జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. ఓట్లు అడగాలంటేనే భయపడుతున్న నాయకులు
posted on Nov 23, 2020 @ 3:05PM
ఎన్నికలు ఏముంది.. డబ్బు, మద్యం ఎవరు ఎక్కువ పంచితే వాళ్ళదే విజయం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నాయకులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికలు వస్తే కానీ మా వైపు తిరిగి చూడరా?, వరదలు వచ్చినప్పుడు ఏమైపోయారు? రోడ్లు ఏవి? అభివృద్ధి ఏది? అంటూ ఓటర్లు నాయకులను నిలదీస్తున్నారు. దీంతో ప్రచారానికి వెళ్లి ఓట్లు అడగాలంటేనే నాయకులూ భయపడే పరిస్థితి నెలకొంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనంపల్లి యాప్రాల్ వెళ్లారు. అయితే 'నో రోడ్-నో వోట్' అని నినాదాలు చేస్తూ స్థానికులు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో ఎన్నికలు అయిపోగానే రోడ్డు వేయిస్తానని, అవసరమైతే సొంత డబ్బులతో వేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఆ మాటలకు స్థానికులు శాంతించలేదు. సొంత సొమ్ములు అవసరం లేదని, తాము ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని, వాటితో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేతో స్థానికులు అన్నారు. దీంతో ఎమ్మెల్యే తనపై ప్రమాణం చేసుకుని మరీ హామీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లారు.
ఎంఐఎం తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ కు కూడా నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఓవైసీని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తమకు వరద సాయం పదివేలు అందలేదని... ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ఆ మహిళలు ప్రశ్నించారు. గతంలో కూడా ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు.
ఇలా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడగడానికి వెళుతున్న నాయకులకు పలుచోట్ల చేదు అనుభవం ఎదురవుతోంది. స్థానికులు తమ ప్రాంతంలోని సమస్యల గురించి చెప్పి.. అవి తీరిస్తేనే ఓటేస్తామని తెగేసి చెబుతున్నారు. ఓటర్లలో వచ్చిన ఈ మార్పుని చూసైనా.. పదవిలో ఉన్నంత కాలం ఏం చేయకుండా.. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంచితే ఏ ఎన్నికల్లోనైనా గెలవొచ్చు అనుకునే నాయకుల తీరులో మార్పు వస్తుందేమో చూడాలి.