సెప్టెంబ‌ర్ 17ని ఏంచేయ‌ద‌ల‌చుకున్నారు?

చిన్న‌ప్పుడు గాంధీ జ‌యంతి, బాల‌ల‌దినోత్స‌వాలు స్కూళ్ల‌ల్లో బ్ర‌హ్మాండంగా జ‌రిగేవి. వాటి మ‌ధ్య మంచి ఆరోగ్య‌క‌ర పోటీయే ఉండేది. దూష‌ణ‌భూష‌ణ‌లకు ఆస్కారం ఉండేది కాదు. ఒకే పండుగ‌ను వేరు వేరు దృష్టితో నిర్వ‌హించ‌డ‌మే స‌మాజంలో గొడ‌వ‌ల‌కు, స్ప‌ర్ధ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొ న్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో బీజేపీవారి భక్తిత‌త్వానికి, ఇత‌రులు అనుస‌రించేదానికి ఎంతో తేడా ఉం టోంది. వారు మాట్లాడిన‌ది, వారు చేసే ప‌నులు, వారు ప్ర‌క‌టించేదే అస‌లు సిస‌లు దేశ‌భ‌క్తి అని స్వ‌యం గా బీజేపీవారే ప్ర‌చారం చేసుకోవ‌డం హాస్యాస్ప‌దంగా మారింది.   తాము నిర్వ‌హించేదానికే అత్యంత విలువ ఉంటుంద‌న్న భావ‌న నుంచి బీజేపీవారు బ‌య‌ట‌ప‌డాల‌నే అంతా ఆకాంక్షిస్తున్నారు. ఎందు కంటే, దేశ‌భ‌క్తి లో కొట్టుకుపోతున్న స‌ద‌రు బీజేపీ వారు సెప్టెంబ‌ర్ 17ను చరిత్ర‌లో ప్ర‌పంచదేశాలు చెప్పుకునేట్టు చేయ డానికి కంక‌ణం క‌ట్టుకున్నారు.    సెప్టెంబర్ 17.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌ గా మారింది. సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్న తెలంగాణ సర్కార్..తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతామన్న బీజేపీ చెబు తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌లు  పోటా పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నా యి. సెప్టెంబర్ 17 శనివారం పెరేడ్ గ్రౌండ్‌లో‌ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ‌ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అదే రోజున ఎన్టీఆర్ గ్రౌండ్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం సభ నిర్వహించనుంది.  కాగా గురువారం ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం‌ వద్ద నుంచి ఆరెంజ్ బ్రిగేడ్ ర్యాలీ ప్రారంభమైంది. బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ జరుగుతుంది. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాలు నిర్వహించ నుంది. అమృత మహో త్సవాల్లో భాగంగా పార్టీ తరుపున బీజేపీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.   చిత్ర‌మేమంటే తెలంగాణా ప్ర‌జ‌లు మాత్రం క‌మ‌లం, కారు వేగాల మ‌ధ్య న‌లిగిపోతున్నారు. త‌మ ప్రాంత ప్రాధాన్య‌త‌ను దేశ‌మంతా తెలిసేలా చేయ‌డానికి ఇపుడు అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. కానీ కొత్త‌గా రాజ‌కీ యాల్లోకి వ‌చ్చిన వారికి ఉండే అత్యుత్సాహాన్నే బీజేపీ, టిఆర్ ఎస్ సీనియ‌ర్లు ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. గిస్మంటి ర‌చ్చ బ‌డికిబోయిన్ప‌టి సందీ జూడ్నేలే.. అనుకుంటున్నారు తెలంగాణా ప్ర‌జ‌లు. 

ఏపీపై రేణుకా చౌదరి ఫోకస్!

పరిచయం అక్కర్లేని పేరు రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం   దివంగత నందమూరి తారక రామారావు హయాంలో రేణుకా చౌదరి  ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మనసులో ఉన్నది ఉన్నట్లు సూటిగా సుత్తి లేకుండా చెప్పడం, రాజకీయంగా  ప్రత్యర్థులు ఎంతటివారైనా తన పదునైనా  వాగ్బాణాలతో  వెరుపులేకుండా విమర్శలు గుప్పించడం రేణుకా చౌదరి నైజం. అదే స్పీడును, అదే నిక్కచ్నితనాన్ని, అదే ధైర్యాన్ని ఆమె కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగిస్తున్నారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలైన రేణుకా చౌదరి ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు రేణుకా చౌదరి రెడీ అవుతున్నారని సమాచారం. ఏపీ రాజధాని అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని,  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలు నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  అమరావతి అంశాన్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఏపీ ప్రజలకు సుపరిచితురాలైన రేణుకా చౌదరి చరిష్మా ఇందుకు బాగా దోహదపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఏపీలో రేణుకా చౌదరి పార్టీ సభలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఏఐసీసీ ఓ సరికొత్త ప్రణాళికను రెడీ చేసిందని చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతి రాజధాని రైతుల అమరావతి టూ అరసవిల్లి 2.O మహా పాదయాత్ర ప్రారంభోత్సవానికి రేణుకా చౌదరి హాజరయ్యారని చెబుతున్నారు. అమరావతి రైతులతో రేణుకా చౌదరి కొంతదూరం నడిచి మరీ వారికి మద్దతు తెలిపారు.   రైతులు కూర్చున్న ట్రాక్టర్ ను రేణుకా చౌదరి స్వయంగా డ్రైవ్ చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిందనే కోపంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ పార్టీలోని ముఖ్య నేతలు అనేక మంది తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. ఏపీలో అత్యంత దీన స్థితిలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఓ లైట్ హౌస్ మాదిరిగా కనిపించినట్లు చెబుతున్నారు.  రేణుకా చౌదరి సభల ద్వారా ఏపీలో మళ్లీ తన ఉనికిని రాబట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని ప్రధాన నగరాల్లో రేణుకా చౌదరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది. అమరావతి టూ అరసవిల్లి రైతుల మహా పాదయాత్ర సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ సీఎం ఓ మూర్ఖుడు అని, ఆయనకు పరిపాలన చేతకాదంటూ నేరుగా నిప్పులు చెరిగారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో జగన్ కు తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మూర్ఖపు పాలనపై రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. జగన్ కు ఎందుకు ఓటు వేశామా? అని ఏపీ ప్రజలు చాలా రోజులుగా బాధపడుతున్నారన్నారు. ఏపీలో తనకు ఎందరో తెలుసని, వారిని పలకరించినప్పుడల్లా జగన్ ఎప్పుడు పోతాడా అని ఎదురుచూస్తున్నామని చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు.  ఏపీ రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని ఆమె ధీమాగా చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే జగన్ పాలన అంతం అవుతుందని, తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని రేణుక అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు కూడా రేణుకా చౌదరి వచ్చి రైతులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

గాలి మళ్లీ జైలుకు?

