చుక్కేసి చిక్కితే....చిక్కులే!
posted on Nov 30, 2025 @ 2:08PM
మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల.... రోడ్డు ప్రమాదాల కారణంగా.. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన ఇప్పుడు తాజాగా ట్రాఫిక్ పోలీసులు, కోర్టులు కొరడా జులిపిస్తున్నాయి. అందుకే మందుబాబులు జర తస్మాత్ జాగ్రత్త !
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు.ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 431 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 325 ద్విచక్ర వాహనదారులు, 16 ఆటోలు, 86 కార్లు, 4 భారీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే — 378 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య, 42 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య, 11 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ చట్టపరంగా కోర్టులో హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని సూచించారు...గత వారం అనగా నవంబర్ 24తేదీ నుంచి 29తేదీ వరకు మొత్తం 320 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో 264 మందికి జరిమానా, 35 మందికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్, 21 మందికి జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.