90ఏళ్ల బ్రిటన్ బామ్మకు తొలి టీకా! రెండు వారాల్లో భారత్ కరోనా వ్యాక్సిన్ ?
posted on Dec 8, 2020 @ 2:11PM
కరోనా వ్యాక్సిన్ పంపిణిని ప్రారంభించింది బ్రిటన్. 90 ఏళ్ల వృద్ధురాలికి తొలి కరోనా టీకా ఇచ్చారు. ప్రపంచంలోనే కొవిడ్ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన ఈ బామ్మ నిలిచారు. యూకేలో ఫైజర్ టీకా పంపిణీ అధికారికంగా మంగళవారం ప్రారంభమైంది. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్‌లో 90ఏళ్ల మార్గరెట్ కీనన్ తొలి టీకా వేయించుకున్నారు. ఫైజర్ టీకాకు క్లినికల్ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా తీసుకున్న తొలి వ్యక్తి ఈమే. మొట్టమొదటి టీకా తీసుకోవడం చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బామ్మ చెప్పారు.
జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూకే ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. తొలి ప్రాధాన్యంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, 80ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు కేర్ హోంలో ఉండే వర్కర్లకు ఇవ్వనున్నారు. యూకేతో పాటు ఫైజర్ అమెరికాలో కూడా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం డిసెంబరు 10న సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. యూఎస్‌లో కూడా అనుమతి లభిస్తే.. డిసెంబరు మూడోవారం నుంచి అగ్రరాజ్యంలో టీకా పంపిణీ చేయాలని ఫైజర్ భావిస్తోంది.
భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ కంపెనీల విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరపుతుంది. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత రెండు వారాల్లోగా కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కరోనా వ్యాక్సిన్ అవసరంతో పాటు దాని భద్రత కూడా ముఖ్యమైన అంశం. అత్యవసర అనుమతులు ఇచ్చే ముందు వ్యాక్సిన్ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.అందుకే కరోనా టీకా పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టిపెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించారు. దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్ -19 టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.