ఏసీ రూముల్లో కూర్చుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాదు
posted on Nov 23, 2020 @ 9:44AM
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. వరుస ఓటములతో పార్టీ బలం రోజురోజుకి పాతాళానికి పడిపోతోంది. నాయకత్వ లేమి, నాయకుల తీరుతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మనుగడే ప్రశ్నార్ధకంగా మారిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసి సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందని గులాం నబీ ఆజాద్ అన్నారు. పార్టీ పరిస్థితికి నాయకత్వాన్ని నిందించి ప్రయోజనం లేదని.. పంచాయతీ, మండల స్థాయి నుంచి పార్టీని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌లో మొదట్లో ఉన్న పరిస్థితులు లేవని, నాయకుల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నేతలకు మధ్య సంబంధం తెగిపోయిందని చెప్పారు. పార్టీ టికెట్ రావడమే ఆలస్యం ఫైవ్ స్టార్ హెటల్స్‌లో ప్రత్యక్షమవుతున్నారని, ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని, నాయకులు ఫైవ్‌స్టార్ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు.
గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని, అయినా మనమేం కోల్పోతున్నామో గుర్తించాలని అన్నారు. గతంలో కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చానని గుర్తుచేశారు. 2004, 2009 లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఏపీ అని.. 7 స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు రాబట్టడంతోనే అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయని.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాయకులు ఏసీ రూములు, ఫైవ్‌స్టార్ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు.