రెండేళ్లుగా ఒక గంట కూడా రెస్ట్ తీసుకోలేదు : సీఎం రేవంత్‌

  గత రెండేళ్లుగా ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చూట్టారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఆతర్వాత అభివృద్ధే లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.  ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పనిచేస్తున్నట్లు రేవంత్ అన్నారు. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రజలు బీఆర్‌ఎస్ పాలనకు చమర గీతం పాడారని సీఎం అన్నారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాతో అన్నారు.  ఇదే విషయం నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీతో మాట్లాడాను అని సీఎం అన్నారు. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని రేవంత్ అన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్ బస్సు తీసుకొచ్చి నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా అని తెలిపారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో కీరవాణి కచేరీ

  భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ ప్రతినిధులను మన భిన్న సాంస్కృతిక, కళారూపాలతో ఆహ్వానించనున్నారు. ఈవేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహిత కీరవాణి తన అద్బుతమైన సంగీత కచేరితో అతిథులను అలరించనున్నారు. కీరవాణి 90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరిని నిర్వహించనున్నారు. ప్రముఖ వీణా విద్యాంసురాలు పి.జయలక్ష్మీ వీణా కార్యక్రమం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సంప్రదాయ కళా రూపాలు సందడి చేయనున్నాయి.  తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబించేలా కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గు డోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులు పాటు జరిగే కార్యక్రమాల్లో రోజంతా సాంస్కృతిక కళారూపాలతో మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు.

పంచాయతీ పంచాయితీ!.. గ్రామాల్లో ఉద్రిక్తతలు.. విషాదాలు!

తెలంగాణలో పంచాయతీల పంచాయితీ జోరుగా ఉంది. స్థానిక ఎన్నికల సందర్బంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో రాజకీయ వేడి పెచ్చరిల్లింది. పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం రసకందాయంలో పడింది. అదలా ఉంచితే.. తెలంగాణలో   పంచాయతీ ఎన్నికల పంచాయితీ పలు గ్రామాలలో ఉద్రిక్తతలకు, మరికొన్ని గ్రామాలలో విషాదాలకూ దారి తీశాయి.  నామినేషన్ల విషయంలో తలెత్తిన విభేదాలతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, కొన్ని కుటుంబాలలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.  అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై అంటే సై అంటున్న ఉదంతాలూ  ఉన్నాయి.  నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు. ఈ విషయమై ఇంట్లో  ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన  తల్లి మందుల లక్ష్మమ్మ (40) ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. అయితే ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలోవార్డు మెంబర్‌గా నామినేషన్ వేసినందుకు భర్త మంద లించడంతో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.   

తెలంగాణలో స్తంభించిన రవాణా శాఖ సేవలు

  తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖకు సంబంధించిన వాహన్-సారధి సేవలు మళ్లీ మొరయిస్తున్నాయి. తెలంగాణలో వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, నేమ్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ వంటి కీలక సేవల కోసం ఉపయోగించే వాహన్–సారథి సెంట్రల్ సర్వర్ మరోసారి పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి జంటనగరాలతో సహా అన్ని జిల్లాల్లోని ఆర్‌టిఓ కార్యాలయాలకు చేరుకున్న వాహనదారులు  క్యూ లైన్లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.  సెంట్రల్ సర్వర్ కనెక్టివిటీ సమస్యలతో ఏ పని ముందుకు సాగకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారు. సెంట్రల్ సర్వర్ స్పందించడం లేదని అధికారులు స్పష్టం వ్యక్తం చేశారు మా చేతుల్లో లేదు ఢిల్లీ లెవెల్ లో సమస్య ఉంది.. దానిని ఢిల్లీ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని మాత్రమే అధికారులు చెబుతున్నారు.  దీంతో కార్యాలయాల్లో వాహనదారులు, స్టాఫ్ అందరూ నిరాశతో గడిపే పరిస్థితి ఏర్పడింది.కాగా, వాహన్–సారథి వ్యవస్థలో ఇదే తరహా అంతరాయాలు గత కొంతకాలంగా పునరావృతం అవుతుండటం ప్రజా సేవలపై ప్రభావం చూపుతున్నట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని, సేవలను నిరాటంకంగా అందించేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. రవాణా శాఖ సారధిలో తలెత్తిన సాంకేతిక సమస్యలు త్వరలో పరిష్కరమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో సాంకేతిక సమస్యలపై మంత్రి అధికారులతో మాట్లాడారు. సాంకేతిక సమస్యలు 3 గంటల్లో పూర్తిగా పరిష్కరమవుతాయని పొన్నం తెలిపారు.  

