ఏపీ ప్రభుత్వం చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధమైన చర్య: ఐవైఆర్ కృష్ణా రావు

జగన్ సర్కార్ పై ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. లాక్డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌‌లు, పాస్టర్లకు ఏపీ సర్కారు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి సంగతి తెలిసిందే. 77,290 మందికి రూ.37.71 కోట్ల సాయం అందనుంది. వీరిలో 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్, మౌజమ్‌‌లు ఉన్నారు. అయితే, మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటాన్ని ఐవైఆర్ కృష్ణా రావు తప్పుబట్టారు. "మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యను ప్రచారం చేసుకోవడానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం విడ్డూరం. లెక్కల్లో ఎక్కడో తేడా ఉంది. 34 వేల అర్చకులకు 30 వేల పాస్టర్లు." అని ట్వీట్ చేశారు. "దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కావున, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండబట్టి లెక్కలు నిర్ధారించే అవకాశం ఉంది. మిగిలిన రెండు మతపరమైన సంస్థలు ప్రభుత్వ సంబంధం లేకుండా పని చేస్తున్నాయి కావున ఆ లెక్కలు నిర్దిష్టంగా ఉండే అవకాశం తక్కువ." అన్నారు. "అర్చకులు అందరూ ప్రభుత్వ ఆధీనం లో పని చేస్తున్నారు. వారికి సహాయం పెద్ద దేవాలయాల ఆదాయం నుంచి ఇవ్వచ్చు. టీటీడీ గత ప్రభుత్వ హయాంలో అర్చక సంక్షేమానికి 100 కోట్లు వాగ్దానం చేసి 50 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 50 కోట్లు విడుదల చేసి ఇతర పెద్ద దేవాలయాలు సహాయంతో అర్చకులను ఆదుకోవచ్చు." అని సూచించారు. "మిగిలిన మతాల వారికి ఆయా మత సంస్థల నుంచి సహాయం వచ్చే విధివిధానాలు ఏర్పాటు చేయవచ్చు. అది సరైన పద్ధతి. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య." అని ఐవైఆర్ కృష్ణా రావు వ్యాఖ్యానించారు.

శ్రీవారు ఆయన ఆస్తుల్ని ఆయనే కాపాడుకుంటున్నారు

తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీటీడీ ఆస్తుల వేలానికి బ్రేకు పడింది. మొన్నటివరకు అసలు టీటీడీ ఆస్తులను అమ్మడంలో తప్పేముందని కొందరు ప్రశ్నించారు. కానీ ఒక్కరోజులో అంతా మారిపోయింది. టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డు తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆ కాసేపటికే టీటీడీ ఆస్తుల విక్రయం నిర్ణయాన్ని నిలిపివేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీ కి చెందిన 50 ఆస్తులను విక్రయించాలని గత టీటీడీ పాలక మండలి 2016, జనవరి 30న తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రస్తుత టీటీడీ పాలక మండలిని ఆదేశించింది. ఆ ఆస్తులను దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం తదితర అవసరాలకు ఉపయోగించుకునే అంశంపై మత పెద్దలలతో చర్చించాలని సూచించింది. అంతవరకు ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేకులు పడటంతో శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారు ఆయన ఆస్తుల్ని ఆయనే కాపాడుకున్నారని అంటున్నారు.

టీటీడీ ఆస్తుల వేలంలో ట్విస్ట్.. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆస్తుల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డు తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తులపై మరోకసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆస్తుల అమ్మకంపై నిర్ణయం తీసుకోక ముందే రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దని హితవుపలికారు. భక్తులు సమర్పించే ప్రతి పైసాను తాము కాపాడుతున్నామని, పదవిలో ఉన్నా లేకుండా ఈ విషయంలో రాజీపడబోమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తకాదని చెప్పారు. 1970 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వాలు ఇలానే అమ్మకాలు చేపట్టాయని అన్నారు. టీడీపీ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీడీపీ చైర్మన్‌ గా ఉన్నప్పుడు.. నిరర్ధక టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న ఆ సబ్ కమిటీలో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. అయితే, అప్పుడు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కేవలం సమీక్షించామని, ఇంకా అమ్మాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. అమ్మకంపై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

వీడిన మిస్టరీ.. ఒక హత్య నుంచి తప్పించుకోవడం కోసం 9 హత్యలు

వరంగల్ లోని గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని బావిలో తొమ్మిది మృతదేహాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ తొమ్మిది హత్యల కేసును పోలీసులు కేవలం 72 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు సోమవారం సాయంత్రం మీడియా ముందు హాజరుపరిచారు. ఒక హత్య నుంచి తప్పించుకోవడం కోసం నిందితుడు మరో 9 హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మక్సూద్ కుటుంబం గోనె సంచుల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. మక్సూద్ భార్య సోదరి కూతురైన రఫీకా(37) ఐదేళ్ల క్రితం బెంగాల్ నుంచి ముగ్గురు పిల్లలను తీసుకొని వరంగల్ వచ్చింది. భర్త నుంచి విడిపోయిన ఆమె.. తన బాబాయి మక్సూద్ సాయంతో గోనె సంచుల ఫ్యాక్టరీలో పనిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకి సంజయ్ తో పరిచయం ఏర్పడింది. ఆమె ద్వారా మక్సూద్ కుటుంబంతో కూడా సంజయ్ కి పరిచయం ఏర్పడింది. సంజయ్ ఒంటరి కావడంతో రఫీకా అతడికి భోజనం వండి పెడుతూ డబ్బులు తీసుకునేది. అలా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అది సహజీవనానికి దారి తీసింది.  ఈ క్రమంలో రఫీకా కూతురు యుక్త వయస్కురాలు కావడంతో సంజయ్ కన్ను ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయితో సంజయ్ చనువు పెంచుకునేందుకు ప్రయత్నించగా.. రఫీకా మందలించింది. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని హెచ్చరించింది. దీంతో సంజయ్ ఎలాగైనా రఫీకాను అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను, బెంగాల్ తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతానని చెప్పి.. రఫీకాతో కలిసి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ నుంచి మార్చి 7న బయల్దేరాడు. పక్కా ప్లాన్‌తో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. ఆమె పడుకున్న తర్వాత రాత్రి సమయంలో చున్నీని ఆమె మెడకు బిగించి హత్య చేసి, రైల్లో నుంచి బయటకు తోసేశాడు. అనంతరం రాజమండ్రిలో రైలు దిగి ఇంటికొచ్చాడు. నిడదవోలు ప్రాంతంలో రఫీకా బాడీని గుర్తించిన తాడేపల్లిగూడెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల మక్సూద్ కుటుంబం రఫీకా గురించి సంజయ్ ‌ను అడగటం మొదలుపెట్టింది. తన గురించి చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించింది. దీంతో తను చేసిన హత్య నుంచి తప్పించుకోవడం కోసం వారిని హతమార్చాలని భావించాడు. మక్సూద్ పెద్ద కొడుకు పుట్టిన రోజు మే 20న ప్లాన్ చేసుకొని మక్సూద్ కుటుంబం నివసించే గోడౌన్ వద్దకు వెళ్లి.. అదను చూసి నిద్ర మాత్రలను వారు తినే ఆహారంలో కలిపాడు. తాను రావడం.. పై పోర్షన్లో ఉన్న శ్రీరామ్, శ్యామ్ చూశారు కాబట్టి వారి ఆహారంలోనూ నిద్ర మాత్రలు కలిపాడు. అలాగే, షకీల్ అనే వ్యక్తి కూడా ముందే అక్కడికి రావడంతో.. మొత్తం 9 మంది గోడౌన్‌లో ఉన్నారు. నిద్రమాత్రల కారణంగా వారందరూ మత్తులోకి జారుకున్నారు. తరువాత ఒక్కొక్కరిని గోనె సంచిలో పెట్టి.. అందర్నీ బావిలో పడేశాడు.

విమానయాన సంస్థలపై చూపిస్తున్న శ్రద్ధ ప్రజలపై చూపిస్తే బాగుంటుంది

'వందేభారత్ మిషన్' పేరిట విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న విమానాల్లో భౌతికదూరం నిబంధనలు పాటించడలేదంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విమానాల్లో మధ్య సీట్లను తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. వాణిజ్య విమానయాన సంస్థల మీద చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికింది. లాభాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వీసులు నడిపించాలని సుప్రీం కోర్టు సూచించింది. విమానాల్లో ప్రయాణికులను కూర్చోబెడుతున్న తీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రశ్నించారు. భౌతిక దూరం నిబంధనలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. మధ్య సీట్లను ఖాళీగా ఉంచకుండా, అందులోనూ ప్రయాణికులను కూర్చోబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. బహిరంగ ప్రదేశాల్లో ఆరడుగుల భౌతికదూరం పాటించాలంటున్నారు, మరి విమానాల్లో ఏ విధంగా పాటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మధ్య సీట్లు వదిలేయడం కంటే కరోనా టెస్టులు, క్వారంటైన్ విధానాలు అత్యుత్తమం అని నిపుణులు చెప్పిన మేరకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇప్పటికే జూన్ 6 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయని తుషార్ విన్నవించగా, ఆ తర్వాత మాత్రం మధ్య సీట్లు వదిలేయాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది.

