అన్నీ ఆలోచించే.. పార్టీ నిర్ణయం మేరకే లొంగిపోయాం.. మావోయిస్టు ఆజాద్

ఆయుధాలు విడిచి లొంగిపోవడంపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్రకమిటీ మాజీ సభ్యుడు ఆజాద్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఆయుధాలను విసర్జించి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలన్న మావోయిస్టు పార్టీ పిలుపుమేరకే తాము లొంగిపోయామని స్పష్టం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తమ లొంగుబాటుకు కారణాలు, లొంగుబాట్లకు వ్యతిరేకంగా తాను అంతకు ముందు చేసిన ప్రక టన తదితర అంశాలపై వివరణ ఇచ్చారు. తామంతా పార్టీకి చెప్పే లొంగిపోయామని పునరు ద్ఘాటించారు. ఇంకా లొంగిపోకుండా ఉన్న రాష్ట్ర కమిటీ అగ్రనేతలు కూడా సరెండర్ కావాలని పిలుపు నిచ్చారు.   మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని కొనసాగించడం కష్టమని పేర్కొన్న ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించడంలేదన్నారు.   తొలుత మల్లోజుల సాయుధపోరాటం వీడాలంటూ రాసిన లేఖతో పార్టీలో అయోమయం నెలకొన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తామంతా ఆ లేఖతో షాక్ కు గురయ్యామన్నారు.  ఆ సమయంలోనే  మావోయిస్టు కేంద్ర కమిటీ సలహా మేరకు జగన్ పేరుతో మల్లోజుల స్టేట్ మెంట్ న ఖండిస్తూ..  మల్లోజుల సొంత ప్రయోజనాల కోసమే లేఖ రాశారని  జగన్ పేరుతో తాన ప్రకటన విడుదల చేసినట్లు చెప్పిన ఆజాద్.. ఆ తరువాత పార్టీ కేంద్ర కమిటీ క్లారిటీ ఇవ్వడంతో గందరగోళానికి తెరపడిందన్నారు. పార్టీకి చెప్పే ఆయుధాలను వీడి పోలీసుల ఎదుట లొంగిపోయామన్నారు.  భూస్వామ్య  వ్యవస్థ మీద వ్యతిరేకతతో పార్టీలో చేరాను..పీడత జనాల అభివృద్ధి కోసమే పార్టీలో చేరానని చెప్పిన ఆయన ఆ దిశగా పోరాటంలో కొంత మేర విజయం సాధించామని చెప్పుకొచ్చారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయనీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం జరగలేదనీ అన్నారు. ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని  పొందడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందన్నారు.  అలాగే పార్టీలోకి కొత్త క్యాడర్ రావడం ఆగిపోయిందనీ చెప్పుకొచ్చారు.  

మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేసిన సూపరింటెండెంట్.. ఎక్కడో తెలుసా?

జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్   రమణ మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఒక పల్లెటూరి వృద్ధుడి వేషధారణలో ఆయన  రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు.  ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదంటూ ఇటీవల జీజీహెచ్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో సూపరింటెండెంట్ ఈ తనిఖీ చేపట్టారు. తన తనిఖీలలో  ఆసుపత్రిలో కొన్ని సమస్యలను ఆయన గుర్తించారు. వాటిని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ఆయన ఈ తనిఖీలో భాగంగా  ఎమర్జెన్సీ విభాగం, లేబరేటరి, సిటీస్కాన్, ఎంసీయూ, ఐసీయు వార్డులను  పరిశీలించారు.  వైద్యులు, సిబ్బంది పనితీరు పట్ల  సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ మృతి వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ పాక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్  ఖండించారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనను మరో జైలుకు తరలించారని వచ్చిన వదంతులను సైతం కొట్టి పారేశారు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో కంటే ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన ఆహారం అందుతోందని, జైలులో ఆరోగ్యంగానే ఉన్నారని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. డిసెంబర్ 2న ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతినిచ్చారు.   అంతకు ముందు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో  రావల్పిండిలోని అదియాలా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ జైలు వద్దకు వెళ్లిన ఆయన ముగ్గురు సోదరీమణులపై పోలీసులు  దాడి చేశారన్న వార్తలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరిలు నూర్యీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్   పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులతో కలిసి   అదియాలా జైలు వద్దకు చేరుకున్నారు. మూడు వారాలుగా తమ సోదరుడిని కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని, ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా  నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు  దాడికి పాల్పడ్డారని   ఆరోపించారు. ఈ దాడిపై పంజాబ్ పోలీస్ చీఫ్‌కు రాసిన లేఖలో   రోడ్లను దిగ్బంధించలేదనీ, ఎవరికీ ఆటంకం కలిగించదనీ,  అయినా పోలీసులు   వీధి దీపాలను   ఆపేసి, చీకటిలో తమపై దాడికి దిగారని ఆరోపించారు.   71 ఏళ్ల వృద్ధురాలిననైనా చూడకుండా తన  జుట్టు పట్టుకుని, కింద పడేసి  ఈడ్చుకెళ్లారని ఆరోపించారు.      పలు కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో  ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని, కనీసం పుస్తకాలు చదవనీయడం లేదనీ, న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని పీటీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ఏడుసార్లు ప్రయత్నించినా, ఇమ్రాన్‌ను కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. కాగా ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు జైలు అధికారులు ఆయన సోదరిలకు అనుమతిస్తూ, ఇందుకు డిసెంబర్ 2 తేదీని ఖరారు చేయడంతో జైలు వద్ద పీటీఐ శ్రేణులు చేస్తున్న ఆందోళన విరమించారు. 

