దారికొస్తున్న సోషల్ మీడియా
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ప్రయోగం, ప్రయోజనం, ఫలితం ఆధారపడి ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా దుర్వినియోగమే ఎక్కువగా ఉందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక మన దేశం విషయం అయితే చెప్పనక్కరలేదు.
ఇతర దేశాలతో పాటుగా మన దేశంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, విమర్శల వ్యాప్తికి సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. అందుకే ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరిగిన, అశాంతి చోటు చేసుకున్నా, శాంతి భద్రతల పరిస్థితి తలెత్తినా,ప్రభుత్వ అధికారులు, వెంటనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా మారింది. రౌడీ షీటర్లు ఇతర సంఘ వ్యతిరేక శక్తుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారో, సోషల్ మీడియా విషయంలో కూడా అలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అగత్యం ఏర్పడుతోంది. అనేక సందర్భాలలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిడం వలన పరిస్థితి వేగంగా అదుపులోకి వచ్చిన సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే, ఇలా భావప్రకటన స్వేచ్చను హరించడం ఎంత వరకు సమంజసం అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే మిగిలింది. అందుకే, మీడియాకు అయినా సోషల్ మీడియాకు అయినా స్వయం నియంత్రణ అనండి చాలా అవసరమని, అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
అదలా ఉంచే మెల్లి మెల్లిగా సామాజిక మాధ్యమ సంస్థల మధ్య పోటీ పెరగడంతో ఆయా సంస్థలు తమ వేదికలు దుర్వినియోగం కాకుండా కట్టడిచేసే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఉదాహరణకు ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ట్విట్టర్ ముందుగా బేఖాతరు చేసింది. అది ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ విధానాని విరుద్ధమని ప్రకటించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం కూ’ యాప్’ను పోటీకి నిలపడంతో, ట్విట్టర్ తలొగ్గక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం అకౌంట్లు, పోస్టులను ట్విట్టర్ బ్లాక్ చేసింది.
ఇదొక ఉదాహరణ మాత్రమే, నిజానికి ఫిర్యాదులతో సంబంధం లేకుండా, సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు నిరంతర పర్యవేక్షణ యంత్రంగాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది చివరి మూడు నెలలలోనే రెండుననర కోట్లు పైగా విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన పోస్టులపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో, సుమారు 184 కోట్ల రోజువారీ వినియోగదారులు ఉన్నారు. నిత్యం కోట్ల సంఖ్యలో వినియోగదారులు ఫేస్‌బుక్ వేదికగా పోస్టులు చేస్తుంటారు. అయితే, వీటిలో విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవడంలో ఫేస్‌బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తుందనే విమర్శలను ఎదుర్కొంది.
ఇక మెసెంజర్, టెలిగ్రామ్ రావడంతో ఫేస్ బుక్ తప్పనిసరి పరిస్థితులలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్వేషపూరిత పోస్టులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు మరిన్ని విధానాలను తీసుకొస్తామని పేస్ బుక్ ప్రకటిస్తోంది. ముఖ్యంగా వార్తా విభాగంలో ఇటువంటి వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రతి పదివేల వ్యూస్‌లో 7 నుంచి 8 విద్వేషపూరిత వ్యూస్ తగ్గినట్లు ఫేస్‌బుక్ ప్రతినిధి గయ్‌రోజన్ వెల్లడించారు. హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ కూడా 0.07 శాతం నుంచి 0.05శాతానికి తగ్గినట్లు తెలిపారు. అంతేకాకుండా యూజర్లు రిపోర్టు చేయకముందే వీటిపై చర్యలు తీసుకునే రేటు 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాను సమాజ హితం కోసం వినియోగించుకోవాలని కోరుకునే వారికి ఇది ఒక శుభ వార్తే కదా...