వలంటీరు వేధింపులు భరించలేక.. మాజీ మంత్రి డ్రైవర్ ఆత్మహత్య

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం జరిగింది. మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్ సన్యాసినాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు తానెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ వివరిస్తూ బంధువులకు నాయుడు ఆడియో మెసేజ్ పంపాడు. వలంటీర్‌ జాగరపు నర్సింగరావు వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. నాయుడి మృతితో.. కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా?.. ఏం సాధించారని?...

వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో వైఎస్ ఏడాది పాలనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు." అని విమర్శించారు. "ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యధేచ్ఛగా సాగించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారు." అని మండిపడ్డారు. "రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా  అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం." అని పేర్కొన్నారు. "ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత. ఇన్ని విషాదాల్లో వైసిపి ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని...? ఎవరికేం ఒరగబెట్టారని..?  ఇకనైనా బాధ్యతగా పనిచేయండి." అని చంద్రబాబు హితవు పలికారు.

శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మృతి

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. రైల్వేశాఖ మే 1నుంచి 27వతేదీ వరకు దేశంలో 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి, దాదాపు 50 లక్షల మంది వలసకార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. అయితే ఈ రైళ్లలో ఇప్పటి వరకు 80 మంది మరణించారు. మే 9 నుంచి 27 వరకు నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడైంది. ఎక్కువగా, దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలసకార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే, రైళ్లలో భోజనం దొరక్క మాత్రం ఎవరూ మరణించలేదని తెలిపింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

తెలంగాణలో ఒక్కరోజే 169 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే, శుక్రవారం కరోనాతో నలుగురు మృతి చెందారు. దాంతో మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక కొత్తగా నమోదైన 169 కేసులలో, స్థానికంగా 100 కేసులు నమోదు కాగా, బయటి నుంచి వచ్చినవారిలో 69 మందికి కరోనా నిర్దారణ అయింది. ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజులో 82 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 400 కు పైగా కేసులు వచ్చాయి. మే 27న 107, మే 28న 158, మే 29న 169 కేసులు.. ఇలా రోజూ 100కు పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి.. జేసీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీకి జగన్ లాంటి సీఎం మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు ౧౧౦ మార్కులు వేస్తానని ఎద్దేవాచేశారు. జగన్ నిరంకుశ ధోరణి, పట్టుదల పరాకాష్ఠకు చేరాయని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ అని అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే నైజాన్ని జగన్ వదులుకోవాలని సూచించారు. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని, అయినా మొండి వైఖరితో ముందుకు సాగుతోందని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమన్నారు. టీటీడీ ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్ రాముడో, రావణుడో ప్రజలే తేల్చుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

హైకోర్టు తీర్పు పై హాట్ కామెంట్స్

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలన్న ఏపీ హైకోర్టు తీర్పు పై వివిధ పార్టీల నాయకులు స్పందించారు. ఈ తీర్పు పై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు స్పందిస్తూ ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని అయన హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అయన హెచ్చరించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ తీర్పు పై వ్యాఖ్యానిస్తూ ఇది ముందుగా ఉహించిందేనన్నారు ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేయడాన్ని అయన స్వాగతించారు. తమిళనాడు హై కోర్ట్ కూడా 2006లో ఇలాంటి తీర్పే ఇచ్చిందని, రాజ్యాంగ బద్ద పదవుల పదవీ కాలాన్ని తగ్గించే ఆర్డినెన్సులు చెల్లవని స్వయంగా వైసీపీ ఎంపీ స్పష్టం చేసారు. కోర్ట్ లకు ఈ ఆర్డినెన్స్ ను కొట్టేయడం మినహా వేరే మార్గం లేదన్నారు ఇప్పటికైనా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు,సూచనలతో ఆడగు ముందుకు వేయాలని అన్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం జగన్ కి కొత్త కాదని, రోజు వారీ మొట్టికాయల్లో కేవలం ఇది ఒకటని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కులాన్ని ఆపాదించడం దారుణమన్న ఆమె ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా, జగన్ సర్కార్ చలించడం లేదని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అతని మంత్రి వర్గాన్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆమె అన్నారు.

నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్.. ఎవరిది పై చేయి

ఎ.పి ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఎ.పి హైకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. జగన్ సర్కార్ రమేశ్ ‌కుమార్‌‌ను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డ‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం కమిషనర్ కనగరాజ్ పదవి నుండి తొలగినట్టేనని న్యాయ నిపుణులు తెలియచేస్తున్నారు. ఐతే ఈ విషయం నేపధ్యం లోకి వెళితే గత మార్చ్ నెలలో ఏపీలో స్థానిక ఎన్నికల కోలాహలంగా నడుస్తున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఐన వైసిపి అనేక నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవ చేసుకునేందుకు అడ్డ దారుల ద్వారా ప్రయత్నించడంతో ప్రతి పక్షాలు ప్రభుత్వం పై ఎలక్షన్ కమిషనర్ కు ప్రూఫ్ ల తో సహా ఫిర్యాదు చేసాయి. దీని పై స్పందించిన రమేష్ కుమార్ విచారణ జరిపి కొన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేయాల్సిందిగా ఎపి సీఎస్ కు లేఖ రాసారు. ఐతే దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కలకలం రేగటంతో స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్ ఆరు వారాల పాటు వాయిదా వేశారు. దీనితో ఆగ్రహించిన సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషనర్ ది బాబుది ఒకే కులం కాబట్టి ఎన్నికలను వాయిదా వేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రజలు తనకు అధికారం అప్పచెపితే అధికారుల బదిలీ పై అయన పెత్తనం ఏంటంటూ అసలు సీఎం నేనా లేక నిమ్మగడ్డనో అర్ధం కావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో రెచ్చిపోయిన విజయ్ సాయిరెడ్డి, కోడలి నాని, స్పీకర్ తమ్మినేని నిమ్మగడ్డను తీవ్ర పదజాలం తో దూషించారు. దీంతో ఎలక్షన్ కమిషనర్ కేంద్ర హోమ్ శాఖకు ఒక లేఖ రాస్తూ సాక్షాత్తు సీఎం, అధికార పార్టీ నాయకులు తన పై తీవ్ర విమర్శల చేస్తున్న నేపథ్యంలో తనకు తన కుటుంబానికి రాష్ట్రంలో రక్షణ లేదని తమ పై దాడి జరిగే అవకాశం ఉన్నందున కేంద్రమే రక్షణ కల్పించాలని అలాగే హైదరాబాద్ నుండి పని చేసే అవకాశం కల్పించాలని కోరారు. దీని పై స్పందించిన కేంద్రం ఆయనకు సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తూ హైద్రాబాద్ నుండి పనిచేసే వెసులుబాటు కల్పించింది. ఐతే ఈ లేఖ విషయంలో కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ ఐంది. అసలు ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని దాని పై ఉన్న సంతకం ఫోర్జరీదని ఎంపీ విజయ సాయి రెడ్డి సిఐడి కి కంప్లైంట్ చేయడం తో దాని పై దర్యాప్తు కూడా జరిగింది ఇది ఇలా ఉండగానే ఏప్రిల్ 10 న జగన్ ప్రభుత్వం కమిషనర్ పదవి కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదిస్తూ ఆర్డినెన్సు తెచ్చి నిమ్మగడ్డ ను తొలిగించి ఆగమేఘాలపై రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను కొత్త ఎలక్షన్ కమిషనర్ గా నియమించింది. ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రమేష్ కుమార్ ఏపి హైకోర్టును ఆశ్రయించగా దాదాపు నెల రోజుల పైగా విచారణ జరిపిన కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎలక్షన్ కమిషనర్ గా తిరిగి బాధ్యతలు అప్పగించాలని అయన పదవి కాలాన్ని తగ్గించే అధికారం ఏపి ప్రభుత్వానికి లేదని తన తీర్పుతో స్పష్టం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ కు బాధ్యతలు అప్పగిస్తుందో లేక ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళుతుందో వేచి చూడాలి.

