ఏపీ ప్రభుత్వం విచిత్రమైన జీవో.. ఇది కదా పరిపాలనంటే..
posted on Dec 30, 2020 @ 9:42AM
ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక విచిత్రమైన జీవో తీసుకొచ్చింది. కుక్కలు, పందులకు లైసెన్స్‌లు ఉండాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే యజమానికి రూ.500 ఫైన్‌తో పాటు రోజుకు రూ.250 రుసుము వసూలు చేస్తారని జీవోలో పేర్కొంది. ఒకవేళ ఎవరూ వాటి ఓనర్లుగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కులు, పందులుగా పరిగణించి వాటికీ కుటుంబ నియంత్రణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. అంతేకాకుండా లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా వాటికి తిరిగి లైసెన్స్ పొందాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
అంతేకాకుండా లైసెన్స్‌లు పొందే ముందు కుక్కలు, పందుల యజమానులు వాటికి సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్ కూడా అందజేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఇటు కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ అందచేయడం, అటు పందుల విషయంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం అదేశించింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించింది. ఆ టోకెన్లను పెంపుడు జంతువుల మెడలో నిరంతరం వేలాడేలా చూడాలని ఆ ఆదేశాలలో పేర్కొంది.