కన్న బిడ్డను బ్లేడ్ తో కోసేసింది! రంగారెడ్డి జిల్లాలో కసాయి తల్లి 

అమ్మంటే దేవతకి ప్రతిరూపం అంటారు. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా ఉండదంటారు. బిడ్డలను లాలించి, ప్రేమించడమే అమ్మలకు తెలుసు. కానీ ఓ తల్లి మద్యం మత్తులో కసాయిగా మారింది. కన్నకొడుకుపైనే కిరాతకంగా వ్యవహరించింది. పీకల దాకా మద్యం తాగిన ఆ మహా తల్లి... మద్యం మత్తులో,  ఏం చేస్తుందో కూడా స్పృహ లేకుండా  కుమారుడిపై బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  జరిగిందీ ఈ దారుణ ఘటన.  రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్ మండలం గంధంగూడలో తాగిన మైకంలో ఓ తల్లి కుమారుడిని బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసి గాయపర్చింది. గాయాల బాధను బరించలేని బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెళ్లారు. అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను అడ్డుకుని, బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా తల్లి మద్యం మత్తులో ఉండే ఈ ఘాతుకానికి పాల్పడ్డినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. దాడికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

వేధించిన కుర్రాళ్లకు బుద్ధి చెప్పిన ఎద్దు..   వైరల్ అవుతున్న వీడియో

మూగ జీవాల జోలికి వెళ్ళవద్దు.. వాటిని హింసిస్తే భగవంతుడు కూడా క్షమించడు అంటారు మన పెద్దలు. అయినా కొంతమంది ప్రబుద్ధులు తమ రాక్షస ఆనందం కోసం అమాయకమైన జంతువులను హింసిస్తూనే ఉంటారు. ఇటువంటి వారు మనకు మంచి చేసే మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంటారు. మనదేశంలో ఎన్ని జంతు పరిరక్షణ చట్టాలు ఉన్నా ఇలాంటి వారి నుండి ఈ మూగ ప్రాణులను మాత్రం కాపాడలేకపోతున్నాయి. అయితే ఇలాంటి వారిపైకి ఒక్కోసారి ఆ జంతువులే తిరగబడి తమను వేధిస్తున్న వారిని శిక్షించిన ఘటనలు కొన్ని మనం చూశాం తాజాగా ఇలాంటి ఘటన కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే.. ఇద్దరు యువకులు చెట్టు కొమ్మల మధ్య ఓ ఎద్దు తలను ఉంచి దాన్ని తీవ్రంగా వేధించారు. దాని కొమ్మలను పట్టి లాగుతూ దాని తలకు గాయమయ్యేలా చేసి వారు రాక్షసానందం పొందారు. ఇలా ఆ యువకులు చాలాసార్లు చేశారు. అంతేకాకుండా తమ క్రూరత్వాన్ని వారు వీడీయో కూడా తీశారు. అయితే ఆ యువకుల హింస మితిమీరడంతో ఆ ఎద్దు ఆగ్రహించి.. ఒక్కసారిగా వారి మీదకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఇద్దరిని తన కొమ్ములతో గుద్ది కింద పడేసింది. అక్కడి నుండి వేగంగా పరుగెత్తి తనను తాను రక్షించుకుంది. ఈ వీడియోను అవనీశ్ శరణ్​ అనే ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మంచితనానికి ఇవి రోజులు కావు" అంటూ అయన ఆ వీడియోకు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు . తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనకు పాల్పడ్డ యువకులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేధించిన యువకుల తిక్కను ఆ ఎద్దు బాగా కుదిర్చిందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట కొంత మంది శాడిస్టులు ఇలా జంతువులను వేధించడం మామూలైపోయిందని, ఇలా చేసే వారికి తప్పకుండ శిక్ష పడాల్సిందేనని కామెంట్లు పెట్టారు.

సెంచరీ కొట్టిన పెట్రోల్..  హెల్మెట్ పైకి ఎత్తి నిరసన! 

దేశంలో చమరు ధరలు అకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో  ఇప్పటికే పెట్రోల్ రేట్ సెంచరీ మార్క్ దాటగా.. తాజాగా  భోపాల్‌లో ప్రీమియం పెట్రోల్ ధర లీటరు వంద రూపాయలు  దాటేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇతర నగరాల్లోనూ ఇంధనం ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి. పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేయడంపై వాహనదారులను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భోపాల్ లో ఓ వాహనదారుడు వినూత్న నిరసన తెలిపారు. ఒక పెట్రోల్ పంప్ వద్ద ఒక చేత్తో హెల్మెట్, మరో చేతితో బ్యాట్ ధరించి 'సెంచరీ' సంకేతమిచ్చాడు.         పెట్రోల్, డీజిల్ ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతుండటంతో వినియోగదారుల గుండెల్లో మరిన్ని రైళ్లు పరిగెడుతున్నాయి. చమురు ధరలపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పులుగా పోస్టులు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. 'కఠోర శ్రమ, పోరాటంతో ఎట్టకేలకు పెట్రోల్‌ సెంచరీ చేసింది' అంటూ ఒక ట్విట్టర్ యూజర్ భోపాల్ యువకుడి ఫోటోను షేర్ చేశాడు. పెట్రోల్ ప్రైజ్ అంటూ దానికి హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.పెట్రోల్ ధర రూ.100కు చేరువైనందున భారత్ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతోందంటూ ట్విట్టర్ లో వ్యంగ్యోక్తులు సంధించాడు. 