అమ్మో జగన్ సర్కార్ ని ప్రశ్నించడమా.. ఇంకేమన్నా ఉందా!!

సామాన్యులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. రాజకీయం, సినిమా లేదా మరేదైనా అంశమైనా సరే, తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.. సినిమాని ఆకాశానికెత్తుతారు, సినిమాని విమర్శిస్తారు.. ఇలా నచ్చిన అంశం మీద స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. అయితే, ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలన్నా భయపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నవారికి సీఐడీ నోటీసులు వస్తుండటమే ఆ భయానికి కారణం. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ వ్యక్తి చేసిన ఫేస్ బుక్ పోస్ట్ ని.. గుంటూరు కి చెందిన 66 ఏళ్ళ రంగనాయకమ్మ షేర్ చేశారు. దీంతో ఆమెకి సీఐడీ అధికారులు నోటీసులిచ్చి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తాజాగా రాజమహేంద్రవరంకి చెందిన అనూష ఉండవల్లికి కూడా నోటీసులను అందజేశారు. అధికార పార్టీకి, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టినందుకే ఆమెకు నోటీసులు అందాయి. దీంతో నెటిజనులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు, ప్రతిపక్ష టీడీపీ.. జగన్ సర్కార్ ప్రజల స్వేచ్చని హరిస్తోందని, కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శిస్తోంది. ఇక టీడీపీ నారా లోకేష్ అయితే.. మరి సోషల్ మీడియాలో మీ అంతుచూస్తాం, చంపుతాం అని బెదిరిస్తున్న వారి మీద చర్యలు తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా మాట్లాడితే మీ అంతుచూస్తాం అంటూ కొందరు దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లోకేష్.. మరి వీరిపై చర్యలు తీసుకోరా? అని జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినందుకు నోటీసులు, విచారణ, అరెస్టులు అంటున్నారు. మరి అదే సోషల్ మీడియాలో ఎందరో అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారు.. మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబసభ్యుల గురించి కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మహిళల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు కొన్ని కులాలను టార్గెట్ చేస్తూ, కుల విభేదాలు రెచ్చగొడుతున్నారు. మరికొందరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని వదిలేసి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నవారిపై మాత్రమే చర్యలు తీసుకోవడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీశైల క్షేత్రంలో బయటపడ్డ భారీ కుంభకోణం

పవిత్ర శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొందరు అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు. శ్రీఘ్ర దర్శనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చాలా వరకు స్వాహా చేశారు. 150 రూపాయల శ్రీఘ్రదర్శనంలో కోటి 80 లక్షల రూపాయలను, 1500 రూపాయల అభిషేకం టికెట్లలో 50 లక్షలను, డొనేషన్స్ కౌంటర్లలో కోటి రూపాయలను, వసతి సదుపాయం కౌంటర్లో 50 లక్షలను కాజేశారు. టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. అవినీతికి పాల్పడ్డ అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌నే మార్చేశారు. అవినీతి బండారం బయటపడుతుంటంతో ఈవోకి పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఉద్యోగులు. ఈ అంశంపై శ్రీశైలం ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ.. భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమేనని అన్నారు. మొత్తం అవినీతి ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేదన్న ఆయన.. రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ఈ విషయం మీద ప్రభుత్వానికి కూడా నివేదిక తయారు చేస్తున్నామని ఈవో రామారావు తెలిపారు.

రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు.. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు ఈరోజు ఏపీకి వచ్చారు. రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లి‌లో తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబు.. గరికపాడు చెక్‌‌పోస్ట్ దాటారు. చెక్‌ పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు...అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీలు చేశారు.  నిజానికి చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లాలనుకున్నారు. వెళ్లేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ.. విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో చివరి నిమిషంలో విశాఖ పర్యటన వాయిదా పడింది. విశాఖ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి చేరుకున్నారు. 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు. ఈ నెల 27, 28న మహానాడును నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌లో మహానాడును నిర్వహించనున్నారు. జూమ్ యాప్ ద్వారా సుమారు 14 వేల మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు.

చిక్కుల్లో టీడీపీ నేత కూన రవికుమార్

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. కూన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని శ్రీకాకుళం జిల్లా, పొందూరు తహసీల్దార్ రామకృష్ణ ఆరోపిస్తున్నారు. అందుకు ఇదే సాక్ష్యమంటూ కూన రవికుమార్  ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియో క్లిప్ ను తహసీల్దార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఆడియో జిల్లాలో హల్ చల్ చేస్తోంది.  ఈ నెల 18న గోరింట గ్రామంలో కూన సోదరుడుకి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తుండగా.. వీఆర్వో సమాచారం మేరకు తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవి కుమార్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది జరిగిన వారం రోజులకు తహసీల్దార్ రామకృష్ణ ఆకస్మిక బదిలీ అయ్యారు. క్వారంటైన్‌లో వసతుల విషయంలో తహసీల్దార్ చేతివాటం ప్రదర్శించారంటూ కూన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్ రామకృష్ణపై బదిలీ వేటు వేశారు.  అయితే కూన సోదరుడుకి చెందిన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని తహసీల్దార్ ఆరోపిస్తూ.. కూన రవికుమార్ ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియోను విడుదల చేశారు. ఇప్పటికే, కూనరవి మీద పొందూరు పీఎస్ లో తహశీల్దార్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

బాబు విశాఖ పర్యటన రద్దు.. అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి దెబ్బకొట్టిన సర్కార్!!

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఆయన పర్యటనకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను సోమవారం పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. విశాఖకు విమానంలో రావడానికి రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు అనుమతి కోసం లేఖలు రాశారు. తెలంగాణ నుండి ఆయన పర్యటనకు వెంటనే అనుమతి రాగా, ఏపీ నుండి మాత్రం ఆదివారం సాయంత్రం అనుమతి వచ్చింది. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని విధంగా, ఏపీకి విమానాల సర్వీసుల ప్రారంభాన్ని సోమవారం నుంచి మంగళవారానికి వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు విశాఖ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి సోమవారం నుంచి విమాన సర్వీసులు నడపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఇంతలోనే ఏం జరిగిందో.. సోమవారం విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ ఆదివారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకే విమానాల సర్వీసులను సోమవారం నుంచి మంగళవారానికి వాయిదావేశామని పౌరవిమానయాన మంత్రి హర్దీ‌ప్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ఓ వైపు పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, మరోవైపు విమాన సర్వీసులు మొదలుకాకుండా చేసి, ఆయన పర్యటనను దొంగచాటుగా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  చంద్రబాబు పర్యటనకు డీజీపీ సోమవారం వరకే పాస్‌ ఇచ్చారు. మంగళవారం రావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసినా ఎప్పటికి అనుమతిస్తారో తెలియదు. మరోవైపు బుధ, గురువారాల్లో టీడీపీ మహానాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది. ఒకవేళ, మంగళవారం విమాన సర్వీసు లు ప్రారంభమైనా.. చంద్రబాబు ఆ ఒక్కరోజులోనే మళ్లీ అనుమతి తీసుకొని వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని  టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.  మరోవైపు, చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ పర్యటనకు వెళ్లాలని చంద్రబాబు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనుమతి సోమవారం వరకే ఉండటం, మళ్ళీ మంగళవారం అనుమతి వస్తుందన్న నమ్మకం లేకపోవడం, బుధ గురు వారాల్లో మహానాడు ఉండటం.. ఇవన్నీ ఆలోచించిన చంద్రబాబు.. హైదరాబాద్‌ నుంచి సోమవారమే అమరావతికి రోడ్డుమార్గంలో వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి విశాఖ పర్యటనతో చంద్రబాబు ఎలాంటి సంచలనాలు రేపుతారో చూడాలి.

