కాంగ్రెస్ టార్గెట్ గా మమత, కేసీఆర్ రాజకీయం! బీజేపీ దూసుకు రావడంతో ఆగమాగం
posted on Feb 13, 2021 @ 1:03PM
ఫస్ట్ బెంగాల్. నెక్ట్స్ తెలంగాణ. బెంగాల్ లో గెలిచి తెలంగాణపై దండయాత్ర. కోల్ కతా వేదికగా అమిత్ షా చేసిన రాజకీయ గర్జన ఇది. రాష్ట్రం కాని రాష్ట్రంలో కమలం బాస్ కామెంట్స్ తో.. తెలంగాణలో ప్రకపంనలు వస్తున్నాయి. అక్కడ కాళీ మాత సాక్షిగా సౌండ్ చేస్తే.. ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో పొలిటికల్ రీసౌండ్ వస్తోంది. బెంగాల్ గడ్డ నుంచి బీజేపీ బిగ్ బాస్ చేసిన వ్యాఖ్యలు కాకతాలీయమేమీ కాదు. పెను సంచలనమే. బెంగాల్ లో జరిగిన రాజకీయ పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ ఇంజనీరింగ్ కు అనేక పోలికలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఆ కంపారిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
బెంగాల్ తో ఏం జరిగింది?
బెంగాల్. ఒకప్పుడు వామపక్షాల ఇలాకా. దశాబ్దాల పాటు ఎర్ర జెండాలదే హవా. సుత్తి, కొడవలిలో ఎర్ర బారిన బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలో గడ్డి పూల పార్టీ విరబూసింది. తృణమూల్ చీఫ్ గా కమ్యూనిస్టు పార్టీలను పాతరేసింది దీదీ. ఎక్కడికక్కడ విపక్షాన్ని తొక్కిపడేస్తూ.. బెంగాల్ లో వామపక్షాల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ఆ అణచివేత కొన్నాళ్ల పాటు తృణమూల్ కు ఆధిపత్యం కల్పించినా.. పరోక్షంగా అది బీజేపీకే ఎక్కువ కలిసొచ్చిందని చెబుతారు. కమలనాథులు బెంగాల్ లో పాగా వేసేందుకు రూట్ క్లియర్ చేసింది మమతేనంటారు. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ ఉన్న కమ్యూనిస్టులు కనుమరుగు అవడంతో.. ఆ పొలిటికల్ స్పేస్ ను కాషాయ దళం ఆక్రమించేసింది. మమతపై ఉన్న వ్యతిరేకత మొత్తం.. బీజేపీ వైపు ఏకీకృతం అవుతోంది. అదే, వామపక్షాలు కాస్తైనా బలంగా ఉండి ఉంటే.. బీజేపీ ఇంతలా ఎదిగేది కాకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం బెంగాల్ లో మమత పార్టీకి ప్రత్యామ్నాయం కమలం మాత్రమే. ప్రజాబలం భారీగా పెరగడంతో.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం దిశగా దూసుకుపోతోంది బీజేపీ. ఇదంతా దీదీ స్వయంకృతాపరాధమే.
బెంగాల్ తో తెలంగాణకు పోలికేంటి?
సేమ్ టూ సేమ్ తెలంగాణలోనూ బెంగాల్ మాదిరే రాజకీయం నడుస్తోందని పోల్చుతున్నారు. బెంగాల్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణేనంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బెంగాల్ లో ఎలాగైతే మమతా బెనర్జీ.. ప్రతిపక్షాలను ఎదగకుండా చేశారో.. ఇక్కడ కేసీఆర్ సైతం కాంగ్రెస్, టీడీపీలను చీల్చి ఆ పార్టీలను బొంద పెట్టే ప్రయత్నం చేశారు. ఒకప్పటి ప్రధాన ప్రతిపక్షాలైన హస్తం, సైకిల్ చతికిలపడటంతో.. కేసీఆర్ వ్యతిరేకులందరికీ బీజేపీ ఆశాకిరణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రాభవం తగ్గడంతో ఇక ప్రతిపక్షం పాత్రలో కమలదళం దూసుకుపోతోంది. బీజేపీకి మిగతా విపక్షాల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో.. అధికార పార్టీతో నేరుగా తలపడుతూ తడాఖా చూపిస్తోంది పువ్వు గుర్తు పార్టీ.
కమలంతో కారుకు కష్టాలేనా?
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కూడా కావడంతో.. బీజేపీకి బలం, బలగం దండిగా ఉంది. అందుకే వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులు.. కేసీఆర్ వ్యతిరేకులంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చక ఆగ్రహంతో ఉన్న వర్గాలన్నీ కాషాయ పార్టీకే జై కొడుతున్నాయి. దుబ్బాక, గ్రేటర్ లో ప్రజాతీర్పు కమలానికి అనుకూలంగా ఉండటానికి ఇదే కారణమంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీలను తొక్కేయడంతోనే.. తెలంగాణలో కమలం విరబూస్తోందని.. బెంగాల్ లో సైతం అచ్చం ఇలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల రాజకీయ రంగ స్థలంలో పాత్రలన్నీ ఒకేలా ఉండటంతో.. బెంగాల్ గెలుపు తర్వాత తెలంగాణే టార్గెట్ అంటూ అమిత్ షా సింహగర్జన చేశారంటూ విశ్లేషిస్తున్నారు. బెంగాల్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ దీదీతో కబడ్డీ అడుకుంటున్న కమలనాథులు.. తెలంగాణలో రాజకీయంగా రాటు దేలిన కేసీఆర్ తో ఏమేరకు నెగ్గుకొస్తారో చూడాలి.