అమ్మకానికి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్!

పాకిస్థాన్  ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరింది. ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఐఎంఎఫ్ ఆర్థిక సహాయం తప్పని సరి. అయితే పాకిస్థాన్ ఆర్థిక అరాచకత్వంపై ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన ఐఎంఎఫ్ పాక్ ను ఆదుకోవడానికి విధిస్తున్న ప్రతి షరతుకూ పాకిస్థాన్ తలొగ్గక తప్పడం లేదు. ఆ క్రమంలోనే ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ) ఒత్తిడికి తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థను అంగడి సరుకుగా మార్చేసింది. ఔను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఇందు కోసం ఈ నెల 23న బిడ్డింగ్ నిర్వహించనుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని వాటాలను పూర్తిగా అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. అంతే కాదు ఈ బిడ్డంగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా సెలవిచ్చారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని 51శాతం నుంచి వంద శాతం షేర్లు అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. పాకిస్థాన్ కు 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ అందించడానికి ముందుకు వచ్చిన ఐఎంఎఫ్.. ఆ ప్యాకేజీ అందించాలంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలంటూ విధించిన షరతు మేరకే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అన్నిటి కంటే ఆశ్చర్యం ఏమిటంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ కోసం బిడ్డింగ్ కు అర్హత సాధించిన నాలుగు కంపెనీలలో ఒకటి పాకిస్థాన్ నియంత్రణలో ఉండే ఫౌజీ ఫౌండేషన్ కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి కావడమే. మొత్తంగా పాకిస్థాన్ ఆర్థిక సుడిగుండంలోంచి బయటపడేందుకు ప్రభుత్వ సంస్థలను అయిన కాడికి అమ్మేయాల్సిన దృస్థితికి దిగజారింది. 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటి? : టీపీసీసీ చీఫ్

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ దేశ సంపద అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అని అన్నారు. అలాంటి ఎస్పీ బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేంటని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో  లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మరోవైపు  దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని అన్నారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నట్లున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ నగరంలో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. నగరం కూడా కాలుష్యరహితంగా మారుతుందని మహేశ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ఏం చేసినా కేసీఆర్ కుటుంబానికి అవినీతి మాదిరిగా కనిపిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేయిల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవ వేదిక.. ప్రజాభిప్రాయాల గొంతుక

