మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరాలి..జగన్ కు అయ్యన్న పాత్రుడు సవాల్
posted on Sep 19, 2022 @ 11:33AM
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామన్న భ్రమల్లో ఉన్న జగన్ కు సవాళ్లు, హితబోధలు, హెచ్చరికలు ఆనడం లేదు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మూడు రాజధానుల అంశంపై తన అభీష్ఠమే నెరవేరాలన్న మొండి పట్టుదల ప్రదర్శిస్తూ అడుగడుగునా భంగపాటుకు గురౌతున్నారు.
అయినా కూడా మూర్ఖుడు రాజుకంటే బలవంతుడు అన్న చందంలో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానం రాజే మూర్ఖుడైతే పరిస్థితి ఇలాగే ఉంటుందని అనిపించేలా ఉంది. తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తరువాత తాపీగా మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. అన్ని రాజకీయ పార్టీలూ, అన్ని వర్గాల ప్రజలూ మూడు రాజధానులకు తమ వ్యతిరేకతను ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తున్నా జగన్ తన పట్టు విడవడం లేదు. తాజాగా జగన్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు సవాల్ చేశారు. మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పు కోరే ధైర్యం ఉందా అని నిలదీశారు.
మూడు రాజధానుల అంశంపై ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు వెళ్లాలని సవాల్ చేశారు. 2019 ఎన్నికలలో అమరావతికే మద్దతు అని ప్రకటించి విజయం అందుకున్న జగన్ ఇప్పుడు ఆ మాట విస్మరించి మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరలేపడం రాజకీయ దివాళా కోరు తనమేనని విమర్శించారు.
మీడియాతో మాట్లాడిన అయ్యన్న పాత్రుడు అమరావతిలో భూ అక్రమాలు జరిగాయంటున్న జగన్ దమ్ముంటే ఆ విషయంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై టీడీపీ హయాంలో ఒకటి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరొక ‘సిట్’ వేశారని, ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం 33 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారనీ, వైసీపీ నాయకులు విశాఖలో భూములను ఆక్రమించుకున్నారనీ విమర్శించారు.
అమరావతి రైతులు చేపట్టిన ‘అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర’ శాంతియుతంగా జరగాలని, ఇందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించాలని అయ్యన్న కోరారు. పాదయాత్రను అడ్డుకుని తీరుతామని వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం సరికాదన్నారు., రైతుల పాదయాత్రకు తాము రక్షణ కవచంగా ఉంటామన్నారు.