గాంధీ గారు బ్రతికున్నా ఇదే చెప్పేవారు.. నాగబాబు సెన్సేషనల్ ట్వీట్

జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల, మ‌హాత్మాగాంధీని కాల్చి చంపిన నాధూరాం గాడ్సేని నిజమైన దేశభక్తుడని ప్రశంసిస్తూ ట్వీట్ చేసి నాగబాబు విమ‌ర్శ‌లపాలైన సంగతి తెలిసిందే. అయినా నాగబాబు ఏమాత్రం తగ్గట్లేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా చెప్తూనే ఉన్నారు. తాజాగా, మ‌రోసారి నాగబాబాబు మ‌హాత్మాగాంధీపై ట్వీట్ చేశారు.  ఇండియన్ కరెన్సీ నోట్లు అనగానే మనకి గాంధీనే గుర్తొకొస్తారు. నోట్లపై ఆయన బొమ్మే ఉంటుంది. అయితే నాగబాబు మాత్రం.. మిగతా మహానుభావుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై చూడాలని ఉంది అంటున్నారు. అంతేకాదు, ఒకవేళ గాంధీ బ్రతికున్న ఇలాగే చెప్పేవారు అంటున్నారు. "ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది." అని నాగబాబు ట్వీట్ చేశారు.

15 ఏళ్ల భారతీయ బాలికపై ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలానికి వెళ్లే క్రమంలో గాయపడిన తన తండ్రిని ఓ బాలిక సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఎందరో హృదయాలను కలచివేసింది. ఆ బాలిక సాహసానికి ప్రశంసల జల్లు కురిసేలా చేసింది. తాజాగా ఆ బాలికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ఇవాంక‌ ట్విట్టర్ లో స్పందిస్తూ.. 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని 7 రోజుల పాటు 1200 కి.మీ ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమని చెప్పాలంటూ కొనియాడారు. భారతీయ ప్రజల్లో​ ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈ బాలిక ద్వారా తనకు తెలిసిందని ప్రశంసించారు. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను కూడా ఆకర్షించిందంటూ ఇవాంక ట్వీట్‌ చేశారు. బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీలో తన కూతురితో కలిసి నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు రావడంతో సొంతూరికి వెళ్లే క్రమంలో గాయపడ్డాడు. దీంతో తండ్రిని సైకిల్‌ ఎక్కించుకుని అతని కూతురు జ్యోతి సొంతూరికి వచ్చింది. హర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించింది. మే 10న గురుగ్రామ్‌ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం.. మే 16న తన సొంతూరైన దర్భంగాకు చేరుకోవడంతో ముగిసింది.  15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమంటూ ఎందరో ఆమెని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త  సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా జ్యోతి కుమారిని ఆహ్వానించింది. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

సినీ ఇండస్ట్రీకి సీఎం కేసీఆర్ భరోసా.. దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి

సినీ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ టాలీవుడ్ పెద్దలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ని కలిసిన వారిలో.. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కల్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, ఎన్.శంకర్ తదితరులు ఉన్నారు. సుమారు అరగంటకు పైగా భేటీ జరిగింది. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని, అదే విధంగా థియేటర్స్ కూడా ఓపెన్ చేయాలని సినీ ప్రముఖులు సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఆగిపోయిన షూటింగులను దశల వారీగా పునరుద్ధరిస్తామని ప్రకటించారు. కోవిడ్ నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ.. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున.. ప్రిప్రొడక్షన్, షూటింగులు, థియేటర్లను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న ప్రిప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, తర్వాత దశలో జూన్ లో సినిమా షూటింగులు ప్రారంభించాలని సీఎం సూచించారు. చివరగా పరిస్థితిని బట్టి, థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై మంత్రి తలసాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లతో చర్చించాలని సినీ ప్రముఖులను సీఎం కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు.

