చైతన్య కాలేజీ విషయంలో ఒకలా.. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మరోలా!
posted on Sep 19, 2022 7:52AM
ఏపీలో జగన్ సర్కార్ ఇష్టారాజ్యం నడుస్తోంది. చట్టాలు, నిబంధనలనూ పట్టించుకోకుండా అసమదీయుల విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోకలా వ్యవహరించడం పరిపాటి అయిపోయింది. వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదు అన్నది నానుడి.. జగన్ పాలనలో దానిని మార్చి నేరం చేసిన వాడు మనవాడైతే ఫర్లేదు వదిలేయండి అన్నట్లుగా మార్చుకోవలసిన అవసరం కనబడుతోంది.
విజయవాడ చైతన్య కాలేజీలో ఓ టీచర్ విద్యార్థిని కొడుతున్ వీడియో ఒకటి బయటపడగానే జగన్ సర్కార్ ఆఘమేఘాలపై స్పందించింది. కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఐదు రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది. దాడి చేసిన లెక్చరర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌బోర్డు ప్రకటించేసింది. విద్యార్థిని దారుణంగా కొట్టిన లెచ్చరర్ పై చర్యలు తీసుకోవాలన్న జగన్ సర్కార్ ను, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయడానికైనా వెనుకాడని ప్రభుత్వ తీరును కచ్చితంగా స్వాగతించాల్సిందే. అదే సమయంలో అసభ్య వీడియోలో అడ్డంగా దొరికిపోయిన వైసీసీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో సర్కార్ ఈ వేగంతో ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యల సంగతి దేముడెరుగు.. అసలు ఆయనను సమర్థిస్తూ వైసీపీ రంగంలోకి దిగి.. ఆరోపణలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి పాల్పడడమేమిటని నిలదీస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సదరు కాలేజీలో లెచ్చర్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి కానీ, అతడి తల్లిదండ్రులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. కనీసం ఇంటర్ బోర్డు దృష్టికీ తీసుకు వెళ్లలేదు. కానీ వీడియో చూసి సర్కార్ కదిలిపోయింది. ఆ వీడియో ఫేకా, ఒరిజనలా అన్న మీమాంసే రాలేదు. వీడియో వైరల్ కాగానే చర్యలకు ఉపక్రమించేసింది. ఆ వేగాన్నికచ్చితంగా అభినందించాల్సిందే. కానీ అదే సమయంలో గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో విషయంలో జగన్ సర్కార్ లో ఆ వేగం ఎందుకు కనిపించలేదు అని సామాజిక మాధ్యమం వేదికగడా నెటిజన్లు నిలదీస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఏమీ మామూలు మనిషి కారు. ఆయన ఓ ఎంపీ.. అందులోనూ అధికార పార్టీ ఎంపీ. అటువంటి వ్యక్తి సభ్య సమాజం ఏహ్యతతో ఉమ్మేసే లాంటి చర్యకు పాల్పడినప్పుడు... చర్య తీసుకోవలసింది పోయి.. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు నిస్సిగ్గుగా మీడియా ఎదుట మాట్లాడడమేమిటి. పైగా గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ అని ఎవరూ అనే ధైర్యం చేయడం లేదు.
తెలుగుదేశం నాయకులు అయితే అది ఒరిజనల్ వీడియోయే అని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును కూడా బయట పెట్టారు. ఎలాంటి ఫిర్యాదు, క్రాస్ చెకింగ్ లేకుండా విద్యార్థిని కొట్టాడన్న వీడియో ఆధారంగానే, విద్యారంగంపై అచంచల విశ్వాసం, గౌరవంతో ఆ కేసును సుమోటోగా తీసుకుని, తానే స్వయంగా చర్యలకు దిగిన జగన్ సర్కార్.. తమ పార్టీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చట్టాన్ని లెక్కచేయకుండా మరీ తనంతట తాను చర్యల కొరడా ఝళిపించిన జగన్ సర్కారు మిగిలిన కేసులలో ముఖ్యంగా గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో ఎందుకు ఇంత చైతన్యరహితంగా ఉందని నెటిజన్లు నిలదీస్తున్నారు.
వైసీపీ ఎంపీ మాధవ్ అసభ్య వీడియోకు సంబంధించి మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా మహిళా నేతలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసినా ఆయనపై జగన్ సర్కార్ చర్యలు తీసుకోలేదు సరికదా.. మాధవ్ తరఫు వారు ఇచ్చిన ఫిర్యాదుపైనే మాధవ్ ను విమర్శించిన వారిపై కేసులు పెట్టారు. మరి మాధవ్ పై ఎందుకు కేసు పెట్టలేదంటే.. ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని బదులిస్తున్నారు. మరి చైతన్య కాలేజీ సంఘటనపై ఫిర్యాదు చేసిన వారెవరు? ఎవరూ లేకపోతే మరి ఫిర్యాదు లేకుండా ఎందుకు కేసులు పెట్టి నోటీసులు జారీ చేశారు అని సామాన్య జనం నిలదీస్తున్నారు.