పవన్ చిడతల నాయుడు.. మెడపై మట్టి నలుపుకుంటాడు
posted on Dec 29, 2020 @ 3:51PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను చిడతల నాయుడు అని సంబోదిస్తూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో దిట్ట అని విమర్శించారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ చిడతలు కొట్టారని విమర్శలు గుప్పించారు. "నేను వైఎస్‌ఆర్‌కు భక్తుడిని. చచ్చిపోతూ కూడా వైఎస్ కుటుంబానికే భజన చేస్తా. డబ్బులు కోసం చిడతలు కొట్టే వాడిని కాదు." అని పేర్ని నాని అన్నారు.
ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 2014లో పంటలు నష్టపోతే మీ జాయింట్ ప్రభుత్వం (టీడీపీ-బీజేపీ)తో ఎంత ఇప్పించావు..? ఏ అసెంబ్లీని ముట్టడించావ్..? అని ప్రశ్నించారు. నువ్వు, నీ పార్టనర్ కలిసి ఇచ్చినదానికంటే ఎక్కువే ఇస్తున్నాం అన్నారు.
గుడివాడ పర్యటనలో భాగంగా నాని అంటే ఎవరో తెలియదన్న పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరు?.. మెడపై మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయనేనా పవన్ అంటే అని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఈయన ఎప్పుడు వకీల్ అయ్యాడు..? ఏ యూనివర్శిటీలో వకీల్ చదివాడు..? అని ఎద్దేవా చేశారు. "జనం పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. పవన్‌ది అంతా సెట్టింగ్‌లు, ప్యాకప్‌లు వ్యవహారమే" అంటూ పవన్ పై మంత్రి విరుచుకుపడ్డారు.