పాక్ దుశ్చర్య.. హిందువుల బస్తీ నేలమట్టం

మైనార్టీల హక్కులను కాపాడటంలో పాకిస్థాన్ ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవల ఆ దేశ మానవ హక్కుల సంఘం తీవ్రంగా తప్పబట్టింది. అయినా పాకిస్థాన్ తీరు మారలేదు. మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులపై  అరాచకాలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, హిందువులు నివాసం ఉంటున్న ఓ బస్తీ మొత్తాన్ని నేలమట్టం చేయించి, వారందర్నీ నిరాశ్రయులను చేసింది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో హిందువులు నివసించే ఓ బస్తీని పాక్ ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. పాక్ గృహనిర్మాణ మంత్రి తారిఖ్ బషీర్, ఆ దేశ ప్రధాన సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్వవేక్షణలో అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రజల లబోదిబోమంటున్నా పట్టించుకోకుండా కర్కషంగా వ్యవహించారు. సొంత గూడు కోల్పోయిన హిందూ మైనారిటీ ప్రజలు.. మంటుటెండల్లో కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

జగన్ సర్కార్ కి ఒకేరోజు మూడు షాకులు.. ఏబీ పై సస్పెన్షన్ ఎత్తివేసిన హైకోర్టు

ఏపీ హైకోర్టు లో జగన్ సర్కార్ కి ఈరోజు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పంచాయతీ కార్యాలయలకు రంగులపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను హైకోర్టు రద్దు చేసింది. అలాగే, డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై అనుమానాలు ఉన్నాయంటూ, ఆ కేసుని సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ రెండు షాకులే కాకుండా, ఈరోజు జగన్ సర్కార్ కి హైకోర్టు లో మరో షాక్ కూడా తగిలింది. మాజీ ఇంటెలిజెన్స్ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది.  ఈ ఏడాది ఫిబ్రవరి లో జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. భద్రతా పరికరాలు కొనుగోలులో ఆయన నిబంధనలు అతిక్రమించారన్న అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల్లో నుంచి తొలగించింది. సస్పెన్షన్‌పై ఏబీ క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. అయితే, ఆయ‌నకు‌ తాజాగా హైకోర్టుకు లో ఊర‌ట ల‌భించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా పక్కనపెట్టింది. సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పింది. ఏబీ రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆధేశాలిచ్చింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను కూడా చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

పాక్ లో ఘోర విమాన ప్రమాదం.. వంద మందికి పైగా మృతి?

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 98 మంది ఉన్నట్టు తెలుస్తోంది. విమానంలో ఉన్నవారిలో 91 మంది ప్రయాణికులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది. ఈ ప్రమాదంలో వారంతా మరణించి వుంటారని అనుమానిస్తున్నారు.  పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-8303 విమానం లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా.. ల్యాండింగ్ కు సిద్దమవుతున్న తరుణంలో ప్రమాదం జరిగింది. జిన్నా విమానాశ్రయం సమీపంలో.. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ కాలనీలో జనావాసాల మధ్యలో కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో పరిసర ప్రాంత జనం పరుగులు తీశారు. విమానంలో వున్న 98 మంది సహా కూలిన ఏరియా నివాస ప్రాంతం కావడంతో మృతుల సంఖ్య వందకి పైగా వుంటుందని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.    

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్ ‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న హైకోర్టు సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల మధ్య నిర్వహించనున్నారు. జూన్‌ 8వ తేదీన ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌ జూన్ 11వ తేదీన ఇంగ్లీష్‌ రెండో పేపర్‌ జూన్ 14వ తేదీన గణితము మొదటి పేపర్‌ జూన్ 17వ తేదీన గణితము రెండో పేపర్‌ జూన్ 20వ తేదీన సామాన్యశాస్త్రము మొదటి పేపర్‌ ‌(భౌతిక శాస్త్రం)  జూన్ 23వ తేదీన సామాన్యశాస్త్రము రెండో పేపర్‌ ‌(జీవశాస్త్రం) జూన్ 26వ తేదీన సాంఘిక శాస్త్రం మొదటి పేపర్‌ జూన్ 29వ తేదీన సాంఘిక శాస్త్రం రెండో పేపర్‌ జూలై 02వ తేదీన ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేవప్‌ (సంస్కృతము, అరబిక్‌) జూలై 05వ తేదీన ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ రెండో పేపర్‌ (సంస్కృతము, అరబిక్‌)

డాక్టర్ సుధాకర్ కేసు సంచలన మలుపు.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి, నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. కానీ, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు కోర్టు తెలిపింది.

