నాగార్జున సాగర్ బరిలో టీడీపీ! ఆ పార్టీ కోసమేనా?
posted on Feb 13, 2021 @ 3:44PM
తెలంగాణలో పూర్త వైభవం కోసం ప్రయత్నిస్తున్న తెలుగు దేశం పార్టీ.. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. సాగర్ లో మువ్వ అరుణ్ కుమార్ పోటీ చేస్తారని టీటీడీపీ అధికారక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించాకే అభ్యర్థిని ఖరారు చేశారని తెలుస్తోంది. నాగార్జున సాగర్ లో టీడీపీ గతంలో బలంగా ఉండేది. ఇప్పుడు కూడా నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. కేడర్ అలాగే ఉందని చెబుతోంది. అంతేకాదు నాగార్జున సాగర్ పరిధిలో దాదాపు 12 వేల సెటిలర్ ఓటర్లున్నారు. అవన్ని తమకు కలిసి వస్తాయని అంచనా వేసుకుంటున్నారు తెలంగాణ తమ్ముళ్లు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ... దాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తోంది. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో కుదేలైన అధికార పార్టీ.. సాగర్ సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం అయిందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే.. తమకు పట్టున్న సాగర్ ఘన విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇలా అన్ని పార్టీలు సవాల్ గా తీసుకుంటుండగా.. ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తుండటం మరింత ఆసక్తిగా మారింది.
నాగార్జున సాగర్ లో టీడీపీ పోటీ చేస్తే అధికార పార్టీకే ప్లస్ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఓటును చీల్చడానికే కేసీఆర్.. టీడీపీ పోటీ చేసేలా చూస్తున్నారనే ఆరోపణలు కొందరి నుంచి వస్తున్నాయి. బీజేపీ కోసమే టీడీపీ బరిలో ఉంటుందనే మరో చర్చ కూడా జరుగుతోంది. నియోజకవర్గం పరిధిలో ఉన్న సెటిలర్లు గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారని.. ఈసారి వాళ్ల ఓట్లు కారు పార్టీకి వెళ్లకుండా ఉండేందుకే టీడీపీ పోటీ చేస్తుందని చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా... టీడీపీ పోటీ చేస్తుండటంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.