వారి కోసం నా ప్రాణమైనా ఇస్తా... బాలకృష్ణ సంచలనం

ఏపీలో జరుగుతున్న అరాచకాలపై టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మద్దతుదారులపై అధికార వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అసలు నామినేషన్లు కూడా వేయవద్దని బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామాలలోని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందుపూరానికి వెళ్లి.. టీడీపీ మద్దతుదారులు, వారి కుటుంబాలను, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "‘కార్యకర్తల కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారికోసం నా ప్రాణాన్ని ఫణంగా పెడతా. రాష్ట్రమంతా వైసిపి నాయకులు భయాందోళనలు సృష్టిస్తున్నారు..వాళ్ళ అఘాయిత్యాలకు అడ్డుకట్టవేసే వాళ్లు లేరనుకుంటున్నారు. దీనిపై నేను హెచ్చరిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం. కార్యర్తలు అందరు సమాయత్తంగా ఉండండి. ఒకాయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉక్కు కారాగారం అంటాడు. సీబీఐ కేసులలో ఇరుక్కుని జైలుకు వెళ్లి కారాగారం పదం బాగా అలవాటైంది. పోటీచేసే అభ్యర్థుల కుటుంబీకులు ఆఘాయిత్యాలకు పాల్పడేలా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది" అని బాలకృష్ణ వాసిపై సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అరాచకాలు పెరిగిపోతుండడం పై గత కొంత కాలంగా బాలకృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేస్తుండడంతో ఒక పక్క వైసిపి నేతలు కొంత వెనక్కు తగ్గుతుండగా.. మరోపక్క టీడీపీ కేడర్ లో మానసిక స్థైర్యం పెరుగుతోంది.

టీడీపీ నేత దీక్ష భగ్నం! విశాఖలో హై టెన్షన్

విశాఖపట్నంలో హై టెన్షన్ నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లాకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖ రానున్నారు. చంద్రబాబు నగరానికి రావడానికి ముందే పోలీసులు పల్లా దీక్షను భగ్నం చేశారు. దీక్ష శిబిరం నుంచి ఆయనను బలవంతంగా కృషి ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తరలింపును అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలోనే పల్లా దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పల్లా పరిస్ధితిని చూసి మహిళా కార్యకర్తలు కంటతడిపెడుతున్నారు. చంద్రబాబు వస్తున్నారనే దీక్షను భగ్నం చేశారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావుకు అమరావతి రైతులు మద్దతు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్న మహిళా రైతులు నేరుగా దీక్షా శిబిరానికి వెళ్లి శ్రీనివాస్ రావు మద్దతు ప్రకటించి, సంఘీభావం తెలిపారు.

టీడీపీకి ఓటేశారని ఇంటి మెట్లను కూల్చేశారు!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. అధికారులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారని, టీడీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది.  తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది.    నరసరావుపేట మండలం ఇసప్పాలెం పంచాయతీలో అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయలేదన్న కారణంతో ఓ వీధిలో బిల్డర్ నిర్మించిన పది ఇంటి మెట్లను కూల్చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయాలని తమపై ఒత్తిడి చేశారని, వేయకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  రొంపిచర్ల మండలంలోని గోగులపాడుకు చెందిన జవ్వాజి రమేశ్ బిల్డర్.. ఏడాది క్రితం ఇసప్పాలెంలోని సరస్వతి శిశుమందిర్ సమీపంలో పది ఇళ్లు నిర్మించి అందులో కొన్నింటిని విక్రయించాడు. అందులోని ఓ ఇంట్లో రమేశ్ కుటుంబం నివసిస్తోంది.  గోగులపాడు సర్పంచ్ ఎన్నికల్లో రమేశ్ బంధువులు టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేశారని తెలిసి తనపై గ్రామ పెద్దలు కక్ష కట్టారని, ప్రజా ప్రతినిధితో ఒత్తిడి తెచ్చి తాను నిర్మించిన ఇళ్ల మెట్లను కూల్చివేశారని రమేశ్ ఆరోపించారు. కూల్చివేత సమయంలో తాను ఇంట్లో లేనని, తన అత్తమామలు జేసీబీకి అడ్డంపడినా ప్రయోజనం లేకపోయిందని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.తాను నిర్మించిన ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఇంటి ముందు మెట్లు, ర్యాంపులను కూల్చివేశారన్నారు. విషయం తెలిసి ఇంటికి వచ్చి అధికారులను ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఆయనతో మాట్లాడుకోవాలని చెప్పారని రమేశ్ వాపోయారు.

