నెల్లూరు, తిరుపతికి భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీన పడింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరీ తీరాలకు సమాంతరంగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం ఈ సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొం ది. వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పలు చోట్ల బారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఇక ఈ వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లడం నిషేధమని పేర్కొంది. ఇలా ఉండగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు పంట నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారలు సూచించింది.    

సర్ పై చర్చకు విపక్షాల పట్టు.. సభలో గందరగోళం.. వాయిదా

పార్లమెంట్  ఉభయ సభలూ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమయ్యాయి.  లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే  ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి.  ఈ సమావేశాలలో  14 కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే,    ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సంసిద్ధమయ్యాయి.  ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.  లోక్ సభలో   ఓటర్ల జాబితా సవరణ సర్ పై  చర్చించాలంటూ  కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక పోతే..  ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన రాధాకృష్ణన్   రాజ్యసభ సమావేశాలకు తొలి సారిగా అధ్యక్షత వహిస్తున్నారు.   ఈ రోజు ఆరంభమైన పార్లమెంటు సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి.   ఇలా ఉండగా పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విపక్షలపై విమర్శలు గుప్పించారు.  సభలో నినాదాలు చేసి, సభా కార్యక్రమాలను అడ్డుకుని విలువైన సభా సమయాన్ని వృధా చేయవద్దంటూ విపక్షాలకు సూచించారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయన్న ఆయన, పార్లమెంటును  విధాన రూపకల్పనకు పరిమితం చేయాలన్నారు. నినాదాలతో సభను అడ్డుకుని విపక్షాలు డ్రామా అడుతున్నాయని విమర్శించారు.  పార్లమెంటు  సమావేశాలు కేవలం సంప్రదాయం కాదనీ, దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపే ప్రయత్నాలకు నవ శక్తిని ఇచ్చే మార్గమని అన్నారు.   కాగా  వయనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రా మోడీ వ్యాఖ్యలకు లోక్ సభలో గట్టి రిటార్డ్ ఇచ్చారు. పార్లమెంటు ప్రజా సమస్యలను చర్చించే వేదిక అని పేర్కొన్న ఆమె..  సభలో  చర్చకు అవకాశం ఇవ్వకుండా  అధికార పక్షమే నాటకాలు ఆడుతోందని విమర్శించారు.  ఇలా ఉండగా లోక్ సభ ఇలా ప్రారంభమై అలా కొద్ది సేపటికే వాయిదా పడింది. మొదటి రోజే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సర్ పై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు నిరసనకు దిగాయి.  సభ్యుల నినాదాలతో సభలో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.   

మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు!

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పోలీసులకు ఇప్పుడు మంత్రుల వ్యక్తిగత సహాయకుల నేరాల దర్యాప్తు, విచారణ అదనపు భారంగా మారుతోంది.   గ‌తంలో హోం మంత్రి అనిత పిఏ జ‌గ‌దీశ్ ఆగ‌డాలపై ఏకంగా కూట‌మి నేత‌లే ఫిర్యాదు చేశారు  అత‌గా డి సెటిల్మెంట్ల వ్యవహారం చూసి తెలుగు తమ్ముళ్లే విస్తుపోయారు.   ఏకంగా మంత్రి పీఏగా ఉంటూ..   వైసీపీ లీడ‌ర్ల‌ల‌కు ప‌నులు చేసి పెట్ట‌డంపై అతడిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..  హోం మంత్రి అనిత‌ అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.  తాజాగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికార వ్యక్తిగత సహాయకుడు సతీష్ వ్యవహారం తెరపైకి వచ్చింది. మహిళపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య మెసేజీలతో వేధింపులకు గురి చేసిన ఉదంతం కలకలం రేపింది.  అతడి వైధింపులు భరించలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన సీఎంవో.. అతడిని తొలగించి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   అయితే ఈ వ్యవహారంపై గుమ్మడి సంధ్యారాణి లక్ష్యంగా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి అయితే.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖా  మంత్రిగా ఉన్న సంధ్యారాణి ఒక మ‌హిళ ఆవేద‌న అర్ధం చేసుకోక పోగా.. త‌న పీఏకి వంతపాడుతున్నారని విరుచుకుపడ్డారు.   మంత్రి సంధ్యారాణికి త‌న గోడు వెళ్ల‌బోసుకుంటే, ఆమె  రివ‌ర్స్ లో త‌న‌పైనే దుర్భాష లాడార‌ని  బాధితురాలు వాపోయిన సంగతిని పుష్ప శ్రీవాణి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఆమెకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదనీ, రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.  