ఏపీ టు తెలంగాణ, అమలాపురం టు అమెరికా, ఆమాటకొస్తే ఈ భూమ్యాకాశాల మధ్య ఎక్కడి నుంచి ఎందాకైనా.. విషయం ఏదైనా.. వాస్తవాలను నిగ్గు తేల్చే నిఖార్సయిన వేదిక.. వాస్తవ వేదిక!  జమీన్ రైతు, తెలుగు వన్  సంయుక్త నిర్వహణలో.. జరుగుతోందీ చర్చా వేదిక. ఈ వేదిక ద్వారా అంశమేదైనా... సమాజ హితకరమైన వాడీ వేడీ చర్చ జరుగుతోంది.  జమీన్ రైతు 95 ఏళ్ల నాటి సుదీర్ఘ జర్నలిస్టిక్ అనుభవం గల పత్రిక. ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న ఏ పత్రికకూ ఈ స్థాయిలో అనుభవం లేదన్న విషయం నాటి పాఠకులకు సుపరిచితమే. నేటి కాలానికి తగ్గట్టుగా తమ వాణి వినిపిస్తున్న పత్రిక జమీన్ రైతు. ఇక తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో తెలుగు వారి మధ్య వారధిగా.. వారి వారి అభిప్రాయాలకు గొంతుకగా, వేదికగా కొనసాగుతోంది. అలాంటి తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ..మధ్య ముఖా ముఖీ.. అది సమాజ హితానికి ఓ దిక్సూచి. మార్గనిర్దేశకత్వంలో సవ్యసాచి.  ప్రస్తుతం దేశంలో ఉన్న సుప్రసిద్ధ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన వారే. అలాంటి విద్యార్ధులకు సంబంధించి ఉద్యమాలు ఎలాంటివి? అవిప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు కాలేజీ రాజకీయాల నుంచే రాజకీయాలను మొదలు పెట్టిన హుషారైన కుర్రకారుకూ నేటి యువతకూ గల తేడాలేంటి? వారి ఉడుకురక్తంతో కూడిన ఉద్యమం ఏమై పోయింది? అన్న అంశంపై రెండు భిన్న పార్శ్వాలు ఒకే వేదికపై నుంచి వినిపించే గొంతుక.. ప్రజాభిప్రాయ దీపికగా మారనుందనడంలో సందేహం లేదు. కాబట్టి విజ్ఞులైన పాఠక, ప్రేక్షకులందరూ వాస్తవ వేదిక సెకండ్ ఎడిషన్ గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం విడుదలవుతుంది … చూసి అభిప్రాయ వ్యక్తీకరణ చేయాలని ఆశిస్తూ..  మీ తెలుగు వన్, జమీన్ రైతు.

హిడ్మాది ఎన్ కౌంటర్ కాదు ముమ్మాటికీ హత్యే.. మావోయిస్టుల లేఖ

మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మాది ఎన్ కౌంటర్ కాదనీ, అది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని సంచలన ఆరోపణ చేసింది   ఈ మేరకు వికల్ప్ పేరుతో  విడుదల చేసిన లేఖలో హిడ్మాను విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఆ తరువాత హత్య చేశారని ఆరోపించింది. అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడ వచ్చిన హిడ్మాను  అదే రోజు పోలీసులు అదుపులోనికి తీసుకుని.. మూడు రోజుల తరువాత అంటే నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి  తీసుకెళ్లి హత్య చేశారని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది.   హిడ్మా కదలికల సమాచారాన్ని లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని పేర్కొంది.  హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను మావోయిస్టు పార్టీ దండకారణ్య జోనల్ కమిటీ ఖండించింది. మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమే ఆ ఆరోపణలు అని పేర్కొంది.  ఆపరేషన్ కగార్‌ ను వెంటనే నిలిపివేయాలని,హడ్మా హత్య సహా ఎన్ కౌంటర్ లపై  న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో డిమాండ్ చేసింది.  

ఫామ్ తాత్కాలికం.. కోహ్లీ టాలెంట్, టెక్నిక్ శాశ్వతం!

విరాట్ కోహ్లీ.. క్రీడలతో సంబంధం ఉన్నవారికీ, లేని వారికీ, అసలామాటకొస్తే అందరికీ చిరపరిచితమైన పేరు. దశాబ్దాలుగా భారత క్రికెట్ వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ పరుగుల దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫార్మాట్ ఏదైనా భారత క్రికెట్ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఇండియన్ క్రికెట్  అన్నంతగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీపై ఇటీవల కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు, ఇక ఆటకు గుడ్ బై చేప్పేయడమే బెటర్ అంటూ కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ విమర్శలకు, విమర్శకులకూ కోహ్లీ నోటితో కాకుండా బ్యాట్ తో సమాధానం చెప్పారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలోనూ అద్భుత సెంచరీలు సాధించి తనలో ఆట ఇంకా మిగిలే ఉందని చాటాడు. తొలి వన్డేలో 135 పరుగులతో చెలరేగిన కోహ్లీ, బుధవారం (డిసెంబర్ 30 జరిగిన రెండో వన్డేలో  కూడా శతకబాదాడు. ఈ రెండు మ్యాచ్ లలో విరాట్ బ్యాటింగ్ చూసిన వారంతా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వింటేజ్ కోహ్లీని చూస్తున్నామని అంటున్నారు. అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టు కెప్టెన్ గా నాడు కోహ్లీలో కనిపించిన ఫైర్ మళ్లీ కనిపిస్తోందనీ, అలాగే బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగితే సెంచరీ చేయకుండా తిరిగి రాకూడదన్న పట్టుదల కోహ్లీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్నారు.  కోహ్లీ లేని క్రికెట్ అంటే శూన్యం అంటున్నారు.   విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ వన్డేలలో ఇప్పటి వరకూ 53 సెంచరీలు చేశాడు.    35 ఏళ్ల కోహ్లీ ఇప్పటికీ యాక్యురెసీ, యగ్రసివ్ నెస్, ఫిట్ నెస్ విషయంలో కొత్త వారికి ఒక మోడల్ గా నిలుస్తున్నాడనడంలో సందేహం లేదు. టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీ ఇప్పటికీ సింగిల్ రన్ కోసం వికెట్ల మధ్య చిరుతను మించిన వేగంతో పరుగెత్తుతాడు. ఆ ఫిట్ నెస్ కొత్త కుర్రాళ్లలో కూడా కనిపించదని మాజీ క్రికెటర్లు అంటున్నారు.   

