ఏపీ ఎన్నికలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వకీల్ సాబ్
posted on Feb 22, 2021 @ 10:50AM
ఏపీలో ఎంతో ఉత్కంఠగా జరిగిన పంచాయతీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి ఇక త్వరలో మున్సిపల్, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే గత ఏడాది మార్చిలో జరిగిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైసిపి దౌర్జన్యాలకు పాల్పడడంతో చాల చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. ఇదే విషయాన్నీ అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ అటు కేంద్రానికి ఇటు ఎపి హైకోర్టుకు కూడా తెలిపారు మరోపక్క ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ను కోరాయి . అయితే తాజాగా ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏడాది క్రితం ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి ముందుకు కొనసాగుతుందని పేర్కొంది.
దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ మరోసారి డిమాండ్ చేసింది. ఎస్ఈసీ ఆవిధంగా ఆదేశాలు ఇవ్వకపోతే న్యాయపోరాటం చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ లీగల్ సెల్ విభాగానికి సూచనలు చేసినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతేడాది కరోనా వ్యాప్తికి ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో చాలా అక్రమాలు జరిగాయని .. చాల చోట్ల తమ పార్టీ నాయకులు చాలా మందిని బెదిరించారన్నారు. అప్పట్లో దాడులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా తమపార్టీవారిని అడ్డుకున్నారని అయన ఆరోపించారు. అంతేకాకుండా గతంలో నామినేషన్ల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులు తమ ఫిర్యాదులు తీసుకుని ఆయా జిల్లాల కలెక్టర్లను కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించడంతో తమ పార్టీకి చెందిన వారు కలెక్టర్లను కలవడానికి వెళ్తే. అక్కడ అధికారులు మొక్కుబడిగా ఫిర్యాదులు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కొన్నిచోట్ల జిల్లాల కలెక్టర్లు కూడా కలవడం లేదని, కిందిస్థాయి అధికారులు నామ్ కే వాస్తేగా ఫిర్యాదులు తీసుకుని పంపించేస్తున్నారని.. మొత్తంగా ఈ ప్రక్రియలో సీరియస్‌నెస్ లేదని అయన విమర్శించారు..
దీంతో ఈ ఎన్నికల ప్రక్రియపై మాకు నమ్మకం పోయిందని అయన అన్నారు. వచ్చిన ఫిర్యాదులపై న్యాయం చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పినా మాకు మాత్రం నమ్మకం కలగడం లేదని అయన స్పష్టం చేసారు. దీనిపై పార్టీ న్యాయ విభాగంతో ఇప్పటికే మాట్లాడానని.. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయమని చెప్పానని అయన తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ వ్యవహారం పై జనసేన హైకోర్టును ఆశ్రయిస్తే ఈ ఎన్నికల ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.