నిమ్మగడ్డ రీఎంట్రీ.. అధికార పార్టీకి పెద్ద తలనొప్పి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు చెప్పడంతో.. ప్రస్తుతం నిమ్మగడ్డ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ రీఎంట్రీ తో జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పవా? నిమ్మగడ్డను జగన్ సర్కార్ ఎలా ఫేస్ చేస్తుంది? వంటివి హాట్ టాపిక్ గా మారాయి. కరోనా కారణంగా గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అగ్గి రాజుకుంది. నిమ్మగడ్డ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రభుత్వం మండిపడింది. అసలు కరోనా ప్రభావం లేదు ఏంలేదు, చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, ప్రతిపక్ష టీడీపీ కోసమే ఎన్నికల వాయిదా వేశారంటూ.. అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నిజానికి ఎన్నికల వాయిదాకి ముందు నిమ్మగడ్డ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అధికార పార్టీ నేతలు పలు చోట్ల బెదిరింపులకు, దాడులకు పాల్పడి.. ఇతర పార్టీల వారిని నామినేషన్లు వేయకుండా చేసి.. ఏకగ్రీవం చేసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. నామినేషన్ల ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఒకానొక టైములో ఎన్నికల సంఘం తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే, ఇంతలో కరోనా ఉదృతి పెరుగుతుండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికార పార్టీ ఒక్కసారిగా నిమ్మగడ్డపై విరుచుకుపడింది. అంతేకాదు, కరోనా ప్రభావం లేదని చెప్పి.. ఎలాగైనా ఎన్నికలు నిర్వహిచాలని పంతానికి పోయారు. అందుకే ఆర్డినెన్స్ తెచ్చి నిమ్మగడ్డని తప్పించారు.. ఆ స్థానంలో కనగరాజ్ ని కూర్చోబెట్టారు. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అన్నట్టుగా.. అధికార పార్టీ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఓ వైపు కరోనా ఉదృతి, మరోవైపు కోర్టు కేసుతో..  కనగరాజ్ కూడా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు కోర్టు తీర్పుతో మళ్లీ నిమ్మగడ్డనే రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పుపై స్పందించిన నిమ్మగడ్డ.. తాను గతంలో పని చేసినట్లుగానే నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతో సంప్రదించి, సాధారణ స్థితికి వచ్చిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో సాధారణ స్థితి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. గత కొద్దిరోజులుగా ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో అసలు ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అని అభ్యర్థుల్లో భయం మొదలైంది. నామినేషన్ వేసిన ఉత్సాహంలో ఉన్న చాలామంది అభ్యర్థులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా బాగా ఖర్చుపెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులు లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు, పండ్లు వంటివి పంచుతూ పరోక్షంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు నిమ్మగడ్డ ఎంట్రీతో ఇప్పటిదాకా మేం చేసిన ఖర్చంతా వృధానేనా అని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి చాలా రోజులైంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియపై ఆరోపణలున్నాయి. నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానంటూ రీఎంట్రీ ఇచ్చిన నిమ్మగడ్డ.. ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అధికార పార్టీ ఏకగ్రీవాలు ఆగిపోతాయి, అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడి ఇతరులను నామినేషన్లు వేయనివ్వలేదన్న సంకేతాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. మరోవైపు, అభ్యర్థులకు కూడా తిప్పలు తప్పవు. ఇప్పటికే కరోనా మూలంగా ఎన్నికలు ఆలస్యంగా జరిగేలా ఉన్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభిస్తే మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. పాపం, ఎన్నికలు త్వరలోనే ఉంటాయనుకొని చాలామంది అభ్యర్థులు సాయం పేరుతో చాలా ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నారు. కొందరైతే అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఖర్చుపెట్టారు. కానీ ఏం లాభం?. ఎన్నికలు ఆలస్యమైతే ఈ ఖర్చంతా జనాలు మర్చిపోతారు. మళ్లీ ఎన్నికలప్పుడు ఫ్రెష్ గా ఖర్చుపెట్టాలి. మొత్తానికి నిమ్మగడ్డ ఎంట్రీతో బాగా ఖర్చు పెట్టిన అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది.

భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్.. నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదు

నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ తొలగింపు వ్యవహారంలో జగన్ సర్కార్ కి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో నిబంధనలు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ స్పందించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలతో, తాను తిరిగి చార్జ్ తీసుకున్నానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. తాను గతంలో పని చేసినట్లుగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులను  నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలతో సంప్రదించి, సాధారణ స్థితికి తిరిగి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తానని అన్నారు. వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతంగా ఉండరు.. రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన వారంతా రాజ్యాంగ విలువలు, సమగ్రతను కాపాడాలని నిమ్మగడ్డ అన్నారు. హైకోర్టు తీర్పుపై పలువురు స్పందించారు. జగన్ సర్కార్ ఇకనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అన్నారు. "రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదు.ఇది మరోసారి రుజువైంది.ఎస్ఈసీగా రమేష్ కుమార్ తొలగింపు,అర్హత లేని కనగరాజ్ నియామకం రాజ్యాంగవిరుద్ధమని ఆరోజే చెప్పాను.రాష్ట్ర ప్రభుత్వమూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైందనే విషయం గుర్తుంచుకోవాలి." అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. 'భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది' అని జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. "న్యాయం గెలిచింది చట్టం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది రాజ్యాంగం గెలిచింది న్యాయ వ్యవస్థ పై వున్న నమ్మకం నిలబడింది." అని కేశినేని నాని ట్వీట్ చేశారు.

జగన్ సర్కార్ కి ఊహించని దెబ్బ.. మళ్లీ ఎన్నికల కమిషనర్‌గా రానున్న నిమ్మగడ్డ!

జగన్ సర్కార్ కి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో నిబంధనలు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఐదు జిల్లాల స్వప్నం.. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. మర్కుక్‌ పంప్ ‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను చినజీయర్‌స్వామితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు.  అంతకముందు కొండపోచమ్మ ఆలయంలో ఉదయం వైభవంగా చండీయాగం నిర్వహించారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ యాగం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతో పాటు చినజీయర్ స్వామీ కూడా పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కడంతో.. ఐదు జిల్లాల స్వప్నం సాకారమైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను ఈ రిజర్వాయర్‌ తీర్చనుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్‌ చేపట్టారు. 557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ ఆ తర్వాత అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడంతో గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మకు చేరుకుంటాయి.  కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు. కొండపోచమ్మతో ఐదుజిల్లాలో మొత్తం 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి

భారత్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి ఆరువేలకు పైగా నమోదవుతున్న కేసులు.. ఇప్పుడు ఏడు వేల మార్కుని దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,466 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. 24 గంటల్లో 175 మంది కరోనాతో మరణించారు. భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4706కు చేరింది. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకూ 71,105 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 89,987 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

హైకోర్టులో జగన్ సర్కార్ కి కాస్త ఊరట

హైకోర్టులో వరుస ఎదురుదెబ్బల నుంచి జగన్ సర్కార్ కి కాస్త ఊరట లభించింది. విశాఖ, గుంటూరు జిల్లాల్లోని భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించుకునేందుకు హైకోర్టు అంగీకరించింది. అయితే, టెండర్లను ఖరారు చేయరాదని స్పష్టం చేసింది. జగన్ సర్కార్ విక్రయించదలచిన భూముల్లో దాతలు ఇచ్చినవి ఉన్నాయని, నిబంధనల మేరకు వాటిని విక్రయించడానికి వీల్లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 28 నుంచే భూముల వేలం ప్రక్రియ జరగనుందని, చట్టనిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ  ప్రక్రియను అడ్డుకోవాలని కోరారు. 2012 లో తీసుకొచ్చిన భూకేటాయింపు విధానం మేరకు ఈ భూముల్ని విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని కోర్టుకు వివరించారు. గుంటూరులో విక్రయించతలపెట్టిన స్థలంలో మార్కెట్‌ కొనసాగుతోందని, ప్రజావసరాలకు అనుగుణంగా ఉన్న దీనిని విక్రయించరాదని వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్ సుధాకర్‌రెడ్డి ‌వాదనలు వినిపిస్తూ.. భూముల వేలం వాయిదా పడిందని, జూన్‌ 11 నుంచి 13 వరకు వేలం నిర్వహించనున్నామని తెలిపారు. ప్రభుత్వం విక్రయించతలచిన భూములన్నీ ఖాళీ స్థలాలని. వాటిని విక్రయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వివరించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందంటూ విచారణను జూన్‌ 18 కి వాయిదా వేసింది.