మళ్లీ పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి?

ఐ బొమ్మ రవిని పోలీసులు మళ్లీ కస్టడీకి తీసుకోనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. తీవ్ర సంచలనం సృష్టించిన పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ  కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ పై సోమవారం (డిసెంబర్ 1)నాంపల్లి కోర్టులో విచారణ జరగుతుంది. సరిగ్గా అదే సమయంలో మరో మూడు కేసులలో పోలీసులు రవిని ఇదే కోర్టులో హాజరు పరచనున్నారు. ఐప్పటికే ఐబొమ్మ రవిని ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా మరో మూడు కేసులలో రవిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసలు, ఆ మూడు కేసులలోనూ విచారణకు మరోమారు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. అందుకు కోర్టు అనుమతి ఇస్తే మరో మారు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు.  

ఐదేళ్ల చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడి!

అభంశుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిపై ఓ ఆయా పైశాచికంగా దాడి చేసింది. నిష్కారణంగా ఆమెను చితకబాదడమే కాకుండా మెడపట్టుకుని కుదిపేసింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా పోలీసు స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లోని ఒ ప్రైవేట్ స్కూలులో జరిగింది. ఆ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై ఆ స్కూల్ ఆయా అమానుషంగా దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది.  స్కూల్లో పనిచేస్తున్న ఆయా,  అదే స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై జరిపిన దాడిలో ఆ చిన్నారి గాయపడటమే కాకుండా, భయంతో తీవ్ర జ్వరానికి గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  స్కూల్  ఆయా ఆ చిన్నారిని కొడుతున్న దృశ్యాలను ఆ పాఠశాల పక్కనే ఉన్న ఓ ఇంటి పై అంతస్తు నుంచి ఓ యువకుడు తన ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ వీడియోను అతడు పోలీసులకు అందజేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న  పోలీసులు, చిన్నారిపై దాడిచేసిన ఆయాను విచారిస్తున్నారు. 

ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి!

తనను ప్రేమించి పెళ్లాడడానికి సిద్ధపడిన తన ప్రియుడు పరువుహత్యకు గురికావంతో ఓ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. మరణించినా సరే తన ప్రియుడితోనే తన వివాహమని తెగేసి చెప్పింది. అలాగే చేసింది. ఇక తన జీవితమంతా తన ప్రియుడి కుటుంబంతోనే కలిసి జీవిస్తానని స్పష్టం చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.   వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో  ఆ యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిని   హత్య చేశారు. దీంతో ఆ యువతి అతడినే పెళ్లాడతానని పట్టుబట్టి, మరణించిన తన ప్రియుడి అంత్యక్రియల సమయంలో అతడి మృతదేహంతోనే వివాహం చేసుకుంది.   నాందేడ్‌‌‌‌‌‌‌‌ కు చెందిన అంచల్   సక్షం టేట్ లు గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో అంచల్ తండ్రి వీరి వివాహానికి అడ్డు చెప్పడమే కాకుండా.. తన మాట వినకుండా ఇంకా అంచల్ తో ప్రేమ కొనసాగిస్తున్నాడన్న ఆగ్రహంతో సక్షం టేట్ ను అంచల్ సోదరులతో కలిసి  హత్య చేశారు. విషయం తెలిసి అంచల్​  సక్షం అంత్యక్రియలు జరుగుతుండగా అతడి ఇంటికి చేరుకుని అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. సక్షం టేట్ భార్యగా జీవితాంతం అతడి ఇంట్లోనే నివసిస్తానని కుండబద్దలు కొట్టింది. తన ప్రేమ గెలిచిందనీ, సక్షం టేట్ ను దారుణంగా హత్య చేసిన తన తండ్రి, సోదరులు ఓడిపోయారనీ అంచల్ అంటోంది.  

