కేసీఆర్ మదిలో బ్రహ్మాస్త్రం!.. దళితుడిని సీఎం చేసే వ్యూహం!
posted on Aug 29, 2021 @ 9:46AM
అవును, మీరు చదివింది త్వరలోనే నిజం కావొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై దళితుడిని కూర్చోబెట్టినా ఆశ్చర్యం లేదు..అంటున్నారు. సీఎం కేసీఆర్ ఎత్తుగడల గురించి బాగా తెలిసిన వారెవరూ ఈ న్యూస్ విని అవాక్కవరు. తెలంగాణ చాణక్యుడి వ్యూహాలు అలానే ఉంటాయి మరి. ఇప్పుడు ఆ పని చేయడం అత్యంత అవసరం కూడా మరి.
సీఎం కేసీఆర్‌పై ప్రజా వ్యతిరేకత ఉప్పెనలా ఎగుస్తోంది. దళిత బంధుతో కుటుంబానికి 10 లక్షలు పంచేందుకు సిద్ధమైనా ఆయన్ను ఎవరూ నమ్మట్లేదు. కేసీఆర్ నిజంగా ఇస్తారా? అందరికీ ఇస్తారా? హుజురాబాద్ ఎన్నికలు ముగియగానే బంధును బొందపెట్టేస్తారా? ఇలా అనేక అనుమానాలు. అందుకు కారణమూ ఆయనే. గతంలో దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇలా దళితులను నిలువునా దగా చేసిన ఘన చరిత్ర. అందుకే, దళితుల కోసం రక్తం ధారబోస్తానంటున్నా కేసీఆర్‌ను దళితులతో సహా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు..అంటున్నారు.
మరి ఎలా? తాను దళిత పక్షపాతినని నిరూపించుకునేదెలా? 10 లక్షలు ఇస్తానంటున్నా నమ్మట్లేదంటే ఇంకెలా? ఇలా ఆలోచిస్తున్న కేసీఆర్‌కు అద్భుతమైన ఆలోచన వచ్చిందట. తనపై వినిపిస్తున్న విమర్శలు.. తనను అనుమానిస్తున్న ప్రశ్నలకు.. తిరుగులేని, ఎదురులేని.. బ్రహ్మాస్త్రం లాంటి ఆలోచన ఆయన మదికి తట్టిందట. ఆ ఆయుధాన్ని ప్రయోగించేందుకు తన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
కేసీఆర్ మదికి తట్టిన ఆ బ్రహ్మాస్త్రంలాంటి ఆలోచన.. దళిత ముఖ్యమంత్రి. అవును, సీఎం సీటు నుంచి తాను వైదొలిగి.. తన స్థానంలో దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దళితుడిని సీఎం చేస్తే.. ఇక తనపై ఉన్న ముఖ్యమైన మచ్చ చెరిగిపోతుంది. ఈ రెండున్నరేళ్లు దళితుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కడిగిన ముత్యంలా తాను మరోసారి బరిలో నిలవొచ్చనేది ఆయన ఆలోచనతో కూడిన ఎత్తుగడ వ్యూహం!
అయ్యో.. ముఖ్యమంత్రి పీఠం పోతే ఎలా? పవర్ లేకుండా పెద్దాయన ప్రశాంతంగా ఉండగలరా? అనే డౌటనుమానం అస్సలే అవసరం లేదు. ఎందుకంటే.. గత యూపీఏ హయాంలో ప్రధాని సీట్లో మన్మోహన్‌సింగ్ కూర్చున్నా.. పవర్ అంతా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ చేతిలోనే ఉన్నట్టు.. ఆ ఫార్ములాను తెలంగాణలోనూ ఈజీగా అప్లై చేసేయొచ్చనేది ఆయన ఐడియా. అలా అయితే దళితుడిని సీఎం చేసినట్టు ఉంటుంది.. అసలు పవర్ పదిలంగా తన దగ్గరే ఉంటుంది. తనపై పడిన మరక వదిలిపోతుంది. ప్రతిపక్షాలకు ప్రగతిభవన్ ఉన్న అసూయ తొలగిపోతుంది. తాను ఎంచక్కా ఫాంహౌజ్‌లోనే ఉంటూ రాష్ట్రాన్ని పరోక్షంగా పాలించొచ్చు. బ్రహ్మాస్త్రంలాంటి ఈ ఆలోచన కేసీఆర్‌కు బ్రహ్మాండంగా నచ్చేసిందని.. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి.. వారిని ఒప్పించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అదే నిజమైతే.. డమ్మీ సీఎం అయ్యే ఆ దళిత అదృష్టవంతుడు ఎవరవుతారో...?