పశ్చిమబెంగాల్ ‌లో ప్రధాని ఏరియల్ సర్వే.. వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటన

ఆంఫన్ తుఫాన్ పశ్చిమబెంగాల్‌‌ను అతలాకుతలం చేసింది. తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 80 మందికి పైగా చనిపోయారు. వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. తీర ప్రాంతం వెంబడి అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి.  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ వెళ్లారు. కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మమతను పలకరించిన మోడీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆంఫన్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని మమత డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని మోడీ ఏరియల్ సర్వే జరిపారు. మమతా బెనర్జీ కూడా ప్రధానితో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. మోడీ మ్యాప్ చూస్తూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు.  ఏరియల్ సర్వే జరిపాక, పశ్చిమబెంగాల్‌కు ప్రధాని మోడీ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. తుఫాన్ కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న మోడీ.. కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని.. నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు.

హైకోర్టులో జగన్ సర్కార్‌కు మళ్ళీ ఎదురుదెబ్బ.. జీవో 623 రద్దు

జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయలకు రంగులపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జీవో ఇవ్వడంపై ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28లోపు రంగులు తీసేయాలి లేదా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 28లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు పేర్కొంది. గతంలో పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని, ఎటువంటి రంగులు వేయాలనే దానిపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ 623 జీవోను జారీ చేసింది. ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో పాటు టెర్రా కోట్(ఎర్రమట్టి రంగు) రంగును బార్డర్‌గా వేయాలని జీవోలో పేర్కొంది. పైగా ఈ రంగులు దేనికి సంకేతమో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే మళ్లీ అవే రంగులు వేస్తూ జీవో ఎలా ఇస్తారంటూ.. జీవో 623ను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సోమయాజులు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న హైకోర్టు.. 623జీవోను కొట్టివేస్తూ.. జీవోను ఎందుకిచ్చారో ఈ నెల 28లోపు వివరణ  ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

వరంగల్ లో కలకలం.. ఒకే బావిలో ఏడు మృతదేహాలు

పొట్టకూటికోసం పశ్చిమ బెంగాల్‌, బీహార్ రాష్ట్రాల నుంచి తెలంగాకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ బావిలో శవాలుగా తేలారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. నిన్న బావిలో 4 మృతదేహాలు లభ్యం కాగా, ఈరోజు మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరింది. కోల్‌కతాకు చెందిన మక్సూద్‌ (50) దాదాపు 20 ఏళ్లుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని కరీమాబాద్‌లో నివసిస్తూ.. ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. అతడికి భార్య నిషా(45), ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న అతడి కుమార్తె కూడా.. తన కొడుకుతో కలిసి తండ్రి మక్సూద్‌ వద్దే ఉంటోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మక్సూద్‌ కుటుంబం ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని సాయిదత్తా బార్‌దాన్‌ ట్రేడర్స్‌లోని భవనంలోనే నెల రోజులుగా ఉండిపోయింది. ఆ భవనంపైనే బీహార్ ‌కు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్నారు. గురువారం సాయిదత్తా ట్రేడర్స్‌ యజమాని వచ్చేసరికి.. వీరెవరూ కనిపించకపోవడంతో గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ చుట్టుపక్కల వెతుకుతుండగా బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. వాటిని వెలికితీసిన పోలీసులు.. మక్సూద్‌, నిషా, కుమార్తె (22), మనవడి(3)గా గుర్తించారు. ఎవరైనా హత్య చేశారా? వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయంలో స్పష్టత లభించడం లేదు. అయితే శుక్రవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ఇవాళ లభ్యమైన మూడు మృతదేహాల్లో మక్సూద్ కుమారుడు షాబాద్(22), బిహార్ కు చెందిన కార్మికుడు శ్రీరామ్ గా గుర్తించారు. మరొ మృత దేహం వివరాలు తెలియాల్సి ఉంది. బావిలో నీటిని అధికారులు బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో మళ్ళీ 60 కి పైగా కరోనా కేసులు.. ఒకరు మృతి

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సగటున రోజుకి 50 కేసులకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 8,415 శాంపిల్స్ ను పరీక్షించగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 51 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికవరకు నమోదైన మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,514 కి చేరింది. ఇప్పటివరకు 1,734 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 55కి చేరింది.

