సొమ్ము మనది.. సోకు ఫాస్ట్ ట్యాగ్ దా? 2వేల కోట్ల దందా..!
ఫాస్ట్ ట్యాగ్. ఫిబ్రవరి 15 నుంచి దేశవ్యాప్తంగా ఇది కంపల్సరీ. టోల్ గేట్ల దగ్గర రద్దీ నివారించడం, వాహనాలు వేచి ఉండు సమయం తగ్గించడం, తద్వారా ఇంధన పొదుపు, ఆన్ లైన్ మనీ ట్రాన్జాక్షన్స్ పెంచడం ఫాస్ట్ ట్యాగ్ ముఖ్య ఉద్దేశం. పైపైన చూస్తే.. ఇది అద్భుతమైన విధానం. అయితే.. ఇందులో కనిపించని ఆసక్తికర కోణముంది. ఫాస్ట్ ట్యాగ్ తో వేల కోట్ల నగదు గారడీ నడుస్తోంది.
టోల్ గేట్ దాటాలంటే ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ (NHAI ప్రీపెయిడ్ వాలెట్) కానీ, ఫాస్ట్ ట్యాగ్ కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లో గానీ ఎప్పుడూ బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సిందే. ఇక్కడే ఉంది పైకి కనిపించని తిరకాసు.
దేశవ్యాప్తంగా 720కి పైగా టోల్ గేట్లలో ఫాస్ట్ ట్యాగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ 2 కోట్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్ లు కొనుగోలు చేశారు వాహనదారులు. కేంద్రం మాటల్లో ఫాస్ట్ ట్యాగ్ ఫ్రీ అయినా.. రియాల్టీలో ఒక్కో ఫాస్ట్ ట్యాగ్ కు 100 నుంచి 200 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకూ అమ్ముడైన 2 కోట్ల పై చిలుకు ఫాస్ట్ ట్యాగులతో 200 నుంచి 400 కోట్ల వరకూ ఆదాయం సమకూరింది. ఇదంతా బ్యాంకులకు, అటునుంచి ప్రభుత్వానికి చేరినట్టేగా.
టోల్ దాటాలంటే.. నిర్ణీత రుసుము చెల్లించాల్సిందే. 20 రూపాయల నుంచి 200 వరకూ వసూలు ఛార్జి చేసే టోల్ లు దేశంలో ఎన్నో. టోల్ గేట్ కు వెహికిల్ చేరుకోగానే ఫాస్ట్ ట్యాగ్ నుంచి ఆటోమెటిక్ గా అమౌంట్ కట్ అవుతుంది. అంటే, ఫాస్ట్ ట్యాగ్ లో ఎప్పుడూ నియమిత మొత్తం ఉండాల్సిందే. కొందరు ఫాస్ట్ ట్యాగ్ వాలెట్ లో డబ్బులు వేస్తుంటే.. మరికొందరు బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేస్తున్నారు. ఏ విధానం ఫాలో అయినా.. టోల్ ఫీజు కోసం ఎల్లప్పుడూ ఫాస్ట్ ట్యాగ్ కు నగదు అందుబాటులో ఉంచాల్సిందే. కొత్త టోల్ గేట్లలో సుమారు 100 రూపాయలు ఫీజు ఉంటోంది. రిటర్న్ జర్నీ కూడా ఉంటే మినిమం 200 కట్టాలి. అందుకే, ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ చేసుకునే వారంతా అకౌంట్లో సుమారు వెయ్యి రూపాయలు ఎప్పుడూ ఉంచుతున్నారు. టోల్ గేట్ నుంచి వెళ్లినా, వెళ్లకుండా ఆ వెయ్యి అలానే ఉంటోంది. ఈ లెక్కన దేశంలో 2 కోట్ల మంది ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఉంటే.. అందులో ఒక్కో అకౌంట్లో సుమారు వెయ్యి రూపాయలు ఉన్నాయని అనుకుంటే.. ఆ మొత్తం ఏకంగా రెండు వేల కోట్లు అవుతోంది. అంటే, ఏకకాలంలో దేశంలో ఫాస్ట్ ట్యాగ్ ల కోసమే రెండు వేల కోట్లు జమ చేయబడి రెడీగా ఉంటున్నాయన్నమాట. అందులో కొంత మొత్తం నేరుగా ఫ్యాస్ట్ ట్యాగ్ వాలెట్ లో ఉంటే.. మిగతా సొమ్ము ఫాస్ట్ ట్యాగ్ కు లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్లో ఉంటోంది. ముందస్తు నగదు నిల్వతో.. ఇటు కేంద్రం, అటు బ్యాంకులు 2వేల కోట్లను ఎంజాయ్ చేస్తున్నట్టేగా? ఫాస్ట్ ట్యాగ్ పేరుతో ఉత్తి పుణ్యానికే దేశంలో వేల కోట్ల నగదు కేంద్రానికి, బ్యాంకులకు అందుబాటులోకి వచ్చినట్టేగా? అంటే, సొమ్ము మనది.. సోకు ఫాస్ట్ ట్యాగ్ దా?