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

ప్ర‌ముఖ‌ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్ (95) క‌న్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మొహాలీలోని ఫార్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.  ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు బంగారు పతకాలు అందించడంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. హాకీ ఒలింపిక్స్ లండన్ (1948), హెల్సింకి (1952), మెల్‌బోర్న్‌ (1956) లలో భారత్ బంగారు పతకాల‌ను సాధించింది. ఈ మూడు బంగారు పతకాల విజయంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు.  బల్బీర్ సింగ్ గోల్ మెషీన్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపుపొందారు. 1952లో జరిగిన ఒలింపిక్స్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన ఘనతను బల్బీర్ సింగ్ సొంతం చేసుకున్నారు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజ హాకీ ఆటగాళ్లలో బల్బీర్ సింగ్ కూడా ఉన్నారు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క భారత ఆటగాడిగా బల్బీర్ సింగ్ రికార్డులకెక్కారు. 1957లో భారత ప్రభుత్వం బల్బీర్ సింగ్ ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షను జులై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో, ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. జూలై 1న పాలీ సెట్, జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్, జూలై 4న ఈసెట్, జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జులై 10న లాసెట్ & లాపీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.

హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర.. వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేయాలి

తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న శ్రీవారికి సంబంధించిన విలువైన ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకెక్కడిది అంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సర్కారుపై మండిపడ్డారు. శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే మీకు హక్కు ఉంది. అలాంటిది మీరెలా వేలం వేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై రాజీలేని పోరాటం చేస్తామని కన్నా స్పష్టం చేశారు. ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.. జగన్ సర్కార్ విమర్శలు గుప్పించారు. హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టటం హిందువులను అవమానించటమే అని అన్నారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం, మీ బినామీలకు కట్టబెట్టటం కోసం ఇదో కొత్త  ఎత్తుగడ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టటం చేతకాని తనమని, అంత చేతగాని వారు చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , పాలక మండలి సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షకులు అని ప్రచారం చేసుకునే స్వరూపానంద స్వామి, చిన్నజీయర్ స్వామీ ఇతర పీఠాధిపతులు ఏమయ్యారు? మీరు కూడా ప్రశ్నించటానికి భయపడుతున్నారా? అని నిలదీశారు. హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే అని ప్రగాల్భాలు పలికే బీజేపీ, విశ్వ హిందూపరిషత్ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొవాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు‌ హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1963 మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు మిమిక్రీ అంటే ఆసక్తి​. స్కూల్ టైం నుంచే గొంతులను అనుకరిస్తూ ఉండేవారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో మిమిక్రీ రంగంలోకి వచ్చిన హరికిషన్..1971లో విజయవాడలో తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. ఆ తరువాత దేశ విదేశాల్లో 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించి నటుడిగానూ అలరించారు. 12 ఏళ్ల  పాటు టీచర్‌గా పనిచేసిన హరికిషన్.. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గానూ పనిచేశారు.

నాగబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందన.. ప్రజాసేవ తప్ప వేరే అంశాల జోలికి వెళ్లొద్దు

నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ నటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గాంధీని చంపిన గాడ్సేని పొగడటం ఏంటంటూ నాగబాబుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో నాగబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వివాదంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.  ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసిన పవన్.. కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని వెల్లడించారు. నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను.. జనసేన అధికారిక పత్రం ద్వారా, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని అన్నారు. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నట్టు తెలపారు. కరోనా కష్టకాలంలో.. ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని జనసైనికులందరికీ పవన్ విజ్ఞప్తి చేశారు.

టీటీడీ సంచలన నిర్ణయం.. శ్రీవారి ఆస్తుల వేలం...

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇప్ప‌టికే టీటీడీ పాల‌క‌మండ‌లిలో ఈ మేర‌కు తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. బ‌హిరంగ వేలం ద్వారా అమ్మిన ఆస్తుల‌ను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. ఈ ఆస్తుల నిర్వహణ భారంగా మారిందనే పేరుతో ఆస్తులు విక్రయించాలని నిర్ణయించారు. ఇవన్నీ వివిధ సందర్భాలలో స్వామి వారి భక్తులు విరాళంగా ఇచ్చినవి. ఇందులో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. కాగా, ఈ అమ్మకాలకు సంబంధించిన తతంగమంతా టీటీడీ ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు అధికారికంగా ఉత్తరువులు కూడా వచ్చాయి. ఓ వైపు ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకాలే వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు శ్రీవారి ఆస్తులు అమ్మకానికి పెట్టడం సంచలనంగా మారింది. టీటీడీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.