వర్మ డైరెక్షన్ లో 'అల వైయస్ అవినీతిపురములో'! జగన్ పాత్ర పోషిస్తానన్న టీడీపీ నేత
posted on Dec 28, 2020 @ 3:02PM
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కామన్.. కానీ రాజకీయ నాయకుడు సినీ నటుడు అవ్వాలనుకోవడం వెరైటీ. అందులోనూ ఒక నాయకుడు తమ ప్రత్యర్థి పార్టీ నాయకుడి పాత్రలో నటించాలనుకోవడం డబుల్ వెరైటీ. తాజాగా ఓ టీడీపీ నేత అలాంటి కోరికనే బయటపెట్టారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రలో నటించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, ఆయన స్టొరీ లైన్ ఇచ్చారు, డైరెక్టర్ ని కూడా ఎంపిక చేశారు. అలాగే, ఈ సినిమాకి అదిరిపోయే టైటిల్ ని కూడా పెట్టారు. ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురములో' స్ఫూర్తితో ఆ సినిమాకి 'అల వైయస్ అవినీతిపురములో' అని పేరు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఇళ్ల పట్టాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని చెప్పారు. సీఎం జగన్ పేదల పేరు చెప్పి 7 వేల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల్లో జరిగిన అవినీతిపై బొత్స చర్చకు రావాలన్నారు. తన ఆరోపణలు అవాస్తం అని తేలితే... రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బండారు సవాల్ విసిరారు. 31 లక్షల పట్టాలు ఇస్తామని వైసీపీ నేతలు అంటుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్‌లో 60 గదులు ఉంటే.. ఒక సెంటులో పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని టీడీపీ నేత ప్రశ్నించారు.
ఇళ్ల పట్టాల పంపిణి విషయంలోనే వివాదాస్పద, సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బండారు సత్యనారాయణ మూర్తి ఒక కోరిక కోరారు. ఇళ్ల స్థలాల అంశం ఆధారంగా వర్మ ఒక సినిమాను తీయాలన్నారు. ఆ సినిమాలో జగన్ పాత్రను తానే పోషిస్తానని చెప్పారు బండారు. ఆ చిత్రానికి 'అల వైయస్ అవినీతిపురములో' అని టైటిల్ పెట్టాలని సూచించారు. జగన్ అవినీతి మొత్తం తనకు తెలుసన్న బండారు.. తాను కూడా మంచి నటుడినే అని... అందుకే జగన్ పాత్రను తానే పోషించాలనుకుంటున్నానని చెప్పారు. వర్మ తనకు అవకాశాన్ని ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు బండారు సత్యనారాయణ మూర్తి.
టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని చెప్పారు బండారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చామో.. అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జగన్ రెడ్డి సర్కార్ ఇళ్ల దోపిడీని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆపాలన్నారు. జగన్ ఒక మూర్ఖుడు, అహంకారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండారు సత్యనారాయణ మూర్తి. ఇళ్ల పట్టాల్లో జరుగుతున్న అనినీతిని దారి మళ్లించడానికే వైసీపీ నేతలు సవాళ్ల పేరిట డ్రామాలు ఆడుతున్నారని బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.