రెండు పార్టీలు కలిస్తేనే మేయర్! ఎంఐఎం, బీజేపీ కలిసేనా?
posted on Dec 5, 2020 @ 11:43AM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితం వచ్చింది. ఎవరి అంచనాలకు అందకుండా హంగ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. సెంచరీ ఖాయమని ప్రకటించిన టీఆర్ఎస్ అంచనాలు తలకిందులై.. 55 సీట్లకే పరిమితమైంది. టీఆర్ఎస్ లీడ్ లో ఉన్న మరో డివిజన్ ఫలితం ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ 48 డివిజన్లతో రెండో ప్లేస్లో నిలవగా.. ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు సీట్లు సాధించాయి. సింగి ల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా మేయర్ పీఠానికి అవసరమైన మేజిక్ ఫిగర్ మాత్రం క్రాస్ చేయలేకపోయింది కారు పార్టీ. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరి. దీంతో గ్రేటర్ మేయర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందా..? లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
రూల్స్ ప్రకారం మేయర్ ఎన్నిక కోసం మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి కంటే ఎక్కువ మంది మద్దతు కావాలి. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండే స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకూ మేయర్ ఎన్నికలో ఓటేసే హక్కు ఉంటుంది. ఈ ఎక్స్ అఫీషియో మెంబర్లనూ కలిపి మొత్తం ఓట్ల సంఖ్యను నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి జీహెచ్ఎంసీలో 194 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన మేయర్ సీటు కోసం మేజిక్ ఫిగర్ 98. కానీ టీఆర్ఎస్ కు ఇప్పుడు 87 మంది ఓటర్లున్నారు. ఇందులో 56 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు. అంటే మేయర్ సీటు గెలుచుకునేందుకు టీఆర్ఎస్ కు ఇంకా 12 ఓట్లు కావాలి. మేయర్ రేసులో బీజేపీ అవకాశాలను పరిశీలిస్తే.. 48 స్థానాల్లో గెలిచినా ఇంకా యాభై మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఆ పార్టీకి అవసరం. కానీ బీజేపీకి ఎంపీ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ , ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాత్రమే ఎక్స్ అఫిషియేలుగా ఉన్నారు. మజ్లిస్ లెక్కలను చూస్తే .. ఆ పార్టీ 44 డివిజన్లు గెలిచింది. 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో ఎంఐఎం బలం 53గా ఉంది. మేయర్ కోసం ఇంకా ఆ పార్టీకి 45 ఓట్లు కావాలి.
ఈ మూడు పార్టీల్లో ఏదైనా మరో పార్టీ మద్దతు తీసుకోవడం గ్రేటర్ మేయర్ ఎన్నికకు అనివార్యంగా మారింది. అయితే ఏ రెండు పార్టీలు కలుస్తాయన్నది సస్పెన్స్ గా మారింది. మజ్లిస్, బీజేపీ కలిసే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీలు మేయర్ పీఠాన్ని పంచుకునే ఛాన్సే లేదు. దీంతో మజ్లిస్, టీఆర్ఎస్ కలవడం ఒక్కటే మార్గం. మజ్లిస్ పార్టీ నేరుగా సపోర్ట్ చేయడమో, ఓటింగ్ కు హాజరుకాకుండా ఉండటమో చేస్తే…టీఆర్ఎస్ మేయర్ సీటును గెలుచుకునే చాన్స్ ఉంటుంది. మజ్లిస్ సహకారంతో టీఆర్ఎస్ మేయర్ పదవి తీసుకుని.. ఆ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ నేరుగానే మజ్లిస్ సహకారం తీసుకుంది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 28 డివిజన్లలో గెలిచి సింగి ల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. టీఆర్ఎస్ 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. మజ్లిస్ హెల్ప్ తో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లతో మేయర్ పదవిని దక్కించుకుంది టీఆర్ఎస్. నిజామాబాద్ తరహాలోనే జీహెచ్ఎంసీలో ఎంఐఎం మద్దతు తీసుకుంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
జీహెచ్ఎంసీ మేయర్ సీటు కోసం టీఆర్ఎస్ నేరుగా మజ్లిస్ సాయం తీసుకునే చాన్స్ తక్కువగా ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా సహకారం తీసుకుంటే బీజేపీ నుంచి, ప్రజల నుంచి విమర్శలు వస్తాయని అధికార పార్టీ భయపడుతుందట. ఎంఐఎంతో తమకెలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పిన టీఆర్ఎస్... మేయర్ పీఠం కోసం ఆ పార్టీతో జతకడితే బీజేపీ చేతికి మరో అస్త్రం చిక్కినట్లవుతుంది అంటున్నారు. అటు ఎంఐఎం కూడా టీఆర్ఎస్‌కు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటిస్తుందా లేక మేయర్ సీటును చెరో రెండేళ్లు పంచుకుందామన్న ప్రతిపాదన తీసుకొస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మేయర్ ఎన్నిక రోజు మజ్లిస్ ఓటర్లు కొందరు దూరంగా ఉండటమో, ఎన్నికను బాయ్ కాట్ చేయడమో జరిగేలా ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకునే చాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే మరో రెండు నెలల వరకు ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలికి గడువుంది. అంతవరకు వేచి చూసే దోరణిలో అధికార పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ ఫలితాల తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పారు.