బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి! తమిళనాడు ఎన్నికలే కీలకం!
posted on Dec 28, 2020 @ 4:42PM
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ బలహీన పడింది. బీజేపీ మాత్రం రోజురోజుకు మరింత బలపడుతోంది. బీజేపీకి ధీటుగా పోరాడే శక్తి కాంగ్రెస్ కు లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కొత్త కూటమి అయితే సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడున్న యూపీఏనే బలోపేతం చేసే యోచనలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వేదిక కాబోతున్నాయని సమాచారం.
తమిళనాడులో మేలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అంటే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఇప్పటికే తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. తమిళనాడులో పాగా కోసం బీజేపీ శ్రమిస్తున్నా.. వారికి ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు. రజనీకాంత్ పార్టీ పెడితే... బీజేపీతో కలిసి పోటీ చేయవచ్చని భావించారు. కాని హైదరాబాద్ లో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన రజనీకాంత్.. హాస్పిటల్ నుంచి డాశ్చార్జ్ అయినా ... ఆయన ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో డిసెంబర్ 31న చేస్తానన్న రజనీకాంత్ రాజకీయ ప్రకటన లేనట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కేంద్ర సర్కార్ తో సఖ్యతగానే ఉన్నా... తమిళనాడుకు వచ్చే సరికి మాత్రం ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో బీజేపీతో కలిసి సర్కార్ పంచుకునే అవకాశం లేదని అన్నాడీంకే స్పష్టం చేసింది. డీఎంకే ఎలాగూ బీజేపీకి బద్ద వ్యతిరేకమే.
జనవరి తొలి వారంలోనే చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదల కాబోతోంది. శశికళ ఎంట్రీ తర్వాత తమిళ పాలిటిక్స్ మరింత రంజుగా మారిపోనున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017లో శశికళను దోషిగా తేల్చిన కోర్టు నాలుగేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. అప్పటి నుంచి ఆమె బెంగళూరులోని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జనవరిలో జైలు నుంచి రానున్న శశికళ.. రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఆమె అనుచరులు పార్టీ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారంటున్నారు. శశికళ పార్టీ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తాను జైలుకు వెళ్లడానికి బీజేపీనే కారణమనే భావనలో శశికళ ఉన్నారని ఆమె అనుచరుల వాదన. తమిళనాడులో ఏ విధంగా చూసినా బీజేపీకి కలిసి వచ్చే పార్టీలు కనిపించడం లేదు.అవసరమైతే బీజేపీని ఎదుర్కొనేందుకు.. అన్నాడీఎంకే మినహా మిగితా పార్టీలు ఏకమయ్యే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు రాజకీయ పరిణామాల తరహాలోనే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి బలమైన శక్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూపీఏ కూటమికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను చీఫ్ గా నియమించి.. ఆ దిశగా అడుగులు వేయవచ్చని చెబుతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని, ప్రాంతీయ పార్టీలతో ఆమె సమావేశం జరిపింది కూడా ఇందు కోసమేనని చెబుతున్నారు. రైతు సమస్యలపై మాట్లాడుకున్నామని మమత చెబుతున్నా అంతర్గతంగా జరిగింది మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి బలోపేతం పైనేనని పక్కాగా తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి శివసేన కూడా అంగీకరిస్తోంది. ఆ పార్టీ పత్రిక సామ్నాలో శరద్ పవార్ ను ప్రశంసిస్తూ సంపాదకీయం వచ్చింది. పవార్ ఆ పదవిని స్వీకరిస్తానంటే తమకే అభ్యంతరం లేదని.. పవార్ ఆ పదవికి అన్ని విధాలా అర్హులని మిత్రపక్షం శివసేన అందులో స్పష్టం చేసింది.
మొత్తంగా పశ్చిమ బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, బెంగాల్ లో టీఎంసీ విజయం సాధిస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టేనని చెబుతున్నారు. మమత, స్టాలిన్, శివసేనల డైరెక్షన్ లోనే శరద్ పవార్ నేతృత్వంలో బలమైన కూటమి రావచ్చంటున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించడం వల్లే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ.. తమ చేతుల్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తోందని, అందుకే కేసీఆర్, జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు సాగించిందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత గతంలో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని రాజకీయ అనలిస్టులు ఉదాహరణగా చూపుతున్నారు.