పుతిన్ భారత పర్యటన.. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ బంధాలు మరింత బలోపేతం!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. పుతిన్ రెండు రోజుల భారత పర్యటన గురువారం (డిసెంబర్ 4)న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో పుతిన్, మోడీల మధ్య కీలక చర్చలు జరగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వాణిజ్యం,  వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై ఇరువురి మధ్యా జరిగే ద్వైపాక్షిక చర్చలలో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాక్స్ టెర్రర్ యావత్ ప్రపంచాన్నీ కుదిపి వేస్తున్న నేపథ్యంలో మోడీ, పుతిన్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    రష్యా నుంచి భారత్ చమురుకొనుగోలును ఆపేయాలంటూ తాను జారీ చేసిన హుకుంను భారత్ లెక్క చేయకపోవడంతో ఉక్రోషంతో రగిలిపోతున్న ట్రంప్ సుంకాలను పెంచేసి భారత్ ను లొంగదీసుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ట్రంప్ ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడి భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే పుతిన్ భారత పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమౌతుండటమే కాకుండా.. ఈ పర్యటన విజయవంతం కావాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.  ఇలా ఉండగా పుతిన్ బారత్ లో పర్యటించడానికి ముందే.. భారత్ లో రష్యా సంబంధాల పట్ల సానుకూల ప్రకటన విడుదల చేశారు. వాణిజ్య లోటు విషయంలో భారత ఆందోళనలు తమకు తెలుసంటూనే.. దాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామనీ, ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ మధ్య చర్చలు ఉంటాయనీ పుతిన్ పేర్కొన్నారు.   ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరాలన్న లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్లు పుతిన్ చెప్పారు.   

గాన గంధర్వుడికి ప్రాంతీయత అంటగడతారా?

హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉండే  ర‌వీంద్ర భార‌తిలో గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న పై జరుగుతున్న రగడపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటుడు శుభ‌లేఖ సుధాక‌ర్ అధ్వ‌ర్యంలో ఎస్పీ బాలు విగ్ర‌హం ఇక్క‌డ  ఏర్పాటు చేసే విష‌యంలో కొందరు అనవసర వివాదానికి తెరలేపారు.   ఆంధ్రప్రదేశ్ కు చెందిన  ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హం తెలంగాణ‌లో స్థాపించడమేంటన్న చర్చను తెరపైకి తీసుకువచ్చి రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠాపనను వ్యతిరేకించడం ద్వారా కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేయడానికీ, ఆంధ్రా, తెలంగాణ మధ్య విభేదాల సృష్టికీ, తెలంగాణ సెంటిమెంట్ ను ప్రేరేపించడానికి ప్రయత్నించడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు బాలు అభిమానులు. ప్రజలు. ఆ మాట‌కొస్తే ఈ సాంస్కృతిక భ‌వ‌నానికి  పెట్టిన ర‌వీంద్ర భార‌తి అనే పేరు ఇక్క‌డ పుట్టిన వ్యక్తిది ఎంత మాత్రం కాదనీ,  బెంగాల్లో పుట్టిన రీవీంద్ర నాథ్ ఠాగూర్ పేరు మీద ఇక్కడ రవీంద్రభారతి వెలిసిందన్న సంగతని గుర్తు చేస్తూ, జాతీయగీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ కీ ప్రాంతీయత అంటగడతారా అని ప్రశ్నిస్తున్నారు. బాలూ కూడా జనం అందరూ మైమరిచి ఆలకించి పరవశించిపోయే మధుర గీతాలను పాడారనీ, ఆ గీతాలకు, మన చెవుల్లో అమృతం పోసిన ఆ గొంతుకకు ప్రాంతీయత అంటగట్టడం సరికాదనీ అంటున్నారు.    ఎస్పీ బాలు పాడిన పాట‌లు ఆంధ్ర, తెలంగాణ తేడా లేకుండా అంద‌రూ చెవులప్పగించి విన్నారు. వింటున్నారు.  ఆస్వాదించారు. ఆస్వాదించారు. పైగా బాలు పాటలంటే చెవికోసుకునే వారు  తెలంగాణలో కూడా అత్యధికంగా ఉన్నారు. మరి ఇంత కాలం బాలూ గానామృతాన్ని గ్రోలిన తెలంగాణ వాదులు  ఇప్పుడా ఆస్వాద‌న మొత్తం తిరిగిచ్చేస్తారా?  ఇవ్వగలరా? అని  నిలదీస్తున్నారు బాలు అభిమానులు.  క‌ళ‌కు ఎల్ల‌ల్లేవు. క‌ళాకారుల‌కు త‌ర‌త‌మ బేధాలే  కాదు ప్రాంతీయ భాషాభిమానాలు కూడా  ఉండవు. ప్రాంతీయత పేరుతో బాలూ వంటి గాన గాంధర్వుడి ప్రతిభను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ఎవరికీ, ఎప్పటికీ సాధ్యం కాదు.  తెలంగాణకు చెందిన పైడిజ‌య‌రాజ్  ముంబై వెళ్లి అక్క‌డి హిందీ సినిమాల్లో రాణించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హించారు. న‌ల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు ఆనాడు తెలుగు సినిమాలో ఒక వెలుగు వెలిగారు. ఇక్కడి వారికి అంత‌టి ప్రాంతీయాభిమానం ఉంటే వారిద్ద‌రి విగ్ర‌హాలిక్క‌డ ఇప్పటి వరకూ ఎందుకు ప్ర‌తిష్టించ‌లేదు?   ఎక్క‌డో బీహార్ కి చెందిన కేసీఆర్ పూర్వీకులు ఆంధ్ర‌ప్రాంతంలోని బొబ్బిలికి వ‌చ్చి అటు పిమ్మ‌ట తెలంగాణ‌లోని చింత‌మ‌డ‌క‌కు వ‌ల‌స వ‌చ్చారు. అలాంటి కేసీఆర్ తెలంగాణ సాధన కోసం పోరాడారు.  బీహారీ కేసీఆర్ సాధించిన‌  తెలంగాణ తిరిగి ఆంధ్ర‌లో క‌లిపేస్తారా?  కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాదంటూ ఆయనను డిజ్ ఓన్ చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు.   ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ సాయుధ  పోరాటంలో పాల్గొన్న చాక‌లి  ఐల‌మ్మ విగ్ర‌హాలున్నాయి. ఆ విగ్ర‌హాల‌నేమీ ఇక్క‌డి వారు వ‌ద్ద‌న‌డం లేదు. అంతెందుకు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుంద‌ర‌య్య వంటి ఎంద‌రో క‌మ్యూనిస్టు పోరాట యుధులు అండ‌గా నిలిచారు. మ‌రి వారి త్యాగాల‌ను తిరిగిచ్చేయ‌గ‌ల‌రా? అని కూడా నిలదీస్తున్నారు.  మొన్న‌టికి మొన్న జూబ్లీహిల్స్ ఉప  ఎన్నిక‌ల్లో న‌వీన్ యాద‌వ్  గెలిస్తే మైత్రీవ‌నం ప్రాంతంలో .. ఎన్టీఆర్ విగ్ర‌హ స్థాప‌న చేస్తామ‌ని సాక్షాత్ సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఆ విగ్ర‌హ ఏర్పాటును కూడా ఇలాగే వ్య‌తిరేకిస్తారా?  అంతెందుకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు ఎన్టీఆర్ పేరునే తన కుమారుడు కేటీఆర్ కు పెట్టానని స్వయంగా కేసీఆరే చెప్పారు. అలాంటిది.. తన పాటల మాధుర్యాన్ని ప్రాంతాలకు అతీతంగా అందరికీ పంచారు. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను అడ్డుకోవడం ఎంతమాత్రం సమజసం కాదు.    రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారిగా కలిసుందాం అంటూ చంద్రబాబు, కేసీఆర్ సహా రాజకీయాలకు అతీతంగా నేతలందరూ విభజన సందర్భంగా ఉద్ఘాటించారు. అటువంటిది రాష్ట్ర విభజన జరిగి పదిహేనేళ్లు దాటిపోయిన తరువాత కుచ్ఛితమైన స్వార్థ రాజకీయాల కోసం మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలను వివాదం చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు.    ఎస్పీబీకి భార‌త ర‌త్న ఇవ్వాల‌ని త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి అభ్య‌ర్ధ‌న‌లు వెళ్లాయి.  ఎస్పీబీ త‌మిళుడు కాదు,  మ‌ల‌యాళీ కాదు అంటూ ప్రాంతీయ విభేదాలను చూపలేదు. మన తెలుగువారికి ఎందుకీ తెగులు అన్న ఆవేదన ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వ్యక్తం అవుతోంది.  

