హస్తినకు చేరిన..ఓరుగల్లు వివాదం
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి, ఒక్క వరంగల్ జిల్లా అనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉందని ఏ ఒక్క జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఒకటిగా లేదని, గాంధీ భవన్ సాక్షిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే, అదలా ఉంచి వరంగల్ విషయానికి వస్తే, వరంగల్ జిల్లాలో పరిస్థితి, రోజు రోజుకు శృతి మించి రాగాన పడుతోందని, అంటున్నారు. ఇప్పటికే, జిల్లా సరిహద్దులు దాటి గాంధీ భవన్’కు చేరిన, వరంగల్ పచాయతీ తాజా సమచారాన్ని బట్టి ఢిల్లీకి చేరిందని అంటున్నారు.ఓ వంక హస్తం పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్’మధ్య, సాగుతున్న ‘కిస్సా కుర్సీకా’ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి సర్డుమణిగినట్లు కనిపిస్తున్నా,మళ్ళీఎప్పుడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని భావిస్తునారు.ఈ నేపద్యంలో తెలంగాణలో రాజుకున్న వివాదం ఉపేక్షిస్తే ముందు ముందు మరంత ప్రమాదంగా పరిణమించే ప్రమాదం లేక పోలేదని, అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని, గాంధీ భవన్ వర్గాల సమాచారంగా చెపుతున్నారు.
అదలా ఉంటే,అధికారంలోకి వచ్చేందుకు, వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ’ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు పదవులు ఎరగా వేయడం వలన తలెత్తిన సమస్యలు, చిలికిచిలికి గాలివానగా మారి పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీ విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు, కొండా ఫ్యామిలీకి రెండు ఎమ్మెల్యే టికెట్లు,ఇస్తామన్నారు,ఇవ్వలేదు. ఒకే టికెట్’తో సరిపెట్టారు.కొండా మురళీకి ఎమ్మెల్సీ ప్రామిస్’ చేశారు.కానీ,అదీ లేదు.కొండా సురేఖకు మంత్రి పదవి అయితే ఇచ్చారు,కానీ, గిట్టుబాటయ్యే శాఖలు ఇవ్వలేదన్న అసంతృప్తిని కొండా మురళీ దాచుకోలేదు.మంత్రి సురేఖ శాఖల్లో ఎక్కడ పైసలు రాలడం లేదని, ఇప్పటికీ, ఆమె నెల వారీ ఖర్చులకు తానే పైసలు పంపుతున్నాని మీడియా ఎదుటనే ప్రకటించారు. అంతేకాకుండా,ఇప్పుడేమో,ఇచ్చిన సురేఖ కుర్చీకి ఎసరు పెడుతున్నారు, అందుకే, మంత్రి కొండా సురేఖ’కుటుంబంలో అసంతృప్తి భగ్గుమంటోంది,వరంగల్ రాజకీయాల్లో రగులుతున్న వర్గ పోరుకు ఇదే ప్రధాన కారణంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒరలో రెండు కాదు, అంతకంటే ఎక్కువ కత్తులు ఇమిడ్చే ప్రయత్నం చేయడం వల్లనే ఈరోజు,ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, మీనాక్షి నటరాజన్’ ద్వారా సమాచారం తెప్పించుకున్న కాంగ్రెస్ అధిష్టానం, వరంగల్’ వివాదాన్ని మొగ్గలోనే తున్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే, తాజాగా కొండా దంపతుల కుమార్తె, కొండా సుష్మిత పటేల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీచేస్తున్నానని సోషల్ మీడియా అకౌంట్’ లో మార్పులు ద్వారా సంకేతాలు ఇవ్వడంతో వరంగల్’ వివాదం మరో మలుపు తీసుకుందని అంటున్నారు. అదొకటి అయితే, కొండా దంపతులు ఈరోజు (జులై 3) కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి, ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై ఆమెకు 16 పేజీల నివేదికను నివేదిక ఇచ్చారు. అలాగే, తమ పై వచ్చి ఆరోపణలపై కొందాడంపతులు, మీనాక్షి నటరాజన్’కు సమాధానం చెప్పారు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు.. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు.దీంతో, వరంగల్, వివాదం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించినమీనాక్షి నటరాజన్’ అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెపుతున్నారు. ముఖ్యమంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జూలై 4న రాష్ట్రానికి వస్తున్న నేపద్యంలో.. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎలా స్పందిస్తుంది, ఏమి చూస్తుంది చూడవలసి వుందని అంటున్నారు.