విశాఖ పై పవన్ కళ్యాణ్‌కు కసి అందుకే.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
posted on Aug 3, 2020 @ 10:30AM
మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసిపి, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా న్యాయ నిపుణుల సలహాతో దీని పై పోరాటం చేస్తానని అయన ప్రకటించారు. తాజాగా పవన్ వ్యాఖ్యల పై స్పందించిన వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2019 లో జరిగిన ఎన్నికలలో పవన్ కల్యాణ్ ను గాజువాక ప్రజలు చిత్తుగా ఓడించారని, అందుకే విశాఖపై పవన్ కల్యాణ్ అంట కసి పెంచుకున్నారా అని ఆమె అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా రోజా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇదే సందర్భంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేవలం తన ఆస్తుల విలువ పెంచుకునేందుకే మూడు రాజధానులకు వైతిరేకంగా పని చేస్తున్నారని ఆమె విమర్శించారు.
ప్రస్తుతం చంద్రబాబు మాయమాటల నమ్మే పరిస్థితిలో ఎపి ప్రజలు లేరని ఆమె అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా జగనన్న ఉన్నాడనే భరోసాతో మహిళలు భద్రతగా, గౌరవంగా బయటకు వస్తున్నారని ఈ భరోసా ఇలాగే మరో 30, 40 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. ఇదే సందర్భంగా "మా అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నాని అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా రాష్ట్రంలోని మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం" అని రోజా అన్నారు.