కొత్త చట్టాలు వద్దేవద్దని తెగేసి చెప్పిన రైతు సంఘాలు
posted on Dec 9, 2020 8:56AM
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల పై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. రైతులకు బాసటగా నిన్న దేశ వ్యాప్త బంద్ విజయవంతమైన తరువాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు ఆయనతో రైతు సంఘాలు నిన్న సాయంత్రం సమావేశమయ్యాయి. అయితే ఇరు పక్షాలు కూడా తమ పూర్వ వాదనలకే కట్టుబడ్డాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఈరోజు బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్ చర్చలు రద్దయ్యాయి. అయితే కొత్త చట్టాల రద్దుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం వాటిలో తామెలాంటి సవరణలు తేదల్చుకున్నదీ వివరిస్తూ ఒక ప్రతిపాదనను ఈరోజు రైతులకు పంపనుంది. ఈ సవరణల పై రైతు సంఘాల నేతలు బుధవారం 12 గంటలకు సింఘూ సరిహద్దు కేంద్రం వద్ద సమావేశమై చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. అయితే మంగళవారం జరిగిన భారత్ బంద్ చాల రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపడం, దేశ విదేశాల్లో ప్రభుత్వ ఇమేజి దెబ్బతింటూండడంతో హోమ్ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఓ పక్క బంద్ జరుగుతున్న సమయంలోనే ఆయన రైతు సంఘాల నాయకులకు కబురు పంపారు. దాంతో సింఘూ సరిహద్దుల నుంచి 13 మంది రైతు సంఘం నేతలు నిన్న రాత్రి ఆయనను కలిశారు.
అయితే షా నివాసంలో చర్చలకు కొందరు రైతు నేతలు విముఖత చూపడంతో పూసా ఏరియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద సమావేశం రెండు గంటల ఆలస్యంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 13 మందిలో ఎనిమిది మంది పంజాబీ రైతు సంఘాల వారు కాగా మిగిలిన ఐదుగురూ దేశంలోని వివిధ యూనియన్లకు చెందినవారు. ఆలిండియా కిసాన్ సభకు చెందిన హన్నన్ మొల్లా, భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన రాకేశ్ తికాయత్ వారిలో ఉన్నారు. అసలు దీనిపై అమిత్ షాతో చర్చించేందుకు ఏమీ లేదని, "చట్టాలను రద్దు చేస్తారా లేదా... అవును లేదా కాదు... అన్నది మాత్రమే అడుగుతున్నామని" రైతు నేత రుద్రు సింగ్ మాన్సా సమావేశానికి ముందే చెప్పారు. దీంతో సమావేశం కూడా అదే తరహాలో సాగింది. అయితే రైతు నేతలిచ్చిన సమాచారం ప్రకారం... కొత్తగా చేసిన చట్టాల్ని రద్దు చేయడం అసాధ్యమని అమిత్ షా తేల్చి చెప్పారు. చట్టాల రద్దు తప్ప ఏ తరహా సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్పారు. అయితే చట్ట సవరణలకు తాము వ్యతిరేకమని, తమ వాదనలో మార్పు లేదని రైతు నేతలు తేల్చిచెప్పారు. ఆ సమయంలో షా వారి ముందు మరో ప్రతిపాదన ఉంచారు. "చట్టాలపై మీకున్న 39 అభ్యంతరాలనూ మేము పరిశీలించాం. ప్రభుత్వం ఏమేం సవరణలు చేయదలిచిందీ మీకు రేపటికి పంపిస్తాం... పరిశీలించండి" అని కోరారు. దీంతో రైతు సంఘాల నేతలు అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు బుధవారం మంత్రులు నరేంద్ర తోమర్, పీయూష్ గోయల్ సారథ్యంలోని ప్రభుత్వ బృందంతో తాము జరిపే చర్చలను రద్దు చేసినట్లు కిసాన్ సభ నేత హన్నన్ మోలా రాత్రి 11-30 గంటలకు మీడియాకు తెలిపారు. "ఈ సాయంత్రం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమిత్ షా తో సమావేశానికి రావాలని.. అయితే సమావేశానికి వెళ్లినా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏమీ చెప్పలేదు" అని రైతుల నేత రాకేశ్ తికైత్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంపై తమకు విశ్వాసం కలగడం లేదని చెప్పిన మరి కొందరు రైతు ప్రతినిధులు ఆందోళనను మరింత ఉధృతం చేయడమే మార్గాంతరమంటున్నారు. దీంతో బుధవారం రైతులు తమలో తాము జరిపే చర్చల్లో ఏ విషయమూ తేలవచ్చని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా రైతుల నిరసనలో భాగమయ్యేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఈ విషయంపై చర్చలు జరిపారు. ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రాహుల్, పవార్, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్ బాలులతో కూడిన అయిదుగురు సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకోనుంది. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు.