జడ్జిగా పాల వ్యాపారి కూతురు! తొలి ప్రయత్నంలోనే సాధించిన సోనాల్
posted on Dec 28, 2020 @ 2:03PM
పట్టుదల ఉంటే సాధించలేనిమి ఏదీ ఉండదంటారు. గతంలోనూ ఇది చాలా సార్లు రుజువైంది. ఎందరో పేదలు కష్టపడి తమ లక్ష్యాలను చేరుకున్నారు. ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరికొందరు వ్యాపార రంగంలో రాణించి దిగ్గజాలయ్యారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన సోనాల్ శర్మ కూడా పట్టుదలగా చదివి అద్భుతాలు చేసింది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. వెనుకంజ వేయకుండా విజేతగా నిలిచి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. దూద్‌వాలా కూతురిగా తండ్రికి సాయం చేస్తూనే, మొదటి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికైంది. పట్టుదల, సంకల్పం ముందు కొండంత లక్ష్యం చిన్నబోతుందనేందుకు నిదర్శనంగా నిలిచింది సోనాల్ శర్మ.
సోనాల్ శర్మ తండ్రి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. తండ్రితో కలిసి సోనాల్ కూడా పశువుల పాకలో నిరంతరం శ్రమించేది. పశువుల కొట్టాన్ని క్లీన్ చేయడం, పేడ ఎత్తడం, పాలు పితకడం, పాలు పోయడం వంటి పనులన్నీ చేస్తూ.. అదే పాకలో తన లక్ష్యం కోసం కష్టపడి చదివేది. ఆ క్రమంలోనే 26 ఏళ్ల సోనాల్.. బీఏ, ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి మూడు బంగారు పతకాలు సాధించింది. ఎల్‌ఎల్ఎమ్ పూర్తి చేసిన తర్వాత రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీస్ కు సొంతంగా ప్రిపేర్ అయింది. పరీక్ష కోసం బుక్స్ కొనే స్థోమత లేకపోవడంతో సైకిల్ మీద కాలేజ్‌కు వెళ్లి లైబ్రరీలో చదువుకునేది. చివరకు ఆమె అనుకున్నది సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఆర్‌జేఎస్ క్రాక్ చేసి రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా నియమితురాలైంది.
మొదటి ప్రయత్నంలోనే జడ్జిగా ఎన్నికైన సోనాల్ శర్మ ఇప్పుడు ఎందరికో స్పూర్తిగా నిలుస్తోంది. నలుగురు పిల్లలమైన మమ్మల్ని చదివించడానికి నాన్న ఎంతగానో కష్టపడ్డారని చెబుతోంది సోనాల్ శర్మ. తమ చదువుల కోసం లోన్లు కూడా తీసుకున్నారని తెలిపింది. చిన్నప్పుడు స్కూల్లో తమది పాల వ్యాపారం చేసే కుటుంబం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేదాన్ని.. కానీ నేడు మా నాన్న ఓ దూద్‌వాలా అని గర్వంగా చెప్పుకుంటానని చెప్పింది. తన విజయం నాన్నకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చిందని, ఇక నుండి నాన్నకు ఏ కష్టం రాకుండా చాలా సంతోషంగా చూసుకుంటానని సంతోషంగా చెబుతోంది సోనాల్ శర్మ.