పొంగులేటి కుమారుడి కంపెనీపై కబ్జా కేసు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీపై కేసు నమోదైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ గండిపేట రెవెన్యూ పరిధిలోని వట్టినాగులపల్లిలో  300 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు ప్రయత్నించడంతో ఈ కేసు నమోదైంది. గత నెల  30న 70 మంది బౌన్సర్లను తీసుకెళ్లి ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేసి, స్థల యజమానిపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు   కేసు నమోదు చేశారు. గత నెల  30 అర్ధరాత్రి రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన పలువురు వ్యక్తులు, నంబర్ ప్లేట్లు లేకుండా తీసుకొచ్చిన జెసిబిలతో ఆ భూమిలోకి బలవంతంగా ప్రవేశించి ప్రహారీ గోడను కూల్చేయడమే కాకుండా, అక్కడ ఉన్న గోశాలలు, షెడ్లు,  ధ్వంసం చేసినట్టుగా పల్లవీషా అనే మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో రాఘవ కన్స్ట్రక్షన్స్‌తో పాటు మరో ఐదుగురిపై   కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ ప్రవేశం, ఆస్తి ధ్వంసం వంటి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు న్నామని పోలీసులు తెలిపారు.  ఇలా ఉండగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదు కావడం కాంగ్రెస్ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అన్నిటికీ మించి రేవంత్ కేబినెట్ లో అత్యంత కీలకంగా ఉన్న పొంగులేటి కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీ దౌర్యన్యంగా కబ్జాకు ప్రయత్నించిందన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. 

బౌలర్ల వైఫల్యం.. పేలవ ఫీల్డింగ్!