జియోలోకి పెట్టుబడుల వెల్లువ.. కేకేఆర్‌ రూ.11,367 కోట్ల పెట్టుబడి

రిలయన్స్‌ డిజిటల్‌ యూనిట్‌ జియోలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు జియోలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా, న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కేకేఆర్ జియోలో రూ.11,367 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. దీంతో జియోలో 2.32 శాతం వాటా కేకేఆర్ సొంతం చేసుకోనుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి కానుందని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు, ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు చేరనుందని తెలిపింది. కాగా, గత నెలలో ఫేస్‌బుక్‌ జియోలో రూ. 43,574 కోట్లు పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్‌ సంస్థలు కూడా జియోలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా కేకేఆర్‌ కూడా ఈ జాబితాలో చేరడంతో.. జియో కొద్ది కాలంలోనే రూ. 78,562 కోట్ల పెట్టుబడులను సేకరించింది.

కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌(ఆర్‌బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని నిధులను అందుబాటులో ఉంచేందుకే రెపోరేటు తగ్గించామని వివరించారు. టర్మ్‌ లోన్లపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని.. ఆర్థిక ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని‌ వెల్లడించారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 15శాతం పడిపోయిందని, ఏప్రిల్‌లో తయారీరంగంలో ఎన్నడూ లేనంత క్షీణత కనిపించిందని పేర్కొన్నారు. అయితే, ఈ పరిస్థితులు వ్యవసాయ రంగానికి మాత్రం మరింత ప్రోత్సాహకంగా ఉన్నాయని చెప్పారు. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందని శక్తికాంత్ దాస్‌ తెలిపారు.

భారత్‌లో కరోనా తీవ్రరూపం.. ఒక్క రోజులో 6 వేలకు పైగా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొద్దిరోజులుగా రోజుకి ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్న కరోనా.. ఇప్పుడేకంగా ఆరు వేలలోకి అడుగుపెట్టింది. ఒక్కరోజులో తొలిసారిగా ఆరువేల కంటే అధికంగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 6,088 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 118,447కు చేరింది. గత 24 గంటల్లో 148 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో.. భారత్‌‌లో కరోనా మృతుల సంఖ్య 3,583కి చేరింది. ఇప్పటివరకూ 48,533 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 66,330 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయోధ్య‌లో బయటపడిన శివలింగం, దేవ‌తా విగ్ర‌హాలు

అయోధ్య రామజన్మభూమి వద్ద స్థలం చదును చేస్తుండగా పురాత‌న దేవ‌తా విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దేవ‌తా విగ్ర‌హాల‌తో పాటు శివలింగం కూడా లభ్యమైంది. ఈ శివలింగం ఎత్తు ఐదు అడుగులు ఉన్నట్టు గుర్తించారు. రామజన్మభూమిలో కొన్నిరోజులుగా భూమి చదును చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి శిథిలాలను తొలగిస్తుండగా.. విరిగిన దేవతా విగ్రహాలు, ఐదు అడుగుల శివ‌లింగం, 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు, ఓ క‌ల‌శంతో పాటు ప‌లు పురాత‌న వ‌స్తువులు బయటపడ్డాయి.  దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలం చదును చేస్తున్నారన్నారు. ఈ త‌వ్వ‌కాల్లో స్తంభాలతో పాటు ప‌లు శిల్పాలు వెలుగు చూశాయ‌న్నారు. వీహెచ్‌పీ నేత వినోద్ భ‌న్సాల్‌ మాట్లాడుతూ.. మే 11న రామాయ‌లం ప‌నులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి త‌వ్వ‌కాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో అవ‌శేషాలు ల‌భించాయ‌ని తెలిపారు.

తెలంగాణలో కరోనా పరీక్షల పై కేంద్రం అసంతృప్తి.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్న మంత్రి

తెలంగాణలో జరుగుతున్న కరోనా పరీక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయని.. కానీ, తెలంగాణలో మాత్రం ఈ విషయంలో అలసత్వం కనిపిస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. కరోనా‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు.  కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, తమ పటిష్ట చర్యల వల్ల కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు పరీక్షలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలపై ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి ఈటల అన్నారు.

విశాఖలో మళ్లీ కలకలం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

విశాఖలో ఇటీవల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ అయి 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖలో మళ్లీ కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్‌ కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన తెల్లని పొగలు అలుముకున్నాయి. పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురై.. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే కాసేపటికే పొగ తగ్గిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలోని ఎస్‌హెచ్‌యూని తెరిచే సమయంలో ఈ ఘటన జరిగింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్టు గుర్తించామని, సమస్యను వెంటనే చక్కదిద్దామని, ఎలాంటి ప్రమాదం లేదని హెచ్‌పీసీఎల్‌ వర్గాలు అంటున్నాయి.