షర్మిల పార్టీలోకి మాజీ ఎమ్మెల్సీ! 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల  మరింత దూకుడు పెంచారు. పార్టీ ఏర్పాట్లపై ఆమె కీలక సమావేశాలు జరుపుతున్నారు.  భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆమె జిల్లాల పర్యటన కూడా ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు షర్మిల సిద్దమవుతున్నారని తెలుస్తోంది. షర్మిల పార్టీకి మద్దతు కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. గతంలో వైఎస్ తో సన్నిహితంగా ఉన్న నాయకులంతా షర్మిలతో టచ్ లోకి వస్తున్నారని తెలుస్తోంది.  షర్మిలను మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కలిసి  చర్చలు జరిపారు.  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న  సమయంలో  రంగారెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి అత్యంత సన్నిహితుడు. అతను షర్మిలతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన రంగారెడ్డి.. మర్యాదపూర్వకంగానే షర్మిలను కలిశానని చెప్పారు.షర్మిల గురించి కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు.  వైయస్ ఈ లోకంలో లేకపోయినా, వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి. వైఎస్ బతికున్నప్పుడు ఆయన కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు.. ఆయనను విమర్శించడం సరికాదని అన్నారు. షర్మిలపై అవాకులు, చెవాకులు మాట్లాడొద్దని తమ పార్టీ నేతలకు సూచిస్తున్నానని చెప్పారు మాగం రంగారెడ్డి. దీంతో షర్మిల పార్టీలో మాగం రంగారెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారనే చర్చ జరుగుతోంది.  

విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు కు పింక్ డైమండ్ షాక్ 

ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ను బదనాం చేసేందుకు ఆ ఇద్దరు తీవ్రంగా కృషి చేసారు ఈ పింక్ డైమండ్ పేరుతొ సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడిని కూడా రాజకీయ వివాదాల్లోకి లాగారు. టీటీడీపై నిందలు వేయడంతోపాటు .. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడంతో టీటీడీ రూ. రెండుకోట్ల ఫీజు కట్టి మరీ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై చెరో వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. అయితే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత.. టీటీడీ ఆ కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో కోర్టులో ఉపసంహరణ పిటిషన్ కూడా టీటీడీ దాఖలు చేసిన నేపథ్యంలో కేసును విత్ డ్రా చేసుకోడానికి వీల్లేదని, కేసులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని తెలంగాణ హిందూ జనశక్తితోపాటు, మరో న్యాయవాది పిటిషన్ వేశారు. టీటీడీతోపాటు పార్టీలుగా ఉండడానికి తిరుపతి పదవ అదనపు జడ్జి అనుమతించారు. దీంతో ఈకేసులో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. తాజా పరిణామాలను బట్టి ఈ కేసు టీటీడీ పరిధిని దాటిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డికి ఈకేసులో షాక్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.    

ఫాస్టాగ్ కంపల్సరీ ఓకే ! వాలెట్ లో నిధులకు భద్రతేది? 