హైకోర్టు ను ఆశ్రయించిన డాక్టర్ సుధాకర్

డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తనను ఈ నెల 16 నుంచి విశాఖలోని మానసిక వైద్యశాలలో నిర్బంధించారని ఆరోపించారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, హైకోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణకు రానుంది. పిటిషన్ లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య అరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా చేర్చారు.

టీడీపీ నేతల తీరును తప్పుబట్టిన చినరాజప్ప

పలువురు టీడీపీ నేతల తీరును ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చినరాజప్ప తప్పుబట్టారు. రెండో రోజు మ‌హానాడులో భాగంగా పార్టీ సంస్థాగత తీరు తెన్నులపై చినరాజప్ప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు నేతల తీరును తప్పుబట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని, ప్రభుత్వంలో లేకుంటే పార్టీ గురించి పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఎవ‌రు ఏ విధంగా వ్వ‌వ‌హారిస్తున్నారో గ‌మ‌నించాలని, బాగా పని చేస్తున్న వాళ్లనే చంద్రబాబు ప్రమోట్ చేయాలని సూచించారు.  మనం చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోయామని అన్నారు. కార్యకర్తలను చూసుకోవాలని అధినేత చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని, దాంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారని అందువల్లే టీడీపీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారం కోల్పోగానే కొందరు నేతలు వెళ్లిపోయారని, వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. వెళ్లిపోయిన నేతలు ఇప్పుడు కనుమరుగయ్యారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని చినరాజప్ప చెప్పారు.

టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరిగింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ ఆస్తులు విక్రయించకూడదని నిర్ణయించింది. నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతమవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. పాలక మండలి సమావేశంలో టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని అన్నారు. వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం.. దర్శనానికి సంబంధించి నియమ, నిబంధనలు రూపొందిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బస్సు, రైలు ప్రయాణాల్లో వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాదు వలస కార్మికులకు బస్సులు, రైళ్లలో ఆహారం అందించాలని ఆదేశించింది. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు బయలు దేరే ముందే ఆయా రాష్ట్రాలు మంచినీళ్లు, ఆహారం అందించాలని తెలిపింది. రైళ్లలో ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లను ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. రైల్వే కూడా వారికి ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లు చేయాలి. బస్సుల్లో కూడా ఇదే విధానం అమలు కావాలని ఆదేశించింది.  వలస కూలీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వారు తమ గమ్యస్థానాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ముఖ్యంగా కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని సూచించింది. వలస కార్మికులు పడుతున్న కష్టం చూసి గుండె తరుక్కుపోతోందని తెలిపింది. వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని.. రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని తెలిపింది. వారిని వారి స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి కార్మికుడూ క్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని సుప్రీంకోర్టు కోరింది.

జగన్ సమక్షంలో కియా కీలక ప్రకటన.. ఏపీలో భారీ పెట్టుబడులు

దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా మోటార్స్ ప్రకటించింది. 'మన పాలన - మీ సూచన' కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ పారిశ్రామిక రంగంపై ఈరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కియా సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ సమక్షంలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని తెలిపారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్‌ తయారీకి కొత్తగా పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు.  ఏపీతో కియా మోటార్స్ కు బలమైన బంధం ఉందని కూకున్ చెప్పారు.

టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. టీడీపీ ఎవరికీ భయపడదని, సవాళ్లు ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదని అన్నారు. టీడీపీని ఎవరూ కదిలించలేరని చెప్పారు. గతంలో టీడీపీపై బురదజల్లిన వారు అదే బురదలో కూరుకుపోయారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారని.. వారే తమ పార్టీకి శక్తి అని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని, ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చెప్పేవారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుదనానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఎన్టీఆర్ జయంతి కావడంతో చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అలాగే, ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.