రాహుల్ కే కాంగ్రెస్ పగ్గాలు.. తీర్మానాలు చేస్తున్న పీసీసీలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఆ పార్టీలో ఖంగారు, అయోమయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబం ఆవలి వ్యక్తి అధ్యక్షుడు అయ్యే అవకాశం లేకుండా పార్టీ అధిష్టానం ఒక్కటొక్కటిగా పావులు కదుపుతోంది. ఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే పార్టీ అధ్యక్ష నియామక బాధ్యతలు తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ తీర్మానాలు చేయాలని హైకమాండ్ పీసీసీలు, డీసీసీలకు స్పష్టమైన సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలూ పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీయే చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. అలాగే ఛత్తీస్ గఢ్ కూడా అదే దారిలో నడిచింది. రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని మరో సారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఛత్తీస్ గఢ్ సీఎం బూపేష్ బఘేల్ అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని తీర్మానాలు చేశాయి, మరిన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధంమైన డిమాండ్లు, తీర్మానాలు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఏదో విధంగా ఒత్తిడి తీసుకువచ్చైనా రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేలా చేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తున్నది.
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల పార్టీ కమిటీలూ రాహుల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్న సంగతి విదితమే. ఐదు నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగి కాశ్మీర్ లో ముగుస్తుంది.ఇదిలా ఉంటే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 22న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8 అని.. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంతకు ముందు 2017లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. 2019 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2019లో మరోసారి కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే విషయమై రాహుల్ గాంధీని విలేకరులు ప్రశ్నించిన సందర్భంగా రాహుల్ గాంధీ సూటిగా సమాధానం చెప్పలేదు. పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో సుముఖతనూ వ్యక్తం చేయలేదు. అలాగని వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. మీరే చూస్తారుగా అంటూ సస్పెన్స్ మెయిన్ టైన్ చేశారు. ఈ నేపథ్యంలోనే కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్న. నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి, కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఖాళీగానే వుంది.అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ, తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆమె పార్టీ బాధ్యతలను నిర్వహించలేక పోతున్నారు. ఓ వంక వయో భారం, మరో వంక అనారోగ్యం, ఆమెను వెంటాడుతున్నాయి.ఈ కారణంగా ఆమె క్రియాశీలంగా వ్యవహరించలేక పోతున్నారు. మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.
ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహుర్తహం ఖరారు చేసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నా,ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా, ఖాయంగా పోటీ చేస్తామని ప్రకటించలేదు.
అదలా ఉంటే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం ఏమిటి అనే విషయంలో మొదటి నుంచి ఉన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. నిజానికి, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తమ మనసులోని మాటను స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మరోమారు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తులు పార్టీ అధ్యక్ష బాద్యత తీసుకోవాలని, సిడబ్ల్యూ సమావేశంలో తెగేసి చెప్పారు. మూడేళ్ళుగా అయన అదే మాట మీదున్నారు. అయినా, ఇంకెవరు ముందుకు రాకపోవడం వల్లనే, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకొస్తున్నారు.
మరో వంక ఆమె నిరాసక్తత కారణంగానే కావచ్చును కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా స్వతత్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాహుల్ గాంధీ అప్రకటిత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, జీ23 నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సదిగ్ధ వైఖరి కారణంగానే పార్టీ నష్ట పోయిందని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. నిన్న మొన్న పార్టీని వదిలి వెళ్ళిన, పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్, ఇంకా పార్టీలోనే ఉన్నఆనంద శర్మ, మనీష్ తివారీ వంటి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నిర్వాకం వల్లనే పార్టీ కోలుకోలేని విధంగా బలహీనమైందని, మండి పడుతున్నారు.
నిజానికి, వాస్తవానికి రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారథ్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, నిన్న(శుక్రవారం) విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, సస్పెన్సు కొనసాగించారు. అధ్యక్ష బాధ్యతల విషయంలో ఎప్పుడోనే నిర్ణయం తీసేసుకున్నను ఈ విషయంలో నాకెలాంటి అయోమయమూ లేదు. అధ్యక్షుడిని అవుతానో లేదో ఎన్నిక జరిగినప్పుడు స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడండి అంటూ, అటూ ఇటూ కాని, సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఒకవేళ తాను పోటీ చేయకుంటే విలేకరులు తనను అడగొచ్చని.. అందుకు జవాబు చెబుతాననీ సమాధానం ఇచ్చి సస్పెన్స్ కొనసాగేందుకు అవకాశమిచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ సమాధానంతో మీడియాయే కాదు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయన ఔనన్నారా, కాదన్నారా అర్ధం కాక అయోమయంలో పడ్డాయి. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్డమయ్యారని అనికోవాలా? లేదని సరిపుచ్చుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి.
అదలా ఉంటే రాహుల గాంధీ సాగిస్తున్న, భారత్ జోడో యాత్ర లక్ష్యం విషయంలోనూ అదే సందిగ్దత వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నాయకులు, ఓ వంక ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్ర కాదని అంటారు. మరో వంక, యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, అధ్యక్ష పదవి విషయంలో సందిగ్దత తోలిగితేనే కానీ, కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలదని, రాహుల్ గాంధీ, ఇప్పటిలా బాధ్యతలు లేని అధికారం చెలాయించాలని కోరుకుంటే, పార్టీ పరిస్థితి కూడా ఇప్పటిలానే దినదిన ప్రవర్తమానంగా దిగాజారుతుందని అంటున్నారు.