రేవంత్ ఫుట్ బాల్ ప్రాక్టీస్

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్  నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సమ్మిట్ కు  ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు.   ఒక వైపు ఆ సదస్సు ఏర్పాట్లు, తన పట్టణ బాట, వరుస సమీక్షలతో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుల్ బాల్ దిగ్జజంతో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు కూడా సమాయత్తమౌతున్నారు.    ‘గోట్ ఇండియా టూర్‌‌‌‌’‌‌‌‌లో భాగంగా ఈ నెల 13న ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌‌‌‌లో మెస్సీతో  సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడనున్న సంగతి తెలిసిందే.   ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌‌‌‌లో లియోనల్ మెస్సీ (ఎల్‌‌‌‌ఎం10) టీమ్‌‌‌‌తో తలపడే జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ స్కిప్పర్ గా వ్యవహరిస్తారు.  ప్రపంచ సాకర్ దిగ్గజం మెస్సీతో తలపడే ఈ మ్యాచ్‌‌‌‌లో  ఆడటం కోసం సీఎం రేవంత్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ గేమ్ అంటే ఎంతో మక్కువ ఉన్న రేవంత్ రెడ్డి.. తన బిజీ షెడ్యూల్ లో కూడా ప్రాక్టీస్ కు సమయం కేటాయిస్తున్నారు.  అందులో భాగంగానే ఆదివారం (నవంబర్ 30) రాత్రి  ఎంసీహెచ్ఆర్డీ ఫుట్ బాల్ గ్రౌండ్లొ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 

పల్నాడులో తల్లీ కొడుకుపై దుండగులు దాడి

  గుంటూరు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.  కుటుంబ కలహాల నేపథ్యంలో  సాంబశివరావు అనే యువకుడుని హత్య చేశారు. అడ్డువచ్చిన తల్లిపై  కూడా దాడి చేసి గాయపరిచారు. తల్లి కృష్ణకుమారి(58) పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జిజిహెచ్ కు తరలించారు..  వివరాల్లోకి వెళితే, సాంబశివరావు, ఆయన తల్లి ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.  ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు.అయితే, హత్య చేసి పారిపోతున్న నిందితులను సమీపంలోని చాగల్లు గ్రామస్థులు గమనించి, వారిని పట్టుకున్నారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలు దారుణ హత్య జరగడంతో ఒక్కసారిగా గ్రామంలో  ప్రజలు ఉలిక్కిపడ్డారు... జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు..

నెల్లూరు హత్య కేసులో కిలాడీ లేడీ అరెస్ట్

  నెల్లూరుకు చెందిన సీపీఎం కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి రవాణా, చోరీలు ఇతర నేరాలకు సంబంధించిన ముఠాకు లేడీ డాన్ కామాక్షి లీడర్‌గా ఉంది. ఈ క్రమంలో పెంచలయ్య పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నారనే అనుమానంతో ఈ గ్యాంగ్ హత్య చేయించింది. దీంతో పోలీసులు నిందితురాలు కామాక్షి  నివాసంలో పోలీసులు సోదాలు జరిపి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోని ఆమెను అరెస్ట్ చేశారు. విలువైన భూములకు సంబంధించిన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు రూరల్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివసించే కె. పెంచలయ్య (38) ఎలక్ట్రిషియన్, సీపీఎం నాయకుడు. కాలనీలో జరుగుతున్న గంజాయి విక్రయాలను ఆపాలని, పోలీసులకు సమాచారం ఇస్తూ ఉండేవాడు. అదే అతని ప్రాణాలకు శాపమైంది. శుక్రవారం సాయంత్రం, పిల్లలతో స్కూటీపై ఇంటికి వెళ్తుండగా…తొమ్మిది మంది యువకులు అతడిని అడ్డుకున్నారు. "మాకే అడ్డువస్తావా?" అంటూ కత్తులతో దారుణంగా దాడి చేశారు.పెంచలయ్య పరుగెత్తి ప్రాణం కాపాడుకోవాలని చూసినా… వెంటపడి పొడిచి చంపేశారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మృతి చెందారు. గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న పెంచలయ్యను ముఠా సభ్యులతో కలిసి పెంచలయ్యను కామాక్షి హత్య చేయించినట్లు తెలుస్తోంది.ఇటీవలే రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు నిడిగుంట అరుణ  సెటిల్మెంట్ల దందాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే

ఏపీలో ఎస్‌ఐఆర్ చేపట్టాలి ...టీడీపీ ఎంపీ పిలుపు

  కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సిల్ రివిజన్‌ను స్వాగతిస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఏపీలో కూడా  ఎస్‌ఐఆర్ చేపట్టాలని ఆయన అన్నారు. పార్లమెంట్ శీతకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. మరోవైపు పన్నెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియను ఏడు రోజులు పొడిగిస్తూనట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్నాది.  ఓటర్లు తమ వివరాలను తనిఖీ చేసుకునేందుకు, అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ముసాయిదా ఎన్నికల జాబితా డిసెంబర్ 9వ తేదీకి బదులుగా డిసెంబర్ 16న విడుదల అవుతుంది. తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 7వ తేదీకి బదులుగా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది.   

ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశా : సీపీఐ నారాయణ

  ఐబొమ్మలో తాను ఫ్రీగా  సినిమాలు చూశాను అని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేడు వందల రూపాయలు పెట్టి ఎలా మూవీ చూసేది అని నారాయణ అన్నారు.. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే.. వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారు.. ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారని నారాయణ తెలిపారు. ఒక బొమ్మ రవిని చంపితేనో, జైల్లో వేస్తేనో మరో 100 మంది రవిలు వస్తారని తెలిపారు. ఐ బొమ్మ రవిని ఉరి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం ఆడుక్కుంటారని అన్నారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందా అని నిలదీశారు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐ-బొమ్మ రవి దెబ్బ కొట్టారని అన్నారు.   

చుక్కేసి చిక్కితే....చిక్కులే!

  మద్యం మత్తులో  వాహనాలు నడపడం వల్ల.... రోడ్డు ప్రమాదాల కారణంగా.. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన ఇప్పుడు తాజాగా ట్రాఫిక్ పోలీసులు, కోర్టులు కొరడా జులిపిస్తున్నాయి. అందుకే మందుబాబులు జర తస్మాత్ జాగ్రత్త ! సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు.ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 431 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 325 ద్విచక్ర వాహనదారులు, 16 ఆటోలు, 86 కార్లు, 4 భారీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే — 378 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య, 42 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య, 11 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml మధ్య ఆల్కహాల్‌ సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ  చట్టపరంగా కోర్టులో హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్‌ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కింద కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.  ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని సూచించారు...గత వారం అనగా నవంబర్ 24తేదీ నుంచి 29తేదీ వరకు మొత్తం 320 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో 264 మందికి జరిమానా, 35 మందికి జరిమానాతో పాటు సోషల్‌ సర్వీస్, 21 మందికి జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడినట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు తెలిపారు.

దూసుకొస్తున్న దిత్వా తుఫాను...రేపు స్కూళ్లకు సెలవు

  నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాను ప్రభావం ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారమే జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాగా ఆదివారం, సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారంతో ఆపై ఆకస్మిక వరద సూచన చేశారు.  దాంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో అనూష సూచించారు. లోతట్టు,తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఏ సహాయం కావాలన్నా నేరుగా అధికారులు సంప్రదించవచ్చని తెలిపారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేశామన్నారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు స్పష్టం చేశారు. నీటిపారుదలశాఖ, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్తు, ఆర్అండ్‌బీ, పంచాయతీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక, మున్సిపల్ తో పాటు అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉన్నామని ప్రజలకు ధైర్యం కలిపించారు.  ఉద్యోగులు 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటమాని భారీ వర్షాలు కురిసేటప్పుడు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ.. ప్రజలకు వివిధ జాగ్రత్తలు సూచించారు. మరోవైపు  దిత్వా తుపానుతో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగవాన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా రేపు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది ఉత్తర కోస్తాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, సోమవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో రెండో నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం తుపాను హెచ్చరికలతో రాష్ట్ర హోంమంత్రి  అనిత అధికారులను అప్రమత్తం చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. మరో మూడు బృందాలను సిద్ధంగా ఉంచింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గురజాడ స్వగృహాన్ని సందర్శించిన జస్టిస్ మానవేంద్రనాథ్

  విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్  సందర్శించారు. గురజాడ చిత్రపటాలను, ఆయన వాడిన వస్తువులను రచనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ గృహాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు.  తన చిన్ననాటి నుంచి గురజాడ రచనలను అధ్యయనం చేశానని చెప్పారు. మహాకవి నివసించిన గృహాన్ని సందర్శించి కొత్త అనుభూతి పొందానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిర,  గురజాడ సంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు డాక్టర్ వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఏ గోపాలరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో గాంధీలకు బిగుస్తున్న ఉచ్చు

  నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై పాటు మరో ఆరుగురిపై కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఢిల్లీ ఎకనమిక్ అఫెస్సెస్ వింగ్ వారితో పాటు మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడాలతో పాటు యంగ్‌ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులపై హక్కు పొందారని ఈడీ ఆరోపించింది.  కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్‌ వోరా 2020లో మృతిచెందగా.. ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ 2021లో మృతిచెందారు. కాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు నిన్న డిసెంబర్ 16కి వాయిదా వేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, బిజినెస్‌కు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్‌ నేతల ద్వారా భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపింది. 2025 అక్టోబర్ 3 నాటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ రూపొందించబడింది. ఈడీ తమ దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులతో పంచుకోవడంతో ఈడీ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఏజేఎల్‌ ప్రచురించేది. అయితే ఆర్థిక  ఇబ్బందుల కారణంగా 2008లో ముద్రణను నిలిపివేసింది. ఆ సమయంలో, మాతృ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల మేరకు బకాయి ఉంది.కాంగ్రెస్ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం ఏజేఎల్‌ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, ఆ అప్పును ఈక్విటీ షేర్లుగా మార్చారు. పార్టీ ఈక్విటీ షేర్లను నిర్వహించలేని కారణంగా, వాటిని 2010లోయంగ్ ఇండియన్ (వైఐ)కి కేటాయించారు.  

రగ్బీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన సోమిరెడ్డి

  నెల్లూరు జిల్లా పొదలకూరులో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ అండర్ -17 బాలుర విభాగంలో నెల్లూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ప్రకాశం, నెల్లూరు జట్లు తలపడగా నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది. రన్నర్ గా ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది. అలాగే అండర్-17 బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది.  రన్నర్ గా గుంటూరు జిల్లా జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో తూర్పుగోదావరి, గుంటూరు జట్లు హారహోరిగా తలపడ్డాయి. చివరకు తూర్పుగోదావరి విజేతగా నిలిచింది. విజేతలకు శనివారం సాయంత్రం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది తన సొంత నిధులతో నగదు బహుమతులను అందజేశారు.

ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు

  ఐబొమ్మ రవి పైరసీ వ్యవహారంపై కొనసాగిన కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు. తన అసలు ఐడెంటిటీ బయట పడకుండా ఉండేందుకు రవి తగ్గు జాగ్రత్తలు తీసుకు న్నాడు. మొత్తం పైరసీ నెట్‌వర్క్‌ను నడిపించేందుకు రవి పలు ఫేక్ ఐడెంటిటీలను సృష్టించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రవి 'ప్రహ్లాద్' అనే పేరుతో నకిలీ గుర్తింపు పత్రాలను సిద్ధం చేసుకొని. అదే పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే కంపెనీలను కూడా ఓపెన్ చేశాడు. అంతేకాక, ప్రహ్లాద్ పేరుతోనే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడంతో పాటు, అనేక డొమైన్స్‌ను కొనుగోలు చేసి, తన అసలు వ్యక్తి త్వాన్ని పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. దర్యాప్తులో భాగంగా, రవి పైరసీ కార్యకలాపాల కోసం మొత్తం 20 సర్వర్లు, 35 డొమెయిన్‌లు కొనుగోలు చేశాడని పోలీసులు నిర్ధారించారు. కొంతకాలం క్రితం ఫిలిం చాంబర్ మరియు పోలీసులకు పంపిన బెదిరింపు ఇమెయిల్ కూడా రవియే పంపినదేనని, అతని ఇమెయిల్ ఐడీలో గుర్తించినట్లు విచారణ అధికారులు వెల్లడించారు. ఇమ్మడి రవికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బెట్టింగ్ యాప్స్, అలాగే వారి ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు మరింతగా సాగుతోంది. ఈ కేసులో విస్తృతంగా నడిచిన పైరసీ వ్యవస్థ, దాని ఆర్థిక లావాదేవీలు మరిన్ని కీలక వివరాలను బయట పెడతాయని అధికారులు అంటున్నారు.

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్ రవి

  తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్ రవి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆర్. ఎన్ రవికి టీటీడీ అధికారులు తీర్ధప్రసాదాలను అందజేశారు. మరోవైపు సినీ నిర్మాత అంబికా కృష్ణ, కమెడియన్ రఘు,  తిరుపతి ఎంపీ గురుమూర్తి,  వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి,  వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయానికి స్వామివారి సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న (శనివారం) స్వామివారిని 79,791 మంది భక్తులు దర్శించుకోగా.. భక్తులు సమర్పించిన హుండీ కానుకలు రూ.3.73 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.