ముంబై ఈడీ ఆఫీసుకు బీజేపీ పార్టీ బ్యానర్..
posted on Dec 29, 2020 @ 4:59PM
మహారాష్ట్రలో ఒకప్పటి మిత్రులైన బీజేపీ శివసేనల మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం నడుస్తున్నసంగతి తెల్సిందే. ఈ మాటల యుద్ధం తాజాగా ఒకరి పై మరొకరు ప్రత్యక్ష చర్యలకు దిగే పరిస్థితులలోకి దారి తీశాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు తాజాగా ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఏకంగా బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్ ( మహారాష్ట్ర స్టేట్ బీజేపీ ఆఫీసు) అంటూ ప్లెక్సీ కట్టారు. అంతేకాకుండా ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.
పీఎంసీ బ్యాంకు సొమ్ము అక్రమ రవాణా కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన విషయంపై శివసేన మండిపడుతోంది. తమ పార్టీ నాయకులపై బీజేపీ ఈడీని ఉసిగొల్పుతుందని వారు ఆరోపించారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ కూటమిని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, గత సంవత్సరకాలంగా తమను బెదిరిస్తూనే ఉన్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. బీజేపీ పాల్పడుతున్న ఇటువంటి కవ్వింపు చర్యలకు శివసేన భయపడదంటూ ఆధిత్య థాక్రే హెచ్చరించారు.