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా రాయ్‌పూర్  వేదికగా బుధవారం (డిసెంబర్ 3) జరిగిన రెండో  మ్యాచ్‌లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి  358 పరుగులు చేసింది. అయితే 359 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. దీంతో వన్డే సిరీస్ లో భారత్, దక్షిణాఫ్రికాలు 1-1తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి భారత బౌలర్ల వైఫల్యం, పేలవ ఫీల్డింగ్   కూడా కారణం.   టాస్ కోల్పోయి భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టాల్సి రావడంతోనే మ్యాచ్ విజయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే శీతాకాలం కావడంతో రాత్రి వేళలో విపరీతంగా మంచుకురుస్తుంది. దాంతో బౌలర్లకు బంతిపై గ్రిప్ దొరకదు. అలాగే ఫీల్డర్లూ మంచులో తడిసిన బంతిని ఆపడం, క్యాచ్ పట్టడం కష్టమౌతుంది. బాల్ చేతుల్లోంచి జారి పోతుంది.  తొలి వన్డేలో కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ.. సౌతాఫ్రికా టాప్ ఆర్డర్డ్ ను బౌలర్లు మంచు ప్రభావం కనిపించడానికి ముందే పెవిలియన్ కు పంపడంతో విజయం సాధ్యమైంది. అయితే రెండో వన్డేలో ఆలా జరగలేదు. అంతే కాకుండా..తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ డెత్ ఓవర్లలో పరుగులు వేగంగా రాబట్టలేకపోవడం కూడా ఒక కారణం. చివరి పది ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 74 పరుగులే చేసింది. అలా కాకుండా మరో పాతిక ముఫ్ఫై పరుగులను చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.   ఇక టీమ్ ఇండియా బౌలర్లు ఘోరంగా విఫలమవ్వడం టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం.  ముఖ్యంగా   ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చారు.  ఆ తరువాత పేలవ ఫీల్డింగ్ క్యాచ్ డ్రాప్ లు కూడా భారత ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా యశస్వి జైసవాల్  మార్క్‌రమ్ క్యాచ్‌ను డ్రాప్ చేయడం చాలా కాస్ట్లీగా పరిణమించింది. మార్కరమ్  53 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన సులభమైన క్యాచ్ ను యశస్వియాదవ్ నేలపాలు చేశారు. ఈ తరువాత మార్కరమ్ సెంచరీ చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి అని చెప్పవచ్చు.  ఇక టీమ్ ఇండియా ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. భారత ఆటగాళ్లు  మిస్ ఫీల్డింగ్, ఓవర్ త్రోలతో చేజేతులా మ్యాచ్ ను దక్షిణాఫ్రికాకు అప్పగించారు. 

జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల విస్తరణ ప్రక్రియ పూర్తి

  జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలియం చేస్తూ తీసుకున్న ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి ..ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఒక సర్కిల్ జారీ చేశారు ..27 మున్సిపాలిటీలు, కమిషనర్లలో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకి ఆదేశాలు ఇచ్చారు.. జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్‌లో శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఇవాళ ఆమోదించారు. దీంతో మొత్తం 27 స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. 

దివ్యాంగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు

  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఏడు వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు.  శాప్‌ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్‌ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నామని పేర్కొన్నారు.  ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ప్రీ ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని తెలిపారు. అమరావతిలో దివ్యాంగ భవన్ నిర్మిస్తామని తెలిపారు. దివ్యాంగులకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

చిత్రపురి కాలనీ అక్రమాల కేసు విచారణ పూర్తి...ఫైనల్ రిపోర్ట్

  హైదరాబాదు నగరంలోని గచ్చిబౌలి లో ఉన్న చిత్రపురి కాలనీ కోఆపరేటివ్​ సొసైటీకి సంబంధించిన భారీ అక్రమాలపై సాగిన దాదాపు పదిహేనేళ్ల విచారణకు తెర పడింది. 2005 నుండి 2020 వరకూ చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ తన ఫైనల్‌ రిపోర్ట్‌ను నవంబర్‌ 27న తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. విచారణలో భాగంగా సొసైటీ నిధుల దుర్వినియోగం, ఆస్తుల కేటాయింపుల్లో గందరగోళం, అక్రమ ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలు బయటపడినట్లు కమిటీ నివేదికలో స్పష్టమైంది. ఈ అక్రమాలకు మొత్తం 15 మందిని బాధ్యులుగా కమిటీ నిర్ధారించింది.ఈ వ్యవ హారంలో పాత, ప్రస్తుత కమిటీ సభ్యులతోపాటు కొంతమంది సినీ ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొనడం ప్రత్యేకంగా నిలిచింది.  ఈ విచారణలో ప్రధానంగా ప్రస్తావించబడినవారిలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, అలాగే బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్ పేర్లు ఉన్నాయి. సొసైటీ కమిటీలో సభ్యులుగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి వీరికి సంబంధం ఉన్నట్లు రిపోర్ట్ సూచిస్తోంది. మొత్తం గా జరిగిన అక్రమాల కారణంగా సొసైటీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు రూ. 43.78 కోట్లు రికవరీ చేయాలని, అదనంగా 18 శాతం వడ్డీతో సహా వసూలు చేయాలని గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ సూచించారు.ఫైనల్‌ రిపోర్ట్ కాపీని ఇప్పటికే సంబంధిత 15 మందికి పంపినట్లుగా అధికార వర్గాలు వెల్లడిం చాయి. ప్రభుత్వం రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.

