అభ్యర్థి లేడా.. వ్యూహాత్మకమా! అక్కడ పోటీ చేయనట్టేనా?
posted on Feb 21, 2021 @ 9:51AM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. ఇందులో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని అధికార టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఆయన ప్రచారంలో మునిగిపోయారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్’నగర్’ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరును తెరాస అధిష్టానం ఇంతవరకు ప్రకటించలేదు.ఈ స్థానం నుంచి, తెరాస పోటీ చేయక పోవచ్చని పార్టీ వర్గాల సమచారం. ఈ విషయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కట్టుబడి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో దూకుడు పెంచిన బీజేపీకి కళ్ళెం వేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్న గులాబీ బాస్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే వ్యూహం అనుసరించే అలోచనాలో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అందులో భాగంగా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఓడించడమే లక్ష్యంగా, వామపక్షాలు బలపరుస్తున్న మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తెరాస మద్దతు ఇవ్వ వచ్చని అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వడం ద్వారా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇటు బీజేపీని ఓడించడంతో పాటుగా వామపక్ష మేథావులను కట్టడి చేయవచ్చని కేసీఆర్ అలోచిస్తున్నట్లు తెరాస భవన్’లో గుసగుసలు వినవస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తెరాస హామీ తీసుకున్న తర్వాతనే నామినేషన్ దాఖలు చేశారని అంతవరకు ఆయన కూడా వేచి చూసే ధోరణితోనే ఉన్నారని సోషల్ మీడియాలో వినవస్తోంది. ఇప్పటికే గోరటి వెంకన్నకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన తెరాస.. ఇప్పడు ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ మేథావుల వ్యతిరేకను కట్టడి చేయవచ్చని భావిస్తుందని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
మరోవైపు పోటీ చేయకపోతే తమకు భయపడే పోటీచేయలేదని బీజేపీ డప్పుకొట్టి టాం..టాం వేసుకుంటే పరువు పోతుందని.. పోటీచేసి ఓడిపోతే పార్టీ పరువు మరింతగా దిగజారి పోతుందని పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్, వ్యూహాలు ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఎవరూ ఉహించలేరు. సో చివరి క్షణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు అటు పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసంగా మారింది.