బళ్లారి గనులను అక్రమంగా కొల్లగొట్టిన మైనింగ్ టైకూన్ గాలి జనార్ధన్ రెడ్డి త్వరలో మళ్లీ జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. గాలి మైనింగ్ అక్రమాల కేసు విచారణ ఇక వేగవంతం కాక తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గాలి జనార్ధన్ రెడ్డి కేసు విచారణలో ఆమోదయోగ్యం కాని జాప్యంపై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు  తాజా పరిస్థితిపై ఈ నెల 19లోగా సీల్డ్ కవర్ లో నివేదిక పంపాలని హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీం  ఆదేశించింది. దీంతో కొంత కాలంగా షరతులతో కూడిన  బెయిల్ పై    స్వేచ్ఛగా ఉన్న గాలి మళ్లీ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు అంటున్నారు.  గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై  సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ 12 ఏళ్లుగా ఆలస్యం కావడం సహించరానిదని సుప్రీం కోర్టు   వ్యాఖ్యానించింది. తాము గతంలో విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినా  జాప్యం ఎందుకు జరిగింది? విచారణ ఏ దశలో ఉంది? ఏ కారణాల చేత విచారణ ముందుకు సాగడంలేదో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011సెప్టెంబర్ 5న జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్ లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లకూడదనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న జనార్ధన్ రెడ్డికి బెయిలు మంజూరు చేసింది.  కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ జనార్ధన్ రెడ్డి 2020లో మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చని గత ఏడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్14) విచారించింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు అంటూ సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ వాదనలు వినిపించారు.  గాలి జనార్ధన్ రెడ్డి స్వస్థలం బళ్లారి. ఆయన అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. సాక్షుల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ధర్మాసనానికి విన్నవించారు. మాధవి దివాన్ వాదనపై స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించారు. విచారణ సాగడం లేదని మాధవి దివాన్ బదులిచ్చారు. విచారణపై స్టే ఉందా.. అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గతంలో అయితే లేదని ఏఎస్ జీ సమాధానం ఇచ్చారు. గతం విషయం తాను అడగటం లేదని, ప్రస్తుతం స్టే ఉందా? అని జస్టిస్ షా ప్రశ్నించారు. దీనికి ఏఎస్ జీ వద్ద సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తీవ్రమైన అభియోగాలున్న ఈ కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ సీబీఐ కేసులు న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట సాగకపోవడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ఆదేశాలతో   గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఒకే గూటి ప‌క్షులు..ఒకే రాగం!

రోడ్డుమీద ఇద్ద‌రు తాగి గొడ‌వ‌ప‌డుతూ ఛండాలంగా తిట్టుకుంటున్నారు...త‌లుపులు భ‌డాల్న మూసేసి ఎదురింటావిడ ఇంట్లోకి వెళ్లింది. మ‌ధ్యాన్నం టీవీ పెట్ట‌గానే ఒక ఛాన‌ల్లో ఒక ప్ర‌జాప్ర‌తినిధి తిట్ల దం డ‌కం వ‌స్తోంది...వంటింట్లోంచి ప‌రుగున వ‌చ్చి ఓ క్ష‌ణం చూసి, విని.. పొద్దుట‌వాడే న‌యం అనుకుం దామె!  అదీ మ‌న భాషా ప్ర‌యోగం తాలూకు ఎఫెక్ట్‌! చ‌దువు, సంస్కారం, భాషా ప్ర‌యోగాల‌కు బొత్తిగా సంబంధ‌మేలేని కాలంలో ఉన్నామ‌న్న‌ది మ‌న ప్ర‌జాప్ర‌తినిధులే రుజువు చేస్తున్నారు. చాలా రోజుల క్రిత‌మే వైసీపీ మాజీ మంత్రి కోడాలి నాని మాంఛి సంస్కృతంలో ఎవ‌ర్నో తిట్టారు. అది తెలుగే అని అర్ధ‌ మ‌య్యేస‌రికి  చెవులు చిల్లులు ప‌డి, టీవీ క‌ట్టేసి తిండి స‌యించ‌క ఓ పెద్దామె ఈయ‌న‌కా ఓటు వేసింది అనుకుందామె. ఇలాంటి వారిని తోబుట్టువులా ఇపుడు వెన‌కేసుకొచ్చారు మంత్రి రోజా.  రాంగ్‌రూట్‌లో ఎమ్మెల్సీ అయిన లోకేష్, సీఎం జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలార‌ట‌. అవాకులు చెవాకుల‌కీ ప‌చ్చి బూతుల‌కీ తేడా తెలీని స్థితిలో ఉన్నారు మంత్రి రోజా. అధికార‌ప‌క్షంవారు, విప‌క్షాల వారూ ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధం చేయ‌డం మామూలే. ఇది అనాదిగా ఉన్న‌దే.కానీ కాల‌క్ర‌మంలో వారి భాషా ప్ర‌యోగంలో స‌ర‌దాలు పోయి దారుణంగా మారి బ‌య‌ట‌క‌న‌ప‌డితే కొట్టుకు చ‌చ్చేంత‌గా  కొత్త రంగులోకి మారడ‌మే ఎవ్వ‌రూ భ‌రిచ‌లేక‌పోతున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి నపుడు  ఆ హుందాత‌నం, గౌర‌వం ఇచ్చిపుచ్చుకోవ‌డం పోతున్నాయ‌న్న‌ది ఓట‌రు బాధ‌.  ఓటు వేసిన త‌ర్వాత మ‌ర్చి పోయేలా ప్ర‌జాప్ర‌తినిధులే చేసుకుంటున్నారు.  గ‌తంలో వైసీపీ విప‌క్ష స్థానంలో ఉండ‌గా, ఆర్‌.కె.రోజా అసెంబ్లీలో చాలా అస‌హ్య‌క‌ర భాషా ప్ర‌యోగ‌మే చేశారు. అది చూసి, వినీ మ‌హిళ‌లే తిట్టుకున్నారు. ఒక‌ మ‌హిళ మంత్రిగా ఇంత ఛండాలమ‌యిన  భాష మాట్లాడందేమిటా అని ఆశ్చ‌ర్య‌పోయారు, అస‌హ్యించుకున్నారు. ఇటీవ‌లి కాలంలో రోడ్డుషోల్లో, మీడియా స‌మావేశాల్లోనే కొడాలి నాని విప‌క్షాల మీద ఆయ‌నే మాట్లాడ‌గ‌లిగిన భాష‌తో విరుచుకుప‌డ‌టం మ‌రి ఆర్‌.కె. రోజా వంటివారికి పెద్ద ఘోరంగా ఏమీ అనిపించ‌దు. ఒకే రకంగా ఆలోచించేవారు, ఒకే ర‌కంగా మాట్లాడేవారు ఇలా ఒకే పార్టీలో ఉండ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. అందువ‌ల్ల, ఒక‌రి భాష ఒక‌రికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. వారి అధినేత‌కీ న‌చ్చ‌వ‌చ్చు. అంచేత‌, వారి దృష్టిలో టీవీ ప్రేక్ష‌కుల‌కు, అందునా ఓట‌రుకి న‌చ్చాల‌ని ఉండ‌దు. ఉండాల‌నీ అనుకోరు. 

ప్రహసనంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. సర్వాధికారాలూ సోనియాకే..!?

