ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్! భారత్ సిరీస్ తీసుకొచ్చిన కేంద్రం
posted on Aug 28, 2021 @ 9:15PM
ఒకే దేశం ఒకే రేషన్, ఒకే దేశం ఒకే పన్ను ఇవి కేంద్ర సర్కార్ అవలంభిస్తున్న విధానాలు. ఇదే బాటలోనే మోడీ సర్కార్ కొత్తగా మరో పాలసీ తీసుకొచ్చింది. ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర రోడ్డు రవాణా-హైవేల మంత్రిత్వ శాఖ కొత్త రిజిస్ట్రేషన్ పాలసీని ప్రకటించింది. ఇందుకోసం కొత్తగా భారత్ సిరీస్ BH)ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కేంద్ర రోడ్డు రవాణా-హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటివరకు దేశంలో ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం మరో రాష్ట్రంలో 12 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక వేళ ఉండాల్సి వస్తే ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. అయితే కొత్తగా తీసుకొస్తున్న భారత్ సిరీస్ తో అలాంటి ఇబ్బందులు తప్పనున్నాయి. భారత్ (BH) సిరీస్ లో రిజిస్టర్ చేసుకుంటే… దేశంలో ఎక్కడైనా వెహికిల్ ఉండొచ్చు.అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. రక్షణ శాఖలోని వివిధ డిపార్ట్ మెంట్స్ లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ చోట్ల ఆఫీస్ లు ఉన్న ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది.
వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే ‘బీహెచ్’ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించనుంది. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే బీహెచ్ రిజిస్ట్రేషన్ ను చేసుకోవచ్చు. రోడ్డు పన్నును మొదట రెండేళ్లకే కట్టొచ్చని లేదంటే వాహన గరిష్ట జీవితకాలమైన 15 ఏళ్లకుగానూ రెండేళ్ల చొప్పున మొత్తం ఒకేసారి చెల్లించే వెసులు బాటు ఇందులో ఉండనుంది. ఈ కొత్త విధానంతో ఉద్యోగ, వ్యాపార కారణాలతో వేరే రాష్ట్రానికి మారాల్సి వచ్చిన వారికి ఊరట లభించనున్నది.