దక్షిణాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా వైట్ వాష్

సొంత గడ్డపై టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికాతో  గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి టెస్టులో కూడా టీమ్ ఇండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 0-2తో చేజార్జుకుని దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది.  బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసింది. ప్రతిగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య  ఛేదనలో టీమ్ ఇండియా బొక్కబోర్లా పడింది. కేవలం 140 పరు గులకే  ఆలౌట్ అయ్యి 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.  

జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో.. ఇలాంటివి వద్దంటూ లోకేష్ హితవు

ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తున్న జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో  ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఇవ్వని, అర్హత లేని ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇందులో భాగంగానే జగన్ విపక్ష హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లను బతిమలాడుకుంటున్నట్లుగా ఓ ఏఐ జనరేటెడ్ వీడియో ప్రస్తుతం సామిజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది. ఆ వీడియోలో చంద్రబాబు, పవన్, లోకేష్ నడుచుకుంటూ వెడుతుంటే .. ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అంటూ రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని జగన్  వారిని వేడుకుంటున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో తెగ వైరల్ అయ్యింది.  అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..  ఆ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్  వ్యక్తిగత దాడులు సముచితం కాదు, ఆ వీడియోను తీసేయండంటూ హితవు పలికారు.  ఇదే లోకేష్ ను గతంలో వైసీపీయులు నానా రకాలుగా ట్రోల్ చేశారు. లోకేష్ ఆహారం, ఆహార్యం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనను ట్రోల్ చేసి,  రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన ఒక తిరుగులేని నేత. ఆయన ఇప్పుడు జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడదంటూ తెలుగుదేశం శ్రేణులకు హితవు చెబుతూ  మర్యాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.   రాజకీయ ప్రత్యర్థులైనా, ప్రజా జీవితంలో గౌరవం, మర్యాదలు తప్పనిసరి అని పేర్కొంటూ.. జగన్ పై ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియా నుంచి తీసేయమంటూ పార్టీ శ్రేణులను ఆదేశించారు.  తెలుగుదేశం  పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహా ఎవరూ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. ఆంధ్రప్రదేశ్ బలోపేతానికి తోడ్పడే నిర్మాణాత్మక రాజకీయాలపైనే మనం దృష్టి పెట్టాలని హితవు పలికారు.  దటీజ్ లోకేష్ అనిపించుకున్నారు. 

హవ్వ ఇదేం పని.. పోలీసువేనా?

అంబర్ పేట పీఎస్ లో ఎస్ ఐగా పని చేస్తున్న భానుప్రకాష్ సస్పెండయ్యారు. అయితే అయ్యో పాపం అని ఎవరూ అనడం లేదు. ఎందుకంటే.. ఓ పోలీసు అనేవాడు చేయకూడని చేసి సస్పెండ య్యారాయన. ఇంతకీ ఆయనేం చేశారంటే.. క్రైమ్ విభాగంలో పని చేసే భాను ప్రకాష్.. ఓ దొంగతనం కేసులో రికవర్ చేసిన దాదాపు ఐ తులాల బంగారాన్ని ఏకంగా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు వాడేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే ఆయన సర్వీస్ రివాల్వర్ ను కూడా తాకట్టే పెట్టేశారు.  ఆర్థిక సమస్యల ఉండటంతో ఎస్సై భాను ప్రకాష్ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు తన  సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టేసినట్లు తేలడంతో  పోలీసు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.   ఎస్ఐ భాను ప్రకాష్ బెట్టింగులకు బానిసై అందిన కాడికల్లా అప్పులు చేసి అవి తీర్చే మార్గం కనపడకపోవడంతో ఇలా అడ్డదారి తొక్కాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మాక్ అసెంబ్లీ.. ఒరిజినల్ అసెంబ్లీకి మించి!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో బుధవారం విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అచ్చంగా అసెంబ్లీని తలపించేలా వేసిన సెట్ లో జరిగిన ఈ మాక్ అసెంబ్లీ నిజంగానే అసెంబ్లీ సమావేశం జరుగుతోందా? అనిపించేంత అద్భుతంగా జరిగింది. ఈ మాక్ అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలుగా పిల్లలు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ కారణంగానే జరుగుతున్నది నిజంగా అసెంబ్లీ సెషనేనా అనిపించింది. ఈ మాక్ అసెంబ్లీకి రాష్ట్రంలోని  175 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి ఒక విద్యార్థి చొప్పున పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీని స్పీకర్ అయ్యన్న పాత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తిలకించారు.   అచ్చంగా అసెంబ్లీలాగే ప్రొటెం స్పీకర్ స్పీకర్ కు బాధ్యతలు అప్పగించడం, ఆ తరువాత ప్రశ్నోత్తరాల సమయం, అలాగే బిల్లులు ప్రవేశపెట్టడం, చివరిగా మాక్ అసెంబ్లీలో విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టడం, మార్షల్స్ రంగ ప్రవేశం అన్నీ ఆకట్టుకున్నాయి. పిల్లలు అసెంబ్లీలో తమతమ పాత్ర లను సమర్ధంగా పోషించడం నిజంగా అబ్బురం. ఒక్క క్షణం నిజమైన ఎమ్మెల్యేల కంటే వీరే మెరుగ్గా చేశారా అనిపించిందని స్వయంగా ముఖ్యమంత్రే అన్నారంటే..మాక్ అసెంబ్లీ ఎంత చక్కగా జరిగిందో అవగతమౌతుంది. ఈ మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా   45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.   

తిరుపతి ఎస్పీయూలో చిరుత సంచారం

తిరుపతిలో మరోసారి చిరుత  సంచారం కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో  చిరుత సంచరిస్తున్న దృశ్యాలు  అక్కడి సీసీటీవీల్లో రికార్డైంది. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోని  గ కోళ్ల షెడ్‌పై  మంగళవారం నవంబర్ 25) అర్ధరాత్రి చిరుత దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ  ఫుటేజీలలో స్పష్టంగా కనిపించాయి. ఆ తరువాత అక్కడ నుంచి  ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద కొద్ది సేపు తచ్చాడిన చిరుత.. ఆ తరువాత అక్కడ నుంచి అటవీ ప్రాంతంవైపు వెళ్లిపోయింది.  ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా వర్సిటీ ఆవరణలో చిరుత సంచా రం సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది,  టీటీడీ విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.     గతంలో కూడా తిరుమల ఘాట్ రోడ్డు, మెట్ల మార్గంలో,  ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో  చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఇక ఈ నెల మొదటి వారంలో కూడా ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో చిరుతపులి సంచారం కనిపించింది.  ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురౌతున్న వర్సిటీ  విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది వర్సిటీ ప్రాంగణంలోకి వన్యప్రాణులు వచ్చే అవకాశంలేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

చాగంటినీ వ‌ద‌ల‌రా?