అవున్రా..ఇంత‌కీ పిల్ల‌డికి ఏం పేరుపెట్టాల‌నుకుంటున్నావ్‌? అని అడిగారు ఆ యింటి పెద్దామె. మెగాస్టార్ పేరు.. అన్నాడు మ‌న‌వ‌డు విసుగ్గా..ఇంత‌ప‌నీ చేస్తాడ‌ని పెద్దామె వంటింట్లోకి వెళ్లి వాళ్ల బంధువులంద‌రికీ ఫోన్ చేసింది.. నా మునిమ‌న‌వ‌డి పేరు మా ఆయ‌న పేరే ఉండేట్టు ఫోన్ చేసి మ‌రీ చెప్ప‌మ‌ని! ఎంత‌యినా ఇంత పెద్ద కుటుంబాన్ని నిల‌బెట్టినోడుగ‌దా.. అందుకు అంది పెద్దామె ఆన‌క‌. ఈలోగా బంధువ‌ర్గం అంతా త‌లా ఒక పేరు కాయితాల మీద రాసేసుకుని ఫోన్ చేసి చెప్పాల‌ని సిద్ధ‌ప‌డ్డారు. ఇంత‌లో ఒక‌రిత‌ర్వాత ఒక‌రికి పెద్దామె ఫోన్ రావ‌డంతో స‌ద‌రు కాయితాల‌న్నీ బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. ఇక చేసేదేముంది.. డివివి బిఎస్‌వి..అంటూ పేద్ధ‌పేరు ఆ బుడ్డోడికి పెట్టాల్సి వ‌చ్చింది. దీంతో ఆ పిల్లాడి నామకరణ మహోత్సవం కాస్తా ఒక ప్రహసనంగా మారిపోయింది. సరిగ్గా అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం ఒక ప్రహసనంగా సాగుతోంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. పోటీ అనివార్యమైతే వచ్చే నెల 17న జరుగుతుంది.  దీంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ నెహ్రూ కుటుంబం బయటి నుంచి ఎన్నికయ్యేది ఎవరన్న ఆసక్తి కాంగ్రెస్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అందరిలోనూ నెలకొంది. వాస్తవానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి, ఆ పార్టీ అధ్యక్ష స్థానం ఖాళీగానే వుంది. అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా, ఆమె ఆ బాధ్యతలను తాత్కాలికంగానే, తప్పని సరి పరిస్థితుల్లోనే చేపట్టారు.  వయో భారం, మ అనారోగ్యం కారణంగా ఆమె తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను కూడా సంపూర్ణంగా న్యాయం చేయలేకపోయారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.  ఈ పరిస్థితుల్లోనే పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది.  అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది.  అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక  కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ సహా మరికొందరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినవస్తున్నా, అందుకు సంబంధించిన స్పష్టత అయితే లేదు. ఇక గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ మరో సారి పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తున్నా.. ఆ విషయంలో ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.  అయితే రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై మాత్రం పార్టీలోనే కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా జీ23 నేతలు ఈ విషయంలో సీరియస్ గా విమర్శలు చేస్తున్నారు. జీ 23 నేతలకు నాయకత్వం వహించిన గులాం నబీ ఆజాద్ ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకునే హడావుడిలో ఉన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ తెగించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ  విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, అదే సస్పెన్స్ కొనసాగించారు. దీంతో అంతటా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులను నామినేట్‌ చేసే అధికారం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకే కట్టబెట్టేలా   తీర్మానాలు చేయాలని అన్ని రాష్ట్రాల శాఖలకు పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అంతా నామమాత్రంగా మారిపోయింది. గాంధీయేతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అగ్రనాయకత్వం యోచిస్తోంది. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వంటి విధేయులకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ తదుపరి అధ్యక్షుడిని ప్రకటించే అధికారాన్ని సోనియా గాంధీకి కట్టబెడుతూ రాష్ట్రాల ప్రతినిధులు తీర్మానం చేయడం అంటే.. సోనియాగాంధీ అభీష్టం మేరకు ఆమె ఆశీస్సులు ఉన్న వారే పార్టీ అధ్యక్షపగ్గాలను అందుకుంటారు. పోటీ ఉండదు. కొత్త అధ్యక్షుని హయాంలో కూడా గాంధీ, నెహ్రూ కుటుంబం ఆధిపత్యం ఇప్పటిలాగే కొనసాగుతుంది.  ఆపలేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 22న విడుదల కానుంది. 24 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలుకు గడువు ఉంది. అక్టోబరు 17న ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ నెల 20లోగానే సర్వ అధికారాలనూ తీర్మానాలు చేయాలని అన్ని పీసీసీలకు అగ్రనాయకత్వం ఆదేశించింది.

ఠాగూర్ చిరు..సారీ.. చిల‌క‌రాజు!

మున‌పు ఒక‌డుండేవోడు..అస‌లు నిజ్జాయితీ అంటే ఆడిపేరే సెప్పేటోళ్లు మ‌రి!.. ఇలాంటి డైలాగులు మ‌న గ్రామాల్లో ఏదో ఒక సంద‌ర్భంలో ఎవ‌రో ఒక‌రు అన‌డం వింటూంటాం. నిజ్జంగా నిజాయితీగా ఉండ‌ డం బ‌హు క‌ష్టంసుమ్మీ అంటారు. సూక్తులు చెప్ప‌డం కంటే పాటించి చెప్ప‌డం క‌డు దుర్ల‌భం. స్కూలు పిల్ల‌డు చొక్కాకి జెండా బొమ్మ పెట్టుకున్న‌ట్టు చిల‌క‌రాజు అనే ఆయ‌న  జెండా స్థానంలో ఒక కార్డు పెట్టు కున్నాడు. . నాకు లంచం వ‌ద్దు.. అని రాసిన కార్డు! ఆ ధైర్యం ముందు ఎంత‌టి ఉద్యోగ‌యినా ఖంగారు ప‌డాల్సిందే! న్యాయం, ధ‌ర్మం అనే ప‌దాల‌కు బొత్తిగా అర్ధంలేకుండాపోయిన ఈ రోజుల్లో నిజాయితీగా బ‌త‌కాల‌ను కోవ డం తూ.చ త‌ప్ప‌కుండా పాటించడానికి కొండంత ధైర్యం అవ‌స‌రం. చొక్కాజేబుకి అలాంటి నినాదాన్ని రాసు కున్న కార్డు త‌గిలించుకోగానే ఠాగూర్ చిరంజీవి అయిపోడు. కానీ ఎదుటివారికి, తోటి ఉద్యోగులకు మాత్రం త‌మ ఉద్యోగ వ్య‌వ‌హారాల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తించాలన్న ఆలోచ‌న‌ని మాత్రం క‌లిగిస్తుంది.  తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ఆర్ఐ చిలక రాజు నర్సయ్య అదే ప‌నిచేశారు. ఓ రోజు ఉద‌యాన్నే చిల‌క‌రాజు అలా ఆఫీసుకు వెళ్లే స‌రికి తోటి ఉద్యోగు లు ముందు న‌వ్వుకున్నారు, త‌ర్వాత్త‌ర్వాత చిల‌క‌రాజు ఎంతో నిటారుగా న‌డ‌వ‌డం, ఆయ‌న చూపులో ఎలాంటి బెరుకూ లేకుండా ఉండ‌డం గ‌మ‌నించి స‌ద‌రు తోటి ఉద్యోగులు ఖంగారుప‌డ్డారు. నిజాయితీ తెచ్చే దైర్యం, బ‌లం తాలూకు శ‌క్తి అది. కానీ ఆయ‌న్ను చూసి ఆనందించడం శ‌భాష్ అని మెచ్చుకోవ‌డం కాకుండా వీల‌యితే ఆయ‌న బాట‌లో న‌డిచేందుకు కాస్తంత ధైర్యం చేయాలి ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఉద్యో గులు. అపుడే చిన్నస్థాయి ఉద్యోగి కూడా ఒక ఠాగూర్ చిరంజీవి  కాగ‌ల‌డు. ఇదే సామాన్య ప్ర‌జ‌లూ ఆశించేది. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన తెలుగుదేశం

ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు మొద‌టిరోజు గురువారం(సెప్టెంబర్15) విప‌క్షాల నినాదాల‌తో హోరెత్తింది. తొలి రోజే టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్  ప్రసంగాన్ని అడ్డకుకుంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య   గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో  మార్షల్స్  రంగ ప్రవేశం చేసి   బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు తీసు కెళ్లారు. దీంతో మార్షల్స్ తో తెలుగుదేశం సభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు  గవర్నర్  గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సీఎం జగన్ తీవ్ర అస హనం వ్యక్తం చేశారు.  జాబ్‌క్యాలెండర్... జాబ్‌లెస్ క్యాలెండర్ అంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మా నాన్ని స్పీకర్  తిరస్కరించడంతో గొడవ మొదలైంది. వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గర దూసుకెళ్లి టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. జాబ్‌ ఎక్కడ జగన్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌  డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని టీడీపీ నినాదాలు చేసింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాన్ని చేపడతామని స్పీకర్ చెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.  .టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుల ప్రశ్నలే ఉన్నాయన్నారు. ప్లకార్డులతో సభలోకి రావడం సరికాదని అన్నారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని మంత్రి బుగ్గన  ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.  

