మోడీ ఇలాఖాలో బీజేపీకి బిగ్ షాక్!
posted on Dec 29, 2020 @ 4:40PM
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ గట్టి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, భరూచ్ లోక్‌సభ సభ్యుడు మన్‌సుఖ్ భాయి వాసవ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు ఆయన లేఖ రాశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు వాసవ తెలిపారు. వాసవ రాజీనామా అంశంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్ పాండ్యా స్పందించారు. ఆయన రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీకి అందిందన్నారు. మన్షుక్ భాయ్ తనతో మాట్లాడారని చెప్పారు. ఆయనో సీనియర్ ఎంపీ అని, వాసవ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
గుజరాత్ లో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న వాసవ ఆరు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాను లేవనెత్తిన సమస్యలపై పార్టీ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. బీజేపీ పనితీరుపైనా ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవలి తన నియోజకవర్గంలో పలు సమస్యలపైనా వాసన్ మాట్లాడారు. గత వారంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వాసవ లేఖ రాశారు. నర్మదా జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్లుగా ప్రకటించే నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకొనేలా పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే తన లేఖపై స్పందించలేదనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని భావిస్తున్నారు.
‘‘పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాను. పార్టీ విలువల రక్షణకు కృషిచేశాను. అన్నింటికి మించి నేనో మనిషిని. తెలిసో తెలియకో మనిషి తప్పులు చేస్తాడు. నేను చేసిన తప్పు పార్టీకి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలుస్తాను. లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను అందజేస్తా. నా నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియపరచండి’’ అని తన లేఖలో పేర్కొన్నారు మన్‌సుఖ్ భాయి వాసవ.