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది వైసీపీయుల తీరు. పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పినందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రముఖ ప్రవచన కారుడు చాగంటిపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నది. చాగంటికి రాజకీయాలు అంటగడుతోంది.   ఇప్ప‌టి వ‌ర‌కూ చాగంటి ప్ర‌వ‌చ‌నాలు కులాలకే కాదు, మ‌తాల‌కు అతీతంగా కూడా ఒక గొప్ప స‌మాన‌త్వాన్ని తీసుకొచ్చి పెట్టాయి. కార‌ణం ఆయ‌న చెబుతోన్న‌ది హైంద‌వ క‌థ‌లా లేక మ‌రొక‌టా అన్నది ప‌క్క‌న పెట్టి.. విన‌డానికి ఇంపుగా ఉండ‌టం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని చాటడం  వ‌ల్లనే ఆయన ప్రవచనాలంటే ఎవ‌రైనా స‌రే చెవులు కోసుకునే ప‌రిస్థితి ఉంది. అది ట్రావెలింగ్ బ‌స్సు కావ‌చ్చు, లేదేంటే యూట్యూబ్ చానెల్ కావ‌చ్చు, ఆపై ఆయ‌న నేరుగా ప్ర‌వ‌చ‌నాలు చెప్పే వేదిక‌లూ కావ‌చ్చు.. మాటల ప్రవాహం అలా దొర్లిపోతూనే ఉంటుంది. అయితే కూట‌మి  ప్ర‌భుత్వం వ‌చ్చాక చాగంటి  ఒక ప‌ద‌వి ఇచ్చి.. ఆయ‌న ద్వారా యువ‌త‌కు మంచి నేర్పే చక్కటి కార్యక్రమం చేపట్టింది.  ఇక్కడే వైసీపీయులు తమ వికృత మనస్తత్వాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను గౌరవించి, గుర్తించి పదవి ఇచ్చి ఓ గొప్ప బాధ్యత అప్పగించడంతో  వైసీపీ  క‌క్ష క‌ట్టింది. ఇటీవ‌ల ఆయ‌న చేసిన ఒక ప్ర‌వ‌చ‌నం కార‌ణంగా వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ఇన్నాళ్ల పాటు మీ మీద పెంచుకున్న గౌర‌వం మొత్తం మంట‌గ‌ల‌సి పోయింద‌న్న కోణంలో వారు సోష‌ల్ మీడియాలో  విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.   ఇంత‌కీ చాగంటి ఏమ‌న్నారో చూస్తే.. ఆయ‌న కుటుంబ విలువ‌ల గురించి చెప్ప‌డంలో భాగంగా తోబుట్టువుల అనుబంధం  గురించి చెప్పారు. అంతే ఇదంతా జ‌గ‌న్, ష‌ర్మిళ గురించి ఆయన చెప్పిన‌ట్టు ఊహించుకుని ఆయ‌న్ను తెగ ఆడిపోసుకుంటోంది వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్. ఒక వేళ చాగంటి  హ‌త్య చేయ‌డం త‌ప్పు.. అని చెబితే దాన్ని కూడా జ‌గ‌న్ త‌న బాబాయి వివేకాను హ‌త్య చేయించిన దానికి అన్వ‌యించుకుని.. గోలగోల చేస్తూ విమర్శలకు దిగుతారేమో, అలాగే అవినీతికి పాల్పడకూడదని చాగంటి చెబితే.. అది కూడా జగన్ కొల్లగొట్టిన కోట్ల ఆక్రమాస్తుల గురించే అని దాడికి దిగుతారేమో అన్నట్లుగా వైసీపీయుల కామెంట్లు ఉంటున్నాయి.  

అయ్యప్ప మాల ధరించినందుకు మెమో… కొత్త వివాదం

హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న కంచన్‌బాగ్ ఎస్‌ఐ ఎస్. కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేసిన విషయం వివాదంగా మారింది. డ్యూటీలో  ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరించడం పోలీసు విభాగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కృష్ణాకాంత్ కు అడిషనల్ డీసీపీ  మెమో జారీ చేయడంపై భిన్న స్పందనలు వచ్చాయి.  పోలీసు శాఖలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మతపరమైన ఆచారాలు పాటించే సమయంలో డ్యూటీకి హాజరు కాకుండా సెలవులు తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. అయ్యప్ప మాల వేసుకుని డ్యూటీ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని  ఆ మెమోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ మెమో ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది. బీజేపీ నేతలు అయ్యప్పమాట ధరించినందుకు ఎస్ఐకు మెమో జారీ చేయడాన్ని తప్పుపడుతున్నారు. మతపరమైన ఆచారాలు ఆచరించడం నియమాల్లో భాగమైతే, పోలీస్‌ సిబ్బంది పట్ల సౌలభ్యం చూపాలని   డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొకవైపు ఇందులో తప్పేమీ లేదని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

కాలుష్యంలో హైదరాబాద్ ను మించిపోయిన విశాఖపట్నం

దేశంలో అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో విశాఖపట్నం 13వ స్థానంలో  నిలిచింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 749 జిల్లాల్లో నిర్దిష్ట ప్రమాణాలకు మించి కాలుష్య కారక పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు.  తాజా సర్వేలో తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో 40 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువగా నమోదయింది. అయితే  హైదరాబాద్ నగరంలో మాత్రం ఇది 40 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్కు మించి వాతావరణ కాలుష్యం ఉన్నట్టు గుర్తించారు. ఇక ఏపీలో 26 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో కాలుష్య ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఇక నగరాల విషయానికి వస్తే విశాఖ నగరం లో కాలుష్యం హైదరాబాద్ ను మించి ఉందన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్ 25వ స్థానంలో ఉండగా, విశాఖ 13వ స్థానంలో ఉండటం గమనార్హం.  

ముంబై విమానాశ్రయంలో విదేశీ గంజాయి పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి విలువ 39 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.  బ్యాంకాక్‌ నుండి ముంబై వచ్చిన ఎనిమిది మంది ప్రయాణీల తీరుపై అనుమానం వచ్చిన అధికారులు వారి లగేజీ తనిఖీ చేయడంతో ఈ విదేశీ గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. వారి లగేజీలో ఉన్న చాక్లెట్ ప్యా ఎనిమిది మంది ప్రయాణికులపై అనుమానం వచ్చిన అధికారులు వారి సామానులను పరిశీలించగా, చాక్లెట్ ప్యాకెట్లలో  దాచిన గంజాయి బటయపడింది.  కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా సాధారణ చాక్లెట్ ర్యాపర్ల మాదిరిగానే ప్యాకింగ్ చేసి అక్రమంగా తరలించేందుకు  ఈ స్మగ్లర్లు చేసిన ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు.  అధికారులు ఎనమండుగురు స్మగ్లర్లనూ అదుపోనికి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.   అదుపులోకి తీసుకున్న నిందితులపై ఎన్డీపీఎస్  చట్టం కింద కేసులు నమోదుచేసి   దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో బ్యాంకాక్‌–భారత్‌ మధ్య గంజాయి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకాక్ నుండి వచ్చే ప్రతి ప్రయాణీకుడిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.   అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్లపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

సత్తా చాటిన భార‌త మ‌హిళ‌లు.. ఒకే ఏడాది నాలుగు ప్ర‌పంచ క‌ప్పులు

ఈ మ‌ధ్య కాలంలో భార‌త్  క్రీడాకారులు, మ‌రీ ముఖ్యంగా మ‌హిళా జ‌ట్లు అన్ని విభాగాల్లో ప్ర‌పంచ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. 2025 భార‌త మ‌హిళా జ‌ట్లు ప్రంపంచ స్థాయిలో  నంబంర్ వన్ గా నిలిచాయనడానికి ఆ జట్లు సాఆధించిన నాలుగు వరల్డ్ కప్ లే నిదర్శనం.  తొలుత అండర్ 19 విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ తో మోదలైన  భారత మహిళల విజయపరంపర.. 2025 విమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. సుమారు యాభై ఏళ్ల సుదీర్ఘ‌మైన నిరీక్ష‌ణ‌కు తెర దించితూ వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది టీమ్ ఇండియా మహిళల జట్టు. ఇదే గొప్ప అనుకుంటే, బ‌ధిరుల మ‌హిళా ప్ర‌పంచ క‌ప్ సైతం గెలిచి భ‌ళిరా! భార‌త మ‌హిళ.. అనిపించారు.  తాజాగా భార‌త మ‌హిళా క‌బ‌డ్డీ జ‌ట్టు సైతం ప్ర‌పంచ క‌ప్ గెలిచి భార‌త మ‌హిళ‌ల‌కు క్రీడా ప్రపంచంలో తిరుగే లేదనిపించారు.  భార‌త మ‌హిళ‌ల జ‌ట్లు ఇప్పుడు అన్ బీట‌బుల్ గా మారాయని క్రీడా లోకం కోడై కూస్తోంది.    భార‌త మ‌హిళ‌లూ మీరు భేష్! అంటూ స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు.. సామాన్య భక్తులకే పెద్దపీట