సమయం ఆదా.. ఇంధనం మిగులు.. వీటితో  పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కోసం ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 16 నుంచి అన్ని వాహనాలకు కంపల్సరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనానికి డబుల్ ఛార్జీ వసూల్ చేస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండం వల్ల గతంలో ఇంధనంతో పాటు ప్రయాణికుల సమయం వృథా అయ్యేదని.. వీటిని అధిగమించేందుకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేశామని కేంద్రం చెబుతోంది. అయితే ఫాస్టాగ్ తో ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నిధుల విషయంలో వాహనదారుల నుంచి చాలా సందేహాలు,  అభ్యంతరాలు వస్తున్నాయి.  ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కలిగి ఉన్న ప్రభుత్వం అందించే ట్యాగ్. టోల్ కట్టాల్సిన అన్ని పెద్ద వాహనాలు FASTagను వాహనం మీద విండ్ షీల్డ్‌పై అతికిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే అక్కడ ఉండే RFID రీడర్ FASTagను స్కాన్ చేసి వివరాలు పరిశీలిస్తుంది. ఈ ట్యాగ్‌పై వాహనదారులు అందించిన ఖాతా నుంచి టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. SMS ద్వారా మీకు సమాచారం లభిస్తుంది. ప్ర‌స్తుతం గుర్తింపు ఉన్న బ్యాంకులు, పేటీఎం వంటి డిజిట‌ల్ వాలెట్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నాయి.  వాహనం వివ‌రాల‌ను న‌మోదు చేసి సంబంధిత కేవైసీ ప‌త్రాల‌తో ఫాస్టాగ్‌కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ప‌త్రాల వెరిఫికేష‌న్ పూర్త‌యి ఫాస్టాగ్ వ‌స్తుంది. దాన్ని వాహ‌నంపై నిర్దిష్ట‌మైన భాగంలో అతికించాలి. ఇక ఫాస్టాగ్‌కు క‌నెక్ట్ అయి ఉండే డిజిట‌ల్ వాలెట్‌లో న‌గ‌దును లోడ్ చేయాలి. దీంతో టోల్ ప్లాజాల గుండా వెళ్లిన‌ప్పుడు న‌గ‌దు ఆటోమేటిగ్గా క‌ట్ అవుతుంది. దీనిలో వినియోగదారులు  కనీసం 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి. మీరు KYC చేసిన ఫాస్టాగ్ ఖాతాలో  100,000 రూపాయల వరకు ఉంచవచ్చు.  ఇప్పుడు దీనిపైనే వినియోగదారుల నుంచి సందేహాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ  దాదాపు 3  కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశామని కేంద్రం చెబుతోంది. వాహనదారులు కూడా తమ ఫాస్టాగ్ అకౌంట్ లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో లోడ్ చేస్తున్నారు. కోట్లాది మంది వాహనదారులు రీచార్జ్ చేస్తున్న వేల కోట్ల రూపాయల డబ్బు.. ఎవరి ఖాతాలో ఉంటుంది.. వాటికి భద్రత ఏంటన్న చర్చ వస్తోంది. వాహనదారులు ఫాస్టాగ్ లో లోడ్ చేసిన అమౌంట్ కు జవాబుదారి ఎవరూ... అది మిసి యూజ్ అయ్యే అవకాశం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కొన్ని సార్లు ఫాస్టాగ్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్ అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రిటర్ జర్నీ డబ్బులు కూడా ముందే కట్ తీసేసుకుంటున్నారని చెబుతున్నారు. కట్టాల్సిన టోల్ కంటే డబుల్ చార్జీ కొన్ని సార్లు పేమెంట్ అవుతుందని కూడా తెలుస్తోంది. ఈ సమస్యలపై అడగడానికి సరైన ఫ్లాట్ ఫామ్ లేదనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వస్తున్నాయి.  రెగ్యులర్ గా  వినియోగించేవారితో సమస్య లేకున్నా... అప్పుడప్పుడు వాహనాల్లో తిరిగేవారి విషయంలోనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఫోర్ వీలర్ ఉన్నవారందరికి కంపల్సరి కావడంతో అంతా ఫాస్టాగ్ తీసుకుంటున్నారు. అయితే ఎక్కువగా బయటికి వెళ్లని వారు ఫాస్టాగ్ లో జమ చేసిన నిల్వ చాలా కాలంపాటు అలాగే ఉండిపోతోంది. ఇలాంటి ఖాతాలు లక్షల్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే వందల కోట్ల రూపాయలు అలా ఉంటాయన్న మాట. ఆ డబ్బులకు ఇంట్రెస్ట్ కూడా రాదు. అదే బ్యాంకుల్లో మనం జమ చేసిన డబ్బుకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాలెట్లలో మనం జమ చేసిన డబ్బును.. దేనికైనా వాడుకోవచ్చు. కాని ఫాస్టాగ్ కోసం రీచార్జ్ చేసిన డబ్బును... కేవలం టోల్ ప్లాజా దగ్గర మాత్రమే వినియోగించుకోవాలి. మనం టోల్ ప్లాజా ద్వారా వెళ్లనప్పుడు ఆ డబ్బంతా ఖాతాలో వృధాగనే ఉండిపోతుంది.            దేశంలో ఇప్పటికే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. డీజీల్ కూడా అదే దారిలో ఉంది. ఎల్పీజీ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫాస్టాగ్ అదనపు భారంగా మారిందనే అభిప్రాయం వాహనదారుల నుంచి వస్తోంది. అయితే ఫాస్టాగ్ తో మనం ఎంత రీచార్జ్ చేసుకున్నా సమస్య ఉండదని, మనం వాడుకుంటేనే అది ఖర్చు అవుతుందని, మిగిలినదంతా వాలెట్ లో భద్రంగానే ఉంటుందని ఫాస్టార్ సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాలెట్ల మాదిరిగానే ఇది పని చేస్తుందని, దీనిపై ఎవరికి సందేహాలు ఉండాల్సిన పని లేదని స్పష్టం చేస్తున్నారు.   

వాట్స్ యాప్ పై సుప్రీమ్ వేటు..

ఇండియాలో ప్రజల భద్రత కోసం ప్రైవసీ యాప్ పై సుప్రీం కొత్త చట్టం తేనుందా.. ఒకపుడు సీక్రెట్స్ నాలుగు గోడల మధ్యనో .. ఇద్దరి వ్యక్తుల మధ్యనో ఉండేవి,  కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చిందో.. సీక్రెట్స్ కి చోటులేకుండా పోయింది.. అంతరంగం లో ఉండాల్సిన విషయాలు.. వార్తలుగా బహిర్గతం అవుతున్నాయి.. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే సుప్రీమ్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి.   ప్రజలు  ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్, దానికి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇటీవల  ప్రవేశపెట్టిన వాట్స్ యాప్ నూతన విధానంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మీ సంస్థ రెండు లేదా మూడు ట్రిలియన్ డాలర్ల సంస్థ కావచ్చు... కానీ మీ కంటే దేశ ప్రజల గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ప్రజల గోప్యతను కాపాడటంలో సుప్రీమ్ కోర్టు మరోసారి తన బాధ్యత అని స్పష్టం చేసింది. ప్రజలకు భద్రత లేకపోవడంతో  ఆందోళన చెందుతున్నారని వివరించింది. ఎవరికైనా మెసేజ్ పంపితే అది ఫేస్ బుక్ కు అందుబాటులో ఉంటోందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పింది. విచారణ సందర్భంగా ఫేస్ బుక్, వాట్సాప్ తరపున కపిల్ సిబాల్ వాదిస్తూ... నూతన గోప్యతా విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు వెళ్లదని అన్నారు. ప్రైవసీపై యూరప్ లో ఒక ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టాలనే తీసుకొస్తే, దాన్ని అనుసరించడం జరుగుతుందని చెప్పారు.

ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ 

దేశంలో గత మూడు రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే 3 వేలకు పైగా యాక్టివ్ కేసులు పెరిగాయని, ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఆదివారం 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో... అలర్ట్ ప్రకటించారు. కేరళలోనూ కరోనా ఉధృతి కొనసాగుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రి  విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆదివారం వడోదర ఎన్నికల ప్రచారంలో ఆయన అస్వస్థకు గురయ్యారు. వడోదరలోని నిజాంపురలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ వేదిక మీదే ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను అధికారులు యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. విజయ్ రూపానీకి వైద్యులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు వైద్యులు  హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.  ముఖ్యమంత్రి విజయ్  రూపానీకి కరోనా సోకిందని డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ ప్రకటించారు. ఆయన ప్రతిరోజూ ప్రజలను కలుస్తుంటారని, అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా సభలకూ హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాస్త బలహీనంగా ఉండటంతో సభలో ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయారని ఆయన తెలిపారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని, కరోనా పాజిటివ్ అని తేలిందని డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పాటిల్ తెలిపారు.  గుజరాత్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల జరుగుతున్నాయి. వడోదర సమీపంలోని నిజామ్ పురాలో జరిగిన సభకు సీఎం విజయ్ రూపాని హాజరయ్యారు. ఆయన సభలో  ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. ముఖ్యమంత్రి పడిపోవడంతో, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆయనకు వేదికపైగా ప్రథమ చికిత్స చేసి వెంటనే అహ్మదాబాద్ కు తరలించి ఆసుపత్రిలో చేర్చారు

ఓటమి భయంతోనే దాడులు! వైసీపీపై చంద్రబాబు నిప్పులు 

పంచాయితీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తుండంతో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజల్లో టీడీపీకి ఆదరణ లభిస్తుందని.. పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కి పట్టం కడితే తమ ఆటలు సాగవనే.. వైసీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.. వైసీపీ ఎన్ని అవాంఛనీయమైన పనులు చేసిన ప్రజలు వాటిని తిప్పికొడుతూ టీడీపీ కి మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు.  అధికార పంతం కోసం రాష్ట్రాన్ని ఎప్పుడు లేని విధంగా రావణకాష్టంగా మారుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. క్రోసూరులో టీడీపీ నేతల అక్రమ అరెస్ట్, పులివెందులలో పంట పొలాలను  వైసీపీ నేతలు నాశనం చేయడంపై చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి పచ్చగా ఉన్నరాష్ట్రంలో  విద్వేషం, విధ్వంసాలతో వైసీపీ నేతలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని చంద్ర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజాబలం పెరుగుతుండటంతో.. అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల ఉదాసీనతతో రాష్ట్రంలో వైసీపీ గూండాల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఆవులవారిపాలెంలో అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు.  పులివెందులలో పంట పొలాలను నాశనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  

మున్సిపోల్స్ కు కొత్త నోటిఫికేషన్ ! ఎస్ఈసీకి జనసేన వినతి 

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది ఎన్నికల సంఘం.  మార్చి 10న 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది. గత మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై... కరోనా కారణంగా నిలిచిపోయింది.  గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను  కొన‌సాగుతుందని ఎస్ఈసీ ప్రకటించింది. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఎస్ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  మున్సిపల్‌ నామినేషన్ ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభిస్తే.. అందరికీ న్యాయం జరుగుతుందని  జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌  అన్నారు. గతంలో జరిగిన  మున్సిపల్‌ నామినేషన్ ప్రక్రియ ప్రజాస్వామ్య బద్దంగా లేదన్నారు. నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ మరోసారి ఆలోచించాలని నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు.  ఆనాడు వైసీపీ నేతలు చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారని మనోహర్ తెలిపారు.ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి వైసీపీ నేతలు నామినేషన్ వేశారని చెప్పారు. అవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్లీ ఆగిన చోటినుంచి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఇదే విధానం కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని తాము ఆశించడం లేదన్నారు. రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా జరుగుతున్న ఎన్నికలను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించాలని కోరారు.  సామాన్యులకు ధైర్యం నింపేలా, అభ్యర్థులకు అండగా ఉండేలా ఈ ఎన్నికలు ఉండాలన్నారు నాదేండ్ల మనోహర్. జనసేన అభ్యర్థులకు అండగా నిలుస్తామన్నారు. వైసీపీ నేతలు తమ స్వలాభం కోసం వాలంటీర్లను రాజకీయాలకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ స్లిప్పులపై పథకాల పేర్లు రాసి నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎస్ఈసీ మరోసారి మున్సిపల్‌ నామినేషన్ ప్రక్రియపై పునరాలోచించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.  