ఇజ్రాయెల్ చేరిన 2000 ఏళ్ల‌ నాటి  నాణెం

ఒక భారీ  స్మగ్లింగ్ దర్యాప్తు నేపథ్యంలో, రోమన్ నియంత్రణకు వ్యతిరేకంగా దాదాపు 2,000 సంవత్సరాల నాటి యూదుల తిరుగుబాటులో భాగమైన ఒక నాణాన్ని యునైటెడ్ స్టేట్స్  ఇజ్రాయెల్‌కు తిరిగి ఇచ్చిం ది.  దీని విలువ ఒక మిలియన్ డాల‌ర్లు ఉంటుంద‌ని, ఇది  2000 సంవత్సరాల నాటిద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అరుదైన నాణెం  క్వార్టర్ షెకెల్ ఏడి 69 లో ముద్రించబడింది,  మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాల యం, గ‌త వారం న్యూయార్క్‌లో స్వదేశానికి పంపే వేడుకను నిర్వహించింది, దీని విలువ ఒక డాల‌ర్ మిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. జెరూసలేంకు దక్షిణంగా ఉన్న ఎల్లా లోయలో పురాతన వస్తువుల దొంగలచే వెండి నాణెం కనుగొన్న‌ట్టు ఇజ్రాయెల్ అధికారులు మొదట మూలాల ద్వారా తెలుసుకున్న ఇర‌వై ఏళ్ల తర్వాత  ఈ చర్య చేప‌ట్టా రు. అనేక ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలకు నిలయమైన ఈ ప్రాంతంలో నేరస్థులు కనుగొన్న నాణేల నిల్వలో ఇది ఒక ట‌ని భావిస్తున్నారు. పరిశోధకుల ప్రకారం, ఈ వస్తువు జోర్డాన్ ద్వారా యు.కె కి రవాణా చేయడానికి ముందు అక్రమంగా కొనుగో లు చేయబడింది. ఆ తర్వాత, అది మోసపూరిత డాక్యుమెంటేషన్‌ని ఉపయోగించి యుఎస్‌ కు రవాణా చేయబడింది. ఈ నాణెం కొలరాడోలోని డెన్వర్‌లో వేలం వేయాలని నిర్ణయించబడింది, కానీ బదులుగా 2017లో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు దీనిని తీసుకున్నారు. మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ ఎల్. బ్రాగ్, జూనియర్ ప్రకారం, ఈ నాణెం అపారమైన సాంస్కృ తిక విలువను కలిగి ఉంది, విచారణ సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, అతని ప్రాసిక్యూటర్‌లు, విశ్లేషకులు ఇజ్రాయె ల్ అధికారులతో కలిసి రెండు నెలలు పనిచేసే ఏజెంట్ల బృందం దానిని గుర్తించ గలిగారు.  ఏడి 6 లో, రోమన్లు ​​​​జుడేయా రాజ్యాన్ని జయించారు, కానీ వారి పాలనకు ప్రతిఘటన ఫలితంగా యూదు-రోమన్యుద్ధాలు అని పిలువబడే తిరుగుబాట్ల శ్రేణికి దారితీసింది. కరెన్సీ మొదటి యూదు తిరుగుబాటు సమయంలో తయారు చేయబడింది, దీనిని గ్రేట్ యూదు తిరుగుబాటు అని కూడా పిలుస్తారు, ఇది ఏడి 66 లో ప్రారంభమై నాలుగేళ్ల‌ పాటు కొనసాగింది. జుడాయాతో సహా వారి సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాలలో, రోమన్లు ​​నిర్దిష్ట ప్రాంతీయ నాణేల త‌యారీ, ఉప‌యోగం అనుమతించారు. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (ఐఏఏ) ప్రకారం, తిరుగుబాటు కమాండర్లు  యూదు మూలాంశాలను  జోడించడం ద్వారా  సామ్రాజ్య నాణేలపై చక్రవర్తి ముఖాన్ని కవర్ చేశారు. ఇది ఐఏఏ పత్రికా ప్రకటన ప్రకారం, ఇజ్రాయెల్ లో యూదుల స్వాతంత్య్ర  ప్రకటన, వారి ముందు నిలిచిన శక్తివంతమైన సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటన. బ్రిటీష్ మ్యూజియం 1930 లలో ఒక నాణేన్ని కొనుగోలు చేసింది, ఇది ఐఏఏకి తెలిసిన ఇదే విధమైన డిజైన్ లోని ఇతర క్వార్టర్ షెకెల్ మాత్రమే. అక్రమ మార్కెట్‌లో సుమారు మూడు మరిన్ని కూడా అందు బాటులో ఉన్నాయని అంచనా వేసింది. నాణేల వాపసు కార్యక్రమానికి యు.ఎన్ లోని దేశ రాయబారి గిలాడ్ ఎర్డాన్‌తో సహా సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు హాజరయ్యారు. వస్తువు స్వదేశానికి, ఐఏఏ డైరెక్టర్ ఎలి ఎస్కోసిడో ప్రకారం, సాంస్కృతిక వారసత్వ వస్తువుల పునరుద్ధరణకు చాలా సానుకూల , ముఖ్యమైన ధోరణికి నాంది పలికింది. ఇదిలా ఉండ‌గా, మ‌న కోహినూర్‌ని ఇంగ్లండ్ నుంచి వెన‌క్కి తీసుకురావ‌డానికి  చాలాకాలం నుంచి మ‌న ప్ర‌భుత్వం కృషి చేస్తూనే ఉంది. కానీ ఇంత‌వ‌ర‌కూ ఆ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. 

కేసీఆర్ కేటీఆర్ ఎడముఖం పెడముఖం.. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణ అస్తవ్యస్తం

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టంఅన్నట్లుగా ఉంది తెరాస ప్రభుత్వం తీరు. విలువలు, నిబంధనల ఊసే లేకుండా ఇష్టాను సారంగా సభా వ్యవహారాలను సాగించేస్తున్నదన్న విపక్షాల విమర్శలకు బలం చేకూర్చేదిగానే ప్రభుత్వం తీరు ఉంది. ఏదైనా ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టిన తరువాత దానిపై చర్చ జరుగుతుంది. సభ్యులు తమ అభ్యంతరాలను తెలియజేస్తారు. ప్రభుత్వం వాటిని పరిగణనలోనికి తీసుకుంటే మళ్లీ సవరణలు చేస్తారు. ఆ తరువాత సదరు బిల్లు పాస్ అవుతుంది. అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాతనే దానిని గెజిట్ లో ప్రచురిస్తారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రొసీజర్ ఇది కాగా,   కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విధానాలన్నిటికీ తిలోదకాలిచ్చేసింది. అధికారం చేతిలో ఉంది, సభలో ప్రశ్నించే విపక్షాలకు సంఖ్యా బలం లేదు. ఏ విషయాన్నైనా బుల్ డోజ్ చేసేందుకు అవసరమైన మంద బలం ఉందన్న ధీమాతో తెరాస సర్కార్ అసెంబ్లీ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తోందనడానికి నిదర్శనమే మంగళవారం సభలో ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను సోమవారం తేదీతో ముద్రించి దానినే సభ్యులకు మీడియాకు సర్క్యులేట్ చేయడం. అలాగే సభలో మంగళవారం (సెప్టెంబర్ 13న) ప్రవేశపెట్టిన బిల్లులను 12నే ప్రవేశపెట్టినట్లుగా పేర్కొంటూ అదే 12వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం. తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడో రోజు  మంగళవారం (సెప్టెంబర్ 13) ప్రభుత్వం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, కావేరి వ్యవసాయ, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్‌ఆర్‌, నిక్ మార్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదముద్ర వేసింది. అలాగే కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 25 శాతం తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభ ఆమోదించింది. రేపు సభలో ఏం జరగాలో ఈ రోజే నిర్ణయించేసి, అందుకు అనుగుణంగా పేపర్లు రూపొందించేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చందంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్నది. చట్ట సభల ప్రతిష్టను మసకబార్చే విధంగా తెరాస సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట సభలలో ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రభుత్వమేదీ గతంలో లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఈ తీరు అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కాగా ముందు రోజు తేదీతో గెజిట్ విడుదల  కావడానికీ, బిల్లుల ఆమోదానికి ముందే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడానికి  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ మథ్య  పెరిగిన దూరమే కారణమంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇరువురూ ఒకరికి ఒకరు ఎదురు పడటానికి కూడా ఇష్ట పడనంతగా వారి మధ్య  దూరం పెరగడమే కారణమని ఆ వర్గాలు అంటున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీలో మంగళవారం (సెప్టెంబర్ 13)ప్రవేశ పెట్టిన బిల్లులన్నీ సోమవారం(సెప్టెంబర్ 12)  ప్రవేశపెట్టాల్సి ఉందనీ, అయితే తండ్రీ కొడుకుల మధ్య ఒకరికొకరు ఎదురు పడటానికి ఇష్టపడనంతగా ఎడం పెరిగిన నేపథ్యంలో సోమవారం కేటీఆర్ సభకు వచ్చి కొద్ది సేపటికే వెళ్లిపోవడం, ఆ తరువాత కేసీఆర్ తన ప్రసంగం సోమవారమే పూర్తి చేసి మంగళవారం సభకు గైర్హాజరు కావడం ఇందుకు తార్కాణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఆ కారణంగానే సోమవారం సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు ఎటూ ఆమోదం పొందుతాయన్న విశ్వాసంతో  సోమవారం తేదీతోనే గెజిట్ నోటిఫికేషన్ తయారు చేసేశారనీ,  అయితే అనూహ్యంగా సోమవారం కేసీఆర్ ప్రసంగానికే సభ పరిమితం కావడం.. బిల్లులను  మంగళవారం సభలో ప్రవేశపెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మొత్తం మీద సభా నియమాలకూ, నిబంధనలకు తిలోదకాలిచ్చి తెరాస ప్రభుత్వం శాసన  సభ నిర్వహణను ఒక ప్రహసనంగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లంపి చర్మ వ్యాధితో  ఆందోళన

2025 నాటికి పశువులకు 100 శాతం టీకాలువేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం చెప్పారు. ప్రాణాంతకమైన ముద్ద చర్మ వ్యాధి బారినపడి తమ పశు వు లు పొలాల్లోనే అమాంతం ప్రాణా లు విడ‌వ‌డం భారతదేశం అంత టా రైతులు భయాందోళన లతో చూస్తున్నారు. జులై నుండి 50 వేల‌కుపైగా పశువులు చని పోయిన రాష్ట్రంగా రాజస్థాన్ అత్యంత దారుణంగా ప్రభావిత మైంది. వ్యాధి వైరస్వల్ల వస్తుంది, ప్రజల ను ప్రభావితం చేయదు; ఇది ఈగలు లేదా దోమల ద్వారా వ్యాపిస్తుంది, దీని వలన చర్మంపై నోడ్యూల్స్ ఏర్పడతా యి. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం లో ఏప్రిల్‌లో మొదటి సంక్రమణ కేసు నమోదైంది. జూలై నుంచి ఇప్పటివరకు 75వేల‌ పశువు లు చనిపోయాయి. 2025 నాటికి పశువులకు 100 శాతం టీకాలు వేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం చెప్పారు. డ్రోన్ ఫుటేజీలో రాజస్థాన్, గుజరాత్‌లలో వ్యాధి సోకిన పశువుల భయానక చిత్రాలను చూపిస్తుంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా సహా ఎనిమిదికి పైగా ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని పశువులకు 'గోట్ పాక్స్ వ్యాక్సిన్' ఇస్తున్నారు. ముద్ద చర్మ వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ "100 శాతం ప్రభావవంతంగా" ఉందని ప్రభుత్వం చెబుతోంది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 50,000  పశువులు మ‌ర‌ణించాయి. రాష్ట్రంలో రోజుకు 600-700 మరణిస్తున్నా యని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి, జలగావ్, అమరావతి వంటి ప్రాంతాలపై దృష్టి సారించింది. అంటు వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వ్యాధి సోకిన పశువులను ఎలా సీక్వెస్టర్ చేయాలి. చనిపోయిన పశువుల మృతదేహా లను సురక్షితంగా పారవేయడం చాలా ముఖ్యమైనది. వ్యాధి సోకిన పశువులు జ్వరం, వంధ్యత్వాన్ని చూపుతాయి, తక్కువ పాల ఉత్పత్తిని అనుసరిం చవచ్చు..ఇవన్నీ రైతులకు తీవ్రమైన ఆర్థిక చిక్కులను కలిగి ఉంటాయి. ఈ వ్యాధి కోసం మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. మూడు-నాలుగు నెలల్లో ఉపయోగం కోసం అందుబాటులో ఉంటుంది.

క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన  ఊత‌ప్ప‌

2007 టీ 20 ప్రపంచ కప్ విజేత బ్యాటర్, 2015 లో చివరిగా భారత దేశం తరపున ఆడిన రాబిన్ ఉతప్ప అన్నిరకాల అంత ర్జాతీయ, భారత క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. తన నిర్ణయా న్ని  ట్విట్టర్ లో ప్ర‌క‌టిం చాడు.  భారత్‌ 2004 అండర్-19 ప్రపం చ కప్ జట్టు సభ్యుడు ఉతప్ప, 2006లో అంతర్జాతీయ అరం గేట్రం చేసి, 46 వ‌న్డేలు, 13 టీ20 లు ఆడాడు, 2007లో దక్షిణా ఫ్రికాలో జరిగిన తొలి టీ 20 ప్రపంచ కప్‌ను ఎత్తిన జట్టులో సభ్యుడు. అతను కర్ణాటకతో అనేక దేశీయ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు, రెండుసార్లు ఐపిఎల్‌ను గెలుచుకున్నాడు: 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో, 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌తో. నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ప్రారంభించి 20 సంవత్సరాలు అయ్యింది. నా దేశం, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం, కర్ణాటక- హెచ్చుతగ్గుల అద్భుతమైన ప్రయాణం; సంతృప్తికరంగా, బహుమతిగా, ఆనందదాయకంగా, నేను మనిషిగా ఎదగడానికి వీలుక‌ల్పించింది. కృతజ్ఞతతో కూడిన హృదయంతో నేను అన్నిరకాల భారత క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయిం చుకున్నాను. నేను నా  కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాన‌ని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అతను తన మాజీ ఐపిఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, ప్రస్తుత జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. గత సీజన్ ఐపిఎల్ లో, ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్ తరపున 12 మ్యాచ్‌లు ఆడాడు.  అతని అత్యధిక స్కోరు 88తో 230 పరుగు లు చేశాడు. అయితే చెన్నై ప్లే-ఆఫ్ దశలకు అర్హత సాధించడంలో విఫలమైంది. గౌహతిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఉతప్ప అరం గేట్రం చేసి, భారత్ తరఫున 46 వన్డేలు ఆడి 934 పరుగులు చేశాడు. అతను 13 టీ 20 లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు, 249 పరుగులు చేశాడు. ఉతప్ప భారతదేశం తరపున 46 వ‌న్డేలు, 13 టీ20 లు ఆడాడు, కెరీర్‌లో తక్కువ హెచ్చుతగ్గులు, ఎక్కువ పతనాలతోడి కెరీర్ లో 934, 249 పరుగులు చేశాడు. అయితే ఉతప్ప 205 మ్యాచ్‌లు ఆడి 27 అర్ధ సెంచరీలతో సహా 4952 పరుగులు చేసిన ఐపిఎల్‌ లెజెండ్. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో ఉతప్ప భాగమయ్యాడని మర్చి పోకూడదు. అతను 2 ఐపిఎల్ టైటిళ్లను, 1 కెకెఆర్‌ (2014), సిఎస్‌కె (2021)తో గెలుచుకున్నాడు. అతను వరుసగా 2013-14, 2014-15 సీజన్లలో రెండు బ్యాక్ టు బ్యాక్ రంజీ ట్రోఫీని గెలుచుకున్నాడు.

హీరో ప్రభాస్ తో అమిత్ షా భేటీ అందుకేనా?

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల  17 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారకంగా నిర్వహిస్తున్ననేపధ్యంలో  ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే , సెప్టెంబర్ 16న అమిత్ షా  హైదరాబాద్ వస్తున్నారు. అదే రోజున ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు.  అదే సమయంలో కృష్ణం రాజు సోదరుని కుమారుడు, వెండి తెరవారసుడు హీరో ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారని  బీజీపీ వర్గాల  సమాచారం.  నిజానికి కేంద్ర మంత్రి అమిత్ షా, కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించడం పెద్ద విషయం కాదు. కృష్ణం రాజు అన్ని పార్టీలు తిరిగివచ్చినా, ఆయన బీజేపెలోనే ఎక్కువ గుర్తింపు గౌరవం పొందారు. కృష్ణం రాజు  రెండు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆరెండు సందర్భాలలోనూ బీజేపీ అభ్యర్ధిగానే విజయం సాధించారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం అభ్యర్దిగానూ పోటీ చేసినా, విజయయని చేరుకోలేక పోయారు. అలాగే, అటల్ బిహారీ వాజపేయి మంత్రి వర్గంలో సహాయ మంత్రిగానే ఐదేళ్ళు కొనసాగారు. నిజానికి, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన తొలి తెలుగు హీరో కృష్ణం రాజు. అలాగే, ఆయన మధ్యలో కొంతకాలం ప్రజారాజ్యం వైపు వెళ్ళినా, మళ్ళీ చివరకు బీజేపీ గూటికే చేరారు. బీజేపీ నేతగానే కన్ను మూశారు. కాబట్టి అమిత షా కృష్ణం రాజు ఫ్యామిలీని పరామర్శించడం, పెద్ద రాజకీయ పాధాన్యత గల విషయంగా చూడవలసిన అవసరం లేదు. కానీ వుంది.  ఎందుకు ఉందంటే, కృష్ణం రాజు ఫ్యామిలీని పరామర్శించడంతో పాటుగా  అమిత్ షా హీరో  ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. అందుకే ఈ వార్తకు రాజాకీయ ప్రాధాన్యత ఉందనే చర్చ జరుగుతోంది.నిజానికి, ప్రభాస్ ఇప్పటికే బీజేపీలో సభ్యత్వం లేని సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో, కృష్ణం రాజు, ఆయన సతీమణితో పాటుగా ప్రభాస్ ఇతర కుటుంబ సభ్యలు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రధాని అధికార నివాసంలో  కలిశారు.అప్పుడే ప్రభాస్ చూచాయగా తమ రాజకీయ దృక్ఫదాన్ని వెల్లడించారు. అయినప్పటికీ  ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక సినిమా హీరో కలిసి వెళుతున్నారు. ఇటీవలే మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ తో సమావేశం అయ్యారు. అందుకే  పరామర్శతో పాటుగా రాజకీయ పలకరింపు కూడా అమిత షా  ఎజెండా కావచ్చని అంటున్నారు.  నిజమే కావచ్చును  కానీ, బీజేపీ ఒక్క సినిమా వారినే కాదు  అన్ని అన్ని వర్గాల వారిని తమ సంపర్కంలోకి తెచ్చుకునే నిరంతర ప్రక్రియలో భాగంగానే, జూనియర్ ఎన్టీఆర్, నితిన్ /నిఖిల్ లేదా మరో నటుడుని కలవడం జరిగిందని బీజేపీ నాయకులు అంటున్నారు. అమిత్ షా గత పర్యటనలో బేగంపేట విమానాశ్రయంలోనే రైతులతో, రైతు నాయకులతో సమావేసమయ్యారు. బీజేపీ కార్యకర్త ఇంటింకి వెళ్లి చాయ్ తాగి వచ్చారు. అలాగే ఐటీ రంగ నిపుణులు, ఇతర రంగాల వారితోనూ బీజేపీ నాయకులూ , కార్యకర్తలు నిత్య సంపర్కంలో ఉంటారని,  ప్రభాస్ తో అమిత్ షా భేటీని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే లేదంటే లేదని కాదు, ఉందంటే ఉందని కాదు  రాజకీయ నాయకులు ముఖ్యంగా మోడీ, అమిత్ షా వంటి 24X7 పొలిటికల్ లీడర్స్ వేసే ప్రతి అడుగులోనూ రాజకీయాలే ఉంటాయి . అందులో సందేహం అవసరం లేదు.

15 నుంచే  ఏపీ అసెంబ్లీ...మూడు రాజ‌ధానుల బిల్లు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉద యం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా ఈ స‌మావేశాల్లోనే మూడు రాజ‌ ధానుల‌పై బిల్లు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.  ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చర్చ చేయాలని అధికార పక్షం భావిస్తోంది. పోలవరం పునారావాస ప్యాకేజీ పైన సభలోనే చర్చించాలని నిర్ణయించి నట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు.. గత ప్రభు త్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి సభ ద్వారా ప్రజల ముందు ఉంచాలని వైసీపీ భావిస్తోంది.  సభ మొదటి రోజే మూడు రాజధానుల అంశంపై లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై సీఎం జగన్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని.. ప్రజల్లోకి  సమగ్రంగా తీసుకెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సమావే శాల్లో కీలక అంశాలపై చర్చ ప్రారంభించడంతోపాటు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నిర్ణయిం చింది. మూడు రాజధానుల బిల్లు చర్చ వంటి అంశాలను సీఎం జగన్ నిర్ణయానికి వదిలివేశారు.  బీఏసీ సమావేశంలో తెలుగుదేశం ప్రతిపాదించే అంశాలపై చర్చ చేపట్టి.. ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేయా లని వ్యూహా కమిటీ సమావేశంలో పలువురు నేతలు సూచించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు అధి కార వైసీపీ సన్నద్ధమైంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం, టీడీపీని డిఫెన్స్‌లో పడేసే విధం గా చర్చ చేపట్టాలని అధికారపార్టీ నిర్ణయించింది. సమావేశాలు ఐదు రోజులపాటు నిర్వహించాలని తాత్కాలి కంగా నిర్ణయించారు. బిఏసీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

కెఎ పాల్ ప్ర‌జాశాంతి పార్టీ గుర్తింపు ర‌ద్దు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రియాశీల‌కంగా లేని 253  రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. అందులో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 25 పార్టీలు రద్దు చేశారు. అందులో అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిం డియా ముక్తి దళ్ పార్టీ, ఆలిండియా ముత్తహిదా ఖ్వామీ మహజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ  ప్రజాపార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, మన పార్టీ, నేషనలిస్టిక్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజా భారత్ పార్టీ, ప్రజాపార్టీ, ప్రజాశాంతి పార్టీ, సురాజ్ పార్టీ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిష్టర్ అయ్యాయి. అందులో చాలా పార్టీలు ఇప్పు డు యాక్టివ్‌గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షా ళన మొదలు పెట్టింది. క్రియాశీలకంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.  ఢిల్లీ, బీహార్, కర్ణా టక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్ గా లేని రాజకీయ పార్టీలు  కేంద్ర ఎన్నికలసంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించక పోవ డంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014-19 ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను సైతం యాక్టివ్‌గా లేని పార్టీలుగా గుర్తించారు. కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదా య పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారనీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈసీ ఆరోపించింది. ఏదైనా రాజకీయ సంస్థగా నమోదు చేసుకున్న సంస్థకు పోస్టల్ అడ్రస్ తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఈసీకి తెలియజేయాలి. అయితే చాలా రాజకీయ పార్టీలు ఈ విధానాలను పాటిం చడం లేదని ఈసీ గుర్తించింది. అందుకే ఆయా పార్టీలను రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించింది.