దిత్వా తుఫానుతో నెల్లూరు అతలాకుతలం

  దిత్వా తుఫాను ప్రభావంతో  నియోజకవర్గంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, చలిగాలుల తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పంట పొలాలు జలమయం, కురిసిన వర్షాలకు పలు గ్రామాలలో వందలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి.  ముఖ్యంగా వరి, ఇతర రకాల పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు పూర్తిగా వర్షపు నీటితో నిండి జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.  రాగల ఒకటి, రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నదులు, చెరువులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు.

కాకాణిపై పోలీసు స్టేషనులో సోమిరెడ్డి ఫిర్యాదు

  మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన ఫిర్యాదును నెల్లూరు రూరల్ పోలీసు స్టేషనులో అందజేశారు. తాను కోట్ల రూపాయలను దోచుకున్నానని కాకాణి నిరాధార ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.  దేవుడి గుడిని అభివృద్ధి చేస్తే తప్పు పట్టిన ఘనత కాకానికే దక్కుతుందని తెలిపారు. కాకాణి మనిషి జన్మ ఎత్తితే ఇలాంటి నిరాదార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. గతంలోనూ నా పై నిరాధార ఆరోపణలు చేసాడు..మా కుటుంబం దేవాలయాలకు, బడులకు, ఆసుపత్రికి భూములిచ్చిన చరిత్రి మాదని సోమిరెడ్డి తెలిపారు.  14.5 ఎకరాలు దాదాపు 60 కోట్లు విలువ చేసే భూములిచ్చామని పేర్కొన్నారు. త్వరలో కాకానీ  అండ్ బ్యాచ్ త్వరలో జైలుకు పోక తప్పదని తెలిపారు. కాకానికి మిగిలిన రాజకీయ నాయకుల్లాగా సంస్కారవంతంగా విమర్శలు చేయడం చేత కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని అన్నారు. ఈ మేరకు గత నవంబరులో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరుకు ఫిర్యాదు చేశారు  

త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ : సీఎం రేవంత్‌

  త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ఇవాళ హుస్నాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.262.68 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.  2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని రేవంత్ అన్నారు. శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదే రోజు జరిగిందని ఆయన స్పూర్తితో 60 వేల కోసం ఉద్యోగాలు చేశామని తెలిపారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్‌లో సోనియా ప్రత్యేక రాష్ట్రం మాటిచ్చారని తెలిపారు.  పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాల్లో అందరూ ఏకమై సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి పనిచేసే వారినే సర్పంచ్‌లను ఎన్నుకోవాలని కోరారు. కిరికిరి సర్పంచ్‌లను వస్తే ఐదేళ్ల కాలం వృధా అవుతుందన్నారు. అలాంటి వారిని ఎన్నుకోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో కోట్లాడైనా అత్యధిక నిధులు గ్రామాలకు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. హస్నాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. గడీలు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సర్దార్ పాపన్న గౌడ్ గారి నాయకత్వంలో బహుజనుల రాజ్య స్థాపనకు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారని ఆ ప్రాంత ప్రాధాన్యతను  గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి వ్యవసాయ రంగంలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ.. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రజా సంక్షేమ  కార్యక్రమాలు అమలు చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.