కొడాలి నానికి ఖతర్నాక్ షాక్!
posted on Feb 14, 2021 9:02AM
పంచాయతీ ఎన్నికల్లో ఏపీ మంత్రి కొడాలి నానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. తనకు ఎదురు లేదని చెప్పుకునే నానికి.. ఆయన నియోజకవర్గ ఓటర్లు షాకిచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు సంచలన విజయాలు సాధించారు. మంత్రి కొడాలి ఎన్ని ఎత్తులు వేసినా, బెదిరింపులకు దిగినా.. ఓటర్లు మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో తమ ప్రతాపం చూపించారు.
గుడివాడ నియోజకవర్గంలో 58 పంచాయతీలు ఉండగా.. 20 స్థానాల్లో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌లు విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 32 పంచాయతీలు గెలుచుకోగా.. జనసేన ఒకటి, సీపీఎం ఒకటి, స్వాతంత్ర అభ్యర్థులు నాలుగు పంచాయతీల్లో గెలిచారు. అయితే టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను స్వతంత్రులుగా గలిచామని చెప్పాలంటూ వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను తమ ఖాతాలో వైసీపీ నాయకులు వేసుకుంటున్నారు.
అంతేకాదు కొడాలి నాని సొంతూరు పెదపారుపూడి మండలం యలమర్రులో టీడీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. యలమర్రులో టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కొడాలి నానికి ఊహించని షాక్ అని టీడీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.