాలమని, టీడీపీని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు.  శారీరంకగా, మాససికంగా, ఆర్థికంగా వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలని దెబ్బతీశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మెగా ఫ్యామిలీలో విషాదం.. ఉపాస‌న తాతయ్య క‌న్నుమూత

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.  ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని దోమ‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు. ఆయన మృతికి ఉపాసన ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ‘మా తాత‌య్య కె.ఉమాపతి రావు(జూన్‌ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత‌య్య‌’ అంటూ ఉపాసన భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

ఇండిగో విమానంలో కరోనా రోగి.. 130 మంది క్వారంటైన్!

దాదాపు రెండు నెలల తరువాత దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కాగా, కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణం సాగించడం కలకలం రేపింది. ఈ ఘటన చెన్నై-కోయంబత్తూర్ ఇండిగో విమానంలో వెలుగుచూసింది. చెన్నై నుంచి కోయంబత్తూర్ నగరానికి వచ్చిన 6ఈ 381 ఇండిగో విమానం నుంచి దిగిన ప్రయాణికులను పరీక్షిస్తుండగా.. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని కోయంబత్తూర్ లోని వినాయక్ హోటల్ కు తరలించి నిర్బంధంలో ఉంచారు. అనంతరం అతన్ని ఈఎస్ఐ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతనితో కలిసి ప్రయాణించిన 129 మందికి వైద్యపరీక్షలు చేయగా వారికి నెగిటివ్ వచ్చినప్పటికీ, వారందరినీ 14రోజుల పాటు హోం క్వారంటైన్ కు తరలించారు.  విమానంలో ప్రయాణికులంతా ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డు లు, గ్లౌజులు ధరించి అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నారని, కరోనా బాధితుడికి సమీపంలో ఎవరూ కూర్చోలేదని ఇండిగో అధికారులు చెప్పారు. సేవలందిస్తున్న విమానాలను తాము క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నామని, విమాన క్యాబిన్ సిబ్బందిని కూడా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ చేశామని ఇండిగో వెల్లడించింది.

జూన్ 1 నుంచి ఆల‌యాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్న‌ల్‌

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. భక్తులతో కళకళలాడే దేవాలయాలు రెండు నెలల నుంచి వెలవెలబోతున్నాయి. లాక్‌డౌన్‌ నుండి ఇప్పటికే చాలావాటికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వాలు.. దేవాలయాలకు కూడా ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్రకటించింది. దీంతో, లాక్‌డౌన్‌ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఆలయాలు తెరిచే విషయమై కర్ణాటక సీఎం యడియూరప్ప ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆ రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస్‌ పూజారి మాట్లాడుతూ.. జూన్‌ 1 నుంచి ఆలయాలను తెరుస్తున్నట్లు ప్రకటించారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. బుధ‌వారం నుంచి 52 దేవాలయాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు.

యూపీలో తీవ్ర కలకలం.. కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన గబ్బిలాలు

కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందన్న వార్తలతో.. గబ్బిలాల పేరు వింటేనే ప్రజల్లో భయం పుడుతుంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రజలైతే మరింత వణికిపోతున్నారు. యూపీలోని గోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి వుండటాన్ని చూసిన ప్రజలు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోరఖ్ పూర్ సమీపంలోని బేల్ గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు పడివుండటాన్ని చూసిన స్థానికులు.. కరోనా కారణంగానే అవి మరణించాయని భావించారు. ఈ వార్త ఆనోటా, ఈనోటా దావానలంలా వ్యాపించింది.  ఈసమచారం వెటర్నరీ అధికారులకు తెలియటంతో, వారు సైతం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎండలు సగటుతో పోలిస్తే, చాలా ఎక్కువగా వున్న కారణంగానే గబ్బిలాలు చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు డివిజనల్‌ ఫారెస్ట్‌ హెడ్‌ అవినాష్‌ కుమార్‌ వెల్లడించారు. ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకూ ఉందని, తాగేందుకు నీరు లేకనే అవి చనిపోయి వుండవచ్చని తెలిపారు. స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. చనిపోయిన గబ్బిలాలను తదుపరి పరీక్షల నిమిత్తం వెటర్నరీ రీసెర్చ్‌ ఇని‌స్టిట్యూట్ కు‌ పంపించామని తెలియజేశారు.

తెలంగాణ వైపు దూసుకొస్తున్న మిడతల దండు.. పొంచి ఉన్న భారీ ముప్పు

ఓ వైపు కరోనా వైరస్‌ తో పోరాడుతోన్న భారత్ కి మరో కష్టం వచ్చిపడింది. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తోంది. ఆ మిడతల దండు చాలా ప్రమాదకరమైంది. మిడతల దండు పొలంలో పడిందంటే ఇక ఆ పొలంలో ఏదీ మిగలదు. కొన్ని గంటల్లోనే పంటనంతా శుభ్రంగా ఆరగించేస్తాయి. లక్షలాది మిడతల దండు.. 30-40 వేలమందికి సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులో తినేస్తాయి. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు అవి ఎంత ప్రమాదకరమైనవో. పాకిస్థాన్ నుంచి భారత్ కి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు, లక్షలాది ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలపై వీటి ప్రభావం విపరీతంగా ఉంది. అయితే ఈ మిడతల ముప్పు తెలంగాణకూ పొంచి ఉంది. మిడతల దండు తెలంగాణ సమీపానికి రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఈ రాకాసి మిడతల దండు రాజస్థాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోకి ప్రవేశించింది. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే, అవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి, నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తున్నాయని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి గ్రామంలో రసాయనాలను సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన పెంచి, చైతన్యవంతం చేయాలని అన్నారు. మరోవైపు, జూన్ లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, భారీ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కరోనా మీద పోరాడోతోన్న ప్రభుత్వాలు.. ఇప్పుడు మిడతల దండుపై కూడా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి.