తల్లిదండ్రుల ఫోటోలకు చెప్పులదండ వేసిన ప్రబుద్ధులు.. ఎక్కడంటే..
posted on Dec 15, 2020 @ 6:16PM
కన్న కొడుకు చేతుల మీదుగా ప్రశాంతంగా వెళ్లిపోవాలని కోరుకునే తల్లిదండ్రులు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తారు. అదే సమయంలో కన్నవాళ్ళు బతికుండగానే అనాధలుగా ఏ రోడ్డు మీదో.. లేక వృద్ధుల ఆశ్రమాలలోనో వదిలివేసే పిల్లలు ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఆస్తి కోసం తల్లిదండ్రులకు బతికుండగానే నరకం చూపిస్తున్న పిల్లల గురించి కూడా మనం గతంలో విన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణ లో జరిగింది. ఆస్తి కోసం తమ కన్నతండ్రినే కిడ్నాప్ చేసిన ఘనులు వీళ్ళు. ఈ ఘటన సూర్యాపేటలోని భగత్ సింగ్ నగర్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న రిటైర్డ్ తహసీల్దార్ సంజీవరావుకు ఇద్దరు కుమారులు. వారు ఆయన పేరుమీదున్న ఐదు ఎకరాల భూమిని తమకు రాసివ్వాలని గత కొన్నిరోజులుగా ఆయనపై తీవ్ర వత్తిడి తెస్తున్నారు. అయినా తమ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో.. ఈరాజు ఉదయం అయన ఇంటికి వచ్చిన కుమారులు ఇద్దరూ.. తండ్రి సంజీవరావుతో గొడవపడ్డారు. ఆస్తి రాస్తావా చస్తావా అని ఆయనను తీవ్రంగా హింసించారు. అయితే మధ్యలో అడ్డు వచ్చిన కన్నతల్లిని కూడా పక్కకు తోసేశారు. కన్న కొడుకుల ప్రవర్తనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే ఎంత ప్రయత్నించినా.. సంజీవరావు ఆస్తి రాయకపోవడంతో... ఆయనను కుమారులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయారు. ఈ ఘటనతో షాక్ తిన్న తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తి కోసం తమ ఫొటోలకు కొడుకులు చెప్పుల దండ కూడా వేశారని సంజీవరావు భార్య వాపోయారు. ఇపుడు తమ కుమారుల నుంచి తన భర్తను కాపాడాలని ఆమె పోలీసులను వేడుకుంది.