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.   ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల తేదీలను   ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే వీలు కల్పించింది. అంతే కాకుండా ఈ సారి వీఐపీలకు కాకుండా   సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ   కీలక మార్పులు చేసింది. దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకూ  పూర్తిగా సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మూడు రోజులకు గాను 1.88 లక్షల సర్వదర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.  ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగుతుంది.  డిసెంబర్ 2 నుంచి టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మిగిలిన ఏడు రోజుల్లో  ) ప్రతిరోజూ 15,000 సర్వదర్శన టోకెన్లు, 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్యులకు అదిక సమయం కేటాయించేందుకు   వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని బాగా కుదించారు. మొత్తం 184 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించినట్లు టీటీడీ పేర్కొంది.   తొలిరోజు వీఐపీ బ్రేక్‌ను 4 గంటల 45 నిమిషాలకు, ఇతర రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు పరిమితం చేసింది.   ఇలా ఉండగా,  వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక చివరి మూడు రోజులూ అంటే జనవరి 6 నుంచి జనవరి 8 వరకూ   స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ఇందు కోసం ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శనం కోసం   రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు.  ఇకపోతే.. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా  డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ పది రోజులూ   తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. 

మంత్రి కొమటిరెడ్డి వర్సెస్ పున్నా కైలాష్ నేత.. నల్గొండ కాంగ్రెస్ లో రచ్చ!

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం రచ్చ రేపింది. నల్గొండ డిసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. తనపైనా, తన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో దూషిస్తూ మీడియాకు ఎక్కిన పున్నా కైలాష్ నేతను డిసీసీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్నా కైలాష్ నేతపై పోలీసు కేసు పెడతానంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డకి లేఖ రాశారు కోమటిరెడ్డి. పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అర్హులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా మంత్రి కోమటిరెడ్డి వ్యవహారశైలిపై జిల్లా కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేసిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ అందరిపైనా నోరు పారేసుకుంటుంటారనీ,  ఇతరులెవరికీ పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదరింపులకు దిగడం వారికి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నాయి కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు.  ఈ నేపథ్యంలో నల్గోండ జిల్లా కాంగ్రెస్ రేగిన చిచ్చును పార్టీ అధిష్ఠానం ఎలా చల్లారుస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

మునిసిపాలిటీల విలీన ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం

అవుటర్ రింగ్ రోడ్  పరిధిలో లేదా దానికి ఆనుకుని ఉన్న 27 మునిసిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం  కానున్నాయి.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.   మంగళవారం (నవంబర్ 25) జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో కీలక అంశంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సమావేశంలో టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టగా, కౌన్సిల్ దానిని పరిశీలించి అ  ఆమోదించింది.   వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి, సేవల పరంగా పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఈ విలీనం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. విలీనం ద్వారా ఏకీకృత నగర ప్రణాళిక, మెరుగైన పౌర సేవలు, సమగ్ర మెట్రో పాలిటన్ అభివృద్ధి సాధ్యమవుతాయని వివరించింది. పెద్ద అంబర్‌పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్ తదితరులు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి జీహెచ్ఎంసీ చట్టం, 1955 నిబంధనల ప్రకారం, విలీనం ప్రతిపాదనపై పరిశీలన చేసి, అవసరమైన అధ్యయనాలు నిర్వహించి అభిప్రాయాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఆదేశించింది. దానికి అనుగుణంగా, నవంబర్ 21, 2025న జారీ చేసిన ప్రభుత్వ మెమోను   సమావేశంలో టేబుల్ ఐటమ్ నంబర్ 2గా జిహెచ్ఎంసి జనరల్ బాడీ ముందు ఉంచగా, జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా మంగళవారం (నవంబర్ 25) ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఈ 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 

మాక్ అసెంబ్లీకి మంగళగిరి ఎమ్మెల్యేగా ఎంపికైన విద్యార్థినికి లోకేష్ అభినందన

నేటి బాలలే రేపటి పౌరులుగా మారి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై స్పందిస్తారు. అందుకోసం పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యా బుద్దులతో పాటుగా సమాజంతో ఎలా నడుచుకోవాలి అనే అంశాలు పాఠశాలల్లో నేర్పిస్తే.. పిల్లలు మంచి పౌరులుగా దేశ అభివృద్దిలో భాగస్వాములు అవుతూ వివిధ రంగాల్లో తమ సేవలు అందిస్తూ దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తారన్న ఉద్దేశంతోనే పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువల బోధన, అలాగే  రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే  రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడిలా మారి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. ఈ చర్చల్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఓ వర్గం విద్యార్థులు మాట్లాడితే.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై మరో వర్గం విద్యార్థులు మాట్లాడుతారు. ఈ సందర్భంగా జరిగే చర్చలు అచ్చం అసెంబ్లీని తలపించే విధంగా ఉంటాయి. విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేసింది. అక్టోబరు 21, 22 తేదీల్లో పాఠశాల స్థాయిలో 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్‌ పోటీలు నిర్వహించింది. వీరిలో ఆరుగురు చొప్పున మండల స్థాయిలో అక్టోబరు 24, 25 నిర్వహించే పోటీలకు ఎంపిక అయ్యారు. అనంతరం మండల స్థాయి నుంచి ఆరుగురు చొప్పున అదే నెల 29, 30 తేదీల్లో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. చివరికి నియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్థాయి విద్యార్థుల అసెంబ్లీ పోటీలకు 175 మందిని ఎంపిక అయ్యారు. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేలా విద్యార్థులను ఎంపిక చేసి  శాసనసభలో మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తారు. అలా మంగళగిరి నియోజకవర్గం నుంచి కనకపుట్లమ్మ ఎంపికైంది.  విద్యార్థుల మాక్‌ అసెంబ్లీకి ఎన్నికైన మంగళగిరి విద్యార్థిని శ్రీకనకపుట్లమ్మను విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు.  ఆ విద్యార్ధినిని ఆమె కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని తన నివాసానికి  పిలిపించుకుని మాట్లాడారు. 8వ తరగతి చదువుతున్న శ్రీకనకపుట్లమ్మ వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి ఎంపికవ్వడం ముదావహమని అభినందించారు.  ఆ విద్యార్థిని కుటుంబ యోగక్షేమాలను  అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి 11వ వార్డులో నివాసం ఉండే విద్యార్థిని తండ్రి రాము దివ్యాంగుడు. ట్రై స్కూటిపై కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని, తనకు రూ.6వేల పెన్షన్ వస్తోందని విద్యార్థిని తండ్రి రాము తెలిపారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి తన కుటుంబంలా మారిపోయిందని, మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్​లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. అమరావతిలో బుధవారం (నవంబర్ 26)న నిర్వహించనున్న  స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికకావడం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని విద్యార్థిని కనకపుట్లమ్మ పేర్కొంది   . మంత్రి నారా లోకేష్ ను కలవడం పట్ల విద్యార్థిని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 

మూడు విడతల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే నెల 11, 14, 17 తేదీలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైనందున ఎన్నికల నియమావళి  తక్షణమే అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట  జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్‌  సెప్టెంబర్ 29న ప్రకటించామని,   అక్టోబర్ 9న ఆ షెడ్యూల్ పై కోర్టు స్టే విధించిందని అన్నారు.   తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరుగుతుందన్న రాణి కుముదిని,  రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు, . మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా పదమూడు వేల ఐదు వందల ముఫ్పై నాలుగు   వార్డు స్థానాలకు మూడు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లను నవంబర్ 27 నుంచి,  రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి   స్వీకరించనున్నట్లు  వెల్లడించారు.

జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం

జీహెచ్ ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం (నవంబంర్ 25)  దాదాపు నాలుగు గంటల పాటుజరిగిన మంత్రివర్గ సమావేశంలో  పలు కీలక అంశాలపై చర్చించారు.  ముఖ్యంగా జీహెచ్ఎంసీ విస్తరణపై విస్తృతంగా చర్చించిన మంత్రివర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న  27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు  ఆమోదం తెలిపింది. దీంతో పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, శంషాబాద్‌లు, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయి గూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్నాయి. అలాగే  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ డిస్కం లకు తోడు మరో డిస్కమ్ ను ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లను ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. అదే విధంగా  రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలపై చర్చించిన మంత్రి వర్గం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు   నిర్ణయం తీసుకుంది.   .  రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం  కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.