ఏపీ పంచాయతీలో కేంద్రం జోక్యం ?

ఆంధ్ర ప్రదేశ్’లో జరుగతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో గత మార్చిలో జరగవలసిన ఎన్నికలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ఆ వాయిదా వివాదంగా  మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వాయిదా రగిల్చిన వివాదం అప్పటికి నుంచి ఇప్పటివరకు అలా రగులుతూనే వుంది. సాగుతూనే వుంది. చివరకు చిలికిచిలికి గాలివానగా మారింది. రాజ్యాంగ సంక్షోభానికిదారి తీస్తుందా అన్నంతగా పరిస్థితులు దిగజారాయి.కోర్టులు, కేసులు,విచారణలు,తీర్పులు ఇలా అనేక మరకల మలుపులు తిరిగి చివరకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో గత నెలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికి రెండు విడతల పోలింగ్ జరిగింది. మరో రెండు విడతల పోలింగ్ జరగవలసి వుంది. అయితే, అసలే కోతి ఆపైన కల్లు తాగింది అన్నట్లుగా,దిగజారుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం,అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓవంక సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించి, సాధ్యమైన మేరకు ఏకగ్రీవాలు కాని చేస్తోంది.అలా ఎన్నికల క్రతువును ‘మమ’ అనిపించి ఫలితాలను తమ ఖాతాలో కలిపేసుకుంటోంది.పార్టీ నాయకులు 80 నుంచి 90-95 శాతం గ్రామ పంచాయతీలలో అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు గెలిచారని డప్పు కొట్టుకుంటున్నారు.నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలలో పార్టీ ప్రమేయం అనేది ఉండనే ఉండదు. పార్టీలు, జెండాలు, గుర్తులు ఇవేవీ పంచాయతీ ఎన్నికలలో కనిపించవు. కనిపించకూడదు. అయినా, అధికార పార్టీ వాపు  చూసి బలుపనుకుంటుందో ఏమో గానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అద్భుత  పాలనను చూసి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని, అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అదెలాఉన్నా, ఎన్నికల అక్రమాలపై, ప్రధాన ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం, బీజీపే, జన సేన పార్టీలు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నాయి. తెలుగు దేశం పార్టీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై ఫిర్యాదు చేసినా ఎస్ఈసీ స్పందించడం లేదంటూ.. రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్న ఆయన.. కేంద్ర అధికారులు, బలగాలతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని లేఖలో కోరారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకులు అక్రమాలకు, దారుణాలకు పాల్పడుతున్నారని.. కొందరు అధికారులు, పోలీసులు వారికి కొమ్ము కాస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ అంశంపై రాష్ట్రపతి, సీఈసీ , కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశారు. ప్రభుత్వ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని.. బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపించిన బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి మమకారం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ అంశాలన్నింటిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని వీర్రాజు వెల్లడించారు. అలాగే, జనసేన కూడా పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పరిజసించే విధంగా సాగుతున్నాయని ఆరోపించారు   ప్రభుత్వం చాలా దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మనోహర్‌ అన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అలాగే, అధికార పార్టీ అసమ్మతి నాయకుడు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో ఇతర అంశాలతో పాటుగా పంచాయతీ ఎన్నికల ప్రహసనం గురించి కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందా ... అంటే .. అనుమానమే.

సీఎం జగన్‌కు సన్న గడ్డి.. క్యూలో అక్క చెల్లెమ్మలు!

ఎపిలోని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం, అలాగే రేషన్ డోర్ డెలివరీ పై టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ సెటైలరు వేశారు. ప్రభుత్వం ఇచ్చే రేష‌న్ బియ్యం, ఇతర స‌రుకులు ఇచ్చే చౌక‌ధ‌ర‌ల దుకాణం వ‌ద్ద ప్ర‌జ‌లు క్యూ‌ల్లో నిల‌బ‌డి ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు, అలాగే స‌రుకుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తొల‌గించ‌డానికి ఏపీలోని జగన్ సర్కారు రేషన్ డోర్ డెలివ‌రీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, దీని వ‌ల్ల ప్ర‌జ‌లు మ‌రిన్ని ఇబ్బందులు పడుతున్నారంటూ లోకేశ్ తాజాగా ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. "ప్రభుత్వ పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే. సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు' అని నారా లోకేశ్ తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా "డోర్ డెలివరీ మాయలోడు జ‌గ‌న్ కనపడితే సన్న గడ్డి పెట్టడానికి అక్క చెల్లెమ్మలు క్యూలో రెడీగా ఉన్నారు" అని నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

గులాబీలో కొత్త పార్టీ కలకలం! కులాల కుంపట్లతో ఆగమాగం

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అన్యోపదేశంగానే అయినా  కొత్త పార్టీ పెట్టడం అంత తేలిక కాదు అంటూ ఒక హెచ్చరిక లాంటి వ్యాఖ్య చేశారు. అలాగే పార్టీ పెట్టి భంగపడిన ఆలే నరేంద్ర, దేవేందర్ గౌడ్, విజయశాంతి అనుభవాలను కూడా కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అలాంటి హితబోధ చేశారన్నది పక్కన పెడితే..  తాజాగా  తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి తారక రామా రావు, తమ సొంత నియోజక వర్గం సిరిసిల్లలో పార్టీ కార్యకర్తలను  ఉద్దేశించి ప్రసంగిస్తూ, “తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడి బతికి బట్టకట్టిన పార్టీలు రెండే రెండు, ఒకటి ఎన్టీర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ, రెండు కేసీఆర్ స్థాపించిన తెరాస పార్టీ”అంటూ ఇతర పార్టీలు అన్నీ పుబ్బలో పుట్టి మఖలో మాయమైన పార్టీలే అని అన్నారు.అంటే  ఎవరికైనా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలాంటిది ఏదైనా ఉంటే, ఆ ఆలోచనలు పక్కన పెట్టండి అని కేటీఆర్ తమ స్టైల్లో  చెప్పకనే చెప్పారు.  ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరూ వేర్వేరు సందర్భాలలో  కొత్త పార్టీల ప్రస్తావన చేయడం కేవలం యాదృచ్చికమా లేక గుండెల్లో చేరిన గుబులు వారి చేత అలాంటి పలుకులు పలికించిందా అంటే.. రెండోదే ఖాయం చేసుకోమనే మాట పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.  అలాగే ఇదేదో యాదృచ్చికంగా చేసిన వ్యాఖ్య కాదనే వాళ్ళు లేక పోలేదు. నిప్పులేనితే పొగరాదు, అన్నట్లుగా ఎక్కడో ఎదో జరుగుతోంది,ఆ వంటకం తాలూకు మసాలా ఘాటు తండ్రీకొడుకులను ఉక్కిబిక్కిరి చేస్తోంది, అందుకే కేసీఆర్, కేటీఆర్’ కొత్త పార్టీల ప్రస్తావన చేశారని అనే వాళ్ళున్నారు.  రాజకీయ విశ్లేషకులు  కూడా కొత్త పార్టీ ఏర్పాటు విషయంగా నిజానిజాలు ఎలా ఉన్నా, తెరాసలో ముసలం పుట్టింది, సంకుల సమరానికి కుంపట్లు రాజుకుంటున్నాయని చెబుతున్నారు. .తండ్రీ కొడుకులు, అన్నా  చెల్లెలు, బావ బామ్మర్డులు ఇలా ఎవరెవరి మధ్య ఏమేమీ జరుగుతోందో ఏమో గానీ,అధికార పార్టీ అధికార కేంద్రాలు  ప్రగతి భవన్, తెరాస భవన్, ఫార్మ్ హౌస్ లో ఎదో జరుగుతోందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.     సరే లోపలి శక్తుల కుమ్ములాటల విషయం పక్కన పెట్టినా.. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ ఇలా కలవరపాటుకు గురి చేస్తున్న ఆ ‘కొత్త’ హీరో’, విలన్, కంటికి కనపడని ఆ నాలుగో సింహం ఎవరు? గతంలోనే ‘గులాబీ జెండా ఓనర్లం’ అంటూ తొడకొట్టిన బీసీ నాయకులా?.. ఇస్తానన్న ముఖ్యమంత్రి  పదివి ఇవ్వకపోతే ఇవ్వక పాయే, కనీసం మంత్రి వర్గంలో సముచిత స్థానం అయినా ఇవ్వరా,ఇచ్చిన పదవుల నుంచి అవమానకరంగా బయటకు పపంపడం, చివరకు అస్మేదీయ ఎమ్మెల్ల్యేలు , నాయకుల చేత, అధికారుల మీద పెట్టి, ఎస్సీ,ఎస్టీ నాయకులను, ‘అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికిరారు’ అనిపించి అవమానించడం ఏమిటీ? ఇదెక్కడి అన్యాయం అని గుండెను చెరువు చేసుకుని, లోలోన రోదిస్తున్న దళిత బహుజనులా... అగ్రవర్ణాలలోని అణగారిన వర్గాల ప్రతినిధులా .. అంటే అందరూ .. అన్యాయాలకు, అవమానాలకు గురవుతున్నామన్న అన్ని కులాలు, అన్ని  వర్గాల ప్రజలు ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక ఏర్పాటు ప్రయత్నాలలో ఉన్నారని అంటున్నారు.    నిజానికి కేసీఆర్ ను, ఆయన నాయకత్వాన్ని ఎవరూ ఏనాడూ ప్రశ్నించలేదు. మంచైనా చెడైనా రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఆయన్ని, అన్ని వర్గాల ప్రజలు గౌరవించారు. కానీ, ఎప్పుడైతే కొడుకు కేటీఆర్’  తండ్రి చెప్పుల్లో కళ్ళు పెట్టారో, ఎప్పుడైతే సీనియర్లను, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర  బడుగు, బలహీన వర్గాల నాయకుల ప్రాధాన్యతను తగ్గిచడం మొదలైందో, అప్పుడే పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. బడుగు,బలహీన వర్గాలకు బర్రెలు, గొర్రెలు ఎరగా వేసి,ఆవర్గాల నాయకులను అధికార కేంద్రాలకు దూరం చేయడంతో బడుగు బలహీన వర్గాలు, అధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు వైపు అడుకులు వేస్తున్నారు. ఆ అడుగుల చప్పుడుకే, తండ్రీ కొడుకులు ఉలిక్కి పడుతున్నారు.  మరో వంక దక్షిణాదిలో పట్టు కోసం, విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ కొత్త శక్తుల పునరేకీకరణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొలకత్తాలో కేంద్ర హోం మంత్రి, అమిత్ షా, బెంగాళ తర్వాతి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించడం ఇందులో భాగంగానే కొందరు అనుమానిస్తున్నారు. అయితే  ఎవరు ఎమన్నా, కేసీఆర్ అన్నట్లుగా  కొత్త పార్టీ పెట్టండం, పెట్టిన పార్టీని బతికించుకోవడం, అంత ఈజీ యవ్వారం అయితే కాదు. కానీ, రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును. కొయ్యాగుర్రం ఎగరావచ్చు .. 

మే14న  షర్మిల పార్టీ జెండా.. ఎజెండా..  

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె,  షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. పార్టీ ఆవిష్కరణకు షర్మిల రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మే 14న .. లేదా జూలై 8న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మే 14 కు ఒక సెంటిమెంట్ ఉంది.. గతంలో  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసింది మే 14నే..  అందుకే ఆ రోజును షర్మిల సెంటిమెంట్ గా భావిస్తున్నారని..  మే 14న పార్టీ జెండా అజెండా ప్రారంభిస్తే పచ్చ జెండా ఊపి పాదయాత్ర లకు వెల్లొచ్చని ముఖ్య నేతలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. జులై 8న కూడా షర్మిల ఆలోచిస్తున్నారని ఆరోజు రాజశేఖర్ రెడ్డి జయంతి కావడం వాళ్ళ అదే రోజు  పార్టీ జెండా, ఎజెండా విడుదలకు ముహూర్తం గా  షర్మిల అనుకుంటుంటారని. అయితే జూలై 8 నాటికి ఆలస్యం అవుతుందని ముఖ్యనేతలు చెబుతున్నట్లు తెలియవచ్చింది. కాగా రెండు తేదీల్లో ఒకదానిని ఫైనల్ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం. చూడాలి  వైఎస్ ప్రమాణ స్వీకారం రోజునా లేక వైఎస్ జయంతి రోజునా షర్మిల పార్టీ జెండా, ఎజెండా..   

కేసీఆర్ కు చలి జ్వరం! ఎందుకో తెలుసా..

తెలంగాణ రాజకీయాల్లో  మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, విపక్ష నాయకులు వ్యక్తిగత దూషణలతో మంటలు రేపుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్నారు. రైతు దీక్షలతో దూకుడు పెంచిన హస్తం లీడర్లు.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ కేడర్ లో జోష్ నింపుతున్నారు.  తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌..  కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వంత పాడుతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌.. ప్రధాని మోడీని కలిశాక చలి జ్వరంతో ఫామ్‌హౌజ్‌ చేరుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులను కంటతడి పెట్టిస్తున్న మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌కు రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను లాక్కుని బహుళజాతి కంపెనీలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. ప్రజలకు, భూమికి హాని కలిగించే  ఫార్మాసిటీని అడ్డుకునేందుకు రైతుల పక్షాన కాంగ్రెస్‌ నిలుస్తుందని తెలిపారు.  చాయ్‌వాలా, మందువాలా జతకట్టి కుట్ర రాజకీయాలు సాగిస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ రేవంత్‌ చేపట్టిన రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర 9వ రోజు కొనసాగుతోంది.  ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాలలో బస చేశారు రేవంత్ రెడ్డి . మంగళవారం రావిరాలలో పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సభకు జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి రైతు ఎజెండాతో ఉప్పెనలా కదిలిరావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. రావిరాల బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.   

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీ సర్కార్ మెడలు వంచి పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎస్ఈసీ. మార్చి 10న ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.  మార్చి 2, 3 తేదీలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ఉపసంహరణకు సమయం ఉంటుందని, మార్చి 3న మధ్యాహ్నం 3 తరువాత అభ్యర్ధుల తుది జాబితాను విడుదల చేయనుంది.  మార్చి 10న ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగనుంది. మార్చి 13న ఉదయం 7 నుంచీ సాయంత్రం 5 వరకూ  రీపోలింగ్‌ను నిర్వహించనుంది. మార్చి 14న ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది.  ఏపీలోని 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది. గత మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై... కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను  కొన‌సాగించాల‌ని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.   గత ఏడాది మార్చి 23న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకునే వరకు 12 నగరపాలక సంస్థల్లో 6,563 మంది  అభ్యర్థులు నామినేషన్లు దాఖ‌లు చేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు.