బీజేపీకి షాకిచ్చిన అమరావతి అంశం! సెటిలర్ల ఏరియాలో కారు విజయం
posted on Dec 5, 2020 @ 10:53AM
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా చర్చగా మారిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుహ్యా ఫలితాలు సాధించింది బీజేపీ. ఒక రకంగా జీహెచ్ఎంసీలో సాఫ్రాన్ స్ట్రైక్ జరిగిందనే చెప్పుకోవాలి. గత గ్రేటర్ ఎన్నికల్లో కేవలం నాలుగు డివిజన్లు గెలిచిన కమలం పార్టీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారు పార్టీని కంగు తినిపిస్తూ.. ఈసారి అంతకు పది రెట్ట కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. ఏ సర్వే సంస్థ అంచనాకు అందకుండా, ఎవరూ ఊహించని విధంగా గ్రేటర్ లో సంచలం చేసిన బీజేపీ.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. ఎల్బీనగర్ జోన్ లో స్వీప్ చేసిన కమలం.. కూకట్ పల్లి, శేరి లింగం పల్లి జోన్లలో మాత్రం కారుకు పార్టీ ముందు నిలవలేకపోయింది. ఇదే ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరి లింగం పల్లి నియోజకవర్గాల్లో ఏపీ రాజధాని అమరావతి అంశం ఎన్నికల్లో ప్రభావం చూపించిందంటున్నారు. అదే బీజేపీకి మైనస్ గా మారిందంటున్నారు. అమరావతిపై బీజేపీ హైకమాండ్ తీరుతో పాటు కొందరు ఏపీ బీజేపీ నేతల వ్యవహార శైలిపై సెటిలర్లు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్జి వంటి లీడర్లు చేస్తున్న పూటకో ప్రకటనలపై ఆంధ్రా ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ లీడర్లే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తెలంగాణ బీజేపీకి శాపంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడంతో.. ఆయనపై వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నవారంతా కారు పార్టీ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి ఓటేయాలని డిసైడైన వారు కూడా సోము వీర్రాజు ప్రచారం తర్వాత తమ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తెలంగాణ బీజేపీ నేతలు కూజా ఇదే అభిప్రాయానికి వచ్చారట. సోము వీర్రాజు ప్రచారంతో 10 నుంచి 15 సీట్లు కోల్పోయామని చెబుతున్నారని తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో మొత్తం 35 డివిజన్లు ఉన్నాయి. కూకట్ పల్లి, శేరి లింగం పల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెర్వు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లు ఇందులో ఉన్నాయి. ఏపీ ఓటర్లే ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూకట్ పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, హఫీజ్ పేట ప్రాంతాల్లో ప్రచారం చేశారు. గ్రేటర్ ఫలితాల్లో మాత్రం ఇక్కజ బీజేపీ పూర్తిగా చతికిలపడింది. కూకట్ పల్లి జోన్ లో 22 డివిజన్లు ఉండగా బీజేపీ ఒక్క డివిజన్ మాత్రమే గెలిచింది. శేరిలింగం పల్లి జోన్ లో 13కు ఒక్కటే గెలిచింది. గచ్చిబౌలి , మూసాపేట లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు డివిజన్లలోనూ తక్కువ మెజార్టీతోనే గట్టెక్కారు కమలం అభ్యర్థులు. 2016 ఎన్నికల్లో సెటిలర్స్ గంపగుత్తగా టీఆర్ఎస్కు ఓటేశారు. కాని ఈసారి కొంత మార్పు రావచ్చని ప్రచార సమయంలో కనిపించింది. అయితే సోము వీర్రాజు బీజేపీ తరపున ప్రచారం చేయడంతో సీన్ పూర్తిగా మారిపోయిందంటున్నారు. అమరావతిపై ఆయన చేస్తున్న పూటకో ప్రకటనలే ఇందుకు కారణమంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ అమరావతి కీలకంగా మారింది. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, ఏఎస్ రావు నగర్, సనత్ నగర్, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో.. ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చిన బీజేపీ నేతలను అమరావతి పై ప్రశ్నించారు కొందరు ఆంధ్రా ఓటర్లు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలనే విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని కోరారట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటన చేస్తే తామంతా గంప గుత్తగా ఓట్లు వేస్తామని కూడా కొందరు అంధ్రా ఓటర్లు బీజేపీ నేతలకు చెప్పారంటున్నారు. ఆంధ్రా ఓటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గ్రేటర్ బీజేపీ అభ్యర్థులు ముఖం చాటేశారని తెలుస్తోంది. అమరావతి మద్దతుగా కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే తాము సపోర్ట్ చేస్తామని కొందరు సెటిలర్ ఓటర్లు కమలం నేతల ముఖాల మీదనే నేరుగా చెప్పేసినట్లు చెబుతున్నారు. అమరావతి విషయంలో బీజేపీ తీరుపై ఆంధ్రా ఓటర్లు ఇంత ఆగ్రహంగా ఉండగా.. వాళ్ల దగ్గరే అమరావతిపై గందరగోళ ప్రకటనలు చేసే సోము వీర్రాజు ప్రచారం చేయడం తెలంగాణ బీజేపీకి మరింత ఇబ్బంది కల్గించిందంటున్నారు. ఈ ప్రభావం గ్రేటర్ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.
గ్రేటర్ హైదరాబాద్ లో సోము వీర్రాజు ప్రచారం చేయకపోతే బీజేపీకి మరింతగా మంచి ఫలితం వచ్చేదనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్, హబ్సిగూడ, వనస్తలిపురంలో బీజేపీ హవా చూపి.. కూకట్ పల్లిలో ఫెయిల్ కావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఎల్బీనగర్ జోన్ లో 11 డివిజన్లు ఉండగా.. అన్ని గెలిచి కమలం స్వీప్ చేసింది. ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉండే హబ్సిగూడ, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. వీర్రాజు ప్రచారానికి రాకుంటే కూకట్ పల్లి ఏరియాలోనూ బీజేపీ స్వీప్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. సోము వీర్రాజు లాంటి నేతలతో పార్టీకి నష్టమనే అభిప్రాయం బీజేపీలో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలతో మరోసారి తేలిపోయింది. ఏపీలో పార్టీని పాతాళానికి తొక్కుతున్న సోము వీర్రాజు.. హైదరాబాద్ వెళ్లి అక్కడ పార్టీకి నష్టం కల్గించారనే చర్చ బీజేపీ నేతల్లోనే జరుగుతోందట.