మళ్లీ కెబినెట్‌లోకి కొడాలి నాని

 తన కేబినెట్‌ని ముచ్చటగా మూడో సారి మార్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారనే ఓ చర్చ  తాడేపల్లి ప్యాలెస్‌ సాక్షిగా వైసీపీలో జోరుగా సాగుతోంది.  మరోసార జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరించేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన మాటలను బట్టే అవగతమౌతున్నది. పునర్వ్యవస్థీకరణలో  భాగంగా తన తొలి కేబినెట్‌లోని  కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబులతకు స్థానం కల్పించే విషయాన్ని  జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దసరా తరువాత జగన్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న స్పష్టమైన సందేశం ఇప్పటికే మంత్రులకు చేరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.    అయితే పైన పేర్కొన్న వారిలో అందరికీ కేబినెట్ లో చోటు దక్కుతుందా, లేదా కొందరికి మాత్రమే జగన్ అవకాశం ఇస్తారా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. అయితే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మాత్రం మంత్రి పదవి పక్కా అని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.  అంతే కాకుండా ఈ సారి కొడాలి నానికి కేబినెట్ లో అత్యంత కీలక శాఖను కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.   క్విడ్ ప్రోకో తరహాలో నీకు ఇది.. నాకు ఇది అనే తరహాలో సీఎం జగన్, కొడాలి నాని మధ్య.. ఓ ఒప్పందం కుదిరిందని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అదేమిటంటే విపక్షంపై బూతుల వర్షంతో విమర్శలు గుప్పించడం కొడాలి నాని వంతు అయితే మంత్రివర్గంలో కీలక పదవి కట్టబెట్టడం జగన్ వంతు అన్నదే ఆ ఒప్పందంగా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.    ఆ ఒప్పందంలో ఇటీవల కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబంపై  తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగారు. అంతేకాదు..  కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా పలు ఆందోళనలు, ధర్నాలు సైతం చేసిన సంగతి తెలిసిందే.     మరోవైపు జగన్ తన రెండో సారి కేబినెట్ విస్తరణలో భాగంగా 11 మంది పాతవారిని కొనసాగిస్తూనే.. కొత్తగా మరో 14 మందికి చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే పాత వారంతా..  కొత్త వారు వచ్చారు కదా.. వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారులే అంటూ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. కానీ కొత్త వారు మాత్రం.. కొత్తగా మంత్రి పదవులు దక్కేసరికి... గుళ్లులు, గోపురాలు, తాడేపల్లి ప్యాలెస్‌ల.. చుట్టు ప్రదక్షణాలు చేయడంతో ఆ నాలుగు నెలల కాలం కాస్తా.. గాలిలో పెట్టిన పచ్చ కర్పురం కరిగిపోయినట్లు కరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే తన తాజా కేబినెట్ పని తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్ కొత్త మంత్రుల ముఖం మీదనే వారిని కడిగి పారేసి మంత్రి పదవులు ఊడబీకేస్తానని హెచ్చరించినట్లు చెబుతున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తన సతీమణి భారతిపై విపక్ష నేతల విమర్శలకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరూ స్పందించకపోవడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టకపోవడమే కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు... తనను కానీ పార్టీని కానీ కార్నర్ చేస్తే.. గత కేబినెట్‌లోని పలువురు మంత్రులు.. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వీడియోలు సైతం.. మన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయని.. వాటిని చూసి అయినా నేర్చుకోవాలంటూ మంత్రువర్గానికి హితబోధ చేశారని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గట్టిగా విపక్షాలపై విమర్శలతో విరుచుకు పడగలిగే, బూతులు మాట్లాడేందుకు కూడా వెనుకాడని కొడాలి నానిని మరోసారి తన కేబినెట్ లోకి తీసుకోవాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ పరిణామంపై ప్రజాస్వామ్య వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గతంలో ఎవరినైనా కేబినెట్ లోకి తీసుకోవాలంటే వారి  నీతి, నిజాయతీ, సమాజ సేవ, సచ్ఛీలత వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకునే వారనీ,  అయితే నేడు పరిస్ధితి పూర్తి భిన్నంగా మారిందని అంటున్నారు.  గుండాయిజం, రౌడీయిజం మంత్రి పదవికి ఒక అర్హతగా, ప్రత్యర్థులను దుర్భాషలాడటం అదనపు అర్హతగా మారిపోయినట్లుగా పరిస్థితి తయారైందని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనం డెమోక్రసీలో ఉన్నామా? లేక డెమినోక్రసీలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ సైలంట్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఓ ప్రజాప్రతినిధి సహా కీలక వ్యక్తుల అరెస్ట్ ఉంటుందని సమాచారం వచ్చీ రాగానే జగన్ హుటాహుటిన ఢిల్లీ టూర్ వెళ్తారు. అంతే ఏపీలో సీబీఐ అధికారులు సైలెంట్ అయిపోయారు. వివేకా హత్య కేసులో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తున్నది. ఎదురు కేసులు కూడా పెడుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తులను అరెస్టు చేద్దామంటే.. ఢిల్లీ నుంచి బ్రేకులు పడుతుంటాయి. కింది స్థాయిలో డొంక కదిలిద్దామంటే.. వ్యూహాత్మకంగా ప్రైవేటు కేసులు వేయిస్తున్నారు. దీంతో సీబీఐ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందంటున్నారు. ఇలాగైతే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగదని కోర్టుకు సీబీఐ మొర పెట్టుకుంది. దీంతో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసినట్లేనా? ఎడాపెడా ఒత్తిళ్లతో అధికారులు ఇక అడుగు ముందుకు వేయలేమనే భావనకు వచ్చారా? తమపై రాష్ట్ర పోలీసులు ఎదురు కేసులు పెడుతుండటంతో నైతిక స్థైర్యం దెబ్బతిని, ముందుకు వెళ్లేందుకు జంకుతున్నారా? విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసిన జగనే.. అధికారంలోకి రాగానే ఆ డిమాండ్ ను పక్కన పెట్టడమే కాకుండా తన బాబాయి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు విన్నవించారు.  ఈ క్రమంలోనే వివేకా కుమార్తె డాక్టర్ సునీత హై కోర్టును ఆశ్రయించారు. తర్వాత ఈ కేసులో సీబీఐ అడుగులు వేగంగా పడ్డాయి. కీలక వ్యక్తుల అరెస్టుకు సిద్ధమైన ప్రతిసారీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం రివాజుగా మారింది. అక్కడ ఢిల్లీ పెద్దలతో ఆయన ఏం మాట్లాడతారో కానీ.. ఇక్కడ మాత్రం ఈ కేసులో సీబీఐ సైలెంట్ అయిపోవడం జరుగుతోంది. వారంలో కీలక పరిణామాలు జరగనున్నాయని.. వివేకా హత్య కేసులో కీలక ప్రజాప్రతినిధి అరెస్టుకు సీబీఐ రెడీ అయిందని ఆగస్టు నెలలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పులివెందులలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. అదే సమయంలో ఆగస్టు 21న సీఎం జగన్ ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. 22న ఢిల్లీ పెద్దలను కలిశారు. అంతే.. ఇక్కడ సీబీఐ గప్ చుప్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ కేసు విషయంలో సీబీఐలో ఉలుకూ పలుకూ లేదు. వివేకా కేసులో కీలక వ్యక్తి అరెస్టు జరగొచ్చని బలంగా వార్తలు రాగానే..  దర్యాప్తు అధికారిపై కేసులు పెడుతున్నారు. ప్రైవేటు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాగైతే.. వివేకా హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగడం కష్టం. ఆ కేసులు కొట్టేయాలన్న మా వ్యాజ్యంపై త్వరగా విచారణ జరపండి  అని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీతపైనా కేసుపెట్టారు. ఆ ఫిర్యాదులను పోలీసులకు కోర్టు రిఫర్ చేయగానే.. ఏకంగా ఏఎస్పీపైనే కడప పోలీసులు కేసు పెట్టడం గమనార్హం.   ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం కొన్నాళ్లుగా మందగించింది.  కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసును చేపట్టిన సీబీఐ.. కడపలో మకాం వేసి మూలాల్లోకి చొచ్చుకెళ్లి తీగ లాగడం మొదలు పెట్టింది. ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడం కీలక పరిణామం. దర్యాప్తులో గుర్తించిన విషయాలు, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై అభియోగాలు మోపింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికి ఐదుగురిని జైలుకు పంపింది. 'అసలు సూత్రధారులు ఎవరో తేలుస్తాం' అని చార్జిషీట్ లో పేర్కొంది. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చేపట్టిన కేసుల్లో పకడ్బందీగా దర్యాప్తు చేస్తుంది. వివేకా హత్య కేసులోనూ అదే జరిగింది. సీబీఐ పేరు చెబితే దేశవ్యాప్తంగా బడాబడా వ్యక్తులే వణుకుతుంటారు. ఏపీలో మాత్రం సీబీఐనే వణుకుతుండటం గమనార్హం. అనేక అంశాల్లో వైసీపీ స్థానిక పెద్దల పాత్రపై లింకులు ఈ కేసులో వెలుగుచూశాయి. వీటి ఆధారంగా కీలక వ్యక్తుల అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేసినా.. బ్రేకులు పడుతూనే ఉండడం గమనార్హం. ఇన్ని అవాంతరాల మధ్య వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందా? లేక సీబీఐ ఇంకా సైలెంట్ అవుతుందా? కాలమే నిర్ణయించాలి.

మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీతకు ఐదేళ్లు జైలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు  తీర్పు ఇచ్చింది. గీతతోపాటు ఆమె భర్త రామ కోటేశ్వరరావు కు కూడా ఇదే శిక్ష విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మోసం చేసిన కేసులో 2015లో చార్జిషీటు ఫైల్ చేశారు. దీని ఆధారంగా కోర్టు తీర్పు వెల్లడించింది. బ్యాంక్ అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్‌కు  ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవైట్ లిమిటెడ్ కంపెనీకు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తపల్లి గీత సహా మిగిలిన నింది తులను అరెస్టుచేసి వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. కాగా కొత్తపల్లి గీత తరఫున హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు విచారిస్తుం దా? లేక వాయిదా వేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. 2015లో కేసు రిజిష్టర్ అయిన తర్వాత సుదీ ర్ఘంగా వారికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. విచారించి చార్జిషీటును దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ మేరకు వారికి జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు. ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు రూ.2లక్షల జరిమానా విధించిన సీబీఐ కోర్టు. మంగళవారం ఈ కేసులో తీర్పు రావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది . గీత భర్త, బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీతో దూరం జరిగారు. బీజేపీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల సమయంలో ఏ పార్టీలోనూ చేరలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన వారిలో కొత్తపల్లి గీత కూడా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరుతుందన్న ప్రచారం జరిగింది.  అయితే చేరలేదు. ఈ లోపే ఆమె బ్యాంక్ ఫ్రాడ్ కేసులో జైలు శిక్షకు గురయింది. తనకు  బెయిల్ ఇవ్వాలని ఆమె తెలంగాణ  హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.  మొదట బ్యాంక్ఉద్యోగిగా పనిచేసి తర్వతా గ్రూప్ 1 పరీక్షల్లో విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. 1999వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ్ సబ్-కలెక్టర్‌ గా వివిధహోదాల్లో పనిచేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ప్రొటెక్షన్), రెవెన్యూ డివిజనల్ ఆఫీ సర్, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సర్వేలో ల్యాండ్ రికార్డులు స్పెషల్ ఆఫీసర్ మొదలైన పదవులలో పనిచేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న సమయంలో ఆమె భూముల అవకతవ కలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 2010లో  ఉద్యోగం మానేసి  భర్తతో కలిసి వ్యాపా రం ప్రారంభించారు తర్వాత వైఎస్ఆర్‌సీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో జైలు పాలవ్వాల్సి వచ్చింది. 

మాజీ మంత్రి నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్‌

రాజధాని బృహత్‌ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఆయనతో పాటు రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌కు అనుమతించింది. ముందస్తు బెయిల్ కోసం నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు లో విచారణకు రాగా,  నారాయణ  తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.  నారాయణకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది పోసాని కోరారు. కింద కోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్‌లు వర్తించవని రిమాండ్‌ను తిరస్కరించిన అంశాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, అంజనీకుమార్‌  హైకోర్టులో పిటిషన్‌ వేసుకోగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వు చేసింది. అయితే తాజాగా వీరికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులోనే మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది పోసాని  గుర్తుచేశారు. వాదనలు విన్న హైకోర్టు మూడు నెలల పాటు నారాయణ విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

రెండవ విడత కోవిడ్ మరణాల పై ఆడిట్.. కేంద్రానికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫారసు

రెండవ విడత కోవిడ్ మరణాలు, ఆక్సిజన్ కొరత పై ఆడిట్ చేయాల్సిందేనని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ  కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పని తీరు పై పార్లమెంటు స్థాయీ సంఘం కేంద్రానకి సమర్పించిన నివేదికలో ఈ మేరకు సిఫారసు చేసింది.    వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పని తీరుపై స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  అత్యవసర సమయం లో  సదరు మంత్రిత్వ శాఖ పూర్తి  నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సభాసంఘం ఆ నివేదికలో పేర్కొంది. రెండవ విడత కోవిడ్ మరణాలను సమీక్షించాలని, ఆక్సిజన్ కొరత ఏర్పడిందా లేదా  అన్న అంశం అలాగే మరణించిన కుటుంబాలకు, బాధితులకు అందించిన నష్ట పరిహారం పై ఆడిట్ జరగాలని  సమాజ్ వాదీ పార్టీ నేత రాం గోపాల్ యాదవ్  నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించింది.  వైద్య కుటుంబ సంక్షేమ శాఖపై  పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమర్పించిన రిపోర్టులో కోవిడ్ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం గా మరణించారా లేదా ?అన్న అంశం పై  నిజనిర్ధారణ చేయాలని సూచించింది. ఈ మేరకు మరణించిన కుటుంబలాకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, ఆక్సిజన్ అందించడం అత్యవసర సమయం లో సకాలం లో వైద్యసహాయం అందించడం లో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని   స్టాండింగ్ కమిటీ అభిప్రాయ పడింది .అసలు కోవిడ్ కారణంగా దేశంలో సంభవించిన మరణాల సంఖ్య ఎంత,  ఆ మరణాలకుఆక్సిజన్ కొరత కారణమా అన్న అంశంపై ఆడిట్ అవసరమనిపేర్కొంది. వైద్య కుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలలో కోవిడ్  మరణాల పై ఆడిట్ నిర్వహించాలని వాటిని తప్పని సరిగా రికార్డు చేయాలని స్టాండింగ్ కమిటీ  పేర్కొంది. ఇటువంటి ఆడిట్  ప్రభుత్వ బాద్యతగా కమిటీ పేర్కొంది. పారదర్శకత తో ప్రభుత్వ సంస్థలు జవాబుదారీ తనంతో వ్యవహరించాలని ఆక్సిజన్ కొరత ఉందా లేదా?సహజ మరణాలు ఎన్ని? కోవిడ్ కారణంగా సంభవించిన మరణాల సంఖ్య ఎంత? ఆక్సిజన్ అందక మరణించిన వారెంతమంది బాధితులకు ఇచ్చిన నష్టపరిహారం వివరాలు   తెలపాలని కమిటీ కోరింది. అయితే చాలా ప్రాంతాలాలో రోగుల కుటుంబ సభ్యులు  ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూ లైన్లలో  నిలబడ్డ ఘటనలు ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి   ఘటనలపై  మీడియాలో కధనాలు వెలువడిన ఉదంతాలను ఉటంకించిన స్థాయీ సంఘం రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను తెలుపుతూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా  సరఫరాలో జాప్యం జరిగిందని పేర్కొంది. ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాలో రిగా వ్యవహరించలేదని డిల్లి ప్రభుత్వం చేసిన ఆరోపణలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఇదే అంశం పై దిల్లి హైకోర్ట్ కేంద్రాన్ని  మందలించిన విషయాన్ని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఆ  తరువాత వినియోగించని ఆక్సిజన్ ట్యాంకార్ల ను తిప్పి పంపిన  విషయం కమిటీ తీవ్రంగా పరిగణించింది. కాగా గతం లో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను మరణించిన వారి వివరాలాను ఇవ్వాలని కోరిన విషయాన్ని కమిటీ గుర్తు చేసింది. రెండవ విడత కోవిడ్ పరిస్థితులపై, ఆక్సిజన్ కొరత పై  2౦ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలాలో పరిశీలించి నివేదికను రూపొందించినట్లుపార్లమెంటు స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది.